అదిగో పులి... ఇదిగో తోక! | Sakshi Editorial On Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

అదిగో పులి... ఇదిగో తోక!

Published Sun, Nov 24 2024 12:30 AM | Last Updated on Sun, Nov 24 2024 3:10 PM

Sakshi Editorial On Chandrababu Naidu government

జనతంత్రం

జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిత్వ హననం అనే కార్యక్రమం అంటే యెల్లో మీడియాకు ఎంత మక్కువో, ఎంత మమకారమో అందరికీ తెలిసిన విషయమే! ఆయనపై బురద చల్లడానికి సమయం – సందర్భం అనే విచక్షణ కూడా ఉండదు. జగన్‌ మోహన్‌ రెడ్డిపై యెల్లో మీడియాది పూనకం పాలసీ. శరభశరభ అంటూ ఊగిపోవడమే. స్వైర కల్పనలతో పేజీల నిండా చెలరేగి పోవడమే. 

అదానీలు–ఆమెరికా న్యాయశాఖ వివాదంలోనూ దానిది అదే వీరంగం. మోకాలుకూ బోడిగుండుకూ ముడిపెట్టే కథనాలు వండి వార్చుతున్నారు. యెల్లో మీడియా ప్రచురిస్తున్న అబ్సర్డ్‌ పొయెట్రీని వదిలేసి సంఘటనల కదంబాన్ని మాత్రమే పరిశీలిస్తే కామన్‌సెన్స్‌లో అనేక సందేహాలు తలెత్తుతాయి.

సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) అనేది ఒక కేంద్రప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ నుంచి యూనిట్‌కు రూ. 4.50 చొప్పున సౌరవిద్యుత్‌ను కొనుగోలు చేసేటందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. అదే సంస్థతో జగన్‌ ప్రభుత్వం రూ. 2.49కి యూనిట్‌ చొప్పున కొనే విధంగా ఒప్పందం చేసుకున్నది. ప్రజాధనం దుబారాను భారీగా అరి కట్టింది. మరి చంద్రబాబు దుబారా ఒప్పందం ఒప్పు ఎట్లయింది? జగన్‌ పొదుపు తప్పు ఎట్లయింది?

సౌర విద్యుత్‌ ఉత్పాదక సంస్థల నుంచి ‘సెకీ’ కొనుగోలు చేసి, దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ సంస్థలకు అమ్ముతుంది. రాష్ట్ర ప్రభుత్వం, దాని పంపిణీ సంస్థలకు, ‘సెకీ’కి నడుమనే ఒప్పందాలుంటాయి. అట్లాగే ఉత్పాదక సంస్థలకూ, ‘సెకీ’కి మధ్యనా వ్యవహారం నడుస్తుంది. ఈ సంస్థలలో అదానీ పవర్‌ అనేది కూడా ఒకటి. ఉత్పాదక సంస్థలతో ప్రత్యక్ష సంబంధమే లేని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదానీ అనేవాడు లంచాలు ఇవ్వజూపడమేమిటి?

‘సెకీ’తో పాటు ప్రైవేట్‌ ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా యూనిట్‌కు రూ. 6.99 పెట్టి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కొనుగోలు చేసింది. ప్రజాధనాన్ని ప్రైవేట్‌ సంస్థలకు దోచిపెట్టినందువల్ల కుంభకోణం జరిగితే అప్పుడే జరిగి వుండాలి కదా!

జగన్‌ ప్రభుత్వానికి కుంభకోణం మీద దృష్టి ఉంటే ‘సెకీ’ని పక్కన పెట్టి, నేరుగా అదానీతోనో ఇంకొకడితోనో ఒప్పందం చేసుకొని ప్రజాధనాన్ని ఎక్కువగా కట్టబెట్టి తద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నది కదా! ఎందుకట్లా చేయలేదు? అటువంటి ఉద్దేశం లేదనే కదా సారాంశం!

జగన్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సమయంలోనే ఇంకో నాలుగు రాష్ట్రాలతో కూడా ‘సెకీ’ ఒప్పందం చేసుకున్నది. తమిళనాడు, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, జమ్ము–కశ్మీర్‌ రాష్ట్రాల అధికా రులకు ఎటువంటి లంచాలు ఇవ్వకుండా ఒక ఏపీ అధికారులకు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం అదానీలకు ఎందుకు వస్తుంది? ‘సెకీ’ మధ్యలో ఉండగా రాష్ట్రాల అధికారులతో అదానీల రాయ బేరాలు ఎందుకుంటాయి?

ఒకవేళ అటువంటి రాయబేరాలు జరిగే పరిస్థితే ఉత్పన్న మైతే అందుకు బ్రోకరేజి ఎవరు చేసి ఉండాలి? ‘సెకీ’యే కదా! కేంద్రప్రభుత్వ సంస్థ ఇటువంటి లంచాల బ్రోకరేజులు చేస్తుంటే అందుకు వేలెత్తి చూపవలసింది కేంద్రప్రభుత్వ అధినేతనే కదా! మరి యెల్లో మీడియా వేలు అటువైపు ఎందుకు తిరగడం లేదు?

ఈ వ్యవహారానికి సంబంధించి మన మీడియా ‘అశ్వత్థామ హతః’ అన్నంత ఉచ్చస్వరంతో జగన్‌మోహన్‌ రెడ్డి పేరు చెబుతూ, ‘కుంజరః’ అన్నంత నెమ్మదిగా ఇంకో నాలుగు రాష్ట్రాల పేర్లను చెబుతోంది. ఆ రాష్ట్రాలు తీవ్రంగా ఖండించిన తర్వాత మళ్లీ వాటి ప్రస్తావన కూడా తేవడం లేదు. ఎందు వలన? ఆ సమయంలో జమ్ము–కశ్మీర్‌ రాష్ట్రం కేంద్రం ఏలు బడిలోనే ఉన్నది. అదానీ లంచాలు ఎవరికి ముట్టినట్టు?

ఏపీలో జగన్‌మోహన్‌ రెడ్డి వ్యతిరేక వర్గాలు ‘అదిగో పులి’ అనగానే ‘ఇదిగో తోక’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు ముందుకు దూకుతున్నారు. ఒప్పందాలు జరిగినప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రే అధికారంలో ఉన్నారు. ఆ పులి నిజంగానే ఉంటే ఆ తోకను తాను చూసింది నిజమే అయితే ముందుగా అప్పటి ఛత్తీస్‌గఢ్‌ పార్టీ నాయకత్వాన్ని సస్పెండ్‌ చేయాలనీ, కూటమి నుంచి డీఎమ్‌కేను బయ టకు పంపించాలనీ డిమాండ్‌ చేయగలరా?



అమెరికాలోని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు ఓ రెండు ఆకాశరామన్న లేఖలు వచ్చాయట. ఆ లేఖల సారాన్ని ఎస్‌ఈసీ ఫిర్యాదుగా స్వీకరించి న్యాయశాఖకు అందజేసింది. అదానీ ఖాన్‌దాన్‌లోని సాగర్‌ అదానీ టెలిఫోన్‌ మెసేజీల ఆధారంగా కొనుగోలు ఒప్పందాల కోసం రాష్ట్రాల అధికారులకు లంచాలు ఇచ్చారని ఎఫ్‌బీఐ నేరారోపణ చేసింది. 

ఇది నేరారోపణ (Indictment) మాత్రమే! నేర నిరూపణ కాదు!! దీనిపై అమెరికా న్యాయశాఖ అదానీ పరివారానికి నోటీసులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా జగన్‌ మోహన్‌ రెడ్డి పేరు గానీ, ప్రస్తావన గానీ లేదు. కానీ యెల్లో మీడియా సంస్థలు మాత్రం జగన్‌ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా పతాక శీర్షికలు పెట్టాయి. సీరియల్‌ కథనాలను రాసేస్తున్నాయి. వ్యక్తిత్వ హననానికి ఇంతకంటే పెద్ద ఉదాహ రణ ఉంటుందా?

అమెరికాలోని ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు భంగం కలిగే వ్యవహారం ఏ దేశంలో జరిగినా అమెరికా విచారణ జరుపుతుందనీ, అమెరికాలో అటువంటి చట్టాలున్నాయనీ భారత్‌లోని అమెరికా ప్రియులు తన్మయత్వంతో చెబుతున్నారు. కానీ భారత్‌ ఒక సార్వభౌమాధికారం కలిగిన సర్వసత్తాక గణతంత్ర దేశమనే సంగతిని వారు విస్మరిస్తున్నారు. 

భారత్‌లో జరిగినట్టు వారు భావిస్తున్న అదానీల అక్రమంపై భారత ప్రభుత్వానికి అమెరికా ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరవలసింది. ఈ విషయంలో ఆమెరికా తన పరిధులు దాటి వ్యవహరించిందని భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్‌ సిబ్బల్‌ తదితరులు విమర్శిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రయోజనాల కోసం ఇలా పరిధులు దాటడం అమెరికాకు అలవాటే.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ సంస్థను ఫక్తు వ్యాపారసంస్థగా మార్చిన చరిత్ర చంద్రబాబుది. సంస్కరణల పేరుతో విద్యుత్‌ బోర్డును ముక్కలుగా విడగొట్టారు. విద్యుత్‌ ఛార్జీలను విపరీ తంగా పెంచి, జనంపై మోయలేని భారాన్ని వేశారు. నిరసన తెలియజేయడానికి రోడ్డెక్కిన వారిపై కాల్పులు జరిపి, ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారు. 

నష్టాల్లో ఉన్నాయనే నెపంతో చక్కెర ఫ్యాక్టరీలు వగైరాలను తన మనుషులకు కట్టబెట్టిన చందంగానే జెన్‌కో ముక్కలను, ట్రాన్స్‌కో ముక్కలను అప్పగించాలని భావించారు. కుంభకోణం చేసే ఆలోచన అంటే ఇది. కానీ చివరకు కథ అడ్డం తిరిగి అప్పగింతల కార్యక్రమం నెరవేరలేదు.

కేజీ బేసిన్‌లో గ్యాస్‌ నిల్వలు తగినంతగా లేవని నివేదికలు ఉన్నప్పటికీ, గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లతో పీపీఏలు కుదుర్చుకున్నారు. ఒకవేళ ఆ ప్లాంట్లకు తగినంత గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతే వాటి ఉత్పత్తి సామర్థ్యంలో 80 శాతం వరకు ప్రభుత్వం అప్పనంగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అవినీతి అంటే, స్కామ్‌ అంటే ఇలాఉంటుంది. ప్రజా ఖజానాపై భారం తగ్గించేలా ఉండదు.

వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందజేయాలన్న ఆలోచనకు ఆయన స్వతహాగా వ్యతిరేకమన్నది జగమెరిగిన సత్యం! ఉచితంగా విద్యుత్తును అందజేస్తే కరెంటు తీగలపై బట్టలారేసుకోవలసి వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యానం సూర్యచంద్రులున్నంత వరకూ మరిచిపోయేది కాదు. 

ఈ వైఖరి కారణంగానే వ్యవసాయ విద్యుత్‌ను ఆయన నిరుత్సాహ పరుస్తూ వచ్చారు. 2019కి పూర్వం కూడా రైతన్నల విద్యుత్‌ కష్టాలు చెప్పనలవిగానివి. పేరుకు 7 గంటల విద్యుత్‌ సరఫరా. కానీ రోజూ రెండు మూడు గంటలు కోత పడేది. రెండు మూడు దఫాలుగా ఇచ్చేవారు. రాత్రి పూట కూడా పడిగాపులు పడాల్సి వచ్చేది.

ఆ కొద్దిపాటి సరఫరా కూడా నాణ్యమైనది కాదు. హెచ్‌టీ, ఎల్‌టీ లైన్లు ఒకే స్తంభంపై ఉండటంతో తరచూ గాలికి అవి కలిసిపోయేవి. ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీడర్లలో సగం మాత్రమే వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు అనువుగా ఉండేవి. ఈ వ్యవస్థను మార్చడానికి ఆయన ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కానీ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రైతాంగంపై దృష్టి పెట్టారు. 1,700 కోట్లు ఖర్చు పెట్టి ఫీడర్లను, లైన్లను ఆధునీకరించి పగటిపూటే 9 గంటల నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు రంగం సిద్ధం చేశారు.

ఒక్క విద్యుత్‌రంగంలోనే ఇద్దరు నాయకుల ఆలోచనలు, వారు చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తే వారి వ్యక్తిత్వాలేమిటో తేటతెల్లమవుతుంది. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు నిర్వహించారు. ప్రజల మీద భారాన్ని మోపడం ఆయన నైజం. కట్టలేమన్న వారిని కాల్చి చంపడం ఆయన చరిత్ర. వ్యవస్థల్ని ప్రైవేటీకరించడం, వీలైతే తమ మనుషులకు కట్టబెట్టడం, ప్రైవేట్‌ వ్యక్తులకు లాభం చేకూరేలా పీపీఏలు కుదుర్చుకోవడం ఆయన గతం. 

జగన్‌మోహన్‌ రెడ్డి ఈ వైఖరికి పూర్తి భిన్నం. ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న ప్పటికీ, అందులో రెండేళ్ల కాలాన్ని కరోనా వైరస్‌ కాటేసినప్పటికీ ప్రజాశ్రేయస్సే తన అధికార పరమావధి అని చాటుకున్నారు. ఆయన అవలంభించిన విధానాలే ఇందుకు సాక్ష్యం. 

ఈ సాక్ష్యాన్ని చెరిపేయడానికీ, వారి చరిత్రలను మరిపించడానికీ కూటమి సర్కార్‌ యెల్లో మీడియా సహకారంతో ప్రయత్ని స్తున్నది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీల నుంచి కూడా జనం దృష్టి మరలిపోవాలి. అందుకోసం ఏదో ఒక నాటకాన్ని నడిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు నడిపిస్తున్న నాటకం పేరు ‘అదిగో పులి... ఇదిగో తోక!’


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement