చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు | Air India Express Plane Crash on runway in Kerala | Sakshi
Sakshi News home page

చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు

Published Sun, Aug 9 2020 3:26 AM | Last Updated on Sun, Aug 9 2020 4:35 AM

Air India Express Plane Crash on runway in Kerala - Sakshi

రన్‌వే దాటి కింద పడిన ఎయిరిండియా విమానం శకలాలు

కోళీకోడ్, న్యూఢిల్లీ: జోరున కురుస్తున్న వానలో 35 అడుగుల లోయలో  రెండు ముక్కలైన విమానం మధ్యలో నలిగిపోయిన క్షతగాత్రుల వేదన వర్ణనాతీతం. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విమాన ప్రయాణికులందరూ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఎటు చూసినా రోదనలు, అరుపులు కేకలు తప్ప అసలేం జరిగిందో అర్థం కాలేదని, కళ్ల ముందు చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించలేదని క్షతగాత్రులు చెబుతున్నారు.

184 మంది ప్రయాణికులతో దుబాయ్‌నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం కేరళలోని కోళీకోడ్‌ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ల్యాండింగ్‌ అయిన సమయంలో పట్టుతప్పి పక్కనే ఉన్న లోయలోకి జారిన విషయం తెలిసిందే. విమానం రెండు ముక్కలు కావడంతో వాటి మధ్య నలిగిపోయిన క్షతగాత్రుల మనోవేదన అంతా ఇంతా కాదు. ‘‘మొదట పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే తోటి ప్రయాణికులు అరుపులు వినిపించాయి’’ అని రంజిత్‌ అనే ప్లంబర్‌ చెప్పారు. ‘‘విమానం ఒక్కసారిగా కుదుపుకి లోనైనట్టుగా అనిపించింది.

ఏం జరిగిందో అర్థం కాలేదు. అది తలచుకుంటే ఇంకా నా శరీరం వణుకుతోంది. చాలామంది రక్తాలోడుతూ కనిపించారు’’ అని స్వల్పంగా గాయపడిన మరో ప్రయాణికుడు రంషద్‌ చెప్పారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఆందోళనకి లోనైన ప్రయాణికులు అందులోంచి కిందకి దూకడం కనిపించింది’’ అని అషిక్‌ అనే మరో క్షతగాత్రుడు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  మరొకరు మరణించారు. 149 మంది క్షతగాత్రుల్లో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.  

ఢిల్లీకి బ్లాక్‌ బాక్స్‌  
విమాన ప్రమాదాల్లో అత్యంత కీలకమైన బ్లాక్‌ బాక్స్‌ను శనివారం స్వాధీనం చేసుకొని దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి పంపినట్టుగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ( డీజీసీఏ) వెల్లడించింది. పౌర విమానాయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి ఘటనాస్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ‘‘ప్రమాదానికి గురైన ఎయిరిండియా బోయింగ్‌ 737ఐఎక్స్‌ 1344 విమానానికి చెందిన డిజిటల్‌ ఫ్లయిట్‌ డేటా రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లు లభించాయి.

ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) దీనిపై దర్యాప్తు జరుపుతోంది’’ అని పూరి ట్వీట్‌ చేశారు. విమానంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.  డీఎఫ్‌డీఆర్‌లో విమాన వేగం, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది, ఫ్యూయల్‌ ఫ్లో వంటివి 25 గంటల సేపు రికార్డు చేస్తుంది. ఇక కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డులో పైలట్లు మాట్లాడుకున్న మాటలని రెండు గంటల సేపు రికార్డు చేయగల సామర్థ్యం ఉంటుంది. వీటి సాయంతో విమాన ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకోవచ్చు.  

మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు  
విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ.50 వేలు అందిస్తామని కేంద్ర మంత్రి పూరి వెల్లడించారు. క్షతగాత్రులకి వైద్య చికిత్సకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. హోరున కురుస్తున్న వానలో కూడా సహాయ చర్యలకు ముందుకు వచ్చిన స్థానికుల్ని సీఎం విజయన్‌ ప్రశంసించారు.  

విమాన ప్రమాదంలో కరోనా భయం  
విమాన ప్రమాద మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ ఉందని వైద్య పరీక్షల్లో తేలడంతో కలకలం రే గింది. విమాన ప్రమాద సహాయ చర్యల్లో పాల్గొన్న వారందరూ తర్వాత సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాలని కేరళ వైద్య శాఖ మంత్రి కె.కె. శైలజ ఆదేశించారు.  

పెళ్లి కోసం తిరిగివస్తూ...
పెళ్లి ఖరారు కావడంతో ఆనందంగా దుబాయ్‌ నుంచి తిరిగొస్తున్న యువకుడు విధి వక్రించి విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని మొళ్లూర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ రియాస్‌ (24), సోదరుడు నిజాముద్దీన్‌తో కలిసి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు.

కుటుంబసభ్యులు ఈ నెలలో పెళ్లి నిశ్చయించడంతో అన్నదమ్ములిద్దరూ ఎయిర్‌ ఇండియా విమానంలో స్వరాష్ట్రానికి బయలుదేరారు. విమానం ల్యాండింగ్‌ సమయంలో రెండు ముక్కలైన దుర్ఘటనలో కాబోయే పెళ్లికొడుకు రియాస్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. తీవ్రంగా గాయపడ్డ అతని సోదరుడు నిజాముద్దీన్‌ కోళీకోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.   

