విహారానికి వెళ్లిన బృందం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దపోలీ ప్రాంతం నుంచి పర్యాటక కేంద్రమైన మహాబలేశ్వర్‌కు వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి 500 అడుగుల లోతున్న లోయలోకి పడిపోవడంతో 33 మంది ప్రయాణికులు చనిపోగా ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత అతను లోయ నుంచి పైకివచ్చి అధికారులకు సమాచారం అందించడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బండరాళ్ల ధాటికి బస్సు తుక్కుతుక్కు కావడం, మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోవడంతో ఈ ప్రాంతంలో భీతావహ పరిస్థితి నెలకొంది.
ఈ విషయమై రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. దపోలీలోని కొంకణ్ వ్యవసాయ వర్సిటీకి చెందిన 34 మంది సిబ్బంది శనివారం మహాబలేశ్వర్‌కు ఓ బస్సులో విహారయాత్రకు బయలుదేరారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఆంబెనలి ఘాట్ సమీపంలోని ఓ మలుపు వద్దకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణను కోల్పోయాడని వెల్లడించారు. దీంతో బస్సు 500 అడుగుల లోతున్న లోయలోకి పల్టీలు కొడుతూ జారిపోయిందన్నారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో 33 మంది ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని విజయ్ తెలిపారు.
ప్రాణాలతో బయటపడ్డ ప్రకాశ్ సావంత్ దేశాయ్ అనే వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అధికారులకు సమాచారాన్ని అందించాడన్నారు. దీంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్‌ఎఫ్) సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. తొలుత విహారయాత్రకు 40 మంది వెళ్లాలనుకున్నప్పటికీ.. బస్సు చిన్నదిగా ఉండటంతో పలువురు రాలేకపోయారనీ, దీంతో వారి ప్రాణాలు దక్కాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు.
ప్రధాని మోదీ సంతాపం
ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘రాయ్‌గఢ్ జిల్లాలో జరిగిన ప్రాణనష్టంతో తీవ్ర ఆవేదన చెందుతున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని మోదీని ఉటంకిస్తూ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాల సహాయ సహకారాలను అందించాలని స్థానిక కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అనారోగ్యమే ప్రాణం కాపాడింది..
అనారోగ్యం కూడా కొన్నిసార్లు మంచి చేస్తుందంటే ఇదేనేమో! కొంకణ్ వర్సిటీలో పనిచేస్తున్న ప్రవీణ్ రణ్‌దివే కూడా శనివారం ప్రమాదానికి గురైన బస్సులో విహారయాత్రకు వెళ్లాల్సి ఉంది. అందుకు ఆయన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ‘మహాబలేశ్వర్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యాక నా ఆరోగ్యం దెబ్బతింది. దీంతో టూర్‌కు రాలేనని చెప్పాను. దారిపొడవునా ఉన్న ప్రకృతి అందాల ఫొటోలను వారంతా మా వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ల నుంచి చివరి మెసేజ్ ఉదయం 9.30 గంటలకు అందింది. తాము టిఫిన్ చేసేందుకు దిగుతున్నామని మిత్రులు చెప్పారు. తర్వాత వాళ్ల బస్సు ప్రమాదానికి గురైందని శనివారం మధ్యాహ్నం నాకు తెలిసింది’ అని ప్రవీణ్ చెప్పారు.
ఒకే ఒక్కడు
ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి ప్రకాశ్ దేశాయ్ మాట్లాడుతూ.. రోడ్డుపై ఉన్న బురద కారణంగా బస్సుకు పట్టుదొరక్క లోయలోకి పడిపోయిందన్నారు. ‘బస్సు వెళుతున్న రోడ్డంతా బురదమయంగా ఉంది. ఘాట్ మార్గంలో ఉన్న రాళ్లు అంత పటుత్వంతో లేవు. ప్రమాదం జరిగినప్పుడు జల్లులు పడుతున్నాయి. రోడ్డుపై వెళుతున్న మా బస్సు తొలుత కొద్దిగా ఎడమవైపుకు వంగింది. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే వేగంగా లోయలోకి జారిపోవడం మొదలుపెట్టింది. బస్సు వేగాన్ని చెట్లు అడ్డుకున్నాయి. మా వాహనం లోయలోకి దూసుకెళుతుండగా నేనెలాగో దూకేయగలిగాను. ఆ తర్వాత రోడ్డుపైకి రాగానే చాలామంది వాహనదారులు అక్కడే ఆగిఉన్నారు. వాళ్లలో ఒకరు నాకు ఫోన్ అందించడంతో వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చాను’ అని దేశాయ్ పేర్కొన్నారు.
లోయలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు
Comments
Please login to add a commentAdd a comment