![Specialist doctors services in rural areas of Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/27/ap-bottom.jpg.webp?itok=X1cN24i5)
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో వినూత్న విధానాలతో ముందడుగు వేస్తున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లోని ‘ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, వైద్య సేవలు’ అన్న లక్ష్యంలో భాగంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య క్రమాన్ని అత్యంత పత్రిష్ఠాత్మకంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ దిశగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగించి వారి ఆరోగ్య అవసరాలను గుర్తించి పరిష్కరించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఆరోగ్య శిబిరం సెప్టెంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. ప్రజలందరికీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధి బాధితులు, గర్భిణులు, బాలింతలు, నియో నేటల్, శిశువులు. బాలలు వంటి వారికి ఈ కార్యక్రమంలో వైద్య సేవలందిస్తారు.
ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి కార్యక్రమం ద్వారా ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటికీ వైద్య సేవలందిస్తున్నది. ఇప్పుడు ప్రత్యేక వైద్య శిబిరాలను గ్రామాల్లో ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందు బాటులోకి తెచ్చి గ్రామీణ పేదలకు మరింత చేరువయ్యేందుకు ఈ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజాగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను వారి ముంగిట్లోనే గుర్తించటం మాత్రమే కాక వారికి సరైన వైద్య సలహాలు, చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవటం, అవసరమైన కేసులను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేయటం వంటి చర్యలు తీసుకుంటారు.
ఈ బాధ్యతలను ఫ్యామిలీ డాక్టర్ విధులు నిర్వహించే వైద్య నిపుణులతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ), ఏఎన్‌ఎంలకు అప్పగించారు. వారు పేషెంట్లకు తగిన కన్సల్టెన్సీ సేవల ద్వారా వైద్య సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే వారి అవసరాలకు తగిన మందులను కూడా అందచేస్తారు.
మొత్తం 162 రకాల మందులు. 18 సర్జికల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. స్పెషలిస్టు డాక్టర్ల సూచనల మేరకు ఇతర మందుల్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. సెప్టెంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు 45 రోజుల పాటు కొనసాగి నవంబర్ 15 నాటికి ముగుస్తాయి.
శిబిరాలలో ఏడు రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన టెస్ట్ కిట్లు, అవసరమైన పరిమాణంలో ఔషధాలు అందుబాటులో ఉంటాయి. ఈ వైద్య శిబిరాలలో సేవలందించేందుకు ఆసక్తి కలిగిన డాక్టర్ల అసోసియేషన్లు, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఏఎన్‌ఎం/సీహెచ్‌ఏలు క్షేత్రస్థాయి సంద ర్శనలు ప్రారంభించారు. ఇంటింటి సర్వేలో ఇప్పటి వరకూ దాదాపు 38 లక్షల ఇళ్లలో వ్యక్తుల ఆరోగ్య వివరాలను సేకరించారు. ఈ నెల 19వ తేదీ వరకూ వివిధరకాల వ్యాధుల నిర్ధారణ కోసం దాదాపు 29 లక్షల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన మందుల్ని కూడా ఉచితంగా ఇవ్వడంతో పాటు తర్వాత వారు పూర్తిగా నయమయ్యే వరకూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లతో అనుసంధానం చేస్తామని సీఎం ప్రకటించారు.
– కల్లి వెంకట రమణమూర్తి,
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ
Comments
Please login to add a commentAdd a comment