కర్నూలులో జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంపులో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలు
చానా సంతోషం నాయనా..
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బాలసంటి. వయసు 90 ఏళ్ల పైనే. బాలసంటి గ్రామం పేరు బెలుం. ఇది కొలిమిగుండ్ల మండలం నంద్యాల జిల్లాలో ఉంటుంది. ఇతనికి ఏ వైద్య అవసరం కావాలన్నా ఇంతకు ముందు 70 కిలోమీటర్ల దూరంలోని ప్రొద్దుటూరుకు వెళ్లాల్సిందే. ఇప్పుడతనికి గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి.
శనివారం జగనన్న సురక్ష క్యాంపునకు వచ్చిన అతను మాట్లాడుతూ.. ‘‘గతంలో ప్రొద్దుటూరు వెళ్లి కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నా. ఇప్పుడు మళ్లీ కండ్లు సరిగా కనిపిస్తలేవు. బయటకు వెళ్లలేకున్నా, నడిచేందుకు కూడా కష్టంగా ఉంది. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టినారని తెలిసినోళ్లు ఇక్కడికి తీసుకొచ్చినారు. అప్పటికప్పుడు అన్ని పరీక్షలు చేసినారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఎక్కడెక్కడో తిరిగే బాధ కూడా తప్పింది. చానా సంతోషం నాయనా’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడాడు.
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. 26 జిల్లాల్లో 620 ఆరోగ్య సురక్ష క్యాంప్‌లు నిర్వహించారు. ఒక్కో క్యాంప్‌లో ఇద్దరు పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌లు, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు.. మొత్తం నలుగురు వైద్యులు అందుబాటు లో ఉండి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యం చేశారు. 1,45,611 మంది స్వగ్రామాల్లోనే వైద్య సేవలు పొందారు. అంటే.. ప్రతి క్యాంప్‌లో సగటున 235 ఓపీ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారం(సెపె్టంబర్ 30) నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని శుక్ర వారం సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. శనివారం జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క్యాంప్‌లను ప్రారంభించారు.
మహిళలే అధికం
తొలి రోజు ఆరోగ్య సురక్ష క్యాంప్‌లలో వైద్య సేవలు పొందిన వారిలో మహిళలే అధికం. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల మంది సేవలు పొందగా వీరిలో 63,257 మంది పురుషులు, 82,354 మంది మహిళలు ఉ న్నారు. మొత్తం వైద్య సేవలు పొందిన వారిలో మెరుగైన వైద్యం అవసరమున్న 5,809 మందిని స్థానికంగా ఉన్న పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరు ఆయా ఆస్పత్రులకు వెళ్లి వైద్యసేవలు పొందేలా స్థానిక పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. దీంతో పెద్ద ఆస్పత్రుల్లోను వీరందరికీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తారు.
రూపాయి ఖర్చు లేకుండా
క్యాంప్‌లకు వచ్చిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు, మందులను అందించింది. ప్రతి క్యాంప్ లో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్తపరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామం/పట్టణంలో ఆరోగ్య సు రక్ష క్యాంప్‌పై ప్రజలకు వైద్య సిబ్బంది, వలంటీర్‌లు అవగాహన కల్పించారు.
సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లే పనిలేకుండా జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ వంటి ఇతర స్పెషలిస్ట్ వైద్యులే గ్రామంలో సేవలు అందిస్తున్నారని తెలిసి ప్రజలు శిబిరాలకు తరలి వచ్చారు. క్యాంప్‌ల్లో వైద్య సేవలు పొందిన వారికి వ్యక్తిగత కేస్ షీట్స్‌ను ప్రభు త్వం అందించింది.
కేస్ షీట్‌లో వ్యక్తి పేరు, చిరునామా, వయసు వంటి వివరాలతో పాటు, వైద్యుడు పరిశీలనాంశాలు, సూచించిన మందుల ప్రిస్క్రిప్షన్ నమోదు చేశారు. కేస్ షీట్ ఫోల్డర్, వైద్యుడు సూచించిన మందులతో జగనన్న ఆరోగ్య కిట్‌ను వైద్య శాఖ పంపిణీ చేసింది. వీరిపై ఫ్యామిలీ డాక్టర్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంచనున్నారు.
ఐదు దశల్లో..
ప్రభుత్వం 5 దశల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తొలి దశలో వలంటీర్‌లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు హెల్త్ క్యాంప్ నిర్వహించే 15 రోజుల ముందు ఇళ్లన్నింటినీ సందర్శిస్తున్నారు. ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. రెండో దశలో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌లు ప్రజలకు ఇంటి వద్దే బీపీ, షుగర్, హెచ్‌బీ, డెంగీ, మలేరియా సహా ఏడు రకాల పరీక్షలు అవసరం మేరకు నిర్వహించి ఫలితాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇక మూడో దశలో క్యాంప్ నిర్వహణకు మూడు రోజుల ముందు వలంటీర్, ప్రజాప్రతినిధులు ఇంటింటిని సందర్శించి హెల్త్ క్యాంప్ జరిగే ప్రదేశం, సమయం ఇతర వివరాలను తెలియజేస్తున్నారు. నాలుగో దశలో క్యాంప్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఐదో దశలో హెల్త్ క్యాంప్‌లో వైద్య సేవలు పొందిన వారికి, రిఫరెన్స్ మేరకు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారికి తదుపరి వైద్య అవసరాల విషయంలో మెడికల్ ఆఫీసర్‌లు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, వలంటీర్‌లు చేయిపట్టి నడిపిస్తారు.
వృద్ధులకు మేలు
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వృద్ధులకు ఎంతో ఉపయోగకరం. ఇంటింటికి వచ్చి వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ పలకరిస్తున్నారు. గుమ్మం వద్దే వైద్య పరీక్షలు చేస్తున్నారు. టోకెన్లు ఇచ్చి ఊళ్లోనే వైద్యం చేయిస్తున్నారు. మందులు ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఇలాంటి సేవలో మాకు అందేవి కావు.
– శివలింగరెడ్డి, చిటిపిరాళ్ల గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లా
పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణులతో పేదల కోసం ఇలాంటి వైద్య శిబిరాలు గతంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. నేను గతకొద్ది కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నాను. ఆసుపత్రికి వెళితే ఎంత ఖర్చు అవుతుందో అన్న భయంతో వెళ్లలేదు. ఈ రోజు వైద్య శిబిరంలో ఈసీజీ తీసి పరీక్షించారు.
– కొల్లు అప్పారావు, మర్రిమొక్కవీధి, జగ్గంపేట, కాకినాడ జిల్లా
అన్ని పరీక్షలు చేశారు
నాకు గత కొంతకాలంగా నడుం నొప్పి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడం నాకు సాధ్యం కాదు. మా ప్రాంతానికి 104 వాహనం రావడం, మందులు ఇవ్వడం వల్ల కొంత ఉపశమనం లభించింది. ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చిన పెద్ద డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. మందులు ఇచ్చి కొన్ని సూచనలు చేశారు.
–పాలిక లక్ష్మి, శెట్టిబలిజపేట, జగ్గంపేట, కాకినాడ జిల్లా
పడిపోయి.. నడవలేక..
ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాను. కాలికి గాయమైంది. నడవలేక ఇబ్బంది పడుతున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి వెళ్లాను. అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. కాలుని పట్టిపట్టి చూశారు. పెద్దగా భయపడాల్సిన పనిలేదన్నారు. మందులిచ్చి వేసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బంది ఉంటే పీహెచ్‌సీకి రమ్మని చెప్పారు.
– అప్పలనాయుడు, జమాదులపాలెం, కశింకోట మండలం, అనకాపల్లి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment