జనతంత్రం
విశాఖ నగరం సమీపంలోని భీమ్లీలో అదొక ప్రభుత్వ పాఠశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నాడు ఆ బడిని సందర్శించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించారు. ‘మీరు ముందుగా ఏ భాషలో మాట్లాడుకుంటారు... తెలుగులోనా, ఇంగ్లీషులోనా?’ అని అడి గారు. అక్కడున్న విద్యార్థినులు తడుముకోకుండా ‘ఇంగ్లీషు లోనే’ అని సమాధానమిచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆసక్తి కరంగా ఉన్నదని కూడా వారు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాల పిల్లల గుండెల్లో గూడు కట్టుకున్న ఆకాంక్షలకు ఈ ఘటన అద్దం పట్టింది.
అంతకు ముందు రోజు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సభ విజయవాడలో జరిగింది. ఆ సభలో రాష్ట్ర ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి తెలుగు భాషతోనే జీవితమని మరోసారి చెప్పు కొచ్చారు. జీతం కోసం ఇంగ్లీషు కూడా నేర్పిస్తామని తన ఉభయ భాషాభిమానాన్ని కూడా వెల్లడించారు. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవలసిన ధర్మ సూక్ష్మం ఒకటున్నది. జీతం కోసం నేర్చుకునే ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్లకు, ‘జీవితం’ కోసం నేర్చుకునే తెలుగు ప్రభుత్వ స్కూళ్లకు ప్రత్యేకం.
తొంభై శాతానికి పైగా ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడి యమే ఉంటుందన్న సంగతి జగమెరిగిన సత్యమే! కనుక తెలుగు భాషను రక్షించి పోషించవలసిన బాధ్యత ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలది, కష్టజీవులైన వారి తల్లిదండ్రులది. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచీ ఈ బాధ్యతను వారు తమ భుజాల మీద మోస్తూనే వస్తున్నారు. మన తెలుగు జాతి లోని సంపన్న శ్రేణివారు, ఉన్నతోద్యోగులు, క్రీమీ లేయర్‌లోని ఓ పదిమంది కూడిన ప్రతిచోట ఏ భాషలో మాట్లాడుకుంటారు? నిస్సందేహంగా ఇంగ్లీషులోనే! వారు ఇంగ్లీషులోనే పలక రించుకుంటారు. ఇంగ్లీషులోనే తుమ్ముతారు, ఇంగ్లీషులోనే దగ్గు తారు. తెలుగు భాషా సంస్కృతులను రక్షించవలసిన అవస రాన్ని సామాన్య ప్రజలకు వారే గుర్తు చేస్తుంటారు.
కొద్దిమంది పండితుల చేతుల్లోనే బందీ ఆయిన తెలుగు సాహిత్యాన్ని విముక్తం చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో రచనలు జరగాలని ఉద్యమించి గెలిచిన యోధుడు గిడుగు రామమూర్తి పంతులు. ఆయన నుంచి తీసు కోవలసిన స్ఫూర్తి ఏమిటి? ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలను కల్పిస్తున్న ఇంగ్లీషు మీడియాన్ని సంపన్న శ్రేణికే పరిమితం చేయకుండా సమస్త ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పడం కాదా? అటువంటి సంకల్పమే గదా పంతులు గారికి ఇవ్వదగిన నిజమైన నివాళి!
మనకు కొంతమంది స్వయం ప్రకటిత తెలుగు పెద్ద లున్నారు. వృద్ధనారీ పతివ్రతల వంటివారు. తెలుగు మీడియంలోనే చదువుకోవాలని పదేపదే గుర్తు చేస్తుంటారు. ఆ పిలుపు ప్రభుత్వ బడులకూ, బడుగు వర్గాలకే వర్తిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వర్గాలను ఉత్తేజితం చేయడం కోసం తమ జీవితమే వారికొక సందేశమని చెబుతారు. తెలుగులోనే చదువుకోవడం వల్ల తాము దిగ్గజాలుగా ఎదిగామనీ, ‘మీరు కూడా తెలుగులోనే చదవండి, మా అంతటివారు అవుతార’ని ఊదరగొడుతుంటారు.
అసలు పరభాషా మాధ్యమంలో చదువుకున్నంత మాత్రాన మాతృభాష అంతరించిపోతుందనే వాదనే నిర్హేతుకమైనది. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, పీవీ నరసింహారావు, కాళోజి నారాయణరావు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి తదితరు లంతా ఉర్దూ మీడియంలో చదివి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారే. మన తాజా తెలుగు పెద్దలతో పోల్చితే మహాదిగ్గజాలే.
ఇదొక్క ఇంగ్లీషు మీడియం గొడవ మాత్రమే కాదు. నాణ్యమైన విద్య, సరైన వసతులు, పర్యవేక్షణ, బోధనా పద్ధతులు... వగైరాలన్నింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల ప్రమా ణాలు పడిపోతూ వస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఈ పరిణామం వేగవంతమైంది. ఇందుకు ప్రధాన కారణం మన పాలకులు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి పెట్టుబడి పెట్టడం మన ‘సంస్కరణోత్తర’ రాజకీయ వేత్తలకు ఇష్టంలేదు. ఈ కేట గిరీలో ముందు వరసన నిలిచిన రాజకీయవేత్త చంద్రబాబు.
విద్య, వైద్యం మాత్రమే కాదు... ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదనే ఫిలాసఫీ ఆయనది. ‘మనసులో మాట’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకం నిండా ఈ ఫిలాసఫీయే ఉంటుంది. ఐదేళ్లకు పూర్వం విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ తత్వధారను వారబోస్తూనే వచ్చారు. ‘ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలుండవు. డబ్బులున్న వాళ్లు ప్రయివేటు స్కూళ్లలో చదువుకోండి. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అన్నీ బాగుంటాయ’ని ఆయన ఉద్బోధించేవారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలు ప్రారంభించిన తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన మీడియా కూడా విమర్శల వర్షం కురిపిస్తూనే వచ్చింది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే పిల్లలకు అర్థం కాకుండా పోతుందని గగ్గోలు పెట్టారు. కానీ, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల ప్రయోగంతో ఈ సమస్యను ప్రభుత్వం అవలీలగా అధిగమించిందని విద్యా రంగ నిపుణులు పలువురు కొనియాడారు.
చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్కూళ్ల వైభవం అంతరించిపోతుందన్న అంచనా ప్రజల్లో చాలామందికి ముందే ఉన్నది. కనుకనే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టీసీలు తీసుకుని ప్రైవేట్ బడుల్లో చేరిపోయారు. పూర్తి వివరాలు రాలేదు గానీ, ఈ సంఖ్య మూడు లక్షలకు పైగానే ఉండొచ్చని అంచనా.
ప్రజలు ఊహించినట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం సర్కారు బళ్లపై దాడిని ప్రారంభించింది. ‘అమ్మ ఒడి’ ఇవ్వలేదు. ‘వసతి దీవెన’ లేదు, ‘విద్యా కానుక’ లేదు. ‘మధ్యాహ్న భోజనం’, ‘గోరు ముద్దలు’ గాడి తప్పాయి. ఇంగ్లీష్ ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ‘టోఫెల్’ పరీక్షను తొలగించారు. వెయ్యి స్కూళ్లల్లో అమలవుతున్న సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఎత్తేశారు.
ఉచితంగా లభించాల్సిన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను అటకెక్కించారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేయడం కోసమే ఇటువంటి చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. నేడో రేపో ఇంగ్లీష్ మీడియానికి కూడా వీడ్కోలు చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి లోకేశ్‌కు విశాఖ బాలికలు తమ గుండెచప్పుడును వినిపించారు.
పేద ప్రజానీకం బిడ్డలకు కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం విద్యా సమీక్షా కేంద్రాల (వీఎస్‌కే)ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు, విద్యార్థులు – ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్టూడెంట్ కిట్స్ పంపిణీ, ట్యాబులు, ఐఎఫ్‌పీల నిర్వహణ వగైరా అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ఈ వీఎస్‌కేల పని. ఇప్పుడా పనులేవీ వీఎస్‌కేలు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏం చేయనున్నదో తెలుసుకోవడానికి!
ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ తీరుతెన్నులపై ఈ ఒక్క నెల రోజుల్లోనే డజన్‌కు పైగా విషాదకర వార్తలు వెలువడ్డాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల్లో 566 మంది కేవలం మూడు రోజుల్లోనే ఆస్పత్రి పాలయ్యారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఆ విద్యార్థులు తల్లడిల్లారు. విజయనగరంలోని ఓ ఆశ్రమ విద్యార్థులు 21 మంది ఆస్పత్రి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేజీబీవీలో 20 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది.
మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సంక్షేమ హాస్టల్స్‌ను నిరంతరం తనిఖీ చేసేలా ఒక ప్రత్యేక కార్య క్రమాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. ఆ కార్యక్రమాన్ని చాప చుట్టేసిన ఫలితమే ఈ నెల రోజుల్లో జరిగిన దుర్ఘటనలు. హాస్టల్స్‌లో వుండే విద్యార్థుల వసతి, వైద్య సౌకర్యాలపై జీవో నెంబర్ 46 కింద గత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను విస్మరించింది.
ఎందుకంటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య అనేది ఈ ప్రభుత్వం ఎజెండా కాదు. ఉచితంగా ఉత్తమ విద్యను అంద జేయడం ఈ ప్రభుత్వ ఫిలాసఫీ కాదు. అది జగన్ ప్రభుత్వ ఫిలాసఫీ, జగన్ ప్రభుత్వం ఎజెండా. పేద వర్గాల ప్రజలను సాధికార శక్తులుగా మలచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన నాణ్యమైన ఉచిత విద్యపై కూటమి సర్కార్ దాడిని ప్రారంభించింది. నిశ్చబ్దంగా ఒక మహా విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభిస్తే, బాబు సర్కార్ అదే రంగంలో నిశ్శబ్ద విధ్వంసాన్ని మొదలుపెట్టింది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment