179 ప్రాణాలు బుగ్గిపాలు | Plane crashes on runway At Muan International Airport in South Korea | Sakshi
Sakshi News home page

179 ప్రాణాలు బుగ్గిపాలు

Dec 29 2024 7:00 AM | Updated on Dec 30 2024 5:06 AM

Plane crashes on runway At Muan International Airport in South Korea

Photo Source : The Japan Times

దక్షిణ కొరియాలోఘోర విమాన ప్రమాదం

సియోల్‌: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏకంగా 179 మంది ప్రయాణికులు నిస్సహాయంగా మంటల్లో చిక్కి మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఆదివారం ఉదయం 9.03 గంటలకు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ నుంచి వచ్చిన జెజూ ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737–800 విమానం ముయాన్‌ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగుతూ అదుపు తప్పింది. విమానాశ్రయ రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఇద్దరు మినహా అంతా దుర్మరణం పాలయ్యారు. ఇప్పటిదాకా గుర్తించిన మృతుల్లో 85 మంది మహిళలు కాగా 84 మంది పురుషులు. మరో 10 మందిని గుర్తించాల్సి ఉంది. మహిళలో, పురుషులో కూడా గుర్తించలేనంతగా మృతదేహాలు కాలిపోయాయని సహాయక సిబ్బంది చెప్పారు. విమానం మంటల్లో చిక్కగానే సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. 

ప్రాణాలతో ఉన్న ఇద్దరిని బయటకు లాగారు. వారిని విమాన సిబ్బందిగా గుర్తించారు. మిగతా ప్రయాణికులంతా ప్రమాదంలోనే కన్నుమూశారు. వారిలో అత్యధికులు దక్షిణకొరియా పౌరులే. ఇద్దరు మాత్రం థాయ్‌లాండ్‌ జాతీయులని తేలింది. రాజధాని సియోల్‌కు దక్షిణంగా 290 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం బారిన పడ్డ బోయింగ్‌ 737–800 విమానం 15 ఏళ్ల నాటిది. ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇదొకటి. 

తెరుచుకోని ల్యాండింగ్‌ గేర్‌  
ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో విమానం ల్యాండింగ్‌ గేర్‌ మూసే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వేగంగా దూసుకొచి్చన విమానం రన్‌వేపై దిగుతూనే అదుపు తప్పింది. అడ్డంగా దూసుకెళ్లి విమానం ముందుభాగం రక్షణ గోడను ఢీకొంది. అప్పటికీ వేగం పూర్తిగా తగ్గక మరికొంత ముందుకు దూసుకెళ్లింది. ఆ ఒత్తిడికి ఇంధనానికి మంటలు అంటుకుని ఉవ్వెతున ఎగిశాయి. చూస్తుండగానే విమానం పేలిపోయి భారీగా మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి. 

విమానం పూర్తిగా ధ్వంసమైందని, కేవలం తోక భాగం మాత్రమే గుర్తించగల స్థితిలో ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. 32 అగ్నిమాపక యంత్రాలు, హెలికాప్టర్ల సాయంతో 1,570 మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై పోప్‌ ఫ్రాన్సిస్, జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, థాయ్‌లాండ్‌ ప్రధాని పెటాంగ్‌తర్న్‌ షినవత్ర తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు జెజూ ఎయిర్‌ సంస్థ క్షమాపణ తెలిపింది. 

పక్షి వల్లే ప్రమాదమా? 
ల్యాండింగ్‌కు కాసేపటి ముందు పైలట్‌కు టవర్‌ సిబ్బంది బర్డ్‌ స్ట్రైక్‌ వార్నింగ్‌ ఇచ్చారని దక్షిణ కొరియా రవాణా శాఖ వెల్లడించింది. ‘‘ప్రమాదానికి ముందు విమాన పైలట్, ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ టవర్‌ మధ్య సంభాషణను విశ్లేషించాం. విమానాన్ని పక్షి ఢీకొట్టేలా ఉండటంతో మరో రన్‌వేపై దిగడానికి అనుమతిచ్చారు. అక్కడ దిగలేని పరిస్థితి ఉందంటూ పైలట్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. తర్వాత క్షణాల వ్యవధిలోనే విమానం రన్‌వే చివరి భాగంలో దిగి అదుపు తప్పింది’’ అని తెలియజేసింది. ప్రమాదానికి అసలు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్‌ బాక్స్‌ డేటాను సేకరించి విశ్లేషణకు పంపారు. దర్యాప్తు పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన రన్‌వేను జనవరి 1వ తేదీ దాకా మూసేశారు.

త్రుటిలో తప్పిన మరో మూడు ప్రమాదాలు
    కెనడాలో విమానానికి మంటలు 
    నార్వేలో అదుపు తప్పిన విమానం 
    నేపాల్లో హెలికాప్టర్‌ను ఢీకొన్న పక్షి 
ఒట్టావా/ఓస్లో/కఠ్మాండు: దక్షిణ కొరియా ప్రమాదం జరిగిన కాసేపటికే ఆదివారం మరో రెండు భారీ విమాన ప్రమాదాలు త్రుటిలో తప్పాయి. కెనడాలో సెయింట్‌ జాన్స్‌ నుంచి వస్తున్న ఎయిర్‌ కెనడా 2259 విమానం హలిఫాక్స్‌ విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతూ అదుపు తప్పింది. దాంతో విమానానికి మంటలంటుకున్నాయి! అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. ఒక టైర్‌ పూర్తిగా తెరుచుకోకపోవడంతో రన్‌వేపై దిగగానే విమానం అదుపు తప్పి 20 డిగ్రీల కోణంలో ఎడమకు వాలి అలాగే దూసుకెళ్లింది. దాంతో మంటలు అంటుకుని విమానం ఎడమ భాగం కాలిపోయింది. పెద్ద శబ్దం వినిపించింది. పైలట్‌ చాకచాక్యంగా విమానాన్ని ఆపగలిగాడు. వెంటనే సహాయక సిబ్బంది ప్రయాణికులను హుటాహుటిన బయటకు తీసుకొచ్చారు. 

నార్వేలో కూడా ఓ విమానం అత్యవసరంగా ల్యాండవుతూ అదుపు తప్పింది. ఓస్లో నుంచి నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కు బయల్దేరిన కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ 737–800 టేకాఫయిన కాసేపటికే హైడ్రాలిక్‌ విఫలమైంది. దాంతో ఓస్లోకు 110 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తుండగా అదుపు తప్పి రన్‌వేను తాకి దట్టమైన గడ్డిలోకి వెళ్లి ఆగింది. విమానంలోని 182 మందినీ వెంటనే భద్రంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్‌లో ఎవరెస్ట్‌ శిఖరం సమీపంలోని బేస్‌ లుక్లా నుంచి ఆదివారం ఐదుగురు అమెరికన్లతో బయల్దేరిన హెలికాప్టర్‌ను పక్షి ఢీకొంది. దాంతో సురక్షితంగా బనెపాలో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement