సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యానికి మరింత భరోసానిచ్చేలా సీఎం జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ, విశాఖపట్నంలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) ప్రభుత్వానికి పంపింది. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌లో పిల్లల కోసం నిలోఫర్ ఆస్పత్రి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఆ ఆస్పత్రి సేవలను కోల్పోయింది. దీంతో పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి.
అయితే గత టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ పిల్లలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీటీడీ సహకారంతో తిరుపతిలో చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించింది. ఈ ఆస్పత్రి ప్రస్తుతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. అంతేకాకుండా అలిపిరి వద్ద రూ.450 కోట్లతో పీడియాట్రిక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని టీటీడీ సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నారు.
ఆ తరహాలోనే విశాఖ, విజయవాడల్లోనూ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో 500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి ఏర్పాటుకు డీఎంఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక్కో చోట ఆస్పత్రి భవనాల నిర్మాణం, ఇతర సివిల్ పనుల కోసం రూ.180 కోట్ల మేర ఖర్చు అవనున్నట్టు ఏపీఎంఎస్‌ఐడీసీ అంచనా వేసింది. అధునాతన వైద్య పరికరాల కోసం ఇంకా అదనంగా ఖర్చు పెట్టనున్నారు. గుండె, కిడ్నీ, మెదడు, కాలెయ సంబంధిత జబ్బులతో పాటు, చిన్న పిల్లల్లో క్యాన్సర్‌కు, ఇతర అన్ని రకాల వైద్య సేవలు అందించేలా 17 స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలతో ఈ రెండు ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి.
సీఎం జగన్ ఆదేశాల మేరకు..
ప్రభుత్వ రంగంలోనే చిన్న పిల్లలకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందుబాటులోకి తేవాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఈ క్రమంలో విశాఖ, విజయవాడల్లో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటి ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రజలకు మేలు చేకూరుతుంది. చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాం.
– డాక్టర్ నరసింహం, డీఎంఈ
చిన్నారుల ఆరోగ్యానికి రక్ష
Published Mon, Nov 6 2023 5:17 AM | Last Updated on Mon, Nov 6 2023 7:57 AM
Comments
Please login to add a commentAdd a comment