జనతంత్రం
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్‌లో అటువంటి ప్రస్తావన లేదు.
చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.
ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్‌ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.
2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్‌కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.
ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సమర్పించింది.
అదిగో అదే డీపీఆర్‌ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్‌సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.
ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది.
పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు.
ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.
ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్‌ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?
ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు.
అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్‌కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.
చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్‌ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్‌లో పీపుల్‌ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?
ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్‌లో కనిపించలేదు.
ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్‌వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment