సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రూరల్/ప్రభుత్వ సేవలను తప్పనిసరి చేసింది.
ప్రభుత్వ కళాశాలల్లో రాష్ట్ర కోటా, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్‌లు పొంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఒక సంవత్సరం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఈ మేరకు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
2022–23వ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్‌లు పొందే విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. కోర్సులు పూర్తి చేసుకున్న స్పెషలిస్ట్ వైద్యులను తొలి ప్రాధాన్యత కింద ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో నియమిస్తారు. ఆ తర్వాత మిగిలిన వారి సేవలను డీఎంఈ పరిధిలో వినియోగించుకుంటారు.
ముందుగానే ఒప్పందం
నాన్ సర్వీస్ అభ్యర్థులు కోర్సు అనంతరం సంవత్సరం పాటు రూరల్/ప్రభుత్వ సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రం తీసుకుంటారు. ఒప్పందాన్ని ఉల్లంఘించి కోర్సు పూర్తయిన 18నెలల వ్యవధిలో ప్రభుత్వ సేవల్లో చేరకపోతే పీజీ చేసినవారికి రూ.40 లక్షలు, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి రూ.50లక్షల జరిమానా విధిస్తారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రాష్ట్ర కోటా సీట్లలో 707 మంది, ప్రైవేట్ కళాశాలల్లో ఏ–కేటగిరీ సీట్లలో 1,142 మంది విద్యార్థులు అడ్మిషన్‌లు పొందుతారు. వీరందరూ ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సేవలు అందించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌లు పొందనున్న వీరందరూ 2025–26లో కోర్సులు పూర్తి చేసుకుంటారు.
అనంతరం గ్రామీణ సేవల్లో చేరాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీరనుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
అన్ని కళాశాలలకు ఆదేశాలు
మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్‌లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు.
అన్ని కాలేజీలకు ఆదేశాలు
► మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ముందుగానే ఒప్పంద పత్రాలు తీసుకోవాలని అన్ని కాలేజీలకు డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్–సర్వీస్ అభ్యర్థులకు రాష్ట్ర కోటా, ఏ–కేటగిరీ సీట్లలో అడ్మిషన్‌లు ఇచ్చేటప్పుడు కచ్చితంగా బాండ్ తీసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment