ఎవరికోసం ఈ కృత్రిమ విపత్తు? | Sakshi Editorial On Vijayawada Floods and Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఎవరికోసం ఈ కృత్రిమ విపత్తు?

Published Sun, Sep 15 2024 12:39 AM | Last Updated on Sun, Sep 15 2024 11:08 AM

Sakshi Editorial On Vijayawada Floods and Chandrababu Govt

జనతంత్రం

భోపాల్‌ దుర్ఘటనకు ఇప్పుడు సరిగ్గా నలభయ్యేళ్ల వయసు. భారత చరిత్రలోని విషాద ఉదంతాల్లో అదొకటి. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్నందుకు గాను కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 304 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. తమ నిర్లక్ష్యం కారణంగా లేదా చర్యల కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిసి కూడా ముందుకు వెళ్లడాన్ని నేర శిక్షాస్మృతి  'culpable homicide'గా పరిగణిస్తుంది. ఐపీసీ స్థానంలో ‘భారత న్యాయ సంహిత’ (బీఎన్‌ఎస్‌) అమల్లోకి వచ్చిన తర్వాత, తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రాణనష్టం సెక్షన్‌ 106 కిందకు వస్తుందని చెబు తున్నారు. కారకులకు పదేళ్లు జైలు, జరిమానా కూడా ఉండ వచ్చు.

ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం ఈ హక్కును ప్రాథమిక హక్కుగా (Article 21, Right to life) గుర్తించింది. దీన్ని ఉల్లంఘించే అధికారం ఏ వ్యక్తికి గానీ, వ్యవస్థకు గానీ, ప్రభుత్వానికి గానీ లేదు. నిర్లక్ష్యం వల్లనో, ఉద్దేశ పూర్వకంగానో పౌరుల ప్రాణాలను బలిగొనే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. రెండు వారాల కింద విజయవాడ నగరం ఎదుర్కొన్న ఆకస్మిక వరదల కారణంగా డజన్లకొద్దీ ప్రాణాలు పోయాయి. మూడు లక్షల కుటుంబాలు తమ సమస్తాన్నీ కోల్పోయాయి. పదేళ్ల కష్టార్జితాన్ని కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలామని ఆ కుటుంబాలు రోదిస్తున్నాయి.

విజయవాడ ఆకస్మిక వరదలను ‘ప్రకృతి విపత్తు’ కోటాలో వేసేయలేము. వీటిని నివారించడానికి ఉన్న అవకాశాలను బాధ్యులైన వారు వినియోగించలేదు. బహుశా అందువల్లనే ఈ వరదలను ‘మ్యాన్‌ మేడ్‌ ఫ్లడ్స్‌’గా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అభివర్ణించారు. కచ్చితంగా ఈ విషాదం మానవ కల్పితమే! ఈ మానవ కల్పిత విషాదం వెనుక ప్రభుత్వ నిర్లక్షం ఉన్నది. పరిపాలనా వైఫల్యం ఉన్నది. పాలకుల దురుద్దేశం కూడా దాగున్నది. జరిగిన పరిణామాలను క్రమానుగతంగా పరిశీలిస్తే ఈ సంగతి ఎవరికైనా తేటతెల్లమవుతుంది.

ఆగస్టు 28వ తేదీ బుధవారం నాడు భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) వారు ఒక నివేదికను విడుదల చేశారు. బంగా ళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర, ఒడిషాలపై ప్రభావం చూపబోతున్నదనే అంశం కూడా ఈ నివేదికలో ఉన్నది. వాతావరణ నివేదికల్లో తుపాను సంబంధిత హెచ్చరికలు వెలువడగానే తీరప్రాంత రాష్ట్రాలు తక్షణం స్పందించి సమీక్ష జరపడం రివాజు. పైగా గుజరాత్‌ తర్వాత అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఇక్కడ తుపాను హెచ్చరికలపై స్పందన వేగంగా ఉండాలి. కానీ ప్రభుత్వ పెద్దలు గానీ, అధికార యంత్రాంగం గానీ ఈ హెచ్చరికను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.

ఆ మరుసటిరోజు ఆగస్టు 29న ఐఎమ్‌డీ రెండో నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు గురువారం రాత్రి నుంచి శనివారం వరకు పడతాయని నివేదిక హెచ్చరించింది. ఐఎమ్‌డీతోపాటు ‘ఆంధ్ర ప్రదేశ్‌ వెదర్‌మ్యాన్‌’, ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’ కూడా ట్విట్టర్‌ వేదికగా హెచ్చరించారు. వాతావరణ శాస్త్రవేత్తలైన ఈ యువకులు ‘వెదర్‌మ్యాన్‌’ పేరుతో అత్యంత కచ్చితత్వంతో కూడిన హెచ్చరికలు జారీచేస్తూ ఇటీవలి కాలంలో సంచలనం సృష్టిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ వెదర్‌మ్యాన్‌’ సాయి ప్రణీత్‌ 29న డిప్యూటీ సీఎంను ట్యాగ్‌ చేస్తూ నివేదికను విడుదల చేశారు. విజయనగరం నుంచి పల్నాడు జిల్లా వరకు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, ముఖ్యంగా శనివారం నాడు అతి భారీ వర్షా లుంటాయి కనుక పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించాలని పవన్‌ కల్యాణ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

వరుస హెచ్చరికలున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి కూర్చున్నది. రాజకీయ – అధికార ముఖ్యులందరూ వీకెండ్‌ మూడ్‌లోకి, చలో హైదరాబాద్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. రిజర్వాయర్లలో ‘ఫ్లడ్‌ కుషన్‌’ మెయింటెయిన్‌ చేయలేదని జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నట్టు నదుల్లో వరద నియంత్రణ చర్యలను యంత్రాంగం గాలికి వదిలేసింది. భారీ వర్ష సూచనలున్నప్పుడు నిండుగా ఉన్న రిజర్వాయర్ల నీటిని కొంత మేరకు దిగువకు విడుదల చేసి వచ్చే వరద ప్రవాహానికి కొంత కుషన్‌ ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రోటోకాల్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయి వరద చేరి పరిస్థితిని సంక్లిష్టం చేసింది. దీని ప్రభావం బుడమేరు మీద, రాజ ధాని ప్రాంతం మీద కూడా పడింది.

బుడమేరు అనే వాగుకు ఎప్పటినుంచో ‘బెజవాడ దుఃఖ దాయని’ అనే పేరున్నది. విజయవాడకు ఉత్తర దిక్కున ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఈ వాగు దక్షిణా భిముఖంగా ప్రవహించి, నగరానికి వాయవ్య దిక్కున ఉన్న వెలగలేరు అనేచోట తూర్పు వైపు తిరిగి, పలు వంపులు తిరు గుతూ నగరం మీదుగా కొల్లేరు దాకా పారుతుంది. విజయ వాడకు వరద ముప్పును నియంత్రించడం కోసం వెలగలేరు మలుపు దగ్గర బుడమేరుపై గేట్లు బిగించారు. వరద ప్రవాహాన్ని దక్షిణం వైపు మళ్లిస్తూ ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలోకి పారేలా ‘బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌’ (బీడీసీ) ఏర్పాటు చేశారు. దిగువన ఇబ్రహీంపట్నం దగ్గరున్న విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ కోసం ఏర్పాటైన కూలింగ్‌ కెనాల్‌తోనే ఈ బీడీసీని అనుసంధానించారు. పోలవరం కుడికాల్వను కూడా వెలగలేరు వద్ద బీడీసీతో కలిపేశారు. 

ఈ బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ సామర్థ్యం 15 వేల క్యూసె క్కులని చెబుతారు. కానీ అంతకుముందే అక్కడ వీటీపీఎస్‌ కూలింగ్‌ కెనాల్‌పై చంద్రబాబు ఓ యెల్లో మీడియా ప్రముఖునికి ఇచ్చిన పవర్‌ ప్లాంట్‌ కారణంగా ఐదు వేల క్యూసెక్కులకు మించి అక్కడ ప్రవహించే అవకాశం లేదని ఇరిగేషన్‌ నిపుణులు చెబుతున్నారు. బుడమేరు వరదెత్తిన రోజుల్లో గరిష్ఠ స్థాయిలో ఆ ప్రవాహాన్ని బీడీసీలోకి మళ్లిస్తే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుంది. ఆ గరిష్ఠ స్థాయి మళ్లింపునకు అడ్డుగా ఉన్న పవర్‌ ప్లాంట్‌ను తొలగించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా కోర్టు›స్టేల వల్ల సాధ్యం కాలేదు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులో 45 వేల క్యూసెక్కుల వరద రాబోతున్నదని శనివారం మధ్యా హ్నానికి ముందే స్థానిక ఇరిగేషన్‌ ఇంజనీర్లు అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. బుడ మేరు రెగ్యులేటర్‌ డీఈ మాధవనాయక్‌ ‘సాక్షి’ టీవీతో ఆన్‌ రికార్డు ఈ విషయాన్ని నిర్ధారించారు. బీడీఎస్‌ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులే కనుక అనివార్యంగా బుడమేరు గేట్లను శని వారం సాయంత్రానికల్లా ఎత్తవలసి ఉంటుందని కూడా వారు ఉన్నతాధికారులకు చేరవేశారు. ‘పైస్థాయి’ వారు వెంటనే
స్పందించి గేట్లు ఎత్తడంపై నిర్ణయం తీసుకొని ఉంటే విజయ వాడలోని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను తరలించడానికి సరిపోయే సమయం ఉండేది. రాబోతున్న వరదను గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉండేది. ప్రొటో కాల్‌ ప్రకారం గేట్లు ఎత్తడానికి పన్నెండు గంటల ముందు ప్రజ లను అప్రమత్తం చేయాలి. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

ఇవన్నీ జరగాలంటే వాతావరణ హెచ్చరికలు వెలువడి నప్పుడే ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు సమీక్షా సమావేశం జరిపి నిర్ణయాలు తీసు కోవాలి. అది జరగలేదు. తీరా కృష్ణానదిలో వరద పెరిగి చంద్ర బాబు కరకట్ట నివాసంలోకి కూడా నీళ్లు రావడంతో ఆయన కలెక్టరేట్‌లోకి తన బసను మార్చుకున్నారు. అప్పటికే బుడమేరు పరిస్థితి భయానకంగా ఉన్నట్లు సమాచారం ఉన్నది. ఆ సమ యంలో తీరిగ్గా మూడు శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బుడమేరు గేట్లపై ఏం నిర్ణయం తీసు కున్నారో ఎవరికీ తెలియదు. ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. పునరావాస శిబిరాలు ఏర్పాటు కాలేదు. ప్రజలకు హెచ్చరి కలు జారీ కాలేదు. వారిని తరలించే ప్రయత్నాలూ జరగలేదు.

మూడు లక్షలమందిని వరద ముంచేసిన తర్వాత వారం రోజులకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆర్‌పి సిసోడియా ఒక భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. ఒక రోజు ముందుగానే వరద సంగతి తమకు తెలుసనీ, కానీ రెండు లక్షల కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం సాధ్యమయ్యే పని కాదు కనుక ప్రజలను హెచ్చరించలేదని చెప్పారు. ఇంత కంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంత కన్నా బాధ్యతా రాహిత్యం ఉంటుందా? ఇదే కదా నేరపూరిత నిర్లక్ష్యం! ఇదే కదా ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలను బలి పెట్టడం! ఇది కేవలం ఆ ఉన్నతాధికారి నిర్ణయం మాత్రమే అను కోలేము కదా! అత్యున్నత స్థాయి నిర్ణయాన్నే ఆయన వెల్లడించి ఉంటారు కదా!

హెచ్చరికలు లేకుండా, ఏర్పాట్లు లేకుండా బుడమేరు గేట్లెత్తి లక్షలాదిమందిని వరదపాలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులేమిటి? శనివారం మధ్యా హ్నానికే ప్రకాశం బ్యారేజీలోకి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుకున్నది. కరకట్ట మొదటి అంతస్తుల్లోకి ప్రవేశించింది. బ్యారేజీ దగ్గర కృష్ణానది బెడ్‌ లెవెల్‌ సముద్ర మట్టానికి 11.24 మీటర్లు. రాజధాని ప్రాంతం గుండా పారే కొండవీటి వాగు ఉండవల్లి దగ్గరున్న కృష్ణానది తూము ద్వారా నదిలో కలుస్తుంది. అక్కడ దాని బెడ్‌ లెవెల్‌ 11 మీటర్లు. ఐదారు లక్షల  క్యూసెక్కుల ప్రవాహం గనుక బ్యారేజీ దగ్గర ఉన్నట్లయితే కొండవీడు వాగు కృష్ణలో కలవడానికి బదులు కృష్ణ నీళ్లు వాగు లోకి ఎగదన్నుతాయి. 

కొండవీడు వాగు మోసుకొచ్చే వరదను రాజధాని ప్రాంతంలో నియంత్రించడం కోసం ఒక లిఫ్టును ఏర్పాటు చేశారు. దాని సామర్థ్యం ఐదువేల క్యూసెక్కులు మాత్రమే. కృష్ణాలో ప్రవాహం పెరిగి వాగులోకి ఎగదన్నడం ఎక్కువైతే అమరావతి డ్రీమ్‌ ప్రాజెక్టుకు కోలుకోలేని డ్యామేజ్‌ అవుతుంది. బ్యారేజీలో కొంచెం ఎగువన నదికి మరోవైపున బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ కృష్ణానదిలో కలుస్తున్నది. ఈ బుడ మేరు నీళ్లనే కృష్ణలో కలిపి కృష్ణా–గోదావరి నదుల అనుసంధా నాన్ని పూర్తి చేశానని గతంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. దీనికే ఆయన ‘పవిత్ర సంగమం’ అనే నామకరణం చేశారు.

ఇక్కడ కృష్ణానది, బుడమేరు కాలువల బెడ్‌లెవెల్‌ సమానంగా ఉంటుంది. ఫలితంగా కృష్ణా ప్రవాహం వేగంగా కాల్వ లోకి ఎగదన్నడం మొదలైంది. మరోపక్క బుడమేరు గేట్లు మూసి ఉన్నందువలన వరద మొత్తం డైవర్షన్‌ కెనాల్‌ ద్వారా కృష్ణ వైపు పరుగెత్తుతున్నది. పవర్‌ ప్లాంట్‌ కారణంగా ఇరుకైన కాలువ తట్టుకోలేక గట్టుకు గండ్లు పడి  కృష్ణా జలాలు పడమటి దిక్కు నుంచి విజయవాడ వైపు మళ్లాయి. శనివారం రాత్రి పడిన ఈ గండ్లనే జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూడ్చలేకపోయిందని అధికార పార్టీ ప్రచారంలో పెట్టింది. గేట్లు ఎత్తితే బుడమేరు వరద ఎదురు రాకుండా కృష్ణా వరద స్వేచ్ఛగా ఎగదన్నడం వలన బ్యారేజీ నీటిమట్టం ప్రమాదకరంగా పెరగకుండా నియంత్రించవచ్చనే ఆలోచన కూడా కారణం కావచ్చు. రాత్రి పూట చెప్పాపెట్టకుండా గేట్లు ఎత్తేశారు. బుడమేరు వరద బెజవాడపై ఉత్తరం దిక్కు నుంచి విరుచుకుపడింది.

శనివారం మధ్యాహ్నానికే నిర్ణయం తీసుకొని, చాటింపు వేయించి ప్రజలను తరలించి ఉన్నట్లయితే పెను ఉత్పాతం నివారించడం సాధ్యమయ్యేది. కానీ ఈ ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సన్నద్ధంగా లేదు. నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా కిమ్మనాస్తిగా స్తంభించిపోయింది. పెద్దల ఆయువుపట్టుకే దెబ్బ తగలబోతోందన్న ఆలోచన రాగానే విజయవాడను బలిపెట్టడా నికి సిద్ధమైనట్టుగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ ఘోరవైఫల్యం, దూరదృష్టి లేకపోవడం, పాలనా యంత్రాంగ నిస్తేజం, ఆపైన పెద్దల సొంత ప్రయోజనాలు... వెరసి విజయవాడ వీధుల్లో కన్నీటి కెరటాలు ఎగసిపడ్డాయి. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారం రోజుల పాటు ప్రభుత్వ పెద్దలు పడినపాట్లు అన్నీ ఇన్నీ కావు. విష్ణుమూర్తి అవతారాల మాదిరిగా కొన్నిసార్లు పడవల మీద, కొన్నిసార్లు బుల్డోజర్లపై, మరికొన్ని సార్లు కాలినడకన ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి ప్రజ లకు అభివాదాలు చేస్తూ కనిపించారు. వర్షంలోనే గండ్లు పూడ్చుతూ కనిపించే మంత్రుల ఫొటోలు, వీడియోలు దర్శన మిచ్చాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా సృష్టించిన ఫోటోల్లో, డ్రోన్‌ల ద్వారా ఇంటింటికి ఆహారం సరఫరా దృశ్యాలు ప్రచారంలోకి వచ్చాయి.

ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కనిపించి నట్టుగా వైఫల్యాల సుడిలో కొట్టుమిట్టాడుతున్న సర్కార్‌కు ప్రకాశం బ్యారేజీ దగ్గరకు కొట్టుకొచ్చిన బోట్లు కనిపించాయి. ఈ బోట్లను వైసీపీ వాళ్లే ప్రయోగించారనీ, ఈ బోట్ల కారణంగానే బెజవాడ మునిగిందనే డైవర్షన్‌ స్కీమును ముందుకు తెచ్చారు. బురదను కడుక్కోవాలి కనుక అవతలి పక్షం వారు కూడా బోట్లు టీడీపీ వారివేననే సాక్ష్యాలను ముందుకు తెచ్చారు. ఈ బోట్ల కాట్లాట నడుమ అసలైన కారణాలను మరుగున పడేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. వారి లక్ష్యం ఏదైనా కావచ్చు, ప్రజల ప్రాణాలను బలిగొనే నేరపూరిత నిర్లక్ష్యాలను ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. ప్రభుత్వాల చేతగానితనాన్ని సహించడం కూడా క్షేమం కాదు. జరిగిన విధ్వంసంపై కేసులు నమోదు కావాలి. ఈ విషాదానికి కేవలం నిర్లక్ష్యం, చేతగాని తనాలే కారణాలా? మరేదైనా లోతైన కారణం ఉన్నదా అనే కోణంలో విచారణ జరగాలి.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement