స్పెషలిస్టులు ఊస్టింగే? | Telangana Govt Focus On Specialist Doctors Attendance | Sakshi
Sakshi News home page

స్పెషలిస్టులు ఊస్టింగే?

Published Wed, Jul 17 2019 7:29 AM | Last Updated on Wed, Jul 17 2019 7:29 AM

Telangana Govt Focus On Specialist Doctors Attendance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైద్య విధాన పరిషత్‌లో అత్యంత కీలకమైన స్పెషలిస్టు వైద్యులపై సర్కారు సీరియస్‌గా చర్యలకు రంగం సిద్ధం చేసింది. వారిని తొలగించేందుకు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. చెప్పాపెట్టకుండా గైర్హాజరైన వారికి గత నెలలో షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన సర్కారు.. కొందరు అందుకోలేదన్న కారణమో లేక న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న భావనో తెలియదు కానీ నోటీసులు ఇచ్చిన వారి పేర్లను ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటించడం సంచలనమైంది. నెల రోజుల కిందటే నోటీసులు అందుకున్నా.. డాక్టర్లు స్పందించకపోవడంతో గెజిట్‌లో పేర్లను ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్ణీత సమయంలోగా వారు వివరణ ఇవ్వకపోతే శాశ్వతంగా తొలగించనున్నారు. మొత్తం 91 మంది వైద్యుల జాబితాను ప్రభుత్వం ఈ నెల 12న విడుదల చేసిన గెజిట్‌లో వెల్లడించింది. గెజిట్‌ విడుదలైన 7 రోజుల్లోగా అంటే 19లోగా వారి నుంచి స్పందన లేకపోతే శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోతారని అందులో పేర్కొంది. కాగా మంగళవారం వరకు ఒక్కరే స్పందించగా, మరో నలుగురు డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. దీంతో మిగిలిన వారు ఏం చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. 

ఇది ఎవరి వైఫల్యం.. 
రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 125 ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. అందులో జిల్లా ఆస్పత్రులు 31, ఏరియా ఆస్పత్రులు 22, సామాజిక ఆరోగ్య కేంద్రాలు 58, హైదరాబాద్‌ నగరంలో ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్లు 14 ఉన్నాయి. గతేడాది వాటిలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో వైద్యుల భర్తీ ప్రక్రియ జరిగింది. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో గతేడాది జూలైలో ఏకంగా 15 రకాల స్పెషలిస్టు వైద్యులను భర్తీ చేశారు. వాటిలో మొత్తం 919 మంది స్పెషలిస్టు వైద్యులను నియమించారు. అందులో ఆర్థోపెడిక్‌–47, రేడియాలజీ–50, డెర్మటాలజీ–20, ఫోరెన్సిక్‌–28, జనరల్‌ మెడిసిన్‌–68, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌–9, పల్మనరీ–39, ఆప్తమాలజీ–34, సైకియాట్రిక్‌–22, ఎనస్తీషియా–156, ఈఎన్‌టీ–17, పాథాలజీ–55, జనరల్‌ సర్జన్స్‌–78, ఓబీజీ–146, పీడియాట్రిక్స్‌–150 పోస్టులను భర్తీ చేశారు. నియమితులైన వారిలో 146 మంది మహిళా వైద్యులున్నారు. అయితే తమకు ఇష్టమైన చోట పోస్టింగ్‌లు ఇవ్వలేదని అనేకమంది అసంతృప్తితో ఉన్నారు. చేరిన వారిలో 500 మందికి మించి విధులకు హాజరుకావడం లేదన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. మిగిలిన వారిలో కొందరు విధులకు డుమ్మా కొడుతుండగా, 128 మంది దూరాభారం అంటూ ఉద్యోగాలనే వదిలేసుకున్న పరిస్థితి నెలకొంది. అందులో 91 మంది అనధికారికంగా విధులకు వెళ్లడం లేదని తెలిసి వారికి నోటీసులు ఇచ్చారు. ఇంతమంది ప్రత్యేక వైద్యులను ఉద్యోగాల్లో నియమించిన అధికారులు, వారికి తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. కొందరు భార్యాభర్తలను విడదీసి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఇంతమందిని కౌన్సెలింగ్‌ చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి, చివరకు తొలగించే పరిస్థితి తీసుకురావడం పట్ల పలువురు ప్రభుత్వ వైద్యుల సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. దీనికి కొందరు అధికారుల తీరే కారణమని అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement