run way
-
179 ప్రాణాలు బుగ్గిపాలు
సియోల్: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏకంగా 179 మంది ప్రయాణికులు నిస్సహాయంగా మంటల్లో చిక్కి మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఆదివారం ఉదయం 9.03 గంటలకు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి వచ్చిన జెజూ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737–800 విమానం ముయాన్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై దిగుతూ అదుపు తప్పింది. విమానాశ్రయ రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా ఇద్దరు మినహా అంతా దుర్మరణం పాలయ్యారు. ఇప్పటిదాకా గుర్తించిన మృతుల్లో 85 మంది మహిళలు కాగా 84 మంది పురుషులు. మరో 10 మందిని గుర్తించాల్సి ఉంది. మహిళలో, పురుషులో కూడా గుర్తించలేనంతగా మృతదేహాలు కాలిపోయాయని సహాయక సిబ్బంది చెప్పారు. విమానం మంటల్లో చిక్కగానే సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. ప్రాణాలతో ఉన్న ఇద్దరిని బయటకు లాగారు. వారిని విమాన సిబ్బందిగా గుర్తించారు. మిగతా ప్రయాణికులంతా ప్రమాదంలోనే కన్నుమూశారు. వారిలో అత్యధికులు దక్షిణకొరియా పౌరులే. ఇద్దరు మాత్రం థాయ్‌లాండ్ జాతీయులని తేలింది. రాజధాని సియోల్‌కు దక్షిణంగా 290 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం బారిన పడ్డ బోయింగ్ 737–800 విమానం 15 ఏళ్ల నాటిది. ల్యాండింగ్ గేర్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇదొకటి. తెరుచుకోని ల్యాండింగ్ గేర్ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ సమయంలో విమానం ల్యాండింగ్ గేర్ మూసే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వేగంగా దూసుకొచి్చన విమానం రన్‌వేపై దిగుతూనే అదుపు తప్పింది. అడ్డంగా దూసుకెళ్లి విమానం ముందుభాగం రక్షణ గోడను ఢీకొంది. అప్పటికీ వేగం పూర్తిగా తగ్గక మరికొంత ముందుకు దూసుకెళ్లింది. ఆ ఒత్తిడికి ఇంధనానికి మంటలు అంటుకుని ఉవ్వెతున ఎగిశాయి. చూస్తుండగానే విమానం పేలిపోయి భారీగా మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి. విమానం పూర్తిగా ధ్వంసమైందని, కేవలం తోక భాగం మాత్రమే గుర్తించగల స్థితిలో ఉందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. 32 అగ్నిమాపక యంత్రాలు, హెలికాప్టర్ల సాయంతో 1,570 మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై పోప్ ఫ్రాన్సిస్, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, థాయ్‌లాండ్ ప్రధాని పెటాంగ్‌తర్న్ షినవత్ర తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు జెజూ ఎయిర్ సంస్థ క్షమాపణ తెలిపింది. పక్షి వల్లే ప్రమాదమా? ల్యాండింగ్‌కు కాసేపటి ముందు పైలట్‌కు టవర్ సిబ్బంది బర్డ్ స్ట్రైక్ వార్నింగ్ ఇచ్చారని దక్షిణ కొరియా రవాణా శాఖ వెల్లడించింది. ‘‘ప్రమాదానికి ముందు విమాన పైలట్, ఎయిర్‌పోర్టు కంట్రోల్ టవర్ మధ్య సంభాషణను విశ్లేషించాం. విమానాన్ని పక్షి ఢీకొట్టేలా ఉండటంతో మరో రన్‌వేపై దిగడానికి అనుమతిచ్చారు. అక్కడ దిగలేని పరిస్థితి ఉందంటూ పైలట్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత క్షణాల వ్యవధిలోనే విమానం రన్‌వే చివరి భాగంలో దిగి అదుపు తప్పింది’’ అని తెలియజేసింది. ప్రమాదానికి అసలు కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్ బాక్స్ డేటాను సేకరించి విశ్లేషణకు పంపారు. దర్యాప్తు పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన రన్‌వేను జనవరి 1వ తేదీ దాకా మూసేశారు.త్రుటిలో తప్పిన మరో మూడు ప్రమాదాలు కెనడాలో విమానానికి మంటలు నార్వేలో అదుపు తప్పిన విమానం నేపాల్‌లో హెలికాప్టర్‌ను ఢీకొన్న పక్షి ఒట్టావా/ఓస్లో/కఠ్మాండు: దక్షిణ కొరియా ప్రమాదం జరిగిన కాసేపటికే ఆదివారం మరో రెండు భారీ విమాన ప్రమాదాలు త్రుటిలో తప్పాయి. కెనడాలో సెయింట్ జాన్స్ నుంచి వస్తున్న ఎయిర్ కెనడా 2259 విమానం హలిఫాక్స్ విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతూ అదుపు తప్పింది. దాంతో విమానానికి మంటలంటుకున్నాయి! అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. ఒక టైర్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో రన్‌వేపై దిగగానే విమానం అదుపు తప్పి 20 డిగ్రీల కోణంలో ఎడమకు వాలి అలాగే దూసుకెళ్లింది. దాంతో మంటలు అంటుకుని విమానం ఎడమ భాగం కాలిపోయింది. పెద్ద శబ్దం వినిపించింది. పైలట్ చాకచాక్యంగా విమానాన్ని ఆపగలిగాడు. వెంటనే సహాయక సిబ్బంది ప్రయాణికులను హుటాహుటిన బయటకు తీసుకొచ్చారు. నార్వేలో కూడా ఓ విమానం అత్యవసరంగా ల్యాండవుతూ అదుపు తప్పింది. ఓస్లో నుంచి నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్కు బయల్దేరిన కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737–800 టేకాఫయిన కాసేపటికే హైడ్రాలిక్ విఫలమైంది. దాంతో ఓస్లోకు 110 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా అదుపు తప్పి రన్‌వేను తాకి దట్టమైన గడ్డిలోకి వెళ్లి ఆగింది. విమానంలోని 182 మందినీ వెంటనే భద్రంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్‌లో ఎవరెస్ట్ శిఖరం సమీపంలోని బేస్ లుక్లా నుంచి ఆదివారం ఐదుగురు అమెరికన్లతో బయల్దేరిన హెలికాప్టర్‌ను పక్షి ఢీకొంది. దాంతో సురక్షితంగా బనెపాలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. -
జోరు వానలో ల్యాండింగ్.. ముంబైలో విమాన ప్రమాదం
సాక్షి, ముంబై: నగరంలోని ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఓ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా.. అది రన్‌వే నుంచి జారి పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ముగ్గురు గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే 27పై ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో విమానంలో మొత్తం ఎనిమిది మంది(ఇద్దరు సిబ్బందిసహా) ఉన్నారని సమాచారం. వాళ్లలో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. అయితే వాళ్లకు ఏ తీవ్రత మేర గాయాలు అయిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన విమానం.. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ వీఎస్ఆర్ వెంచర్స్‌కు చెందిన లియర్‌జెట్45 విమానంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి విమానం ముంబైకి చేరుకున్న క్రమంలోనే ప్రమాదానికి గురైనట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. కెనడాకు చెందిన బాంబార్డియర్ ఏవియేషన్ సంస్థ తొమ్మిది సీట్ల కెపాసిటీ ఉన్న లియర్‌జెట్ విమానాలను ఉత్పత్తి చేస్తోంది. Breaking! A private plane skidded off the runway and crashed while landing at #MumbaiAirport amid #heavyrain. Efforts have been started to rescue the people trapped in the plane. I pray for their safety.#Emergency #MumbaiRains #Mumbai #PAKvSL #ElvishYadav #TeJran pic.twitter.com/oglq2JuHOH — Lokesh (@Lokesh_2020V) September 14, 2023 -
Las Vegas: రన్ వేపై రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర లాస్ వేగస్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. రన్‌వే పై రెండు చిన్న విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో విమానాల్లోని మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46, సింగిల్ ఇంజిన్ సెస్నా 172లు ఢీకొన్నాయని తెలిపారు. 'ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింగిల్ ఇంజిన్ పైపర్ పీఏ-46 విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రన్ వేపై సెస్నా 172ను ఢీకొట్టింది. దాంతో పైపర్ పీఏ 46 రన్ వే 30కి తూర్పు వైపు పడిపోయింది. సెస్నా సమీపంలోని నీటి కుంటలో పడింది.' అని ఎఫ్ఏఏ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో విమానంలో ఇద్దరు ఉండగా.. మొత్తం మంది మరణించినట్లు సిటీ అగ్నిమాపక విభాగం తెలిపింది. ఇదీ చదవండి: America Indiana City: ఇండియానా షాపింగ్ మాల్లో కాల్పులు.. ముగ్గురి మృతి.. దుండగుడి హతం -
చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు
కోళీకోడ్, న్యూఢిల్లీ: జోరున కురుస్తున్న వానలో 35 అడుగుల లోయలో రెండు ముక్కలైన విమానం మధ్యలో నలిగిపోయిన క్షతగాత్రుల వేదన వర్ణనాతీతం. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విమాన ప్రయాణికులందరూ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఎటు చూసినా రోదనలు, అరుపులు కేకలు తప్ప అసలేం జరిగిందో అర్థం కాలేదని, కళ్ల ముందు చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించలేదని క్షతగాత్రులు చెబుతున్నారు. 184 మంది ప్రయాణికులతో దుబాయ్నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ల్యాండింగ్ అయిన సమయంలో పట్టుతప్పి పక్కనే ఉన్న లోయలోకి జారిన విషయం తెలిసిందే. విమానం రెండు ముక్కలు కావడంతో వాటి మధ్య నలిగిపోయిన క్షతగాత్రుల మనోవేదన అంతా ఇంతా కాదు. ‘‘మొదట పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే తోటి ప్రయాణికులు అరుపులు వినిపించాయి’’ అని రంజిత్ అనే ప్లంబర్ చెప్పారు. ‘‘విమానం ఒక్కసారిగా కుదుపుకి లోనైనట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. అది తలచుకుంటే ఇంకా నా శరీరం వణుకుతోంది. చాలామంది రక్తాలోడుతూ కనిపించారు’’ అని స్వల్పంగా గాయపడిన మరో ప్రయాణికుడు రంషద్ చెప్పారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఆందోళనకి లోనైన ప్రయాణికులు అందులోంచి కిందకి దూకడం కనిపించింది’’ అని అషిక్ అనే మరో క్షతగాత్రుడు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు మరణించారు. 149 మంది క్షతగాత్రుల్లో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీకి బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదాల్లో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను శనివారం స్వాధీనం చేసుకొని దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి పంపినట్టుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) వెల్లడించింది. పౌర విమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఘటనాస్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ‘‘ప్రమాదానికి గురైన ఎయిరిండియా బోయింగ్ 737ఐఎక్స్ 1344 విమానానికి చెందిన డిజిటల్ ఫ్లయిట్ డేటా రికార్డర్ (డీఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లు లభించాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దీనిపై దర్యాప్తు జరుపుతోంది’’ అని పూరి ట్వీట్ చేశారు. విమానంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. డీఎఫ్డీఆర్లో విమాన వేగం, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది, ఫ్యూయల్ ఫ్లో వంటివి 25 గంటల సేపు రికార్డు చేస్తుంది. ఇక కాక్‌పిట్ వాయిస్ రికార్డులో పైలట్లు మాట్లాడుకున్న మాటలని రెండు గంటల సేపు రికార్డు చేయగల సామర్థ్యం ఉంటుంది. వీటి సాయంతో విమాన ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకోవచ్చు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ.50 వేలు అందిస్తామని కేంద్ర మంత్రి పూరి వెల్లడించారు. క్షతగాత్రులకి వైద్య చికిత్సకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. హోరున కురుస్తున్న వానలో కూడా సహాయ చర్యలకు ముందుకు వచ్చిన స్థానికుల్ని సీఎం విజయన్ ప్రశంసించారు. విమాన ప్రమాదంలో కరోనా భయం విమాన ప్రమాద మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉందని వైద్య పరీక్షల్లో తేలడంతో కలకలం రే గింది. విమాన ప్రమాద సహాయ చర్యల్లో పాల్గొన్న వారందరూ తర్వాత సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని కేరళ వైద్య శాఖ మంత్రి కె.కె. శైలజ ఆదేశించారు. పెళ్లి కోసం తిరిగివస్తూ... పెళ్లి ఖరారు కావడంతో ఆనందంగా దుబాయ్ నుంచి తిరిగొస్తున్న యువకుడు విధి వక్రించి విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని మొళ్లూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రియాస్ (24), సోదరుడు నిజాముద్దీన్‌తో కలిసి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులు ఈ నెలలో పెళ్లి నిశ్చయించడంతో అన్నదమ్ములిద్దరూ ఎయిర్ ఇండియా విమానంలో స్వరాష్ట్రానికి బయలుదేరారు. విమానం ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన దుర్ఘటనలో కాబోయే పెళ్లికొడుకు రియాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. తీవ్రంగా గాయపడ్డ అతని సోదరుడు నిజాముద్దీన్ కోళీకోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కో–పైలట్ భార్య నిండుగర్భిణి కోళీకోడ్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన కో– పైలట్ అఖిలేష్ కుమార్(32)ది విషాదగాథ. ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన అఖిలేష్‌కు 2018లో పెళ్లయింది. ఇప్పుడు ఆయన భార్య నిండుగర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది. ఇంతలో అఖిలేష్ మరణవార్త రావడంతో వారి కుటుంబం షాక్‌కు లోనైంది. భార్య మేఘకు భర్త మరణవార్త ఇంకా చెప్పలేదు. ‘అఖిలేష్ చాలా మర్యాదస్తుడు. 2017లో ఎయిర్ ఇండియాలో చేరాడు. అతని భార్య గర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది’అని బంధువు వాసుదేవ్ తెలిపారు. మొదట అఖిలేష్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్ వచ్చిందని, తర్వాత చనిపోయాడని చెప్పారని తండ్రి తులసీరామ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రమాదానికి కారణాలివేనా ? కోళీకోడ్‌లో విమానం దిగిన రన్ వే 10 పొడవు 2,700 మీటర్లు ఉంది. అయితే రన్‌వేకి వెయ్యి మీటర్లు ముందు విమానం దిగిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. విమానం ల్యాండింగ్ సమయంలో ఈదురుగాలులు, జోరుగా కురుస్తున్న వాన నేపథ్యంలో 2 కి.మీ.కి మించి పైలట్లకు కనిపించే పరిస్థితి లేదన్నారు. విమానం రన్ వే కంటే వెయ్యి మీటర్ల ముందర దిగి అదుపు తప్పి లోయలోకి జారిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ల్యాండింగ్ సమయంలో విమానం అత్యంత వేగంతో ప్రయాణిస్తోందని ఫ్లయిట్ రాడార్ చెబుతోంది. రన్ వే ఉపరితలానికి 450 అడుగుల ఎత్తులో విమానం గంటకి 350కి.మీ. వేగంతో ప్రయాణం చేస్తోందని, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో అంత వేగం మంచిది కాదని ఎయిర్ సేఫ్టీ నిపుణుడు కెప్టెన్ అమర్ సింగ్ చెప్పారు. మొదటిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో గంటకి 276 కి.మీ. వేగంతో ప్రయాణించిందని, రెండోసారి పైలట్ ఎందుకు వేగం పెంచారో అర్థం కాలేదని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. అందులోనూ టేబుల్ టాప్ రన్ వేపై సాధారణ రన్ వేలపై విమానాలను దించినట్టుగా ప్రయత్నించకూడదని ఆయన అన్నారు. టేబుల్ టాప్ రన్ వేలు ప్రమాదకరం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయం దుర్ఘటనతో టేబుల్ టాప్ రన్ వేలు ఎంత సురక్షితం అన్న చర్చ మొదలైంది. కర్ణాటకలోని మంగళూరులో పదేళ్ల క్రితం ఇదే తరహాలో విమాన ప్రమాదం జరిగి 160 మంది మరణించినప్పుడే ఈ టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల రాకపోకలు కత్తి మీద సామేనని నిపుణులు హెచ్చరించారు. అప్పట్లో మంగళూరు విమాన ప్రమాదంపై విచారణ జరిపిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ బీఎన్ గోఖలే కొండ ప్రాంతాల్లో నిర్మించిన విమానాశ్రయాలు ఎంతమాత్రం సురక్షితం కాదని తన నివేదికలో వెల్లడించారు. కోళీకోడ్ విమానాశ్రయం రన్ వే అచ్చంగా ఒక టేబుల్ ఉపరితలం మాదిరిగా ఉండే అతి చిన్న రన్‌వేలపై విమానాలను దించడం అతి పెద్ద సవాల్. పైలట్లు ఎంత నైపుణ్యం కలిగన వారైనా టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లో ఎలాంటి ప్రమాదాలైనా చోటు చేసుకోవచ్చునని ఆ నివేదికలో పేర్కొన్నారు. కోళీకోడ్ విమానాశ్రయంలో రన్ వేకి రెండు వైపుల అదనంగా స్థలం లేదని, ఇలాంటి చోట్ల బోయింగ్ విమానాలు దిగడానికి అనుకూలం కాదని పదేళ్ల క్రితమే ఎయిర్ మార్షల్ గోఖలే గట్టి హెచ్చరికలే పంపారు. దేశంలో అయిదు మన దేశంలో అయిదు ప్రాంతాల్లో టేబుల్ టాప్ రన్ వేలు ఉన్నాయి. కోళీకోడ్ (కేరళ), మంగళూరు (కర్ణాటక), షిమ్లా (హిమాచల్‌ప్రదేశ్), పాక్యాంగ్ (సిక్కిం), లెంగ్పూయీ (మిజోరం)లలో ఈ తరహా రన్ వేలు ఉన్నాయి. ఈ రన్ వేలపై షార్ట్ ఫీల్డ్ పెర్ఫార్మెన్స్ (ఎస్ఎఫ్పీ) సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విమానాలే దిగగలవు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడ్డ విమాన సీట్లు. -
రన్‌వేపై జారి పడిన ఇంధన ట్యాంకు
పనాజి: గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలోభారీ ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి యుద్ధవిమానానికి సంబంధించిన ఆయిల్ ట్యాంకు రన్‌వే పై జారిపడింది. దీంతో ఇంధనం రన్‌వేపై పడి, మంటలంటుకున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఈ అనుకోని ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా రెండు గంటలపాటు కార్యకలాపాలను నిలిపి వేశారు. గోవా విమానాశ్రయంలో అన్ని రకాల సేవలను రెండు గంటల పాటు సస్పెండ్ చేశామని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు శనివారం మధ్యాహ్నం ట్విటర్ ద్వారా ప్రకటించారు. డబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నావీకి చెందిన మిగ్ 29 కె విమానంలోని డిటాచ్బుల్ ఫ్యూయల్ ట్యాంకు రన్‌వేపై జారిపడిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. భారతీయ నౌకా దళానికి చెందిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రన్ వేను శుభ్రపరిచి, మరమ్మతు పనులు చేపట్టారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు యథావిధిగా కార్యక్రమాలు తిరిగి మొదలవుతాయని తెలిపారు. యుద్ధ విమానం కూడా సురక్షితంగానే ఉన్నట్లు వారు తెలిపారు. Due to jettisoned fuel tank on runway during MIG sortie the operations are closed for two hrs at Goa airport. Pl bear with us. — Goa Airport (@aaigoaairport) June 8, 2019 -
సరస్సులోకి దూసుకెళ్లింది..
మజురో(మార్షెల్ ఐలాండ్స్): న్యూజిలాండ్‌లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారిన విమానం సరస్సులోకి దూసుకెళ్లింది. సరుస్సు లోతుగా లేకపోవడంతో కొందరు ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని మైక్రోనేసియా ద్వీపంలో జరిగింది. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్ న్యుగిని బోయింగ్ 737 విమానం వెనో విమానాశ్రయంలో దిగుతూ అదుపుతప్పింది. ఒక్కసారిగా విమానం రన్‌వే పై నుంచి పక్కనే ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది. సరస్సు లోతు తక్కువ కావడంతో పూర్తిగా మునగలేదు. స్థానికులు పడవలతో వెళ్లి ప్రయాణికులు, సిబ్బందిని కాపాడారు. కొందరేమో ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్‌పోర్టు సిబ్బంది తెలిపారు. ప్రమాద కారణాలు స్పష్టంగా తెలియకున్నా.. ప్రమాద సమయంలో భారీ వర్షం, తక్కువ వెలుగు ఉండటం కారణం కావచ్చని ఎయిర్‌లైన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ రన్‌వే పొడవు కేవలం 1831 మీటర్లు. 2008లో ఏసియా పసిఫిక్ ఎయిర్‌లైన్స్ కార్గో బోయింగ్ 727 విమానం కూడా రన్‌వేను దాటి ముందుభాగం వరకు సరస్సులోకి దూసుకెళ్లింది. -
రన్ వేపై విమానాలు ఢీ
టొరంటో: ఒకే రన్ వే మీదకు వచ్చిన రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలి పూర్తిగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరూ ప్రమాదంలో గాయపడలేదు. టొరంటో విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనపై టొరంటో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. పోలాండ్‌కు చెందిన బోయింగ్ 787 విమానం రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. అదే సమయంలో కెనడాకు చెందిన ఎయిర్ కెనడా విమానం రన్ వేపై దిగింది. ఈ సమయంలో రెండు విమానాల రెక్కలు ఢీ కొన్నాయి. ఇరు విమానాలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఒక్కో విమానంలో 200కుపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. -
రన్‌వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందే..
* శంషాబాద్ విమానాశ్రయానికి తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం * ఢిల్లీ, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లు పన్ను కడుతున్నట్లు స్పష్టీకరణ * ఆస్తి పన్ను పరిధిలోకి రావన్న జీఎంఆర్ అభ్యర్థనల తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: రన్‌వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందేనని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ యాజమాన్యం ‘జీఎంఆర్’కు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ అవసరాలకు వినియోగించే ‘రన్ వే’తో పాటు ఎయిర్‌పోర్ట్‌లో వాహనాల పార్కింగ్‌కు వినియోగించే ‘ట్యాక్సీ వే’లు సైతం ఆస్తి పన్ను పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇందుకోసం దేశంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు స్థానిక విమానాశ్రయాలపై విధిస్తున్న రన్‌వే, ట్యాక్సీ వేకు సంబంధించిన ఆస్తి పన్నుల సమాచారాన్ని ప్రభుత్వం తెప్పించుకుంది. ఆ వివరాలను శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యానికి తెలియజేస్తూ.. పన్నులు చెల్లించాల్సిందేనని కోరింది. వాస్తవానికి మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆస్తుల జాబితాలో