సాక్షి, అమరావతి: నాలుగేళ్లలో దాదాపు రూ.నాలుగున్నర లక్షల కోట్లు పెరుగుదల! జీఎస్డీపీతోపాటు అన్ని రంగాల్లో ఏటా రెండంకెల వృద్ధి రేటు. ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభాలను అధిగమించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వరుసగా నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదు చేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తితో పాటు వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగం, నిర్మాణ, తయారీ తదితర అన్ని రంగాల్లో గత నాలుగేళ్లుగా సగటున ఏటా రెండంకెల వృద్ధి నమోదైంది. ఆయా రంగాల్లో ఆర్థిక కార్యకలాపాల ద్వారా 2022–23కి సంబంధించి ఏ మేరకు వృద్ధి పెరిగిందో ఆర్బీఐ గురువారం రాష్ట్రాల వారీగా నివేదికను విడుదల చేసింది.
ప్రస్తుత ధరల ప్రకారం 2019–20 నుంచి 2022–23 వరకు వరుసగా నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ పెరుగుతూనే ఉందని నివేదిక పేర్కొంది. 2018–19లో చంద్రబాబు హయాంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ రూ.8,73,721.11 కోట్లు ఉండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 2020–23 నాటికి నాలుగేళ్లలో రూ.13,17,728.15 కోట్లకు పెరిగింది. అంటే నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏకంగా రూ.4.44 లక్షల కోట్లకుపైగా పెరగడం గమనార్హం. కోవిడ్ లాంటి సంక్షోభాలు లేనప్పటికీ టీడీపీ హయాంలో వ్యవసాయ రంగం వృద్ధి తిరోగమనంలోకి వెళ్లినట్లు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి.
► గత నాలుగేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ 50.81 శాతం పెరగ్గా ఏటా సగటున వార్షిక వృద్ధి 12.70 శాతం నమోదైంది. కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యవసాయ రంగానికి, రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వ్యవసాయం, అనుబంధ రంగాల కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకుంది. దీంతో వరుసగా నాలుగేళ్లు వ్యవసాయ రంగంలో ఏటా సగటున రెండంకెల వృద్ధి నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారం నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో రూ.68,808.49 కోట్ల మేర ఉత్పత్తి పెరిగి 63.19 శాతం వృద్ధి నమోదైంది. అంటే ఏటా సగటున 15.79 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారం చంద్రబాబు హయాంలో 2017–18తో పోల్చితే 2018–19లో వ్యవసాయ రంగం వృద్ధి 5.42 శాతం మేర క్షీణించినట్లు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభం ఉన్నా దాన్ని అధిగమించి పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రెండంకెల వృద్ధి నమోదైంది. 2019–20 నుంచి 2022–23 వరకు వరుసగా నాలుగేళ్లలో పారిశ్రామిక రంగంలో రూ.95,220.02 కోట్ల మేర ఉత్పత్తి పెరిగి 50.48 శాతం వృద్ధి నమోదైంది. అంటే ఏటా సగటున వార్షిక వృద్ధి 12.62 శాతం ఉంది.
► గత నాలుగేళ్లలో సేవా రంగంలోనూ భారీ వృద్ధి నమోదైంది. సేవా రంగంలో రూ.1,58,255.53 కోట్ల మేర ఉత్పత్తి విలువ పెరిగి 47.48 శాతం వృద్ధి నమోదైంది. ఏటా సగటు వార్షిక వృద్ధి సేవారంగంలో 11.87 శాతం నమోదైనట్లు స్పష్టమైంది. నిర్మాణ రంగంలో రూ.23,931.67 కోట్ల మేర ఉత్పత్తి పెరిగి 39.83 శాతం వృద్ధి నమోదైంది. ఏగా సగటున వార్షిక వృద్ధి 9.95 శాతంగా ఉంది. తయారీ రంగంలో రూ.40,582.27 కోట్ల మేర ఉత్పత్తి పెరిగి 48.24 శాతం వృద్ధి నమోదైంది. అంటే ఏటా సగటు వార్షిక వృద్ధి 12.06 శాతంగా ఉంది. నాలుగేళ్లలో బ్యాంకింగ్ రంగంలో రూ.23,878.47 కోట్ల మేర విలువ పెరిగి 71.94 శాతం వృద్ధి నమోదైంది. ఏటా సగటు వార్షిక వృద్ధి 17.98 శాతంగా ఉంది.
► రాష్ట్రం తీవ్ర కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పటికీ 2019–20 నుంచి 2022–23 వరకు వరుసగా నాలుగేళ్లుగా తలసరి ఆదాయం పెరుగుతూనే ఉందని ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేశాయి. 2022–23లో రాష్ట్ర తలసరి ఆదాయం తొలిసారిగా రూ.రెండు లక్షలు దాటిందని నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment