ఆరోగ్య సురక్ష విస్తరణ  | Conducting Jagananna Suraksha camps in every ward of towns | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సురక్ష విస్తరణ 

Published Wed, Oct 18 2023 1:59 AM | Last Updated on Wed, Oct 18 2023 7:14 AM

Conducting Jagananna Suraksha camps in every ward of towns - Sakshi

అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెంలో వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది

సాక్షి, అమరావతి: అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గ్రామాల్లోనే ప్రజలందరూ ఉచితంగా స్పెషలిస్ట్‌ వైద్యసేవలు, మందులు పొందడం.. అలాగే, పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకూ ప్రజలు పోటెత్తుతుండడంతో వీటిని ప్రతి వార్డుకూ విస్తరించాలని వైద్యశాఖ సంకల్పించింది.  

ఇప్పటివరకు 8,985 శిబిరాల నిర్వహణ.. 
గత నెల 30 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 పనిదినాల్లో 8,985 క్యాంపులు నిర్వహించారు. వీటిల్లో 35,11,552 మంది ఉచిత స్పెషలిస్ట్‌ వైద్యసేవలు పొందారు. వీరిలో 61,971 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్‌ చేశారు. అలాగే, గ్రామాల్లోని 10,032 విలేజ్‌ క్లినిక్‌ల పరిధిలో చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 6,500కు పైగా క్యాంపులు పూర్తయ్యాయి. ఇప్పుడు వీటికి అదనంగా పట్టణాల్లో వార్డుల వారీగా విస్తరించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, నగరాల్లో 542 వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

వీటి పరిధిలో మొత్తం 1,626 శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. దీంతో ఒక్కో కేంద్రం పరిధిలో ప్రస్తుతం మూడుచొప్పున ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక్కో శిబిరం వద్దకు వెయ్యి మందికి పైగా జనాభా హాజరవుతున్నారు. ఇలా ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యం పొందడంలో ఆలస్యం, ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు వీలుగా వార్డు సచివాలయాల వారీగా సోమవారం నుంచి శిబిరాలను నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇప్పుడు ఈ క్యాంపులు మరింతగా పెరగనున్నాయి. 
 
3,842 వార్డు సచివాలయాల పరిధిలో.. 
పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే శిబిరాలు పూర్తయినవి మినహాయించి మిగిలిన ప్రతి సచివాలయం పరిధిలో శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. 

► సచివాలయం పరిధిలో శిబిరం నిర్వహించడానికి ముందే ప్రతి ఇంటిని వలంటీర్లు, గృహ సారథులు సందర్శిస్తున్నారు.  
► ఆ తర్వాత.. వలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు.  
► బీపీ, సుగర్‌ పరీక్షలతో పాటు, అవసరం మేరకు డెంగీ, మలేరియా, వంటి ఇతర ఏడు పరీక్షలు చేపడుతున్నారు.  
► ఈ స్క్రీనింగ్‌లో గుర్తించిన వివిధ సమస్యల ఆధారంగా బాధితులు శిబిరాలకు హాజరవ్వడానికి టోకెన్లు ఇస్తున్నారు.  
► టోకెన్లతో సంబంధం లేకుండా ప్రజలు నేరుగా శిబిరాలకు హాజరయ్యే వెసులుబాటు కూడా అధికారులు కల్పించారు.  
► ఇక ప్రతి క్యాంపులో ఇద్దరు ఎంబీబీఎస్, ఇద్దరు స్పెషలిస్ట్‌ వైద్యులు, సరిపడా మందులను సమకూరుస్తున్నారు. 
 
ఇబ్బందులకు తావు లేకుండా.. 
పట్టణాల్లోని ప్రతి వార్డు సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరాల నిర్వహణ ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్‌ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలకు ఆ బాధత్యలు అప్పగించాం.  
- ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్, సీఈఓ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement