జనతంత్రం
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.
ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.
జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.
మీడియా తుపాకీ ట్రిగ్గర్‌ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్‌ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.
ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్‌ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.
చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్‌మోహన్‌రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్‌రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.
సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్‌పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్‌ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్‌కు రూ. 5.90 కట్ట బెట్టారు.
జగన్‌మోహన్‌రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.
ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?
‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్‌రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!
ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్‌ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.
ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు.
ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్‌తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!
హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు.
విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.
జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్‌కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్‌కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు.
ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment