Specialist doctors
-
ఆరోగ్య సురక్ష విస్తరణ
సాక్షి, అమరావతి: అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గ్రామాల్లోనే ప్రజలందరూ ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యసేవలు, మందులు పొందడం.. అలాగే, పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకూ ప్రజలు పోటెత్తుతుండడంతో వీటిని ప్రతి వార్డుకూ విస్తరించాలని వైద్యశాఖ సంకల్పించింది. ఇప్పటివరకు 8,985 శిబిరాల నిర్వహణ.. గత నెల 30 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 పనిదినాల్లో 8,985 క్యాంపులు నిర్వహించారు. వీటిల్లో 35,11,552 మంది ఉచిత స్పెషలిస్ట్ వైద్యసేవలు పొందారు. వీరిలో 61,971 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేశారు. అలాగే, గ్రామాల్లోని 10,032 విలేజ్ క్లినిక్‌ల పరిధిలో చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 6,500కు పైగా క్యాంపులు పూర్తయ్యాయి. ఇప్పుడు వీటికి అదనంగా పట్టణాల్లో వార్డుల వారీగా విస్తరించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, నగరాల్లో 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,626 శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. దీంతో ఒక్కో కేంద్రం పరిధిలో ప్రస్తుతం మూడుచొప్పున ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక్కో శిబిరం వద్దకు వెయ్యి మందికి పైగా జనాభా హాజరవుతున్నారు. ఇలా ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యం పొందడంలో ఆలస్యం, ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు వీలుగా వార్డు సచివాలయాల వారీగా సోమవారం నుంచి శిబిరాలను నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇప్పుడు ఈ క్యాంపులు మరింతగా పెరగనున్నాయి. 3,842 వార్డు సచివాలయాల పరిధిలో.. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే శిబిరాలు పూర్తయినవి మినహాయించి మిగిలిన ప్రతి సచివాలయం పరిధిలో శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. ► సచివాలయం పరిధిలో శిబిరం నిర్వహించడానికి ముందే ప్రతి ఇంటిని వలంటీర్లు, గృహ సారథులు సందర్శిస్తున్నారు. ► ఆ తర్వాత.. వలంటీర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ► బీపీ, సుగర్ పరీక్షలతో పాటు, అవసరం మేరకు డెంగీ, మలేరియా, వంటి ఇతర ఏడు పరీక్షలు చేపడుతున్నారు. ► ఈ స్క్రీనింగ్‌లో గుర్తించిన వివిధ సమస్యల ఆధారంగా బాధితులు శిబిరాలకు హాజరవ్వడానికి టోకెన్లు ఇస్తున్నారు. ► టోకెన్లతో సంబంధం లేకుండా ప్రజలు నేరుగా శిబిరాలకు హాజరయ్యే వెసులుబాటు కూడా అధికారులు కల్పించారు. ► ఇక ప్రతి క్యాంపులో ఇద్దరు ఎంబీబీఎస్, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు, సరిపడా మందులను సమకూరుస్తున్నారు. ఇబ్బందులకు తావు లేకుండా.. పట్టణాల్లోని ప్రతి వార్డు సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరాల నిర్వహణ ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలకు ఆ బాధత్యలు అప్పగించాం. - ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీఈఓ, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
ఊరూ వాడా.. ‘ఆరోగ్య సురక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో 7.16 లక్షల మంది ప్రభుత్వ సెలవు దినాలను మినహాయిస్తే గురువారం వరకూ నాలుగు రోజుల పాటు వైద్య శాఖ 2,427 శిబిరాలను నిర్వహించింది. గ్రామాల్లో 2,261 శిబిరాలను నిర్వహించగా పట్టణాలు, నగరాల్లో 166 శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి శిబిరంలో ఇద్దరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తంగా నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల్లో ఏకంగా 7,16,101 లక్షల మంది సొంత ఊళ్లలో ఉచిత చికిత్సలు పొందారు. వెద్య సేవలను వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 4 లక్షల మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఒక్కో శిబిరంలో సగటున 277 మంది వైద్య సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు భావించిన 20,798 మందిని పెద్దాస్పత్రులకు రిఫర్ చేశారు. ఉచితంగా పరీక్షలు.. మందులు ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. టోకెన్లు లేకున్నా వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకున్నా కూడా తమ గ్రామం/పట్టణంలో శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మహిళలకు ప్రత్యేక కౌంటర్ – పకూర్ బీ, క్రిష్టిపాడు, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లే వాళ్లం. ఇప్పుడు మా గ్రామానికే వైద్యులు వస్తున్నారు. డబ్బు ఖర్చు లేకుండా ఊళ్లోనే వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు వ్యయ ప్రయాసలు లేకుండా వైద్యులే గ్రామాల్లోకి వచ్చి వైద్యం చేయడం ఎంతో మేలు చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ.5 వేలు ఖర్చయ్యేవి – కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)) ఆరోగ్య సురక్ష శిబిరంలో నేను, నా భర్త వైద్య సేవలు పొందాం. ముందుగానే వలంటీర్, ఏఎన్ఎం మా ఇంటికి వచ్చి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భీమవరంలో నిర్వహించిన సురక్ష శిబిరంలో కొన్ని పరీక్షలు చేసి స్పెషలిస్ట్ వైద్యులు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఇదే వైద్య సేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకుంటే మాకు సుమారు రూ.5 వేలు ఖర్చయ్యేవి. ముఖ్యమంత్రి జగన్ మా ఇంటి వద్దకే వైద్యులను పంపించి ఉచితంగా సేవలు అందించడం చాలా బాగుంది. ఈ శిబిరాలు పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడతాయి. 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులు: మంత్రి విడదల రజని చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మంత్రి రజని గురువారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యం అందించేందుకు ఏకంగా 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. -
AP: ప్రభుత్వ వైద్య సేవల్లో కొత్త అధ్యాయం
చానా సంతోషం నాయనా.. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బాలసంటి. వయసు 90 ఏళ్ల పైనే. బాలసంటి గ్రామం పేరు బెలుం. ఇది కొలిమిగుండ్ల మండలం నంద్యాల జిల్లాలో ఉంటుంది. ఇతనికి ఏ వైద్య అవసరం కావాలన్నా ఇంతకు ముందు 70 కిలోమీటర్ల దూరంలోని ప్రొద్దుటూరుకు వెళ్లాల్సిందే. ఇప్పుడతనికి గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి. శనివారం జగనన్న సురక్ష క్యాంపునకు వచ్చిన అతను మాట్లాడుతూ.. ‘‘గతంలో ప్రొద్దుటూరు వెళ్లి కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నా. ఇప్పుడు మళ్లీ కండ్లు సరిగా కనిపిస్తలేవు. బయటకు వెళ్లలేకున్నా, నడిచేందుకు కూడా కష్టంగా ఉంది. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టినారని తెలిసినోళ్లు ఇక్కడికి తీసుకొచ్చినారు. అప్పటికప్పుడు అన్ని పరీక్షలు చేసినారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఎక్కడెక్కడో తిరిగే బాధ కూడా తప్పింది. చానా సంతోషం నాయనా’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడాడు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. 26 జిల్లాల్లో 620 ఆరోగ్య సురక్ష క్యాంప్‌లు నిర్వహించారు. ఒక్కో క్యాంప్‌లో ఇద్దరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు.. మొత్తం నలుగురు వైద్యులు అందుబాటు లో ఉండి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యం చేశారు. 1,45,611 మంది స్వగ్రామాల్లోనే వైద్య సేవలు పొందారు. అంటే.. ప్రతి క్యాంప్‌లో సగటున 235 ఓపీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారం(సెపె్టంబర్ 30) నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని శుక్ర వారం సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. శనివారం జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క్యాంప్‌లను ప్రారంభించారు. మహిళలే అధికం తొలి రోజు ఆరోగ్య సురక్ష క్యాంప్‌లలో వైద్య సేవలు పొందిన వారిలో మహిళలే అధికం. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల మంది సేవలు పొందగా వీరిలో 63,257 మంది పురుషులు, 82,354 మంది మహిళలు ఉ న్నారు. మొత్తం వైద్య సేవలు పొందిన వారిలో మెరుగైన వైద్యం అవసరమున్న 5,809 మందిని స్థానికంగా ఉన్న పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరు ఆయా ఆస్పత్రులకు వెళ్లి వైద్యసేవలు పొందేలా స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. దీంతో పెద్ద ఆస్పత్రుల్లోను వీరందరికీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తారు. రూపాయి ఖర్చు లేకుండా క్యాంప్‌లకు వచ్చిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు, మందులను అందించింది. ప్రతి క్యాంప్ లో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్తపరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామం/పట్టణంలో ఆరోగ్య సు రక్ష క్యాంప్‌పై ప్రజలకు వైద్య సిబ్బంది, వలంటీర్లు అవగాహన కల్పించారు. సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లే పనిలేకుండా జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ వంటి ఇతర స్పెషలిస్ట్ వైద్యులే గ్రామంలో సేవలు అందిస్తున్నారని తెలిసి ప్రజలు శిబిరాలకు తరలి వచ్చారు. క్యాంప్‌ల్లో వైద్య సేవలు పొందిన వారికి వ్యక్తిగత కేస్ షీట్స్‌ను ప్రభు త్వం అందించింది. కేస్ షీట్లో వ్యక్తి పేరు, చిరునామా, వయసు వంటి వివరాలతో పాటు, వైద్యుడు పరిశీలనాంశాలు, సూచించిన మందుల ప్రిస్క్రిప్షన్ నమోదు చేశారు. కేస్ షీట్ ఫోల్డర్, వైద్యుడు సూచించిన మందులతో జగనన్న ఆరోగ్య కిట్‌ను వైద్య శాఖ పంపిణీ చేసింది. వీరిపై ఫ్యామిలీ డాక్టర్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంచనున్నారు. ఐదు దశల్లో.. ప్రభుత్వం 5 దశల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తొలి దశలో వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు హెల్త్ క్యాంప్ నిర్వహించే 15 రోజుల ముందు ఇళ్లన్నింటినీ సందర్శిస్తున్నారు. ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. రెండో దశలో సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ప్రజలకు ఇంటి వద్దే బీపీ, షుగర్, హెచ్‌బీ, డెంగీ, మలేరియా సహా ఏడు రకాల పరీక్షలు అవసరం మేరకు నిర్వహించి ఫలితాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇక మూడో దశలో క్యాంప్ నిర్వహణకు మూడు రోజుల ముందు వలంటీర్, ప్రజాప్రతినిధులు ఇంటింటిని సందర్శించి హెల్త్ క్యాంప్ జరిగే ప్రదేశం, సమయం ఇతర వివరాలను తెలియజేస్తున్నారు. నాలుగో దశలో క్యాంప్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఐదో దశలో హెల్త్ క్యాంప్‌లో వైద్య సేవలు పొందిన వారికి, రిఫరెన్స్ మేరకు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారికి తదుపరి వైద్య అవసరాల విషయంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్, వలంటీర్లు చేయిపట్టి నడిపిస్తారు. వృద్ధులకు మేలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వృద్ధులకు ఎంతో ఉపయోగకరం. ఇంటింటికి వచ్చి వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ పలకరిస్తున్నారు. గుమ్మం వద్దే వైద్య పరీక్షలు చేస్తున్నారు. టోకెన్లు ఇచ్చి ఊళ్లోనే వైద్యం చేయిస్తున్నారు. మందులు ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఇలాంటి సేవలో మాకు అందేవి కావు. – శివలింగరెడ్డి, చిటిపిరాళ్ల గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లా పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణులతో పేదల కోసం ఇలాంటి వైద్య శిబిరాలు గతంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. నేను గతకొద్ది కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నాను. ఆసుపత్రికి వెళితే ఎంత ఖర్చు అవుతుందో అన్న భయంతో వెళ్లలేదు. ఈ రోజు వైద్య శిబిరంలో ఈసీజీ తీసి పరీక్షించారు. – కొల్లు అప్పారావు, మర్రిమొక్కవీధి, జగ్గంపేట, కాకినాడ జిల్లా అన్ని పరీక్షలు చేశారు నాకు గత కొంతకాలంగా నడుం నొప్పి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడం నాకు సాధ్యం కాదు. మా ప్రాంతానికి 104 వాహనం రావడం, మందులు ఇవ్వడం వల్ల కొంత ఉపశమనం లభించింది. ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చిన పెద్ద డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. మందులు ఇచ్చి కొన్ని సూచనలు చేశారు. –పాలిక లక్ష్మి, శెట్టిబలిజపేట, జగ్గంపేట, కాకినాడ జిల్లా పడిపోయి.. నడవలేక.. ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాను. కాలికి గాయమైంది. నడవలేక ఇబ్బంది పడుతున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి వెళ్లాను. అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. కాలుని పట్టిపట్టి చూశారు. పెద్దగా భయపడాల్సిన పనిలేదన్నారు. మందులిచ్చి వేసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బంది ఉంటే పీహెచ్‌సీకి రమ్మని చెప్పారు. – అప్పలనాయుడు, జమాదులపాలెం, కశింకోట మండలం, అనకాపల్లి జిల్లా -
జగనన్న ఆరోగ్య సురక్ష ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో కలిసి గురువారం డీఎంహెచ్వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు దశల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం వైద్య శిబిరాలు ప్రారంభించే ప్రాంతాల్లో ఇప్పటికే గ్రామాల్లో తొలి దశ సర్వే పూర్తయిందన్నారు. రెండు, మూడో దశ సర్వేలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంటింటి సర్వేలను పక్కాగా నిర్వహించాలన్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంపై ప్రజలకు సమగ్రంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ కరపత్రాలను ప్రతి ఇంటికీ అందజేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేయించి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించే తేదీలకు సంబంధించి గ్రామాల్లో దండోరా వేయించాలని చెప్పారు. క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులు వస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడి అవసరం ఉందనే విజ్ఞప్తులు ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్నాయని, క్యాంపులలో వీలైనంతవరకు ఆర్థోపెడిక్ వైద్యులు ఉండేలా చూడాలని సూచించారు. డీఎంహెచ్వోలు, ఇతర ఉన్నతాధికారులు వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. మారిన వైద్య రంగం ముఖచిత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగం ముఖచిత్రం మారిపోయిందని మంత్రి విడదల రజిని అన్నారు. వివిధ కార్యక్రమాల అమలులో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్లకు అత్యధిక రికార్డులను లింక్ చేసి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి రజినికి అందజేశారు. ఈ సందర్భంగా అధికారులను ఆమె అభినందించారు. -
పల్లెల్లోనూ స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో వినూత్న విధానాలతో ముందడుగు వేస్తున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లోని ‘ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, వైద్య సేవలు’ అన్న లక్ష్యంలో భాగంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య క్రమాన్ని అత్యంత పత్రిష్ఠాత్మకంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ దిశగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగించి వారి ఆరోగ్య అవసరాలను గుర్తించి పరిష్కరించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఆరోగ్య శిబిరం సెప్టెంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. ప్రజలందరికీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధి బాధితులు, గర్భిణులు, బాలింతలు, నియో నేటల్, శిశువులు. బాలలు వంటి వారికి ఈ కార్యక్రమంలో వైద్య సేవలందిస్తారు. ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి కార్యక్రమం ద్వారా ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటికీ వైద్య సేవలందిస్తున్నది. ఇప్పుడు ప్రత్యేక వైద్య శిబిరాలను గ్రామాల్లో ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందు బాటులోకి తెచ్చి గ్రామీణ పేదలకు మరింత చేరువయ్యేందుకు ఈ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను వారి ముంగిట్లోనే గుర్తించటం మాత్రమే కాక వారికి సరైన వైద్య సలహాలు, చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవటం, అవసరమైన కేసులను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేయటం వంటి చర్యలు తీసుకుంటారు. ఈ బాధ్యతలను ఫ్యామిలీ డాక్టర్ విధులు నిర్వహించే వైద్య నిపుణులతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ), ఏఎన్ఎంలకు అప్పగించారు. వారు పేషెంట్లకు తగిన కన్సల్టెన్సీ సేవల ద్వారా వైద్య సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే వారి అవసరాలకు తగిన మందులను కూడా అందచేస్తారు. మొత్తం 162 రకాల మందులు. 18 సర్జికల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. స్పెషలిస్టు డాక్టర్ల సూచనల మేరకు ఇతర మందుల్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. సెప్టెంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు 45 రోజుల పాటు కొనసాగి నవంబర్ 15 నాటికి ముగుస్తాయి. శిబిరాలలో ఏడు రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన టెస్ట్ కిట్లు, అవసరమైన పరిమాణంలో ఔషధాలు అందుబాటులో ఉంటాయి. ఈ వైద్య శిబిరాలలో సేవలందించేందుకు ఆసక్తి కలిగిన డాక్టర్ల అసోసియేషన్లు, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఏఎన్ఎం/సీహెచ్ఏలు క్షేత్రస్థాయి సంద ర్శనలు ప్రారంభించారు. ఇంటింటి సర్వేలో ఇప్పటి వరకూ దాదాపు 38 లక్షల ఇళ్లలో వ్యక్తుల ఆరోగ్య వివరాలను సేకరించారు. ఈ నెల 19వ తేదీ వరకూ వివిధరకాల వ్యాధుల నిర్ధారణ కోసం దాదాపు 29 లక్షల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన మందుల్ని కూడా ఉచితంగా ఇవ్వడంతో పాటు తర్వాత వారు పూర్తిగా నయమయ్యే వరకూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లతో అనుసంధానం చేస్తామని సీఎం ప్రకటించారు. – కల్లి వెంకట రమణమూర్తి, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ -
జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ రక్ష
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్ర ప్రజలందరికీ రక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దీనిని బట్టి తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత బలోపేతం చేసిందో, ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ఇప్పటివరకు 2.30 కోట్ల ఓపీలు నమోదయ్యాయని చెప్పారు. ఇది ఒక చరిత్రగా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.8,500 కోట్ల ఖర్చుతో కొత్తగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తోందని, వీటిలో ఐదింటిని సీఎం జగన్ శుక్రవారం పారంభించారని గుర్తు చేశారు. వచ్చే రెండేళ్లలో మిగిలిన 12 కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు. సంక్షేమ రాడార్ నుంచి తప్పించుకోకుండా.. జగనన్న సంక్షేమ రాడార్ నుంచి ఎవరూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందని మంత్రి రజని చెప్పారు. మొదటి దశలో వలంటీర్ల ఇంటింట సర్వే ఈ నెల 15న ప్రారంభమైందని, స్థానిక ప్రజా ప్రతినిధులు, వలంటీర్లు, ఎన్ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తొలి దశలో గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్టు మంత్రి చెప్పారు. సీహెచ్‌వో లేదా ఏఎన్ఎం ఆ ఇంటికి ఎప్పుడు వస్తారనే విషయాన్ని వలంటీర్లు సమాచారం ఇస్తారన్నారు. రెండో దశలో సీహెచ్‌వో, ఏఎన్ఎంలు ప్రజల ఇళ్లకే వెళ్లి అందించే సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ప్రజల అంగీకారం మేరకు బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్ వంటి ఏడు రకాల పరీక్షలను ఇంటివద్దే చేస్తారన్నారు. మూడో దశలో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవాభావం గల వ్యక్తుల బృందాలు మరోసారి ఇంటింటికీ వెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించే తేదీ, అందించే సేవలను వివరిస్తారన్నారు. నాలుగో దశలో ఈ నెల 30న వైద్య శిబిరాలు మొదలుపెట్టి.. 45 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్టు మంత్రి రజిని వివరించారు. శిబిరాల్లో రోగులను పరీక్షించి, అవసరమైన వారికి మందులు ఇస్తారని, చికిత్స అవసరమైతే వారిని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, తహసీల్దార్, పీహెచ్‌సీల వైద్యాధికారులు.. పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ ఆరోగ్య అధికారులు, యూపీహెచ్సీల వైద్యాధికారులు వైద్య శిబిరాల బాధ్యత తీసుకుంటారన్నారు. ఐదో దశలో ఆ గ్రామానికి చెందిన ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వో, ఏఎన్ఎంలు రిఫరల్ కేసులకు సంబంధించిన రోగులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తారన్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందిందా లేదా.. రోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా పరిశీలిస్తారని వివరించారు. నిఫా వైరస్‌పై అప్రమత్తం నిఫా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి రజని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉన్నామని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీజీ సీట్ల విషయంలో నకిలీ ఎల్వోపీలపై విచారణ కొనసాగుతోందని, ఇది పూర్తిగా ఎన్ఎంసీ పరిధిలోని అంశం అవడంతో వారి ద్వారా విచారణ కోరినట్టు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కార్యదర్శి మంజుల, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి వాక్–ఇన్ ఇంటర్వ్యూ లు
సాక్షి, అమరావతి: డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆస్పత్రులతోపాటు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) పరిధిలో 13 స్పెషాలిటీల్లో 343 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ భర్తీ చేస్తోంది. ఇందుకోసం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సోమవారం నుంచి 15వ తేదీ వరకు వాక్–ఇన్ ఇంటర్వ్యూ లను నిర్వహించనుంది. ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో రోజు మార్చి రోజు ఈ నెల 15వ తేదీ వరకు ఇంటర్వ్యూ లు ఉంటాయి. రెగ్యులర్(లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యులను నియమించనున్నారు. సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో గిరిజన ప్రాంతాలను ఎంపిక చేసుకున్న వైద్యులకు నెలకు రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.రెండు లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఖరారు చేశారు. ఎన్హెచ్ఎం కింద బోధన, జిల్లా ఆస్పత్రుల్లో నియమించే వారికి రూ.1.10 లక్షలు చొప్పున ఇస్తారు. ఇక ఎన్హెచ్ఎంలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లలో నియమించేవారికి మైదాన ప్రాంతాల్లో రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయి. అభ్యర్థులు అదనపు వివరాల కోసం http://hmfw.ap.gov.in/ వెబ్‌సైట్‌ను, 6301138782 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండకుండా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గడిచిన నాలుగేళ్లలో 53వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. ఇంటర్వ్యూ ల నిర్వహణ షెడ్యూల్ ఇలా.. సోమవారం(11వ తేదీ): జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ బుధవారం(13వ తేదీ): గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పెథాలజీ శుక్రవారం(15వ తేదీ): పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ -
AP: స్పెషలిస్ట్ వైద్యులకి గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: స్పెషలిస్ట్ వైద్యులకి ప్రత్యేక అలవెన్స్ విషయంలో గుడ్‌న్యూస్. ఏపీ వైద్య విధాన పరిషత్ ప్రతిపాదనలకి అంగీకారం తెలిపింది ప్రభుత్వం. ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో నియమించే స్పెషలిస్ట్ వైద్యులకి 15,000 రూపాయిల ప్రత్యేక అలవెన్స్ ఇస్తూ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. -
స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీకి రాజీలేని చర్యలు
సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖలో స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం రాజీ లేకుండా చర్యలు చేపడుతోందని ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి ఓ వైపు పలు రకాలుగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే.. ప్రభుత్వ సేవల్లో చేరడానికి స్పెషలిస్ట్ వైద్యులు ఆసక్తి చూపడం లేదంటూ పచ్చ పత్రికలో కథనాలు రాస్తున్నారు. ఆ వార్తలను ఖండిస్తూ కమిషనర్ వినోద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే.. 61 శాతం స్పెషలిస్ట్, 50 శాతం జనరల్ ఫిజిషియన్ల కొరత ఉందని పేర్కొన్నారు. అదే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైద్యుల అందుబాటులో దేశంలోనే ఏపీ అగ్ర స్థానంలో నిలుస్తోందని తెలిపారు. 2019 జూన్ నాటికి ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 1,250 స్పెషలిస్ట్ వైద్యుల కొరత ఉండేదని, ఈ క్రమంలో ఎనిమిది నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా 277 గైనిక్, 234 అనస్తీషియా, 146 పీడియాట్రిషన్, 144 జనరల్ మెడిసిన్, 168 జనరల్ సర్జన్, 55 ఆర్థో, 78 ఆప్తామాలజీ, 65 ఈఎన్టీ, మిగిలిన స్పెషాలిటీల్లో 145 పోస్టులు భర్తీ చేసినట్టు తెలిపారు. 403 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి గత అక్టోబర్ వాక్–ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించగా 251 పోస్టులు భర్తీ అయినట్టు తెలిపారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 250 పోస్టుల భర్తీకి తాజాగా వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 110 పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు సహకరించక, పలు పోస్టుల్లో అభ్యర్థులు లేకనే కొన్ని పోస్టులు భర్తీ అవ్వడం లేదని వివరించారు. స్పెషలిస్ట్ వైద్యులను ప్రభుత్వ సేవల్లోకి ఆకర్షించడం కోసం అన్ని చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గ్రామీణంలో రూ.2 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.2.50 లక్షల వేతనాన్ని కూడా ఇస్తున్నామని తెలిపారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా చింతూరు, కూనవరం, పాడేరు వంటి ఆస్పత్రులనూ ఎంపిక చేసుకుని వైద్యులు చేరుతున్నట్టు ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. -
వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు.. 143 మంది వైద్యుల హాజరు
సాక్షి, అమరావతి: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్, శాశ్వత ప్రాతిపదికన స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీ కోసం శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వాక్–ఇన్ ఇంటర్వ్యూలకు 143 మంది వైద్యులు హాజరయ్యారు. శుక్రవారం రాత్రికి మెరిట్ జాబితాలను సిద్ధం చేసి కౌన్సెలింగ్ నిర్వహించారు. శాశ్వత ప్రాతిపదికన ఏడుగురు గైనిక్, నలుగురు ఈఎన్టీ, ఆరుగురు పెథాలజీ, 13మంది అనస్తీషియా స్పెషాలిటీ వైద్యులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. కాంట్రాక్టు ప్రాతిపదికన నలుగురు ఈఎన్టీ, ఒక పెథాలజీ వైద్యులకు పోస్టింగ్ ఇచ్చారు. శనివారం జూమ్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి మిగిలిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. -
డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్! తనిఖీల్లో బండారం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్‌లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్‌లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయతి్నంచగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నిషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్‌లో హాజరుకోసం ఉపయోగిస్తున్నారు. మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచి్చనట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది. ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్‌ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. (చదవండి: సీబీఐ ఛాయ్ బిస్కెట్ తినడానికి రాలేదు.. కవితపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్) -
గ్రామాలకు స్పెషలిస్ట్ వైద్యులు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రూరల్/ప్రభుత్వ సేవలను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో రాష్ట్ర కోటా, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు పొంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఒక సంవత్సరం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 2022–23వ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. కోర్సులు పూర్తి చేసుకున్న స్పెషలిస్ట్ వైద్యులను తొలి ప్రాధాన్యత కింద ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో నియమిస్తారు. ఆ తర్వాత మిగిలిన వారి సేవలను డీఎంఈ పరిధిలో వినియోగించుకుంటారు. ముందుగానే ఒప్పందం నాన్ సర్వీస్ అభ్యర్థులు కోర్సు అనంతరం సంవత్సరం పాటు రూరల్/ప్రభుత్వ సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రం తీసుకుంటారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి కోర్సు పూర్తయిన 18నెలల వ్యవధిలో ప్రభుత్వ సేవల్లో చేరకపోతే పీజీ చేసినవారికి రూ.40 లక్షలు, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి రూ.50లక్షల జరిమానా విధిస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రాష్ట్ర కోటా సీట్లలో 707 మంది, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో 1,142 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతారు. వీరందరూ ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందనున్న వీరందరూ 2025–26లో కోర్సులు పూర్తి చేసుకుంటారు. అనంతరం గ్రామీణ సేవల్లో చేరాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీరనుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అన్ని కళాశాలలకు ఆదేశాలు మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు. అన్ని కాలేజీలకు ఆదేశాలు ► మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు. -
341 స్పెషలిస్టు డాక్టర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలోని ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 341 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి ఆ విభాగం పరిమిత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. https://dmeaponline.com/లో ఆన్లైన్ అప్లికేషన్లను శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 26 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్–సర్వీస్మెన్లకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్–సర్వీస్మెన్లు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎంపిక విధానం, జీతభత్యాలు, ఇతర వివరాలు https://hmfw.ap.gov.inలో అందుబాటులో ఉంచారు. ఈ ఖాళీలు తాత్కాలికమైనవని, అవసరాలకు అనుగుణంగా ఖాళీల సంఖ్య తగ్గడం, పెరగడం ఉంటుందని ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. -
స్పెషలిస్టులొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీ ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం 12 వేలకు పైగా వైద్య సిబ్బంది భర్తీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అందులో డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎం, పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులున్నాయి. డాక్టర్ పోస్టుల్లో ప్రధానంగా బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీ ఏ మేరకు విజయవంతం అవుతుందన్నది అనుమానంగా మారింది. పారామెడికల్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, దాదాపు 10 వేలకుపైగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్, నర్సులు, ఏఎన్ఎం పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భర్తీ చేయనుంది. అందులో ప్రధానంగా 2,467 కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, పల్మనరీ మెడిసిన్ తదితర స్పెషలిస్ట్ పోస్టులున్నాయి. అయితే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినా ఏ మేరకు స్పెషలిస్టులు ముందుకు వస్తారన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖలో అనుమానాలున్నాయి. నోటిఫికేషన్ల కంటే ముందు ఇప్పుడు అధికారులను ఇదే వేధిస్తోంది. ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. 2018 నాటి చేదు అనుభవం... 2018లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులకు పోస్టింగ్‌లిచ్చారు. అన్నీ పోస్టులను భర్తీ చేశారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్ నగరంలోని ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో వైద్యులకు పోస్టింగ్‌లు లభించాయి. అందులో దాదాపు 600 మంది వరకు మాత్రమే విధుల్లో చేరారు. మిగిలినవారు చేరకుండా ఉద్యోగాలను వదులుకున్నారు. చేరిన వారిలోనూ చాలామంది విధుల్లోకి వెళ్లలేదు. వీరికి నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో కొందరిని తీసేశారు. సుదూర జిల్లాలు, ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో సమస్యకు కారణమని తెలుస్తోంది. స్పెషలిస్ట్ వైద్యులకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ వేతనాలకు జిల్లాల్లో పనిచేయాల్సిన అవసరమేంటన్న భావన ఉంటోంది. పైగా ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు చేయాలన్న ఆలోచన ఉన్నందున ఏ మేరకు ముందుకు వస్తారన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సదరు శాఖ స్పెషలిస్ట్ వైద్యుల భర్తీలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఏఎన్ఎం పోస్టులకు భారీ డిమాండ్.. ఎంబీబీఎస్ అర్హతతో భర్తీ చేసే మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఏఎన్ఎం పోస్టులకు ఈసారి భారీగానే డిమాండ్ ఉంటుందని వైద్య వర్గాలు అంచనా వేశాయి. 1,785 ఏఎన్ఎం పోస్టులకు దాదాపు 15 వేల నుంచి 20 వేల మంది నుంచి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఎంబీబీఎస్ అర్హతతో భర్తీ చేసే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 1,100పైగా ఉంటాయని, వాటికి దాదాపు ఐదారు వేల మంది నుంచి పోటీ ఉంటుందని అంటున్నారు. 4,600కు పైగా ఉన్న స్టాఫ్‌నర్స్ పోస్టులకు కూడా రెండుమూడు రెట్లు పోటీ ఉంటుందని భావిస్తున్నారు. డాక్టర్ పోస్టులు మినహా మిగిలిన వాటికి రాత పరీక్ష ఉండే అవకాశముంది. గతంలో మాదిరిగా తప్పులు దొర్లకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడటానికి నెల రోజుల సమయం పడుతుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఆ తర్వాత రెండుమూడు నెలల ప్రక్రియ పడుతుందని ఆయన పేర్కొన్నారు. -
పల్లెటూళ్ల నుంచి పట్నానికి స్పెషలిస్ట్ వైద్యులు
సాక్షి, అమరావతి: పీజీ స్పెషలిస్ట్ సర్టిఫికెట్ ఉండి.. ఇప్పటి వరకు పల్లెటూళ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమైన స్పెషలిస్ట్ వైద్యులను పట్టణాలు, నగరాల్లోని కోవిడ్ ఆస్పత్రులకు రప్పించేందుకు అధికార వర్గాలు చర్యలు తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో పని చేస్తున్న సుమారు 52 మంది స్పెషలిస్ట్ వైద్యులను గుర్తించి కోవిడ్ ఆస్పత్రుల్లో సేవలందించాలని ఆదేశించారు. వీరందరూ తక్షణమే స్టేట్ కోవిడ్ ఆస్పత్రుల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. మైక్రోబయాలజిస్ట్‌లు మాత్రం వైరాలజీ ల్యాబొరేటరీల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చికిత్సకు జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్ వైద్యుల అవసరం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీరంతా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే పని చేస్తున్నారు. జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, అనస్థీషియా, మైక్రోబయాలజీ వంటి ఎంతోమంది వైద్యులు సీనియర్ మెడికల్ ఆఫీసర్లుగానే ఉన్నారు. తాజా నిర్ణయంతో వీరందరికీ స్పెషాలిటీ సేవలందించే అవకాశం లభించింది. -
స్పెషలిస్టులు ఊస్టింగే?
సాక్షి, హైదరాబాద్ : వైద్య విధాన పరిషత్‌లో అత్యంత కీలకమైన స్పెషలిస్టు వైద్యులపై సర్కారు సీరియస్‌గా చర్యలకు రంగం సిద్ధం చేసింది. వారిని తొలగించేందుకు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. చెప్పాపెట్టకుండా గైర్హాజరైన వారికి గత నెలలో షోకాజ్ నోటీసులు ఇచ్చిన సర్కారు.. కొందరు అందుకోలేదన్న కారణమో లేక న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న భావనో తెలియదు కానీ నోటీసులు ఇచ్చిన వారి పేర్లను ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటించడం సంచలనమైంది. నెల రోజుల కిందటే నోటీసులు అందుకున్నా.. డాక్టర్లు స్పందించకపోవడంతో గెజిట్‌లో పేర్లను ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్ణీత సమయంలోగా వారు వివరణ ఇవ్వకపోతే శాశ్వతంగా తొలగించనున్నారు. మొత్తం 91 మంది వైద్యుల జాబితాను ప్రభుత్వం ఈ నెల 12న విడుదల చేసిన గెజిట్‌లో వెల్లడించింది. గెజిట్ విడుదలైన 7 రోజుల్లోగా అంటే 19లోగా వారి నుంచి స్పందన లేకపోతే శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోతారని అందులో పేర్కొంది. కాగా మంగళవారం వరకు ఒక్కరే స్పందించగా, మరో నలుగురు డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. దీంతో మిగిలిన వారు ఏం చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇది ఎవరి వైఫల్యం.. రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 125 ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. అందులో జిల్లా ఆస్పత్రులు 31, ఏరియా ఆస్పత్రులు 22, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 58, హైదరాబాద్ నగరంలో ఫస్ట్ రిఫరల్ యూనిట్లు 14 ఉన్నాయి. గతేడాది వాటిలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో వైద్యుల భర్తీ ప్రక్రియ జరిగింది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో గతేడాది జూలైలో ఏకంగా 15 రకాల స్పెషలిస్టు వైద్యులను భర్తీ చేశారు. వాటిలో మొత్తం 919 మంది స్పెషలిస్టు వైద్యులను నియమించారు. అందులో ఆర్థోపెడిక్–47, రేడియాలజీ–50, డెర్మటాలజీ–20, ఫోరెన్సిక్–28, జనరల్ మెడిసిన్–68, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్–9, పల్మనరీ–39, ఆప్తమాలజీ–34, సైకియాట్రిక్–22, ఎనస్తీషియా–156, ఈఎన్టీ–17, పాథాలజీ–55, జనరల్ సర్జన్స్–78, ఓబీజీ–146, పీడియాట్రిక్స్–150 పోస్టులను భర్తీ చేశారు. నియమితులైన వారిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. అయితే తమకు ఇష్టమైన చోట పోస్టింగ్‌లు ఇవ్వలేదని అనేకమంది అసంతృప్తితో ఉన్నారు. చేరిన వారిలో 500 మందికి మించి విధులకు హాజరుకావడం లేదన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. మిగిలిన వారిలో కొందరు విధులకు డుమ్మా కొడుతుండగా, 128 మంది దూరాభారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్న పరిస్థితి నెలకొంది. అందులో 91 మంది అనధికారికంగా విధులకు వెళ్లడం లేదని తెలిసి వారికి నోటీసులు ఇచ్చారు. ఇంతమంది ప్రత్యేక వైద్యులను ఉద్యోగాల్లో నియమించిన అధికారులు, వారికి తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. కొందరు భార్యాభర్తలను విడదీసి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఇంతమందిని కౌన్సెలింగ్ చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి, చివరకు తొలగించే పరిస్థితి తీసుకురావడం పట్ల పలువురు ప్రభుత్వ వైద్యుల సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. దీనికి కొందరు అధికారుల తీరే కారణమని అంటున్నారు. -
బోధనాస్పత్రులపై ‘ఇతరుల’ ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: బోధనాస్పత్రుల్లో పనిచేసేందుకు ఇతర ప్రభుత్వ విభాగాల వైద్యులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు ఇటీవల ప్రభుత్వం విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెం చింది. పెంపు ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. దీంతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే అనేక మంది వైద్యులు బోధనాస్పత్రుల్లో పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. వారిని బోధనాస్పత్రుల్లో్ల పనిచేసేందుకు అనుమతించాలని వైద్య విద్యా సంచాలకులు.. ప్రజారోగ్య సంచాలకులను కోరినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తే పీజీ పూర్తిచేసిన పీహెచ్సీ వైద్యులంతా కూడా బోధనాస్పత్రుల్లో్లకి వెళ్లే అవకాశముంది. కొత్తగా ప్రారంభించబోయే సూర్యాపేట, నల్లగొండ బోధనాస్పత్రుల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు వైద్యులు కావాలి. పైగా ఇతర మెడికల్, బోధనా స్పత్రుల్లోనూ కొరత నివారించే అవకాశముంది. ఒకేసారి 225 మంది బోధనాస్పత్రులకు... ఈసారి నుంచి పీజీ పూర్తిచేసిన వారిని తప్పనిసరిగా బోధనాస్పత్రులకు పంపించాలని సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఎందుకంటే ఇన్‌సర్వీసు కోటాలో పీజీ పూర్తిచేసిన స్పెషలిస్టుల వైద్య సేవలు ఉపయోగించుకోవాలనేది సర్కారు ఉద్దేశం. పైపెచ్చు విరమణ వయసు పెంపుతో అనేకమంది పీజీ చేసిన పీహెచ్సీ వైద్యులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో దాదాపు 225 మంది స్పెషలిస్టు వైద్యులు బోధనాస్పత్రుల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఇంత పెద్దసంఖ్యలో వైద్యులను బోధనా స్పత్రుల్లోకి పంపితే అక్కడ కొంత కొరత తీరు తుం దని భావిస్తున్నారు. డీఎంఈ వైపు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న స్పెషలిస్టుల వివరాలను పంపించాలని డీఎం హెచ్వోలకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. -
ప్రభుత్వ వైద్యులపై సర్కారు కొరడా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం సంచలనం రేపుతోంది. ఏకంగా 134 మంది ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు. చెప్పాపెట్టకుండా విధులకు హాజరు కాకపోవడం వల్లే ఈ నోటీసులు జారీ చేసినట్లు షోకాజ్ నోటీసుల్లో వైద్య విధాన పరిషత్ కమిషనర్ మాణిక్‌రాజ్ ప్రస్తావించారు. నోటీసులు అందుకున్న వారిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనకాలజీ, ఆర్థో, పీడియాట్రిక్, అనెస్థీషియా, ఈఎన్టీ, డెర్మటాలజీ, రేడియాలజీ తదితర విభాగాలకు చెందిన స్పెషలిస్టు వైద్యులే ఉండటం గమనార్హం. ఎంతో కీలకమైన విభాగాల్లో పనిచేసే వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ కావడంతో వైద్య వర్గాలు ఉలిక్కిపడ్డాయి. నోటీసులకు సరైన సమాధానం ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే నోటీసులు అందుకున్న డాక్టర్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గతేడాదే భర్తీ ప్రక్రియ... రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 125 ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. అందులో 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్‌లో 14 ఫస్ట్ రిఫరల్ యూనిట్లు ఉన్నాయి. వాటిల్లో వైద్యుల నియామకం కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో గతేడాది వైద్యుల భర్తీ ప్రక్రియ జరిగింది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో గతేడాది జులైలో ఏకంగా 15 రకాల స్పెషలిస్టు వైద్యులను భర్తీ చేశారు. వాటిల్లో మొత్తం 919 మంది స్పెషలిస్టు వైద్యులను నియమించారు. అయితే తమకు ఇష్టమైన చోట పోస్టింగ్‌లు ఇవ్వలేదని అనేక మంది అసంతృప్తితో ఉన్నారు. చేరిన వారిలో 500 మందికి మించి విధులకు హాజరు కావడం లేదన్న విమర్శలు వచ్చాయి. మిగిలిన వారిలో కొందరు విధులకు డుమ్మా కొడుతుండగా 128 మంది దూరాభారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్న పరిస్థితి నెలకొంది. మరోసారి వెబ్ కౌన్సిలింగ్ పెట్టి ఏర్పాట్లు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. స్పెషలిస్టు వైద్యులు చాలామంది గైర్హాజర్ అవుతుండటంతో వైద్య విధాన కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీచేయడంతో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. కొరవడిన పర్యవేక్షణ... తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తుంది. కేసీఆర్ కిట్, కంటి వెలుగు తదితర అనేక రకాల పథకాలకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు అనేక ఆసుపత్రులను బలోపేతం చేసింది. ఇంత చేస్తున్నా ఆసుపత్రులను సమగ్రంగా నడపడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీంతో జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలపై పర్యవేక్షణ కరువైంది. ఇటీవల భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా ముగ్గురు డాక్టర్లు... డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్‌కు వెళ్లిన ఘటన బయటపడింది. ఖమ్మంలో బాలింతలకు సెక్యూరిటీ సిబ్బంది సెలైన్ పెట్టిన ఘటన సంచలనం రేపింది మిగతా దవాఖాన్లలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఆసుపత్రుల సూపరింటెండెంట్ల నుంచి డాక్టర్లు, అధికారులు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. పైగా వైద్య విధాన పరిషత్ కమిషనర్‌గా హైదరాబాద్ కలెక్టర్ మాణిక్రాజే కొనసాగడం, ఆయనకు రోజువారీ కలెక్టర్ విధులతోపాటు ఆరోగ్యశ్రీ ఇన్చార్జిగా సైతం బాధ్యతలు ఉండటంతో ఏ విభాగాన్నీ పూర్తిస్థాయిలో పర్యవేక్షించే పరిస్థితి లేకుండా పోయింది. -
స్పెషలిస్టు వైద్యులకు ఇష్టమైన చోట పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో అసంతృప్తితో ఉన్న స్పెషలిస్టు వైద్యులకు ప్రత్యేకంగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌన్సెలింగ్ శుక్రవారమే మొదలైందని వైద్య విధాన పరిషత్ వర్గాలు తెలిపాయి. 3 నెలల కిందట 919 మంది స్పెషలిస్టు వైద్యులను వైద్య విధాన పరిషత్ నియమించింది. అయితే అందులో 500 మందికి మించి విధులకు రావ డం లేదన్న విమర్శలు వచ్చాయి. మిగిలిన వారిలో కొందరు విధులకు డుమ్మా కొడుతుండగా, 128 మంది దూరాభారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్న పరిస్థితి నెలకొంది. విధులకు వెళ్లకుండా అసంతృప్తితో ఉన్న వారిని మళ్లీ దారి లో పెట్టాలని సర్కారు వెబ్ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేసింది. నచ్చిన చోట ఇవ్వలేదని: వైద్య విధాన పరిషత్‌లో 911 మంది స్పెషలిస్ట్ వైద్యులను 31 జిల్లా ఆస్పత్రులు, 22 ఏరియా ఆస్పత్రులు, 58 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, హైదరాబాద్‌లోని 14 ఫస్ట్ రిఫరల్ యూనిట్లలో భర్తీ చేశారు. ఆన్లైన్ ద్వారా ఆర్థోపెడిక్, రేడియాలజీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పల్మనరీ, ఆప్తమాలజీ, సైకియాట్రిక్, ఎనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, జనరల్ సర్జన్స్, ఓబీజీ, పీడియాట్రిక్స్ పోస్టులను భర్తీ చేశారు. కొందరికి సుదూర ప్రాంతాలకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో అసలు సమస్య మొదలైంది. సుదూర ప్రాంతాలకు భార్యాభర్తలను వేరు చేసేలా వేశారని కొందరు గగ్గోలు పెట్టారు. గతంలో ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకుల పరిధిలోని వైద్యుల భర్తీలోనూ ఇలాంటి సమస్యే ఏర్పడితే వాటిని మార్చేందుకు ప్రత్యేకంగా దరఖాస్తులను ఆహ్వానించారు. ఏకంగా 250 మంది వరకు తమకు ఇచ్చిన పోస్టింగ్‌లను మార్చాలని కోరారు. దీంతో వారికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లను ఖరారు చేశారు. అలాగే వైద్య విధాన పరిషత్‌లోనూ నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మంది వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. -
ఓరుగల్లులో మెగా వైద్య శిబిరం
కరీమాబాద్: వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రాంతంలో ‘మానవసేవే-మాధవసేవ’ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 500 మంది పేదలు పాల్గొన్నారు. సాధారణ జబ్బులతో పాటు గుండె, ఎముకలు, కంటికి, స్త్రీ సంబంధిత వ్యాధులకు చెందిన నిపుణులైన వైద్యుల బందం ఈ శిబిరంలో ఉచితంగా సేవలందించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు వైద్య సేవలందిస్తామని నిర్వాహకులు తెలిపారు. రోగులకు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సన్‌షైన్, వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వరంగల్ లయన్స్ క్లబ్‌కు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. -
‘ప్రాథమిక ఆరోగ్యం’ విలవిల
సిబ్బంది లేక.. రోగుల అవస్థలు భర్తీకాని 325 వైద్య ఖాళీలు పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రులకు వెళ్లిన 125 మంది వైద్యులు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిలేక రోగులు నానా తిప్పలు పడుతున్నారు. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఇన్ సర్వీస్ అభ్యర్థులను బోధనాసుపత్రులకు రావాలని నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సుమారు 125 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు డీఎంఈ ఆస్పత్రులకు వెళ్లారు. అంతకుముందే 200కు పైగా వైద్యుల(ఎంబీబీఎస్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 325 పోస్టులు ఖాళీలు ఉన్నట్టు ఆరోగ్య సంచాలకుల లెక్కల్లో తేలింది. అసలే 200 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు లేక అల్లాడుతున్న ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యుల్లో 125 మంది బోధనాస్పత్రులకు వెళ్లడం మరింతగా ఇబ్బందిగా మారింది. 120 సీహెచ్‌సీలకు.. 13 సీహెచ్సీల్లోనే వైద్యులు రాష్ట్రంలో డెరైక్టర్ ఆఫ్ హెల్త్(ఆరోగ్య సంచాలకులు) పరిధిలో 120 సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీ) ఉన్నాయి. ఇవి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ప్రసవ కేంద్రాలుగా ఉండాలి. ప్రతి ఆస్పత్రిలోనూ అనస్థీషియా, పీడియాట్రిక్, గైనకాలజీ వైద్యుల బృందం ఉండాలి. కానీ 120 సీహెచ్‌సీలకు పదమూడింటిలోనే ముగ్గురు వైద్యుల బృందం ఉన్నట్టు తేలింది. మిగతా 107 సీహెచ్‌సీల్లో వైద్యుల కొరత ఉంది. సుమారు 20 సీహెచ్‌సీల్లో ముగ్గురు వైద్యులూ లేనివి ఉన్నాయి. ఇక్కడ కేవలం ఎంబీబీఎస్ వైద్యులే ఉంటున్నారు. నవంబర్‌లో నోటిఫికేషన్!: అక్టోబర్ 10లోగా సాధారణ బదిలీల ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 400కుపైగా వైద్య పోస్టులకు నవంబర్‌లో నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నాయి.