విమానాశ్రయాల రన్వేలు, ట్యాక్సీవేలు లేవు. అయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వసూలు చేస్తుండడంపై గతంలో కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రెండేళ్ల నుంచి విమానాశ్రయ యాజమాన్యం వీటిపై ఆస్తి పన్ను చెల్లించడం ఆపేసింది. పన్ను విధింపుపై పునఃపరిశీలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై అధ్యయనానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రన్వేలు, ట్యాక్సీవేలపై దేశవ్యాప్తంగా ఆస్తి పన్ను విధిస్తున్నట్లు ధ్రువీకరించేందుకు ఈ కమిటీ కీలక ఆధారాలను సేకరించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నగరంలోని బేగంపేట విమానాశ్రయాలకు లేఖలు రాసి రన్వేలు, ట్యాక్సీవేలపై ఆస్తి పన్ను విధిస్తున్నట్లు సమాచారాన్ని రాబట్టింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యం సైతం ఆస్తి పన్ను కట్టాల్సిందేనని కమిటీ తేల్చిచెపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. త్వరలో ప్రత్యేక రేటు ఖరారు శంషాబాద్ విమానాశ్రయ పరిధిని ప్రభుత్వం ‘నోటిఫైడ్ ఏరియా కమిటీ’గా ప్రకటించడంతో పాటు ఓ మున్సిపల్ కమిషనర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ కమిటీ విమానాశ్రయ యాజమాన్యం నుంచి ఆస్తి పన్నులు వసూలు చేస్తుంది. రన్‌వే, ట్యాక్సీవే మినహా ఇతర ఆస్తులపై జీఎంఆర్ పన్నులు చెల్లిస్తోంది. తాజాగా రన్‌వే, ట్యాక్సీవేపై సైతం పన్నులు వసూలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించి ప్రత్యేక రేటును త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనుంది. -
జుహూలో రన్‌వే నిర్మాణానికి ‘పచ్చ’ జెండా
సాక్షి, ముంబై: సముద్రంతీరంలోని జుహూ విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. సముద్రంలో ఎలాంటి మట్టి వేయకుండా 800 మీటర్ల పొడవైన రన్‌వే నిర్మించేందుకు అనుమతి లభించింది.ఈ నిర్మాణం పూర్తయితే సముద్రతీరం సమీపంలో ఉన్న జుహూ విమానాశ్రయం నుంచి త్వరలో విమనాలు రాకపోకలు సాగించనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం శాంత్రాకజ్ డొమెస్టిక్ విమానాశ్రయంపై పడుతున్న ట్రాఫిక్ భారం కొంతమేర తగ్గుతుంది. కొన్ని దశాబ్దాల కిందట నగరంలో మొట్ట మొదటిసారి జుహూ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కాలక్రమేణా విమానాల సంఖ్య పెరిగిపోవడంతో శాంతాక్రజ్, ఆ తరువాత అంధేరిలోని సహార్ అంతర్జాతీయ విమానాశ్రాయాలను నెలకొల్పారు. ప్రస్తుతం జుహూ నుంచి చిన్న తరహా చార్టెడ్ విమానాలు, హెలికాప్టర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ విమానాశ్రయాన్ని జుహూ హెలిప్యాడ్‌గా పిలుస్తారు. సహార్, శాంతాక్రజ్ విమానాశ్రయాలపై పడుతున్న ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం అవసరమని అధికారులు ఆలోచిస్తుండగా ఎయిర్ అథారిటీ వర్గాలు జుహూ విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని భావించాయి. జుహూలో రన్‌వే ఆధునిక విమానాల రాకపోకలకు అనుకూలంగా లేదు. రన్‌వే పొడవు పెంచాలని నిపుణులు సూచించడంతో 800 మీటర్ల రన్‌వే ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా సముద్రాన్ని పూడ్చి రన్‌వే ఏర్పాటు చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లర్లు వేసి వంతెనపై రన్‌వే ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జుహూ విమానాశ్రయానికి పూర్వ వైభవం రానుంది.