కో–పైలట్‌ భార్య నిండుగర్భిణి
కోళీకోడ్‌ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన కో– పైలట్‌ అఖిలేష్‌ కుమార్‌(32)ది విషాదగాథ. ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన అఖిలేష్‌కు 2018లో పెళ్లయింది. ఇప్పుడు ఆయన భార్య నిండుగర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది. ఇంతలో అఖిలేష్‌ మరణవార్త రావడంతో వారి కుటుంబం షాక్‌కు లోనైంది. భార్య మేఘకు భర్త మరణవార్త ఇంకా చెప్పలేదు. ‘అఖిలేష్‌ చాలా మర్యాదస్తుడు. 2017లో ఎయిర్‌ ఇండియాలో చేరాడు. అతని భార్య గర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది’అని బంధువు వాసుదేవ్‌ తెలిపారు. మొదట అఖిలేష్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్‌ వచ్చిందని, తర్వాత చనిపోయాడని చెప్పారని తండ్రి తులసీరామ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ప్రమాదానికి కారణాలివేనా ?  
కోళీకోడ్‌లో విమానం దిగిన రన్‌ వే 10 పొడవు 2,700 మీటర్లు ఉంది. అయితే రన్‌వేకి వెయ్యి మీటర్లు ముందు విమానం దిగిందని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. విమానం ల్యాండింగ్‌ సమయంలో ఈదురుగాలులు, జోరుగా కురుస్తున్న వాన నేపథ్యంలో 2 కి.మీ.కి మించి పైలట్లకు కనిపించే పరిస్థితి లేదన్నారు. విమానం రన్‌ వే కంటే వెయ్యి మీటర్ల ముందర దిగి అదుపు తప్పి లోయలోకి జారిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ల్యాండింగ్‌ సమయంలో విమానం అత్యంత వేగంతో ప్రయాణిస్తోందని ఫ్లయిట్‌ రాడార్‌ చెబుతోంది.

రన్‌ వే ఉపరితలానికి 450 అడుగుల ఎత్తులో విమానం గంటకి 350కి.మీ. వేగంతో ప్రయాణం చేస్తోందని, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో అంత వేగం మంచిది కాదని ఎయిర్‌ సేఫ్టీ నిపుణుడు కెప్టెన్‌ అమర్‌ సింగ్‌ చెప్పారు. మొదటిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో గంటకి 276 కి.మీ. వేగంతో ప్రయాణించిందని, రెండోసారి పైలట్‌ ఎందుకు వేగం పెంచారో అర్థం కాలేదని అమర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. అందులోనూ టేబుల్‌ టాప్‌ రన్‌ వేపై సాధారణ రన్‌ వేలపై విమానాలను దించినట్టుగా ప్రయత్నించకూడదని ఆయన అన్నారు.

టేబుల్‌ టాప్‌ రన్‌ వేలు ప్రమాదకరం  
కేరళలోని కోళీకోడ్‌ విమానాశ్రయం దుర్ఘటనతో టేబుల్‌ టాప్‌ రన్‌ వేలు ఎంత సురక్షితం అన్న చర్చ మొదలైంది.  కర్ణాటకలోని మంగళూరులో పదేళ్ల క్రితం ఇదే తరహాలో విమాన ప్రమాదం జరిగి 160 మంది మరణించినప్పుడే ఈ టేబుల్‌ టాప్‌ రన్‌ వేలపై విమానాల రాకపోకలు కత్తి మీద సామేనని నిపుణులు హెచ్చరించారు.  అప్పట్లో మంగళూరు విమాన ప్రమాదంపై విచారణ జరిపిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌ బీఎన్‌ గోఖలే కొండ ప్రాంతాల్లో నిర్మించిన విమానాశ్రయాలు ఎంతమాత్రం సురక్షితం కాదని తన నివేదికలో వెల్లడించారు.

కోళీకోడ్‌ విమానాశ్రయం రన్‌ వే

అచ్చంగా ఒక టేబుల్‌ ఉపరితలం మాదిరిగా ఉండే అతి చిన్న రన్‌వేలపై విమానాలను దించడం అతి పెద్ద సవాల్‌. పైలట్లు ఎంత నైపుణ్యం కలిగన వారైనా టేబుల్‌ టాప్‌ రన్‌ వేలపై విమానాల టేకాఫ్,  ల్యాండింగ్‌లో ఎలాంటి ప్రమాదాలైనా చోటు చేసుకోవచ్చునని ఆ నివేదికలో పేర్కొన్నారు.  కోళీకోడ్‌ విమానాశ్రయంలో రన్‌ వేకి రెండు వైపుల  అదనంగా స్థలం లేదని, ఇలాంటి చోట్ల బోయింగ్‌ విమానాలు దిగడానికి అనుకూలం కాదని పదేళ్ల క్రితమే ఎయిర్‌ మార్షల్‌ గోఖలే గట్టి హెచ్చరికలే పంపారు.  

దేశంలో అయిదు  
మన దేశంలో అయిదు ప్రాంతాల్లో టేబుల్‌ టాప్‌ రన్‌ వేలు ఉన్నాయి. కోళీకోడ్‌ (కేరళ), మంగళూరు (కర్ణాటక), షిమ్లా (హిమాచల్‌ప్రదేశ్‌), పాక్యాంగ్‌ (సిక్కిం), లెంగ్‌పూయీ (మిజోరం)లలో ఈ తరహా రన్‌ వేలు ఉన్నాయి. ఈ రన్‌ వేలపై షార్ట్‌ ఫీల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌ (ఎస్‌ఎఫ్‌పీ) సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విమానాలే దిగగలవు.  

ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడ్డ విమాన సీట్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement