Valley area
-
చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం
దుమ్ముగూడెం: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కబిర్ధామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. మృతుల్లో 18 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కభీర్దామ్ జిల్లాలోని సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ కుక్దూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో బంజారి ఘాట్‌లో అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడింది. -
Pakistan: లోయలో పడిన బస్సు.. 17 మంది మృత్యువాత
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. సింధ్, బలోచిస్తోన్ ప్రావిన్స్‌ల సరిహద్దుల్లోని హుబ్ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా పట్టణానికి చెందిన కొందరు బలోచిస్తాన్‌లోని హుబ్ పట్టణంలోని షా నూరానీ దర్గాకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు రాత్రి 8 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఆదిలాబాద్: విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే బ్యాంక్ ఉద్యోగులు వీకెండ్లో సరదాగా గడిపేందుకు మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి హిల్‌స్టేషన్‌లోని చిక్కల్ధార ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివా రం తెల్లవారుజామున కారులో పయనమయ్యారు. మరికొద్ది క్షణాల్లో గమ్యస్థానానికి చేరుకోనుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో 200 అడుగుల లోతులో పడడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురు ప్రయాణిస్తుండగా నలుగురు తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు. స్నేహితుల మృతదేహాలను చూసి వారు బోరున విలపించారు. స్థానికులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అమరావతి, పరత్వాడ ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలకు చిక్కల్‌ధర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం అర్లి(టి) గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తోటి ఉద్యోగులు, అధికారులు సంఘటన స్థలానికి పయనం అయ్యారు. మరణంలోనూ వీడని స్నేహబంధం.. భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామానికి చెందిన షేక్ సల్మాన్, బొల్లి వైభవ్ కొన్నేళ్లుగా ప్రాణస్నేహితులుగా ఉంటున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన పొలాల అమావాస్య వేడుకల్లో సైతం ఇద్దరు కలిసి బసవన్నలను ఊరేగించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలవడం గమనార్హం. బ్యాంకు ఉద్యోగాలతో స్నేహితులుగా మారి.. వేర్వేరు జిల్లాల్లో పుట్టి పెరిగిన వీరంతా ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ జిల్లాలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పడిన స్నేహంతో సరదా కోసం చేసిన వీకెండ్ ట్రిప్ విషాదాన్ని మిగిల్చింది. జిల్లాలోని వివిధ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖల్లో ఉద్యోగం చేస్తున్న యువకులకు ఆర్లి(టి) గ్రామానికి చెందిన షేక్ సల్మాన్‌తో స్నేహం ఏర్పడింది. సల్మాన్ సొంతంగా వాహనాన్ని నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. కాగా అర్లి(టి), భీంపూర్‌తో పాటు వివిధ బ్యాంక్ శాఖలకు అప్పుడప్పుడు జిల్లా బ్యాంకు నుంచి నగదు రవాణా కోసం ఈయన వాహనాన్ని బ్యాంకు ఉద్యోగులు అద్దెకు తీసుకునేవారు. ఈ క్రమంలో ఏర్పడిన స్నేహంతో వీరంతా కలిసి వీకెండ్ కోసం వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. మృతులు వీరే.. ఆదిలాబాద్ జిల్లాలోని దక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులతో పాటు అర్లి(టి)కి చెందిన మరో ఇద్దరు మహారాష్ట్రలోని చిక్కల్‌ధర ఆహ్లాదకర ప్రాంతా న్ని సందర్శించేందుకు ఆదివారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లారు. కారు అదుపు తప్పి చిక్కల్‌ధర లోయలో పడిపోయింది. ఈ ఘటనలో భీంపూర్ మండలం అర్లి(టి) సర్పంచ్ గొల్లి రమ – లస్మన్నల కుమారుడు వైభవ్ యాదవ్ (28), అదే గ్రామానికి చెందిన షేక్‌చాంద్ – రుక్సానా దంపతులకు మారుడు, కారు డ్రైవర్ షేక్ సల్మాన్ (31), నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొర్టికల్కు చెందిన అద్దంకి శివకృష్ణ (31), అదే జిల్లాలోని తిప్పర్తి మండలం మల్లెపల్లివారి గూడెంకు చెందిన కోటేశ్వర్రావు (27) అనే నలుగురు మృత్యు ఒడిలోకి చేరారు. కాగా ఖమ్మం జిల్లా పొన్నెకల్కు చెందిన శ్యామ్‌రాజ్, నల్గొండలోని మిర్యాలగూడకు చెందిన యోగేష్యాదవ్, అదే జిల్లాలోని కేటపల్లి మండలం చీకటిగూడెంకు చెందిన హరీష్, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సుమన్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కాగా మృతి చెందిన శివకృష్ణ తాంసి మండలంలోని కప్పర్ల టీజీబీ శాఖలో క్యాషియర్‌గా, కోటేశ్వర్రావు భీంపూర్ మండల కేంద్రంలోని టీజీబీ శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అలాగే అర్లి(టి)కి చెందిన వైభవ్ కాటన్ కమీషన్ ఏజెంట్, సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు కుమారుడి మృతిని తట్టుకోలేక కుప్పకూలిపోయారు. వారు రోధించిన తీరు పలువురిని కలిచివేసింది. రాత్రి వరకు కూడా మృతదేహాలు ఇంటికి చేరుకోలేదు. ఇదిలా ఉండగా గాయపడ్డ వారిలో శ్యామ్‌రాజ్ రెడ్డి అర్లి(టి)లో క్యాషియర్‌గా, సుమన్ జైనథ్ మండలం పెండల్ వాడలో క్యాషియర్‌గా, యోగేష్ యాదవ్, హరీష్‌లు బేల మండల కేంద్రంలో ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు జిల్లాకేంద్రంలో అద్దెకు ఉంటూ నిత్యం విధులకు హాజరవుతున్నారు. కష్టపడి కొలువు సాధించి కుటుంబాలకు అండగా ఉంటున్న తరుణంలో అనుకోని రీతిలో ఇద్దరు మృతిచెందడం వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. అలాగే షేక్ సల్మాన్ వాహనాన్ని కొనుగోలు చేసి తన కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఈ తరుణంలో కుటుంబ దిక్కు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
చిమ్మచీకట్లో మిన్నంటిన రోదనలు
కోళీకోడ్, న్యూఢిల్లీ: జోరున కురుస్తున్న వానలో 35 అడుగుల లోయలో రెండు ముక్కలైన విమానం మధ్యలో నలిగిపోయిన క్షతగాత్రుల వేదన వర్ణనాతీతం. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విమాన ప్రయాణికులందరూ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఎటు చూసినా రోదనలు, అరుపులు కేకలు తప్ప అసలేం జరిగిందో అర్థం కాలేదని, కళ్ల ముందు చిమ్మ చీకటి తప్ప ఏమీ కనిపించలేదని క్షతగాత్రులు చెబుతున్నారు. 184 మంది ప్రయాణికులతో దుబాయ్నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ల్యాండింగ్ అయిన సమయంలో పట్టుతప్పి పక్కనే ఉన్న లోయలోకి జారిన విషయం తెలిసిందే. విమానం రెండు ముక్కలు కావడంతో వాటి మధ్య నలిగిపోయిన క్షతగాత్రుల మనోవేదన అంతా ఇంతా కాదు. ‘‘మొదట పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే తోటి ప్రయాణికులు అరుపులు వినిపించాయి’’ అని రంజిత్ అనే ప్లంబర్ చెప్పారు. ‘‘విమానం ఒక్కసారిగా కుదుపుకి లోనైనట్టుగా అనిపించింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. అది తలచుకుంటే ఇంకా నా శరీరం వణుకుతోంది. చాలామంది రక్తాలోడుతూ కనిపించారు’’ అని స్వల్పంగా గాయపడిన మరో ప్రయాణికుడు రంషద్ చెప్పారు. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయి. ఆందోళనకి లోనైన ప్రయాణికులు అందులోంచి కిందకి దూకడం కనిపించింది’’ అని అషిక్ అనే మరో క్షతగాత్రుడు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు మరణించారు. 149 మంది క్షతగాత్రుల్లో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని కేరళ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీకి బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదాల్లో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను శనివారం స్వాధీనం చేసుకొని దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి పంపినట్టుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) వెల్లడించింది. పౌర విమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఘటనాస్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ‘‘ప్రమాదానికి గురైన ఎయిరిండియా బోయింగ్ 737ఐఎక్స్ 1344 విమానానికి చెందిన డిజిటల్ ఫ్లయిట్ డేటా రికార్డర్ (డీఎఫ్‌డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లు లభించాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దీనిపై దర్యాప్తు జరుపుతోంది’’ అని పూరి ట్వీట్ చేశారు. విమానంలో ఇంధనానికి ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. డీఎఫ్డీఆర్లో విమాన వేగం, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది, ఫ్యూయల్ ఫ్లో వంటివి 25 గంటల సేపు రికార్డు చేస్తుంది. ఇక కాక్‌పిట్ వాయిస్ రికార్డులో పైలట్లు మాట్లాడుకున్న మాటలని రెండు గంటల సేపు రికార్డు చేయగల సామర్థ్యం ఉంటుంది. వీటి సాయంతో విమాన ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకోవచ్చు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ.50 వేలు అందిస్తామని కేంద్ర మంత్రి పూరి వెల్లడించారు. క్షతగాత్రులకి వైద్య చికిత్సకయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. హోరున కురుస్తున్న వానలో కూడా సహాయ చర్యలకు ముందుకు వచ్చిన స్థానికుల్ని సీఎం విజయన్ ప్రశంసించారు. విమాన ప్రమాదంలో కరోనా భయం విమాన ప్రమాద మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉందని వైద్య పరీక్షల్లో తేలడంతో కలకలం రే గింది. విమాన ప్రమాద సహాయ చర్యల్లో పాల్గొన్న వారందరూ తర్వాత సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాలని కేరళ వైద్య శాఖ మంత్రి కె.కె. శైలజ ఆదేశించారు. పెళ్లి కోసం తిరిగివస్తూ... పెళ్లి ఖరారు కావడంతో ఆనందంగా దుబాయ్ నుంచి తిరిగొస్తున్న యువకుడు విధి వక్రించి విమానప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని మొళ్లూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రియాస్ (24), సోదరుడు నిజాముద్దీన్‌తో కలిసి దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. కుటుంబసభ్యులు ఈ నెలలో పెళ్లి నిశ్చయించడంతో అన్నదమ్ములిద్దరూ ఎయిర్ ఇండియా విమానంలో స్వరాష్ట్రానికి బయలుదేరారు. విమానం ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కలైన దుర్ఘటనలో కాబోయే పెళ్లికొడుకు రియాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. తీవ్రంగా గాయపడ్డ అతని సోదరుడు నిజాముద్దీన్ కోళీకోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కో–పైలట్ భార్య నిండుగర్భిణి కోళీకోడ్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన కో– పైలట్ అఖిలేష్ కుమార్(32)ది విషాదగాథ. ఉత్తరప్రదేశ్‌లోని మథురకు చెందిన అఖిలేష్‌కు 2018లో పెళ్లయింది. ఇప్పుడు ఆయన భార్య నిండుగర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది. ఇంతలో అఖిలేష్ మరణవార్త రావడంతో వారి కుటుంబం షాక్‌కు లోనైంది. భార్య మేఘకు భర్త మరణవార్త ఇంకా చెప్పలేదు. ‘అఖిలేష్ చాలా మర్యాదస్తుడు. 2017లో ఎయిర్ ఇండియాలో చేరాడు. అతని భార్య గర్భిణి. మరో 15 రోజుల్లో డెలివరీ ఉంది’అని బంధువు వాసుదేవ్ తెలిపారు. మొదట అఖిలేష్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్ వచ్చిందని, తర్వాత చనిపోయాడని చెప్పారని తండ్రి తులసీరామ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రమాదానికి కారణాలివేనా ? కోళీకోడ్‌లో విమానం దిగిన రన్ వే 10 పొడవు 2,700 మీటర్లు ఉంది. అయితే రన్‌వేకి వెయ్యి మీటర్లు ముందు విమానం దిగిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. విమానం ల్యాండింగ్ సమయంలో ఈదురుగాలులు, జోరుగా కురుస్తున్న వాన నేపథ్యంలో 2 కి.మీ.కి మించి పైలట్లకు కనిపించే పరిస్థితి లేదన్నారు. విమానం రన్ వే కంటే వెయ్యి మీటర్ల ముందర దిగి అదుపు తప్పి లోయలోకి జారిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ల్యాండింగ్ సమయంలో విమానం అత్యంత వేగంతో ప్రయాణిస్తోందని ఫ్లయిట్ రాడార్ చెబుతోంది. రన్ వే ఉపరితలానికి 450 అడుగుల ఎత్తులో విమానం గంటకి 350కి.మీ. వేగంతో ప్రయాణం చేస్తోందని, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో అంత వేగం మంచిది కాదని ఎయిర్ సేఫ్టీ నిపుణుడు కెప్టెన్ అమర్ సింగ్ చెప్పారు. మొదటిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో గంటకి 276 కి.మీ. వేగంతో ప్రయాణించిందని, రెండోసారి పైలట్ ఎందుకు వేగం పెంచారో అర్థం కాలేదని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. అందులోనూ టేబుల్ టాప్ రన్ వేపై సాధారణ రన్ వేలపై విమానాలను దించినట్టుగా ప్రయత్నించకూడదని ఆయన అన్నారు. టేబుల్ టాప్ రన్ వేలు ప్రమాదకరం కేరళలోని కోళీకోడ్ విమానాశ్రయం దుర్ఘటనతో టేబుల్ టాప్ రన్ వేలు ఎంత సురక్షితం అన్న చర్చ మొదలైంది. కర్ణాటకలోని మంగళూరులో పదేళ్ల క్రితం ఇదే తరహాలో విమాన ప్రమాదం జరిగి 160 మంది మరణించినప్పుడే ఈ టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల రాకపోకలు కత్తి మీద సామేనని నిపుణులు హెచ్చరించారు. అప్పట్లో మంగళూరు విమాన ప్రమాదంపై విచారణ జరిపిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ బీఎన్ గోఖలే కొండ ప్రాంతాల్లో నిర్మించిన విమానాశ్రయాలు ఎంతమాత్రం సురక్షితం కాదని తన నివేదికలో వెల్లడించారు. కోళీకోడ్ విమానాశ్రయం రన్ వే అచ్చంగా ఒక టేబుల్ ఉపరితలం మాదిరిగా ఉండే అతి చిన్న రన్‌వేలపై విమానాలను దించడం అతి పెద్ద సవాల్. పైలట్లు ఎంత నైపుణ్యం కలిగన వారైనా టేబుల్ టాప్ రన్ వేలపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లో ఎలాంటి ప్రమాదాలైనా చోటు చేసుకోవచ్చునని ఆ నివేదికలో పేర్కొన్నారు. కోళీకోడ్ విమానాశ్రయంలో రన్ వేకి రెండు వైపుల అదనంగా స్థలం లేదని, ఇలాంటి చోట్ల బోయింగ్ విమానాలు దిగడానికి అనుకూలం కాదని పదేళ్ల క్రితమే ఎయిర్ మార్షల్ గోఖలే గట్టి హెచ్చరికలే పంపారు. దేశంలో అయిదు మన దేశంలో అయిదు ప్రాంతాల్లో టేబుల్ టాప్ రన్ వేలు ఉన్నాయి. కోళీకోడ్ (కేరళ), మంగళూరు (కర్ణాటక), షిమ్లా (హిమాచల్‌ప్రదేశ్), పాక్యాంగ్ (సిక్కిం), లెంగ్పూయీ (మిజోరం)లలో ఈ తరహా రన్ వేలు ఉన్నాయి. ఈ రన్ వేలపై షార్ట్ ఫీల్డ్ పెర్ఫార్మెన్స్ (ఎస్ఎఫ్పీ) సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విమానాలే దిగగలవు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడ్డ విమాన సీట్లు. -
200 అడుగుల లోయలోకి..
బనిహల్/జమ్మూ: కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూలోని రంబన్ జిల్లాలో మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 22 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం కిక్కిరిసిన ప్రయాణికులతో మినీ బస్సు రంబన్ నుంచి బనిహల్‌కు బయలుదేరింది. ఉదయం 9.55 గంటలకు జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిపై వెళుతుండగా మారూఫ్ సమీపంలోని కేళా మోల్ వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు 200 అడుగుల లోతైన లోయలో పడింది. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు డ్రైవర్ కూడా ఉన్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన పది మందిని హెలికాప్టర్లలో ఉదంపూర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించగా మరో ఇద్దరిని జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఆరు ఆర్మీ హెలికాప్టర్లతో పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్, మరో ప్రైవేట్ హెలికాప్టర్ సహాయ చర్యల్లో పాల్గొన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.2లక్షల పరిహారం ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. -
రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. స్వారా నుంచి తియునికి వెళ్తున్న జీపుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. జీపులో ఉన్న వారిలో పది మంది అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. మృతుల్లో మూడు జంటలు, వారి పిల్లలూ ఉన్నారు. -
విహారయాత్ర విషాదాంతం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దపోలీ ప్రాంతం నుంచి పర్యాటక కేంద్రమైన మహాబలేశ్వర్కు వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి 500 అడుగుల లోతున్న లోయలోకి పడిపోవడంతో 33 మంది ప్రయాణికులు చనిపోగా ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత అతను లోయ నుంచి పైకివచ్చి అధికారులకు సమాచారం అందించడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బండరాళ్ల ధాటికి బస్సు తుక్కుతుక్కు కావడం, మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోవడంతో ఈ ప్రాంతంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఈ విషయమై రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. దపోలీలోని కొంకణ్ వ్యవసాయ వర్సిటీకి చెందిన 34 మంది సిబ్బంది శనివారం మహాబలేశ్వర్కు ఓ బస్సులో విహారయాత్రకు బయలుదేరారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఆంబెనలి ఘాట్ సమీపంలోని ఓ మలుపు వద్దకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణను కోల్పోయాడని వెల్లడించారు. దీంతో బస్సు 500 అడుగుల లోతున్న లోయలోకి పల్టీలు కొడుతూ జారిపోయిందన్నారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో 33 మంది ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని విజయ్ తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డ ప్రకాశ్ సావంత్ దేశాయ్ అనే వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అధికారులకు సమాచారాన్ని అందించాడన్నారు. దీంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. తొలుత విహారయాత్రకు 40 మంది వెళ్లాలనుకున్నప్పటికీ.. బస్సు చిన్నదిగా ఉండటంతో పలువురు రాలేకపోయారనీ, దీంతో వారి ప్రాణాలు దక్కాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ సంతాపం ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘రాయ్‌గఢ్ జిల్లాలో జరిగిన ప్రాణనష్టంతో తీవ్ర ఆవేదన చెందుతున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని మోదీని ఉటంకిస్తూ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాల సహాయ సహకారాలను అందించాలని స్థానిక కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనారోగ్యమే ప్రాణం కాపాడింది.. అనారోగ్యం కూడా కొన్నిసార్లు మంచి చేస్తుందంటే ఇదేనేమో! కొంకణ్ వర్సిటీలో పనిచేస్తున్న ప్రవీణ్ రణ్దివే కూడా శనివారం ప్రమాదానికి గురైన బస్సులో విహారయాత్రకు వెళ్లాల్సి ఉంది. అందుకు ఆయన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ‘మహాబలేశ్వర్కు వెళ్లడానికి సిద్ధమయ్యాక నా ఆరోగ్యం దెబ్బతింది. దీంతో టూర్‌కు రాలేనని చెప్పాను. దారిపొడవునా ఉన్న ప్రకృతి అందాల ఫొటోలను వారంతా మా వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ల నుంచి చివరి మెసేజ్ ఉదయం 9.30 గంటలకు అందింది. తాము టిఫిన్ చేసేందుకు దిగుతున్నామని మిత్రులు చెప్పారు. తర్వాత వాళ్ల బస్సు ప్రమాదానికి గురైందని శనివారం మధ్యాహ్నం నాకు తెలిసింది’ అని ప్రవీణ్ చెప్పారు. ఒకే ఒక్కడు ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి ప్రకాశ్ దేశాయ్ మాట్లాడుతూ.. రోడ్డుపై ఉన్న బురద కారణంగా బస్సుకు పట్టుదొరక్క లోయలోకి పడిపోయిందన్నారు. ‘బస్సు వెళుతున్న రోడ్డంతా బురదమయంగా ఉంది. ఘాట్ మార్గంలో ఉన్న రాళ్లు అంత పటుత్వంతో లేవు. ప్రమాదం జరిగినప్పుడు జల్లులు పడుతున్నాయి. రోడ్డుపై వెళుతున్న మా బస్సు తొలుత కొద్దిగా ఎడమవైపుకు వంగింది. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే వేగంగా లోయలోకి జారిపోవడం మొదలుపెట్టింది. బస్సు వేగాన్ని చెట్లు అడ్డుకున్నాయి. మా వాహనం లోయలోకి దూసుకెళుతుండగా నేనెలాగో దూకేయగలిగాను. ఆ తర్వాత రోడ్డుపైకి రాగానే చాలామంది వాహనదారులు అక్కడే ఆగిఉన్నారు. వాళ్లలో ఒకరు నాకు ఫోన్ అందించడంతో వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చాను’ అని దేశాయ్ పేర్కొన్నారు. లోయలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు -
48 మందిని బలిగొన్న బస్సు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోతున్న లోయలో పడి 48 మంది ప్రయాణికులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. పౌడీ జిల్లాలోని ధూమకోట్ ప్రాంతం సమీపంలో ఉన్న గ్వీన్ అనే గ్రామం దగ్గర్లో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పౌడీ ఎస్పీ జగత్ రామ్ చెప్పారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటో ఇంకా నిర్ధారించలేదనీ, రాం నగర్ వెళ్తున్న ఈ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారనేది మాత్రం స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. 28 సీట్లున్న ఈ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు 58 మంది ప్రయాణిస్తున్నారనీ, ఘటనా స్థలంలోనే 45 మంది మరణించగా, ధూమకోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తుండగా మరో ముగ్గురు చనిపోయారని ఎస్పీ వెల్లడించారు. గాయపడ్డ పది మందిలోనూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాం నగర్‌లోని వైద్యశాలకు తరలించారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాద స్థలిని పరిశీలించారు. దుర్ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరపాల్సిందిగా ఆయన ఆదేశించారు. మృతుల బంధువులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. రావత్‌తో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఫోన్లో మాట్లాడి, కేంద్రం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని చెప్పారు. నీటిగుంటే ప్రమాదానికి కారణమా? ప్రాథమిక సమాచారం ప్రకారం రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద నీటి గుంటను డ్రైవర్ తప్పించే క్రమంలో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. బస్సు 200 మీటర్ల లోతుకి దొర్లుకుంటూ వెళ్లిన అనంతరం వాగులోకి పడిందని పోలీసులు పేర్కొన్నారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారనీ, మృత దేహాలనన్నింటినీ బస్సులో నుంచి బయటకు తీశామని ఎస్పీ చెప్పారు. ప్రముఖుల సంతాపం ప్రమాదంలో మృతి చెందిన వారికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలు సంతాపం తెలిపారు. ‘ప్రమాదం విచారకరం. మృతుల కటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ కోవింద్ ట్వీట్ చేశారు. మోదీ ట్వీట్ చేస్తూ ‘తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ గవర్నర్ క్రిష్ణకాంత్ పాల్ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ సానుభూతి తెలిపారు. -
మహిళ దారుణ హత్య
దుండగులు ఓ గుర్తుతెలియని మహిళ ను దారుణంగా హత్య చేశారు. తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. హత్య అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నాలుగైదు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కలకలం సృష్టించిన ఈ సంఘటన మండల పరిధిలోని తిమ్మాయిపల్లి అనుబంధ బండమీదిపల్లి శివారులో బుధవారం వెలుగు చూసింది. - తల నరికేసిన దుండగులు - మృతదేహాన్ని కాల్చివేసిన వైనం - డాగ్‌స్క్వాడ్‌తో వివరాలు సేకరించిన సీఐ శివశంకర్ - యాలాల మండలం బండమీదిపల్లి శివారులో ఘటన యాలాల: స్థానికులు, తాండూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బండమీదిపల్లి గ్రామ శివారులోని ర్యాలబండ గుట్టలో ఉన్న లోయ ప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయి తల లేకుండా ఉన్న మహిళ మృతదేహాన్ని పశువుల కాపరులు గుర్తించారు. గ్రామ సర్పంచ్‌తో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. తాండూరు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ రమేష్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో హత్యకు జరిగి నాలుగైదు రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళకు దాదాపు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు పరిసరాలను పరిశీలించగా సమీపంలోని పొదల్లో మహిళకు సంబంధించిన తల కనిపించింది. దుండగులు హత్య అనంతరం మృతదేహంపై పెట్రోల్ లేదా కిరోసిన్ పోసి నిప్పంటించిన ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహం సగం కాలిపోయింది. హతురాలి కుడి చేతిపై పచ్చబొట్టు ఉంది. చేతులకు రోల్డ్‌గోల్డ్ గాజులు ఉన్నాయి. సంఘటన స్థలానికి సమీపంలో మృతురాలికి చెందినవిగా భావిస్తున్న చెప్పులు, ఇంటికి సంబంధించిన తాళాలు పడి ఉన్నాయి. హతురాలిని గుర్తించే వీలులేకుండా పోయింది. మహిళకు తెలిసిన వారే ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. అనంతరం జాగిలాలతో వివరాలు సేకరించారు. ఘటనా స్థలంలోనే మృతదేహాన్ని ఖననం చేశారు. కాగా బండమీదిపల్లి శివారులో మహిళను దుండగులు దారుణంగా హత్య చేయడంతో గ్రామస్తులు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ వీఆర్వో పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ పేర్కొన్నారు.