bus accidnet
-
Mulugu: డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. బస్సులో 40 మంది భక్తులు
ములుగు: జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో యాత్రికుల బస్సు అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. అయితే బస్సులో 40 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. గుండెపోటుకు గురైన డ్రైవర్ మాత్రం ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి ప్రైవేటు బస్సులో బయలుదేరిన భవాని దీక్ష భక్తులు.. భద్రాచలం మీదుగా యాదగిరిగుట్ట వెళ్తుండగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రపురం వద్ద డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. -
కేరళలో ఏపీ శబరిమల భక్తుల వాహనం బోల్తా.. ప్రమాదంపై సీఎం జగన్ ఆరా
ఏలూరు రూరల్/సాక్షి, అమరావతి : అయ్యప్ప మాలధారులతో కేరళలోని శబరిమలకు వెళ్లిన ఓ ప్రైవేటు బస్సు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. శబరిమల సమీపంలోని పతనంతిట్ట వద్ద మలుపు తిరుగుతుండగా బ్రేక్ ఫెయిలై లోయలో పడింది. ప్రయాణ సమయంలో బస్సులో 46 మంది ఉండగా, వారిలో 17 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్యచౌదరి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కేరళ ప్రభుత్వంతో, అక్కడి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. రెండు బస్సుల్లో ప్రయాణం.. ఈ నెల 15న ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామానికి చెందిన 86 మంది అయ్యప్ప మాలధారులు శబరిమల యాత్రకు రెండు బస్సుల్లో బయల్దేరి వెళ్లారు. 18న మధ్యాహ్నం శబరిమలకు చేరుకుని దర్శనానంతరం శనివారం ఉ.6.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శబరిమల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని పతనంతిట్ట వద్ద బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ బండిని అదుపుచేయలేక లోయలో పడింది. ప్రయాణికులంతా పెద్దపెట్టున హాహాకారాలు చేశారు. సుమారు 15–20 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు ఒక్కసారిగా పడటంతో ప్రయాణికులంతా చెల్లాచెదురయ్యారు. 17 మంది గాయపడ్డారు. వీరిలో మాదేపల్లికి చెందిన మణికంఠ అనే బాలుడికి పక్కటెముకలు విరిగాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సంఘటన జరిగిన తరువాత అక్కడి పోలీసులు, ఇతర అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల ద్వారా కొట్టాయం మెడికల్ కళాశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సు 40–50 కి.మీ.ల వేగంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. ప్రమాద వార్త తెలియగానే మాదేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. తమవారి క్షేమ సమాచారం కోసం బంధువులు ఎంతో ఆతృతతో ఆరా తీశారు. కేరళ మంత్రితో ఆళ్ల నాని వాకబు సమాచారం తెలియగానే మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి, స్థానిక కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి క్షేమంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాదేపల్లి పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ పెంచల కిషోర్‌తో పాటు క్షతగాత్రుల కుటుంబీకులను పరామర్శించారు. బాధితులను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని వివరించారు. ఇక బ్రేక్ ఫెయిల్ అవడంవల్లే బస్సు ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు వివరించారని వారి బంధువు, మాదేపల్లికి చెందిన శ్రీనివాస్ ‘సాక్షి’కి చెప్పారు. తాను కూడా వారితో పాటే శబరిమలకు వెళ్లానని, వచ్చేటప్పుడు వారికంటే ముందు బయల్దేరి వచ్చేశానన్నారు. కొండ దిగువన పెద్దపెద్ద చెట్లు ఉండడంవల్ల ప్రమాద తీవ్రత తగ్గినట్లు బాధితులు చెప్పారన్నారు. అసలు తిరుగు ప్రయాణంలో బస్సు క్లచ్ ప్లేట్లు పాడయ్యాయని.. మరమ్మతులు చేసుకుని తిరిగి బయలుదేరిన 30 నిమిషాల్లో ఈ ప్రమాదం జరిగినట్లు వారు చెప్పారన్నారు. క్షతగాత్రులు వీరే.. గాయపడిన వారిలో.. మాదేపల్లి గ్రామానికి చెందిన బత్తిన రాజశేఖర్, చల్లా సురేష్, బత్తిన రాజేష్, తరగళ్ల రాజేష్, పాశం సాయిమణికంఠ, జి.గోపి, కాకరబత్తిన వెంకటేశ్వరరావు, మారేటి దుర్గారావు, పైడిపాతి భాస్కరరావు, గండికోట శ్యామ్, పాండు, సూరినీడు శివ, ప్రసాద గోపి, మారెడ్డి చరణ్, లక్ష్మయ్యతో పాటు ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగేశ్వరరావు, శ్రీను ఉన్నారు. సీఎం జగన్ ఆరా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం మరోవైపు.. రాష్ట్రానికి చెందిన శబరిమల భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రమాద ఘటనకు దారితీసిన పరిస్థితులు, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతోపాటు గాయపడిన వారందరికీ వైద్యం, తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌తో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు వివరించారు. -
ఘోర అగ్ని ప్రమాదం... బస్సు కిందే సజీవ దహనమైన బైకర్లు
పోలీస్ సిబ్బందితో వెళ్తున్న బస్సు బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో ఇంధన ట్యాంకర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం చోట చేసుకుంది. ఈ ఘటన చప్రా సివాన్ హైవేపై చోటు చేసుకుంది. ఆ బస్సులో బీహార్ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు డియోరియా గ్రామ సమీపంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో వారిలో ఒకరు బైక్‌తో సహా బస్సు కింద ఇరుక్క పోయారు. దీంతో ఒక్కసారిగా ఇంధన ట్యాంకు పేలి అగ్నికీలలు చుట్టుముట్టాయి.ఆ ముగ్గురు వ్యక్తుల బస్సు కిందకు రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో బస్సు కింద ఇరుక్కన్న బైకర్‌తో సహా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగడంతో పోలీస్ అధికారులు వెంటనే బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. సితాబ్దియారాలో దివగంత రాజకీయ నాయకుడు జయ ప్రకాశ్‌నారాయణ 120వ జయంతి వేడుకల్లో పాల్గోని పోలీస్ సిబ్బంది తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. (చదవండి: కుక్క పిల్ల అని తెచ్చుకుంటే.. ) -
ఓవర్ స్పీడ్.. కేరళలో ఘోర ప్రమాదం
పాలక్కడ్: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు బలిగొంది. కేరళలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం జరిగింది. పాలక్కడ్ వడక్కన్‌చ్చెర్రి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. బేస్లియస్ స్కూల్‌కు చెందిన 10, 11, 12వ తరగతి విద్యార్థులను టూర్‌కు తీసుకెళ్లిన బస్సు.. ఓవర్ స్పీడ్‌తో ఓ కారును ఓవర్టేక్ చేయబోయే ప్రయత్నంలో అదుపు తప్పింది. అంజుమూర్తీ మంగళం బస్టాప్ వద్ద ఓ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఆపై అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులో పడి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు దుర్మరణం పాలయ్యారు. వలయార్-వడక్కన్‌చెర్రి జాతీయ రహదారిపై అర్ధరాత్రి 12 గం. తర్వాత ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన టైంలో జోరుగా వాన కురుస్తోందని అధికారులు తెలిపారు. టూరిస్ట్ బస్సులో 41 మంది చిన్నారులు, ఐదుగురు టీచర్లు, బస్సుకు సంబంధించి ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇక ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని, 28 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని తెలిపారు. ఆర్టీసీ బస్సు కొట్టారక్కరా నుంచి కొయంబత్తూరు రూట్లో వెళ్తోంది. ప్రమాదం తీవ్రమైంది కావడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులకు పాలక్కడ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. వానలో టూరిస్ట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఘోరం జరిగిందని పోలీసులు వెల్లడించారు. Kerala | 9 people died while 38 were injured after a tourist bus crashed into Kerala State Road Transport Corporation (KSRTC) bus in Vadakkenchery in Palakkad district: State minister MB Rajesh — ANI (@ANI) October 6, 2022 ఇదీ చదవండి: బీఆర్ఎస్పై కర్ణాటక మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు -
ఘోర బస్సు ప్రమాదం... 20 మంది సజీవ దహనం
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ బస్ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు . దీంతో సుమారు 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. ముల్తాన్ హైవేకి సుమారు 350 కి. మీ దూరంలో ఉన్న లాహోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కరాచి నుంచి లాహోర్కి బయులు దేరుతున్న ప్యాసింజర్ బస్సుని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయని వెల్లడించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి రెస్య్కూ చర్యలు చేపట్టినప్పటికీ ప్రయాణికులను కాపాడటం కష్టతరమైందని అన్నారు. ఈ ఘటనలో సుమారు ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారని, ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అన్నారు. ఆయా మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్‌లు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులును ఆదేశించారు. అలాగే మృతి చెందిన బాధిత కుటంబాలు తమ వారిని గుర్తించేలాగా సహకరించాలని అధికారులను కోరారు. (చదవండి: బస్సు బ్రేకులు ఫెయిలై ఘోర ప్రమాదం.. ఐటీబీపీ సిబ్బంది దుర్మరణం) -
MP Bus Accident: మృత్యు కేళి: నర్మదా నదిలో ఘోర బస్సు ప్రమాదం
భోపాల్: మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం వేకువ ఝామున ఖాలాఘాట్ దగ్గర అదుపు తప్పి ఓ ప్రయాణికుల బస్సు నర్మదా నదిలో పడిపోయింది. సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్తున్నప్పటికీ.. సంఖ్యపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఇప్పటిదాకా 12 మంది మృతదేహాలు లభ్యం కాగా, కొందరిని రక్షించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బస్సు.. ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 12 people dead, 15 rescued after a Maharashtra Roadways bus going from Indore to Pune falls off Khalghat Sanjay Setu in Dhar district, says Madhya Pradesh minister Narottam Mishra. pic.twitter.com/h4FuW2B3Ch — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022 -
లోయలో పడ్డ బస్సు, 22 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్ధామ్ యాత్రికుల బస్సు దమ్టా వద్ద లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22 యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టుగా తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చార్ధామ్ యాత్రికులు యమునోత్రి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. చదవండి👉🏻 వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the accident in Uttarakhand. The injured would be given Rs. 50,000 each. — PMO India (@PMOIndia) June 5, 2022 -
బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు....మిన్నంటిన రోదనలు
దేవుడా ఎంత పని చేశావయ్యా.. సంతోషంగా శుభకార్యానికి వెళ్తున్న వారిని ఎందుకింత నిర్దయగా కబళించావు.. మేము ఏం పాపం చేశామయ్యా.. ఇంత విషాదాన్ని మా కుటుంబాలకు మిగిల్చావు’ అంటూ బస్సు ప్రమాద బాధితులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద లోయలో బస్సు బోల్తాపడిన ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను అంబులెన్సుల్లో ధర్మవరానికి తీసుకురాగానే బాధితుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, ధర్మవరం టౌన్/ అర్బన్/ తనకల్లు/ కదిరిటౌన్/ పుట్టపర్తి: ధర్మవరంలోని ప్రముఖ పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు వేణు వివాహ నిశ్చితార్థ వేడుకలకు తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణమండపానికి బయల్దేరిన వారిని బస్సు ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. భాకరాపేట వద్ద లోయలో శనివారం రాత్రి బస్సు బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా, ఆదివారం సాయంత్రం మరొకరు చనిపోయారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మృతుల్లో ధర్మవరానికి చెందిన మలిశెట్టి మురళి (45), తమ్ముడు మలిశెట్టి గణేష్ (42), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ (38), బంధువు, పెళ్లిళ్ల పేరయ్య అయిన మలిశెట్టి వెంగప్ప (75), భార్య నాగలక్ష్మి (60), తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన జింకా చంద్ర కుమార్తె చందన (10), ధర్మవరానికి చెందిన బస్సు డ్రైవర్ నబీరసూల్ (42), కదిరికి చెందిన క్లీనర్ షకీల్ (22), మలిశెట్టి మురళి స్నేహితుడు, విలేకరి అయిన బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఆదినారాయణరెడ్డి (45) ఉన్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో కుటుంబంలో దంపతులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం మిగి ల్చింది. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు 33 మంది ఉన్నారు. కన్నీటి వీడ్కోలు.. బస్సు ప్రమాద మృతుల్లో ఎక్కువమంది ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. తిరుపతి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ మృతదేహాలను ఆదివారం అంబులెన్స్‌లో కొత్తపేట ఉషోదయ స్కూల్ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు బోరున విలపించారు. మృతదేహాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఏపీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డే బాలాజీ, దేవరకొండ రమేష్, గుండా ఈశ్వరయ్య సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గరుడంపల్లి సమీపాన మలిశెట్టి మురళి పొలంలో నిర్వహించిన ముగ్గురి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మలిశెట్టి వెంగప్పకు హిందూ శ్మశాన వాటికలోను, డ్రైవర్ నబీరసూల్‌కు ముస్లిం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కదిరిలో క్లీనర్ షకీల్, బుక్కపట్నం మండలం మారాలలో విలేకరి ఆదినారాయణరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి చందనకు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృత్యువులోనూ వీడని బంధం.. ధర్మవరం పట్టణానికి చెందిన మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ముగ్గురు అన్నదమ్ములూ పట్టుచీరల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. కానీ బస్సు ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. మురళి కుమారుడు వేణు (పెళ్లికొడుకు), భార్య లలితమ్మ, తమ్ముడు గణేష్ భార్య భైరవి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మురళి మృతితో అన్నదమ్ముల కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయినట్లయ్యింది. నీ వెంటే నేనూ.. ధర్మవరానికి చెందిన మలిశెట్టి వెంగప్ప శనివారం రాత్రి బస్సు ప్రమాదంలో మృతిచెందగా, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య నాగలక్ష్మి (60) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. భర్త మృతి చెందిన విషయం కూడా ఆమెకు తెలియకనే కన్నుమూసింది. అర్ధంతరంగా ముగిసిన విలేకరి జీవితం.. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ఆదినారాయణరెడ్డి 20 ఏళ్లుగా పత్రికారంగంలో విలేకరిగా పనిచేస్తున్నారు. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో ఆయన కుమారుడి నిశ్చితార్థానికి ఆదినారాయణరెడ్డి బస్సులో వెళ్లారు. అలా వెళ్లిన విలేకరి అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈయనకు భార్య గౌతమి, కుమార్తె మనీషా, కుమారుడు గణేష్‌రెడ్డి ఉన్నారు. అయ్యో ‘పాపం'.. ధర్మవరం కొత్తపేట నివాసి జింకా చంద్ర కుమార్తె జింకా చందన (10) స్థానిక మున్సిపల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. బంధువుల నిశ్చితార్థానికి వెళ్లి బస్సు ప్రమాదంలో చందన మృతి చెందింది. తండ్రి చంద్ర తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి సొంతూరు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్. ఛిద్రమైన పేదల బతుకులు బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ నబీరసూల్, క్లీనర్ షకీల్ నిరుపేదలు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాలు ఛిద్రమయ్యాయి. కదిరికి చెందిన క్లీనర్ షకీల్ అవివాహితుడు. నార్పల మండలం గూగూడుకు చెందిన డ్రైవర్ నబీరసూల్ 12 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం తాడిపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి ధర్మవరం చేరుకుని డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఇతని భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇతని సోదరుడు హైదర్‌వలి కూడా లారీడ్రైవర్‌గా వెళ్తూ 16 క్రితం ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. (చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!) -
భాకరాపేట ప్రమాద బాధితులను పరామర్శించిన పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మృతి చెందడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు భరోసా ఇచ్చారు. రుయాతో పాటు, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, రాత్రంతా అధికారులు స్పాట్లో ఉండి పర్యవేక్షించారని తెలిపారు. స్పాట్లో ఏడు మంది మృతి చెందారని, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని చెప్పారు. ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ఫ్యాక్చర్లు అయ్యాయని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్న వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై సమీక్షించారని వెల్లడించారు. ఇప్పటికే మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారని గుర్తుచేశారు. మంచి చికిత్స అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. తక్షణం స్పందించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. భాకరాపేట ఘాట్‌లో తక్షణం రైలింగ్ ఏర్పాటుకు ఆదేశిస్తాని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆ రోడ్డులో రైలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రూ. 1500 కోట్లతో అక్కడ నాలుగు లైన్లు రోడ్డు మంజూరు అయ్యిందని గుర్తుచేశారు. ఆ రోడ్డు నిర్మాణం సమయంలో పూర్తి స్థాయిలో పర్మనెంట్ రైలింగ్‌కు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాకరాపేట లోయలో పెళ్లి బస్సు బోల్తా ఘటనలో గాయపడ్డ వారిని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బస్సు బోల్తా ఘటనలో ఎనిమిది మంది మరణించగా 45 మంది క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రుయా ఆసుపత్రిలో ఒక అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. చదవండి: భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. -
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
చంద్రగిరి: ఓ పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు (కేఎల్30 ఏ 4995) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి (కోమలి శిల్క్ హౌస్) మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వేణుతో పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు 55 మంది శనివారం ఓ ప్రైవేట్ బస్సులో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయంలో మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. కాపాడండి సారూ.. అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. బస్సు పల్టీలు కొట్టడంతో ఆ కుదుపులకు కొందరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో బస్సు మొత్తం రక్తమయమైంది. అయ్యా.. కాపాడండి.. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడిపోగానే అందులో ఉన్న వారు భయంతో కేకలు పెట్టారు. కొందరు కిటికీల్లోంచి బయటకు వచ్చినా, చీకట్లో వారికేమీ కనిపించలేదు. చిన్న పిల్లలు గుక్క పట్టి ఏడుస్తుండగా, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. మరికొందరు బస్సులోనే చిక్కుకుపోవడంతో వారిని తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు భాకరాపేట, చంద్రగిరి పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కలెక్టర్ హరినారాయణన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షితరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 250 నుంచి 300 అడుగుల లోతు నుంచి క్షతగాత్రులను పైకి తీసుకొచ్చేందుకు వందలాది మంది పోలీసులు, రోప్ బృందాలు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున సాయపడాల్సి వచ్చింది. ఒకరిని పైకి తీసుకొచ్చేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. లైట్లు ఒకరు పట్టుకొని, మరొకరు తాడు సాయంతో.. ఇలా ప్రమాదకర స్థితిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం అతివేగమే కారణం ప్రమాదకరమైన మలుపులు ఉన్న భాకరాపేట ఘాట్ రోడ్డులో ఈ బస్సు డ్రైవర్ ఎక్కువ వేగంతో నడిపినట్లు సమాచారం. నిత్యం ఈ రహదారిలో వెళ్లే డ్రైవర్లు మాత్రమే వేగంగా వెళ్లడానికి వీలుంటుంది. అలాంటిది ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ అనుభవ రాహిత్యం వల్లే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి ముందు సమీపంలోని పెట్రోల్ బంకులో బస్సుకు డీజిల్ పట్టించారు. ఆ సమయంలో బస్సును ముందుకు కదిల్చే క్రమంలో ర్యాష్ డ్రైవింగ్‌పై పలువురు డ్రైవర్‌ను హెచ్చరించారు. జాగ్రత్తగా వెళ్లాలని చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే ఘాట్ మొదటి మలుపు వద్దే బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఐదు పల్టీలు కొట్టినట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఈ ఘటనలో వధూ వరుల కుటుంబాల వారు, బంధు మిత్రులు విషాదంలో మునిగిపోయారు. కాగా, 2000లో ఇదే ఘాట్‌లో ఓ పెళ్లి బృందం బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందారు. -
Guntur: ఫోన్ మాట్లాడుతుండగా బస్సు ఢీకొని యువకుడు మృతి
తాడేపల్లిరూరల్: సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుడివాడకు చెందిన పాలకొండ సుబ్రహ్మణ్యం (38) జుమోటాలో పనిచేస్తూ హైదరాబాద్‌లో నివాసముండేవాడు. వారి ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలో సీటు రావడంతో విజయవాడ బదిలీ చేయించుకున్నాడు. తాడేపల్లిలో విధులు ముగించుకుని విజయవాడ మొగల్రాజపురంలోని తన నివాసానికి వెళుతుండగా మార్గంమధ్యలో ఉండవల్లి సెంటర్ స్క్రూ బిడ్డి వద్దకు వచ్చేసరికి ఫోన్ రావడంతో బండి పక్కకు తీసి మాట్లాడుతుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు వచ్చి ఢీకొట్టింది. స్థానికులు కేకలు వేయడంతో బస్సు నిలిపివేయగా అప్పటికే సుబ్రహ్మణ్యం శరీరం మీదకు బస్సు వెనుక టైర్లు ఎక్కాయి. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి బస్సుకింద ఉన్న సుబ్రహ్మణ్యాన్ని తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాడు. చదవండి: ఒమిక్రాన్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళిక ఇదే..: ఆరోగ్య శాఖ -
రెప్పపాటులో 'ఘోరం'.. జల్లేరు వాగులో బస్సు బోల్తా
సమయం మధ్యాహ్నం 12 గంటలు.. పల్లె వెలుగు బస్సు ఓ వంతెనపై వెళుతోంది.దాదాపు నాలుగు గంటలుగా ప్రయాణం.. సాఫీగానే సాగుతోంది... మరో పావు గం టలో గమ్యస్థానం చేరుకోనుండటంతో ప్రయాణికులంతా సిద్ధంగా ఉన్నారు.. అంతలో.. హఠాత్తుగా పెద్ద కుదుపు.. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బ్రిడ్జిపైనే ఓవర్టేక్ చేసి బస్సు ముందుకు దూసుకొచ్చాడు.. అదుపు తప్పిన బస్సు డివైడర్‌ను ఎక్కి వంతెన ఎడమ వైపు రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టింది.. తేరుకునేలోపే బస్సు వాగులో పడిపోయింది.. పది ప్రాణాలు నీటిలో కలిశాయి.. పశ్చిమ గోదావరి జిల్లా వేగవరం వద్ద జల్లేరు వాగులో చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. ప్రముఖుల దిగ్భ్రాంతి బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. జంగారెడ్డిగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్, ఏలూరు టౌన్: కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకోవాల్సిన బస్సు ప్రయాణం కొన్ని కుటుంబాలకు అంతిమయాత్రగా మారింది. మృతుల కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో పది ప్రాణాలు పోయాయి. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారు జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. అక్కడున్న స్థానికులు తక్షణమే స్పందించగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను కాపాడటంతోపాటు వెంటనే ఆస్పత్రులకు తరలించి వైద్య సాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మరో రూ.2.5 లక్షల చొప్పున అదనంగా పరిహారాన్ని అందించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. భద్రాచలం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్న పల్లె వెలుగు బస్సు (ఏపీ 37 జడ్ 0193) జల్లేరు వాగు వంతెనపై ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ప్రమాదానికి గురైంది. ఉదయం 8 గంటలకు బయల్దేరిన ఈ బస్సులో 47 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో వాగులో నీరు నిండుగా ప్రవహిస్తోంది. క్షతగాత్రుల హాహాకారాలతో స్థానికులు వెంటనే స్పందించి కాపాడారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వీఆర్ ఎలీజా, తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జేసీ హిమాన్షు శుక్లా, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు సహాయ చర్యలను పర్యవేక్షించారు. జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు వద్ద సహాయక చర్యల్లో స్థానికులు ఆర్టీసీ తరఫున రూ.2.50 లక్షలు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన సేవలు అవసరమైతే తక్షణమే ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన వైద్యాన్ని ఆర్టీసీ పర్యవేక్షణలోనే అందిస్తామని తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి మృతులకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని, ఆర్టీసీ తరపున మరో రూ.2.50 లక్షలు అందచేస్తామని చెప్పారు. తొలుత వారిద్దరూ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రి వద్ద విలపిస్తున్న బాధితులు నిమిషాల వ్యవధిలో... ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 20 నిమిషాల్లోనే రెస్క్యూ అక్కడకు చేరుకుంది. క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎస్పీలు డాక్టర్ రవికిరణ్ తదితరులు ఆగమేఘాలపై అక్కడకు వెళ్లారు. సుమారు 4 గంటలకుపైగా శ్రమించిన రెస్క్యూ టీం వాగులో పడిన బస్సును మూడు భారీ క్రేన్ల సాయంతో వెలికి తీసింది. క్షతగాత్రులకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల వివరాలు.... పసుపులేటి రాజారావు (సూర్యారావుపాలెం–ఉండ్రాజవరం), కె.హరినాథ్‌బాబు (నల్లజర్ల), కవ్వాడి కామరాజు (గోపన్నగూడెం–అశ్వారావుపేట), సత్తెనపల్లి కృష్ణవేణి (తాళ్లపూడి), సత్తెనపల్లి పద్మారావు (తాళ్లపూడి), చోడేదేవి (పూసర్ల–వేలేరుపాడు), చోడే సీతమ్మ (పూసర్ల–వేలేరుపాడు), మల్లిడి సోమశేఖర్‌రెడ్డి (రామవరం–అనపర్తి), కోట మనీషా(కుక్కునూరు), కోట ముత్యాలు (కుక్కునూరు), ఎం.లక్ష్మి (జంగారెడ్డిగూడెం), కె.నాగమ్మ (దేవులపల్లి), పంపన శకుంతలదేవి (గొల్లగూడెం–ద్వారకాతిరుమల), కె.కీర్తి (నాగిగూడెం–కుక్కునూరు), కోట ప్రశాంతి (కుక్కునూరు), తాటి సుబ్బలక్ష్మి (తోటపల్లి–బుట్టాయగూడెం),కె.సులోచన (నాయుడుగూడెం– కుక్కునూరు), పాయం శివ (భద్రాచలం), పాయం రమేష్ (పండువారిగూడెం), ఉమ్మడి దుర్గ (టి.నర్సాపురం), జి.రవిశేఖర్ (కరిచెర్లగూడెం), పసుపులేటి మంగ (సూర్యారావుపాలెం), కేత వరలక్ష్మి, కండెల్లి స్వప్న (గోపాలపురం), ఉండ్రాజవరపు గీతికాన్షి (జి.కొత్తపల్లి–ద్వారకాతిరుమల). ఈత రావడంతో.. బస్సు ముందు సీట్లల్లో కూర్చున్నాం. హఠాత్తుగా వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం వేగంగా రావడంతో తప్పించే క్రమంలో వంతెనను ఢీకొని బస్సు వాగులో పడిపోయింది. ఈత రావడంతో వాగులో దూకి ప్రాణాలు కాపాడుకున్నాం. స్థానికులు, మత్స్యకారులు వెంటనే స్పందించి నాటు పడవలు, తాళ్ల సాయంతో గాయపడ్డ వారిని రక్షించారు. – శివ, రమేష్, భద్రాచలం (ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షులు) ఆర్డీవోతో విచారణ కమిటీ క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే ఆయన వెంటనే జంగారెడ్డిగూడెం చేరుకుని గాయపడ్డవారిని పరామర్శించారు. స్వల్ప గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ 9 మందికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై ఆర్డీవో స్థాయి అధికారితో కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 9 మంది ప్రయాణికులు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సీఎం జగన్ సానుభూతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాకు ఆదేశం సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ బాసట సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నట్లు పేర్కొన్నారు. బాధాకరం: మండలి చైర్మన్ సాక్షి,అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు వెనువెంటనే ప్రభుత్వం స్పందించి సత్వరంగా రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సకోసం జంగారెడ్డిగూడెం, ఏలూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారని పేర్కొన్నారు. ఘటనపై సత్వరమే స్పందించి, విచారణకు ఆదేశించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘోర బస్సు ప్రమాదం...19 మంది దుర్మరణం
Massive Bus Accident In Mexico: సెంట్రల్ మెక్సికోలో యాత్రికులను తీసుకువెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా మరో 32 మందికి గాయలైయ్యాయి. అయితే బస్సు బ్రేకులు కోల్పోయి మెక్సికో రాష్ట్రంలోని ఒక భవనంపైకి దూసుకెళ్లడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ప్రమాదం మెక్సికో సిటీకి నైరుతి దిశలో ఉన్న జోక్విసింగో టౌన్షిప్లో జరిగిందని రాష్ట్ర అంతర్గత కార్యదర్శి రికార్డో డి లా క్రూజ్ వెల్లడించారు. (చదవండి: ఆ పిల్లాడి కంటే ఈ కుక్క పిల్లే భలే మాట్లాడేస్తోంది!!!) ఈ మేరకు ఆయన ఈ బస్సు పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ నుండి శతాబ్దాలుగా రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే ఛల్మా పట్టణానికి వెళ్తోండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. అయితే గాయపడిన ప్రయాణికుల పరిస్థితిపై ఎటువంటి తక్షణ సమాచారం లేదన్నారు. పైగా చాలా మంది మెక్సికన్లు డిసెంబర్ 12, వర్జిన్ ఆఫ్ గ్వాడాలుపే రోజు సమీపిస్తున్న కొద్దీ మతపరమైన తీర్థయాత్రలకు వెళ్తుంటారని చెబుతున్నారు. అంతేకాదు వారు తరచుగా ఇరుకైన రోడ్లపై నడవడం, కాలం చెల్లిన బస్సులలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే 1521 ఆక్రమణకు ముందు హిస్పానిక్ పూర్వ కాలంలో ఛల్మా ఒక పవిత్ర ప్రదేశం. అంతేకాక స్పానిష్కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అజ్టెక్ దేవుడికి అంకితం చేయబడిన ఒక గుహలో ఒక శిలువ అద్భుతంగా కనిపించింది. దీంతో అప్పటి నుంచి ఈ ఛల్మా పేరుగాంచిన క్రైస్తవ తీర్థయాత్ర మారింది. అంతేకాదు పెద్ద ఎత్తున భక్తులు భక్తులు చల్మాను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. (చదవండి: కరోనా కొత్త వేరియంట్.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం) -
తప్పిన ప్రమాదం.. రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో తృటిలో బస్సు ప్రమాదం తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్ బ్రేకులు వేయడంతో బస్సు గాలిలో వేలాడుతూ ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. కాగా, పోలీసులు ట్రాఫిక్‌ను అదుపు చేస్తున్నారు. బస్సు కింద పడుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించేదని అధికారులు తెలిపారు. అనంతపురం నుంచి కర్నూలుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: 'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో -
TSRTC: జాతీయ రహదారిపై బస్సుబోల్తా..
సాక్షి, అలంపూర్(మహబూబ్‌నగర్): జాతీయ రహదారిపై ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైందనే సమాచారంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. జిల్లాలో గతంలో జరిగిన ఆర్టీసీ ప్రమాదాలు గుర్తుకు వచ్చి భయాందోళన చెందారు. పెద్ద ప్రమాదమే అయినప్పటికీ అందులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాల బారినపడిన వారిని కర్నూలుకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన ఉండవెల్లి మండలంలోని కంచుపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఘర్ దాబా వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఎస్ఐ జగన్మోహన్ కథనం ప్రకారం.. కాచిగూడకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో 36 మంది ప్రయాణికులతో కర్నూలు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఘర్ దాబాకు అతి సమీపంలో డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు మరో 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో డ్రైవర్ శ్యాం తీవ్రంగా గాయపడ్డాడు. రాముడు అనే ప్రయాణికుడికి ఎడమ చేయి విరిగిపోగా.. రవికుమార్, నర్సింహలతోపాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మానవపాడు 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడగా వెనకాల వస్తున్న కారు డివైడర్ రాడ్ తగిలింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా అందులో ఉన్న దంపతులకు ఎలాంటి గాయాలు కాలేదు. నిలిచిన రాకపోకలు.. జాతీయ రహదారిపై బస్సు బోల్తాపడంతో కర్నూలు– హైదరాబాద్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అనంతరం రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఒకేమార్గంలో రెండు వైపుల వాహనాలు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నారు. తర్వాత రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పోలీసులు క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాద స్థలాన్ని గద్వాల డిపో సీఐ దేవేందర్‌గౌడ్ పరిశీలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. -
తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం: ఇద్దరు మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు తిరుపతిలో బీభత్సం సృష్టించింది. కార్నాల వీధిలో బస్సు అదుపు తప్పి రోడ్డు మీద వెళుతున్న బైకుల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి అక్కడికక్కడే చెందారు. మూడు బైకులు ధ్వంసం అయ్యాయి. బస్సు తిరుపతి నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: సినిమాలో ఆఫర్ కోసం.. గొంతుకోసుకుని -
ఆర్టీసీ బస్ ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం భవానిపేట్ గ్రామ శివారులో కరీంనగర్ డిపో బస్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కండక్టర్ సహా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కరీంనగర్ నుంచి కామారెడ్డి వైపు వస్తుండగా భవానిపేట సమీపంలో ఓ బైక్ బస్‌కు అడ్డుగా వచ్చింది. దీంతో ఆ బైకును తప్పించబోయిన బస్ డ్రైవర్ పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని క్షతగాత్రులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో అంకుర్ సింగ్(మధ్యప్రదేశ్), చాంద్‌బీ, రామారెడ్డి, స్రవంతి(సిరిసిల్ల), జ్యోత్స్న(వీర్నపల్లి), బాలయ్య( ఎన్జీవోస్ కాలనీ కామారెడ్డి), పవన్ (కన్కల్), రజిత(కన్కల్), భారతి(బండ లింగంపల్లి), లక్ష్మీ నర్సింలు (కండక్టర్) గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: కారుతో ఢీ కొట్టి.. ఆపై గొడ్డలితో నరికి -
పెళ్లి బృందంతో బస్సు.. డ్రైవర్‌కి ఫిట్స్
భైంసాటౌన్ (ముథోల్): పెళ్లి బృందంతో వస్తున్న బస్సు అదుపు తప్పి చేలలోకి వెళ్లిన ఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రెంజల్ నుంచి భైంసాకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పెళ్లి బృందం వస్తున్నారు. ఈ క్రమంలో భైంసా శివారులోని హరియాలి పెట్రోల్ పంపు వద్దకు రాగానే డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో డ్రైవర్ చాకచాక్యంగా బస్సును చేలల్లోకి మళ్లించాడు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
వరంగల్ హైవేపై 2 ఆర్టీసీ బస్సులు ఢీ
సాక్షి, వరంగల్ అర్బన్: పండగపూట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. వివరాలు.. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 24మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లోయలో పడ్డ బస్సు: ఐదుగురి మృతి
ముంబై : బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడగా.. 35 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మహారాష్ట్ర, నందూర్బార్లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన ఓ బస్సు దాదాపు 40 మంది ప్రయాణికులతో మల్కాపూర్ నుంచి సూరత్ వెళుతోంది. బుధవారం ఉదయం నందుబార్‌లోని ఖాంఛౌన్ దార్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అదుపుతప్పి పక్కనే ఉన్న 80 అడుగుల లోయలోకి పడిపోయింది. ( 60 గంటలు దాటినా దొరకని దీక్షిత్ ఆచూకీ ) దీంతో బస్సు డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అత్యవసర వైద్యం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
సాక్షి, ఖమ్మం : తెలంగాణ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తల్లాడ మండలం మెట్టుపల్లి గ్రామ సమీపంలో సత్తుపల్లి నుంచి సుమారు 30 మంది ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా బస్సు డ్రైవర్ క్యాబిన్ ఇరుక్కుపోయాడు. ప్రమాదం గమనించిన దగ్గరలోని గ్రామస్తులు అక్కడకు చేరుకొని డ్రైవర్ని బయటకు తీశారు. అనంతరం 108 ద్వారా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరిస్థిత కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదం బ్రిడ్జిపై జరగటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. -
ఉత్తరప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రెండు స్టేట్ రోడ్‌వేస్ బస్సులు ఒకదానికితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. 12 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. లక్నో నగర శివార్లలోని కకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్‌వేస్ బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొట్టాయి. ఇంతలో ఒక ట్రక్కు అదుపు తప్పి వాటి సమీపంలోకి వెళ్లడంతో దాని డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి అని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని కింగ్‌జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కకోరి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్ ఎం ఖాసి అబిది తెలిపారు. (చదవండి: ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే!) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లక్నో నుంచి వస్తున్న బస్సు, ట్రక్కును అధిగమించడానికి ప్రయత్నించింది. ఆ సయమంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది’ అని తెలిపాడు. ప్రమాదం జరగినప్పుడు అక్కడే ప్రయాణిస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు కూడా గాయపడ్డాడు. రెండు బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొట్టడం చూసి తనకు కళ్లు తిరగాయని.. నియంత్రణ కోల్పోవడంతో తనకు కూడా ప్రమాదం జరిగిందని ట్రక్కు డ్రైవర్ తెలిపాడు. -
ఒడిశాలో బస్సుకు షాక్..
భువనేశ్వర్: ఒడిశాలో ఓ బస్సుపై 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడటంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా.. 34 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గంజాం జిల్లా గోళాంతర ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. 45 మంది ప్రయాణికులతో జంగల్పాడు నుంచి చికరాడ వెళ్తున్న బస్సు మందరాజ్పూర్ వద్ద విద్యుదాఘాతానికి గురైంది. బస్సులోని వారంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తున్నారని బెర్హంపూర్ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవో) సర్దార్ జయంత్‌కుమార్ మహాపాత్ర వెల్లడించారు. మృతులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పద్మనాభ బెహరా తెలిపారు. -
ప్రజా చక్రమే చిదిమేస్తోంది!
సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. సిటీ బస్సు టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనాను చిదిమేయడంతో ఇద్దరు చిన్నారులకు తల్లి దూరమైంది. మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన నగరవాసులను కలచి వేసింది. ఇది ఒక్కటనే కాదు.. సిటీ ఆర్టీసీ టెర్రర్ జాబితాలో ఏటా వందల కేసులు చేరుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 2,225 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... వాటిలో ఆర్టీసీ బస్సులతోనే 107 చోటుచేసుకున్నాయి. కండిషన్ తప్పిన బస్సులకు తోడు ఆర్టీసీ సమ్మె కారణంగా వచ్చిన తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. నాలుగో స్థానం... నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రమాదకారకాలుగా మారుతున్న వాహనాలకు సంబంధించి ప్రతిఏటా జాబితా రూపొందిస్తారు. ఇందులో ద్విచక్ర వాహనాల నుంచి గుర్తుతెలియని వాహనాల వరకు 13 కేటగిరీలు ఉన్నాయి. ఈ పట్టికలో ఆర్టీసీ బస్సులు నాలుగో స్థానాన్ని ఆక్రమించాయి. తొలి మూడు స్థానాల్లో ద్విచక్ర, తేలికపాటి, త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. చివరకు అత్యంత ర్యాష్‌గా ప్రయాణిస్తాయని భావించే డీసీఎంల కంటే ఆర్టీసీ బస్సులే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాత్రయిందంటే రెచ్చిపోయి ప్రయాణించే ప్రైవేట్ బస్సులతోనూ చూసినా... ప్రమాదకారకాలుగా మారే విషయంలో ఆర్టీసీ కంటే అవే మిన్నగా ఉన్నాయి. ఉల్లంఘనల్లోనూ ముందే.. సాధారణ పరిస్థితుల్లోనే సిటీలో ఆటోల తర్వాత ఆ స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేది ఆర్టీసీ బస్సులేనన్నది పోలీసు అధికారుల మాట. వీటివల్లే అనేక చోట్ల ఇబ్బందులు వస్తున్నాయన్నది ఇప్పటికే అనేకసార్లు చర్చనీయాంశమైంది. ఆర్టీసీ డ్రైవర్లు పాల్పడుతున్న ఉల్లంఘనల్లో బస్‌బేల్లో పార్క్ చేయకపోవడం, స్టాప్‌లైన్ క్రాసింగ్, సిగ్నల్ జంపింగ్, స్పీడ్ టర్నింగ్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఇవే ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు బస్సులు నడుపుతుండడం, కాలం చెల్లిన బస్సులు ఫిట్నెస్ కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. మూడేళ్లలో ఆర్టీసీ ప్రమాదాలు ఇలా... ఏడాది ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2017 120 33 98 2018 149 35 126 2019(నవంబర్25 వరకు) 107 25 104 డొక్కులు..తుక్కులు సాక్షి, సిటీబ్యూరో: అసలే లారీలు, ట్రాక్టర్లు నడిపే డ్రైవర్లు.. ఆపై రెండు నెలలుగా ఎలాంటి మరమ్మతులు, నిర్వహణ లేని బస్సులు.. పైగా వాటిలో సగం డొక్కువే.. ఇంకేముంది యమదూతల్లా జనంపైకి దూసుకొస్తున్నాయి. ప్రమాదాలతో హడలెత్తిస్తున్నాయి. నగరంలో గత 53 రోజుల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఓవైపు డ్రైవర్ల నిర్లక్ష్యం.. మరోవైపు మరమ్మతులకు నోచని బస్సులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కార్మికుల సమ్మె కారణంగా బస్సుల నిర్వహణ పూర్తిగా స్తంభించింది. ప్రతి బస్సుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, అవసరమైన మరమ్మతులు చేయాల్సిన మెకానిక్‌లు, శ్రామికులు, ఫోర్‌మెన్ స్థాయి ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఏ బస్సులో? ఎలాంటి సమస్యలు? ఉన్నాయో గమనించేవారు లేకుండా పోయారు. ఇలాంటి బస్సులు ఇప్పుడు తాత్కాలిక డ్రైవర్ల చేతుల్లో నడుస్తున్నాయి. ప్రతిరోజు ఇసుక లారీలు, ట్రాక్టర్లు నడిపే సరకు రవాణా డ్రైవర్లు ప్రయాణికుల కోసం వినియోగించే ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సమ్మె మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 36 ప్రమాదాలు జరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా డివైడర్‌కు ఢీకొట్టడం లాం టివి కొన్నయితే, వాహనదారులను ఢీకొట్టినవి మరికొన్ని. గత నెలలో ఛే నంబర్ వద్ద, మూసారాంబాగ్ లో ఆర్టీసీ బస్సులు అదుపు తప్పి ఢీకొట్టడంతో ఇద్దరు బైక్ రైడర్లు చనిపోయారు. తాజాగా బంజారాహిల్స్ లో మరో మహిళ మృత్యువాత పడ్డారు. బస్సు ఫిట్నె స్ బాగానే ఉందని, బ్రేకులు ఫెయిల్ కాలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ... గత రెండు నెలలుగా నిలిచిపోయిన నిర్వహణపరమైన సేవల కారణంగా సిటీ బస్సులు ఎప్పుడు? ఎక్కడ? ఏ వాహనాన్ని ఢీకొంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. షెడ్యూలింగ్ సేవలు ఇలా... బస్సులకు 3 రకాలుగా తనిఖీలు, మరమ్మతులు చేస్తారు. ఆ వివరాలివీ... షెడ్యూల్–1: డ్యూటీ ముగిసి డిపోకు చేరిన బస్సును మెకానిక్‌లు ప్రతిరోజు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. బస్సు జాయింట్స్, బోల్టులు, సౌండ్ సిస్టమ్ వంటివి పరిశీలిస్తారు. డ్రైవర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి మరమ్మతులు చేస్తారు. షెడ్యూల్–2: ఇందులో భాగంగా ప్రతి వారం/ పది రోజులకు ఒకసారి బస్సులను పూర్తిగా తనిఖీ చేస్తారు. ఐదుగురు మెకానిక్‌లు కలిసి ఈ పని చేస్తారు. ఇందులో ఇంజిన్ మెకానిక్, కోచ్ మెకానిక్, టైర్ మెకానిక్, ఎలక్ట్రికల్ మెకానిక్, కోచ్ బిల్డర్లు భాగస్వాములవుతారు. అవసరమైన విడిభాగాలను అమర్చుతారు. ఒకవేళ విడిభాగాల కొరత ఉంటే ఆ బస్సులను బయటకు తీయకుండా మెకానిక్ పనులు పూర్తయ్యే వరకు డిపో గ్యారేజీలోనే ఉంచుతారు. షెడ్యూల్–3: ప్రతి 40 రోజులకు ఒకసారి ఓవర్హాలిం గ్ పనులు జరుగుతాయి. బస్సు ఇంజిన్ సహా అన్నిం టినీ చెక్ చేసి సమూలమైన మరమ్మతులు చేస్తారు. దీంతో బస్సు అన్ని విధాలుగా ఫిట్‌గా ఉంటుంది. -
రెప్పపాటులో చావు వరకూ వెళ్లి.. బతికాడు!
తిరువనంతపురం: కళ్లముందే మృత్యు ఘడియలు నృత్యం చేసిన భయానక అనుభవం కేరళలోని ఓ వ్యక్తికి ఎదురైంది. రెప్పపాటులో మరణం అంచుకు వెళ్లి బతికి బయటపడ్డాడు ఆ యువకుడు. వివరాల్లోకి వెళితే.. కేరళ కోజికొడ్‌లోని ఎంగపుజా ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ వీరంగం సృష్టించాడు. బస్‌ను ఫుట్‌పాత్‌కు దగ్గర అతివేగంగా నడిపాడు. అదే సమయంలో రోడ్డును దాటడానికి ప్రయత్నించిన ఓ స్కూటరిస్ట్ అనుకోకుండా ఒక్కసారిగా బస్సు కింద పడ్డాడు. అయితే బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో.. బస్సు.. స్కూటర్‌ను చాలా దూరం వరకు లాక్కొని పోయింది. దీంతో ఆ వ్యక్తి బస్సు టైరులో చిక్కుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. బస్సు కొంచం వేగం తగ్గాక అతడు అందులో నుంచి బయట పడ్డాడు. ఈ సంఘటనలో బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫుట్‌పాత్ మీద ఉన్న రెండు బైకులు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు ఫుట్‌పాత్ పక్కన ఓ దుకాణంలో అమర్చిన సీసీ టీవీలో రికార్డు అయింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. కాగా కేరళలో రోజుకు సమారు 12 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలన్ని అతి వేగం కారణం జరుగుతున్నాయని తెలుస్తోంది. -
ప్రాణం తీసిన అతివేగం
సాక్షి, వీరఘట్టం/పాలకొండ రూరల్: ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తొమ్మిది మంది మత్స్యకారులను క్షతగాత్రులుగా చేసింది. కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలైన వీరి రోదనతో వీరఘట్టం సమీప వెంకమ్మ చెరువు ప్రాంగణం ఒక్కసారిగా భయకంపితంగా మారింది. ఈ చెరువులో చేప పిల్లలను వదిలేసి రోడ్డుపైన చేప పిల్లల వ్యాన్‌లో తిరిగి వెళ్లి పోదామనుకున్న తరుణంలో అతివేగంతో వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు వెనుక నుంచి బలంగా వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మత్స్యకారుడు గంటా లక్ష్మణరావు(46) బస్సు వెనుక చక్రం కింద పడి నుజ్జునుజ్జయి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఇలా ప్రమాదం... సీతంపేట ఐటీడీఏ గిరిజన మత్స్యకారులకు సబ్సిడీపై చేప పిల్లలను అందజేస్తోంది. ఇందులో భాగంగా వీరఘట్టం సమీపంలో వెంకమ్మ చెరువుకు చేప పిల్లలను బూర్జ మండలం మదనాపురం తీసుకువచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో వచ్చిన చేపల వ్యాన్‌లో చేప పిల్లలను వీరఘట్టం, నీలానగరం మత్స్యకారులందరూ చెరువులో విడిచిపెట్టారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు వ్యాన్ సమీపంలో చేప పిల్లల లెక్కలను సరిచూసుకుంటున్నారు. ఇంతలో వెనుక నుంచి అతి వేగంతో వచ్చిన బస్సు వ్యాన్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో విలవిల.. వీరఘట్టానికి చెందిర మారుబిల్లి జగన్ తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. నీలానగరానికి చెందిన ఎస్ సింహాచలం, అల్లు కనకారావు తీవ్రంగా గాయపడటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరఘట్టం కొండవీధికి చెందిన గురిబిల్లి పోలిరాజు కుడిచేయి విరిగిపోయి, తలకు తీవ్ర గాయమైంది. గుండా దాసుకు, చేపల పంపిణీ చేసిన బీ అప్పన్నదొర, సవర గంగాధర్, వ్యాన్ డ్రైవర్ సవర దుర్గారావుతోపాటు సీతంపేటకు చెందిన ఫిషర్మెన్ బెవర సత్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో వీరంతా గాయాలతో విలవిల్లాడారు. ప్రస్తుతం పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నీలానగరంలో విషాదం... చెరువులో చేప పిల్లలను వదిలేసి మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి వచ్చేస్తానని చెప్పిన భర్త లక్ష్మణరావు మృతి చెందాడని తెలియడంతో భార్య లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. మృతుడి స్వగ్రామం నీలానగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాలకొండ ఏరియా ఆస్పత్రిలో లక్ష్మణరావు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై వీరఘట్టం ఎస్ఐ ఎం మధుసూదనరావు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
ప్రయివేట్ బస్సు బోల్తా, 15మందికి గాయాలు
-
యూపీలో ఘోరం
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లక్నో నుంచి ఢిల్లీకి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాల్వలో పడిపోవడంతో 29 మంది ప్రయాణికులు ప్రాణాలుకోల్పోయారు. 18 మంది గాయపడ్డారు. యూపీలోని అవథ్ డిపోకు చెందిన ‘జనరథ్’ బస్ లక్నో నుంచి ఢిల్లీలోని ఆనంద్‌విహార్ బస్‌స్టేషన్‌కు బయల్దేరింది. సోమవారం వేకువజామున 4 గంటలవేళ ఎత్మద్‌పూర్ సమీపంలో అదుపు తప్పిన బస్సు రైలింగ్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న నాలాలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో మునిగి ఉండటం, నాలాలో సుమారు 8 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. గాయపడిన ప్రయాణికులను రక్షించగలిగారు. కొన్ని మృతదేహాలు కొట్టుకుపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన 29 మందిలో 19 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 18 మంది క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. పూర్తిగా నుజ్జయిన బస్సును కాల్వ నుంచి బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ‘టూ టయర్ స్లీపర్ కోచ్ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై నుంచి అదుపు తప్పి ఝర్నా నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది చనిపోగా 18 మంది గాయపడ్డారు’ అని యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఘటనా స్థలికి చేరుకుని, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సాయం తక్షణమే అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరిపి 24 గంటల్లో నివేదిక అందజేయాలని సీఎం ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించింది. నోయిడాను ఢిల్లీ శివార్లలోని ఆగ్రాతో కలిపే 165 కిలోమీటర్ల ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. విశాలమైన ఈ రహదారిపై వాహనాల అతివేగం కారణంగా, ముఖ్యంగా రాత్రివేళ, వేకువజామున ఎక్కువగా సంభవిస్తున్నాయని రోడ్డు భద్రత నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. బస్సు నుంచి మృతదేహాలను బయటకు తెస్తున్న పోలీసులు -
ఆర్టీసీ బస్సు- ఇసుక లారీ ఢీ
-
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మొయింజా మార్కెట్ సర్కిల్లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. సిగ్నల్ మలుపు వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ఆర్టీసీ బస్సు బోల్తాకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
ఘోర బస్సు ప్రమాదం; 35 మంది మృతి!
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 35 మంది మృతిచెందగా.. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కిష్టావర్ నుంచి కేశ్వాన్‌కు బయల్దేరిన మినీబస్సు మలుపు తీసుకునే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ విషాదకర ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. -
ఘోర ప్రమాదం.. 12 మంది భారతీయుల మృతి..!
దుబాయ్: దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల్లో 12 మంది భారతీయులు ఉన్నారు. మరో తొమ్మిది మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గురువారం సాయంత్రం దుబాయ్‌లో జరిగిన ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఒమనీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మసాలత్‌కు చెందిన బస్సు 31 మంది ప్రయాణికులతో గురువారం ఒమన్ రాజధాని మస్కట్ నుంచి దుబాయ్‌కు బయల్దేరింది. బస్సు సరిగ్గా రషిదీయా మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ్నుంచి బస్సుల కోసం నిర్దేశించిన రోడ్డు మార్గంలో కాకుండా ఇతర వాహనాల కోసం నిర్దేశించిన రోడ్డు లేన్‌లోకి వేగంగా దూసుకెళ్లి ఎత్తైన బారికేడ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయుల మృతిపట్ల దుబాయ్‌లోని భారత కాన్సూల్ జనరల్ విపుల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయుల మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం భూటాన్‌లో పర్యటిస్తున్న విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బాధిత కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రషీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు భారతీయుల్ని డిశ్చార్జి చేసినట్లు కూడా కాన్సూల్ జనరల్ ప్రకటించింది. -
అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
-
లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. కు నల్లా ప్రాంతంలోని రాంనగర్-ఉధంపూర్ రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 28 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికితీసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. -
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం
-
తండ్రి, కూతురిని చిదిమేసిన ఆర్టీసీ బస్సు
పుల్కల్(అందోల్): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురు మృతి చెందిన విషాదకరమైన సంఘటన మండల పరిధిలోని శివంపేట బ్రిడ్జిపై జరిగింది. ప్రమాదంలో చిన్నారి తల్లితోపాటు వారి బంధువైన మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పుల్కల్ ఎస్ఐ ప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేక్మాల్ మండలం కాదులూర్ గ్రామానికి చెందిన రమేశ్(28), అతడి భార్య లక్ష్మి, మూడేళ్ల కూతురు మీనాక్షి, అక్క కొడుకు శ్రీహరిని తీసుకొని బైక్‌పై కూకట్పల్లి వెళ్లేందుకు బుధవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరాడు. వారు శివంపేట బ్రిడ్జి వద్దకు రాగానే సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్, అతడి కూతురు మీనాక్షి బస్సు కింద పడ్డారు. తనతో పాటు మేన అల్లుడు శ్రీహరి బస్ తగిలిన వెంటనే కింద పడిపోయామని ఆసుపత్రికి వచ్చే వరకు ఏం జరిగిందో తెలియదని లక్ష్మి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో గాయపడిన శ్రీహరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. లక్ష్మి ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతోంది. రమేశ్, మీనాక్షి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా బ్రిడ్జిపై ప్రమాదం చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సంగారెడ్డి రూరల్ పోలీసులతోపాటు ట్రాఫిక్ సీఐ, పుల్కల్ ఎస్ఐలు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
విజయవాడ: కృష్ణలంక జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి కిందపడ్డాడు. అదే సమయంలో వెనక నుంచి వస్తోన్న ఆర్టీసీ బస్సు వ్యక్తిపై నుంచి దూసుకెళ్లింది. 108 అంబులెన్స్ రావడంలో ఆలస్యం కావడంతో తీవ్రరక్తస్రావం జరిగి సంఘటనాస్థలంలోనే ఆ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు బాలాజీనగర్‌కు చెందిన వెంకటేశ్వరరావుగా గుర్తించారు. -
విహారయాత్ర విషాదాంతం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దపోలీ ప్రాంతం నుంచి పర్యాటక కేంద్రమైన మహాబలేశ్వర్కు వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి 500 అడుగుల లోతున్న లోయలోకి పడిపోవడంతో 33 మంది ప్రయాణికులు చనిపోగా ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత అతను లోయ నుంచి పైకివచ్చి అధికారులకు సమాచారం అందించడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బండరాళ్ల ధాటికి బస్సు తుక్కుతుక్కు కావడం, మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోవడంతో ఈ ప్రాంతంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఈ విషయమై రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. దపోలీలోని కొంకణ్ వ్యవసాయ వర్సిటీకి చెందిన 34 మంది సిబ్బంది శనివారం మహాబలేశ్వర్కు ఓ బస్సులో విహారయాత్రకు బయలుదేరారని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఆంబెనలి ఘాట్ సమీపంలోని ఓ మలుపు వద్దకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణను కోల్పోయాడని వెల్లడించారు. దీంతో బస్సు 500 అడుగుల లోతున్న లోయలోకి పల్టీలు కొడుతూ జారిపోయిందన్నారు. బస్సు నుజ్జునుజ్జు కావడంతో 33 మంది ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని విజయ్ తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డ ప్రకాశ్ సావంత్ దేశాయ్ అనే వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అధికారులకు సమాచారాన్ని అందించాడన్నారు. దీంతో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. తొలుత విహారయాత్రకు 40 మంది వెళ్లాలనుకున్నప్పటికీ.. బస్సు చిన్నదిగా ఉండటంతో పలువురు రాలేకపోయారనీ, దీంతో వారి ప్రాణాలు దక్కాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ సంతాపం ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘రాయ్‌గఢ్ జిల్లాలో జరిగిన ప్రాణనష్టంతో తీవ్ర ఆవేదన చెందుతున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని మోదీని ఉటంకిస్తూ ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాల సహాయ సహకారాలను అందించాలని స్థానిక కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనారోగ్యమే ప్రాణం కాపాడింది.. అనారోగ్యం కూడా కొన్నిసార్లు మంచి చేస్తుందంటే ఇదేనేమో! కొంకణ్ వర్సిటీలో పనిచేస్తున్న ప్రవీణ్ రణ్దివే కూడా శనివారం ప్రమాదానికి గురైన బస్సులో విహారయాత్రకు వెళ్లాల్సి ఉంది. అందుకు ఆయన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ‘మహాబలేశ్వర్కు వెళ్లడానికి సిద్ధమయ్యాక నా ఆరోగ్యం దెబ్బతింది. దీంతో టూర్‌కు రాలేనని చెప్పాను. దారిపొడవునా ఉన్న ప్రకృతి అందాల ఫొటోలను వారంతా మా వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ల నుంచి చివరి మెసేజ్ ఉదయం 9.30 గంటలకు అందింది. తాము టిఫిన్ చేసేందుకు దిగుతున్నామని మిత్రులు చెప్పారు. తర్వాత వాళ్ల బస్సు ప్రమాదానికి గురైందని శనివారం మధ్యాహ్నం నాకు తెలిసింది’ అని ప్రవీణ్ చెప్పారు. ఒకే ఒక్కడు ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి ప్రకాశ్ దేశాయ్ మాట్లాడుతూ.. రోడ్డుపై ఉన్న బురద కారణంగా బస్సుకు పట్టుదొరక్క లోయలోకి పడిపోయిందన్నారు. ‘బస్సు వెళుతున్న రోడ్డంతా బురదమయంగా ఉంది. ఘాట్ మార్గంలో ఉన్న రాళ్లు అంత పటుత్వంతో లేవు. ప్రమాదం జరిగినప్పుడు జల్లులు పడుతున్నాయి. రోడ్డుపై వెళుతున్న మా బస్సు తొలుత కొద్దిగా ఎడమవైపుకు వంగింది. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే వేగంగా లోయలోకి జారిపోవడం మొదలుపెట్టింది. బస్సు వేగాన్ని చెట్లు అడ్డుకున్నాయి. మా వాహనం లోయలోకి దూసుకెళుతుండగా నేనెలాగో దూకేయగలిగాను. ఆ తర్వాత రోడ్డుపైకి రాగానే చాలామంది వాహనదారులు అక్కడే ఆగిఉన్నారు. వాళ్లలో ఒకరు నాకు ఫోన్ అందించడంతో వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చాను’ అని దేశాయ్ పేర్కొన్నారు. లోయలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు -
ఎంత ఘోరం!
స్కూలు వదిలారు.. బిలబిలమంటూ పిల్లలు బస్సు చుట్టూ చేరారు.. సీటు కోసం ఎగబడుతున్న చిన్నారులు బ్యాగులను బస్సులో వేస్తున్నారు.. ఇంతలో గుండెలు పిండేలా ఆర్తనాదం.. ఎక్కే ప్రయత్నంలో కాలు జారిన విద్యార్థిపైకి వెనక్కి మళ్లుతున్న బస్సు చక్రాలు ఎక్కేశాయి.. కొత్త స్కూల్లో చేరి ఇంకా రెండు వారాలు కూడా కాకముందే పదకొండేళ్ల చిన్నారి విగత జీవిగా మిగిలాడు.. రావికమతం, బుచ్చెయ్యపేట (చోడవరం): పిల్లలిద్దరినీ ఆ ఊళ్లో రామలక్ష్మణులని పిలుస్తారు.. అన్న మరుపాక మోడల్ స్కూల్లో చదువుతున్నాడని తమ్ముడినీ అదే స్కూల్లో చేర్చారు.. ముద్దులొలికే వారిద్దరినీ విధి విడదీసింది. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ప్రమాదవశాత్తూ బస్సు కింద పడి మరుపాక మోడల్ స్కూల్ విద్యార్ధి గుంటల అశోక్ (11) గురువారం సాయంత్రం మృతి చెందాడు. బుచ్చెయ్యపేట మండలం చిట్టియ్యపాలెం గ్రామానికి చెందిన గుంటల నూకరాజు, వరహాలమ్మల చిన్న కొడుకు అశోక్ ఆరో తరగతి చదువుతున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అన్నయ్య శివతో కలిసి ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులో స్కూలుకు వెళ్లి వస్తుంటాడు. గురువారం సాయంత్రం విద్యార్ధులను తీసుకువెళ్లేందుకు బస్సు వచ్చి స్కూల్ వద్ద వెనక్కు మళ్లిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అశోక్ గట్టిగా కేకలు వేయడంతో అంతా వచ్చి గాయాలైన ఆ విద్యార్ధిని హుటాహుటిన నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. అశోక్ ఒంటిపై గాయాలేవీ లేనప్పటికీ బస్సు మీదకు ఎక్కేస్తుందని ఆందోళన చెంది గుండె ఆగిపోయి ఉంటుందని వైద్యులు చెప్పారు. రావికమతం పోలీసులు బస్సును స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామలక్ష్మణులను విడదీశావా దేవుడా.. అశోక్ బస్సుకింద పడి తీవ్రగాయాల పాలై మృతి చెందిన వార్తను తెలుసుకున్న అశోక్ తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన ఆటోల్లో స్కూల్ వద్దకు వచ్చారు. అప్పటికే మృతి చెందిన వార్త తెలుసుకున్న వారు గుండెలవిసేలా రోదించారు. బిడ్డలిద్దరూ రామలక్ష్మణుల్లా స్కూల్‌కు వచ్చేవారనీ, ఇద్దరిలో ఒకరిని విడదీశావా దేముడా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. చెదిరిన కల నూకరాజు, వరహాలమ్మ నిరు పేదలు. ఎటువంటి ఆస్తులు లేకపోవడంతో కూలి పనులు చేసికుని ఇద్దరు కుమారులను చదివించుకుంటున్నారు. వారిద్దరినీ ప్రయోజకుల్ని చేయాలని ఎన్నో కలలు కన్నారు. మూడేళ్ల క్రితమే పెద్ద కుమారుడు శివను రావికమతం మండలం మరుపాక మోడల్ స్కూల్ జాయిన్ చేయగా.. ఇటీవల ఐదో తరగతి పూర్తి చేసిన అశోక్‌ను కూడా అదే పాఠశాలలోనే చేర్చారు. పది రోజుల కిందటే పాఠశాలలో జాయిన్ అయిన అశోక్ అన్నయ్యతో కలిసి గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. అశోక్ మృతితో తోటి విద్యార్ధులతోపాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు భోరున విలపిస్తున్నారు. పొట్టకూటి కోసం అశోక్ తండ్రి నూకరాజు హైదరాబాద్‌లో కూలిపనుల కోసం నెల రోజుల కిందట వెళ్లాడు. అశోక్ సర్పంచ్ కూరాకుల ముత్యాలరావుకు స్వయాన మేనల్లుడు. ప్రమాద సంఘటన తెలిసుకుని ప్రయాణంలో ఉన్న ఆయన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వెళ్లి తన మేనల్లుడు మృతదేహాన్ని చూసి విలపించాడు. -
ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 44 మందికి పైగా మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పౌరీ-ఘడ్వాల్ జిల్లాలోని పిపాలి-బౌనా జాతీయ రహదారిపై నానిదాడా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు భోవన్ నుంచి రామ్‌నగర్ వెళ్తుండగా అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.ఘటన గురించి తెలియగానే హూటాహూటిన రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృత దేహాలను వెలికి తీశారు. ప్రధాని దిగ్భ్రాంతి.. ఘటనా స్థలంలో 35 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. -
విషాద ప్రయాణం
వేములపల్లి (మిర్యాలగూడ) : ప్రైవేట్ ట్రావెల్ బస్సు పల్టీ కొట్టిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి శివారులోని నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీగాయత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 04వై 7181)లో 28 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌తో సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా చీరాలకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు బస్సు నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతానికి చేరుకునే సరికి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ దిమ్మెలను ఢీకొట్టి రహదారి పక్కన ఉన్న వ్యవసాయ భూమిలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన యలమల సుబ్బరావమ్మ(55), అదేజిల్లాకు చెందిన మార్టూరు మండలం బొబ్బాయిపల్లి గ్రామానికి చెందిన బిల్లి నాగేశ్వర్రావు(31) అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బరావమ్మ హైదరాబాద్‌లోని తన అన్న ఇంటికి వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వెళ్తోంది. నాగేశ్వరరావు హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తూ.. తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుపాటి శ్రీనివాసప్రసాద్, చంద్రవాణి దంపతులు, నర్సరావుపేటకు చెందిన రాగ విజయలక్ష్మీతో పాటు ఆమె కుమారుడు మనీష్‌కార్తీక్‌రెడ్డి, తల్లి గుంటా సుబ్బమ్మకు స్వల్పగాయాలయ్యాయి. ఏరియా ఆస్పత్రిలో బాధితులు.. బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎస్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, మాడ్గులపల్లి ఎస్ఐ విజయ్‌కుమార్, మిర్యాలగూడ టూటౌన్ ఎస్ఐ శేఖర్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఐదుగురిని 108లో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సుబ్బరావమ్మ, నాగేశ్వర్రావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి సంఘటన స్థలానికి చేరుకని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రయాణికుడు శ్రీహర్షారెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్వగ్రామానికి వస్తూ మృత్యువాత మార్టూరు: మండలంలోని బబ్బేపల్లికి చెందిన బిల్లి నాగేశ్వరరావు (32) బేల్దారు పని చేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సోమవారం రాత్రి నాగేశ్వరరావు స్వగ్రామం బయలుదేరాడు. నల్లగొండ జిల్లాలో బస్సు బోల్తాపడిన ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మరణించాడు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్వగ్రామం బబ్బేపల్లి తరలించారు. నాగేశ్వరరావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కారంచేడు: మండలంలోని స్వర్ణ గ్రామానికి గ్రామానికి చెందిన యలవల సుబ్బరావమ్మ (53) రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నివాసముంటున్న తమ్ముడు వద్దకు తన తల్లిని వదిలి వచ్చేందుకు వెళ్లిందని కుటుంబసబ్యులు తెలిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్ ఎక్కింది. నల్లగొండ జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆమె భర్త సాంబయ్య హుటాహుటిన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి తమ్ముడు కూడా సంఘటనా స్థలానికి వచ్చాడు. మృతదేహాన్ని స్వర్ణకు తరలిస్తున్నారు. నిద్రమత్తులో ఉండగా పెద్ద శబ్దం వచ్చింది.. నేను హైదరాబాద్ నుంచి స్వగ్రామం చీరాలకు లక్ష్మీగాయత్రి ట్రావెల్స్ బస్సులో బయలుదేరాను. ప్రయాణికులందరూ నిద్రమత్తులో ఉన్నారు. తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సు పెద్ద శబ్దంతో రెండు పల్టీలు కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడుతూ చెల్లాచెదురయ్యారు. బస్సు ముందు వరుసలో కూర్చున్న మహిళ బస్సులో ఇరుక్కుని మృతిచెందింది. వెనుక భాగంలో ఉన్న మరో ప్రయాణికుడు కూడా మృతిచెందాడు. మిగతావాళ్లం స్వల్పగాయాలతో బయటపడ్డాం. – వారి శ్రీహర్షారెడ్డి, బస్సు ప్రయాణికుడు, చీరాల -
డివైడర్‌ను ఢీకొట్టి బస్సు బోల్తా
మైన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 25 మంది గాయాలపాలయ్యారు. మైన్‌పురి జిల్లా కల్లూ కీ మంధియా గ్రామం వద్ద బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఓ ప్రైవేట్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో ఒక మహిళ సహా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన బస్సు రాజస్తాన్‌లోని జైపూర్ నుంచి యూపీలోని ఫరూఖాబాద్ వైపు వస్తోందనీ, ఘటన సమయంలో బస్సులో 70మంది వరకు ప్రయాణికు లున్నారని మైన్‌పురి ఎస్పీ అజయ్ శంకర్ రాయ్ తెలిపారు. మృతుల్లో బస్సుపైన నిద్రిస్తున్న వారే ఎక్కువమంది ఉన్నారని చెప్పారు. వీరంతా రాజస్తాన్‌లో కూలీ పనులకు వెళ్లి స్వగ్రామాలకు తిరిగి వస్తున్నా రన్నారు. ఈ ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. -
చక్రాల కింద నలిగిన ప్రాణం
కాశీబుగ్గ : నిరుపేద కుటుంబంపై విధి పగబట్టింది. భర్త విదేశాల్లో ఉంటుండగా.. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ వస్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న పిల్లల కోసం తినుబండారాలు తీసుకుని బయలుదేరిన ఆమె.. బస్సు చక్రాల కింద పడి దుర్మరణం చెందింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కాశీబుగ్గ టెలీఫోన్ ఎక్సే్ఛంజీ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో మత్స్యకార మహిళ మృతి చెందింది. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన చింత కామమ్మ (35) కాశీబుగ్గ పట్టణంలో కూరగాయలు, ఇంటి సరుకులు కొనుగోలు చేసి కాశీబుగ్గ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ ముందు ఉన్న రోడ్డుపై నడిచి వెళుతోంది. ఇంతలో పలాస కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ బస్టాండ్‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ముందు చక్రాలకింద నలిగి పోయింది. ఆమె అక్కడక్కడే మరణించిందని పోలీసులు ధ్రువీకరించారు. కామమ్మ భర్త రాజారావు ఉపాధి నిమిత్తం విదేశాల్లో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ఆమెకు కుమార్తె స్వప్న, కుమారుడు మురళి ఉన్నారు. కామమ్మ వంట మనిషిగా పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. ఇద్దరు పిల్లల కోసం తిను బండారాలు కొనుగోలు చేసి ఇంటికి వెళుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో సంచిలో ఉండటాన్ని చూసిన వారంతా కన్నీరు పర్యంతమ య్యారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పెంట శివకుమార్, కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్తుల సమక్షంలో పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. సీఐ కె.అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస–కాశీబుగ్గలో రోడ్డు విస్తరణ జరగక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు విస్తరణపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
కులదైవం వద్దకు వెళుతుండగా ప్రమాదం
అన్నానగర్: వ్యాన్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న ఘటనలో బాలుడు, బాలిక మృతి చెందగా, 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మవాడిపట్టి సమీపంలో ఆదివారం జరిగింది. వ్యాన్‌ను కోవై రత్తినపురి కన్నప్పనగర్ పుదుకోటకు చెందిన శరవణన్ (48) సొంతంగా వ్యాన్ నడుపుతున్నాడు. ఇతని భార్య శరణ్య (28). వీరికి హరీష్ (15) కుమారుడు, హరిణి (10), సూర్యశ్రీ (6) ఇద్దరు కుమార్తెలున్నారు. వీరి బంధువులు వసంత (30), గంగాదేవి (68), భూపతి (30), దయానంద్ (13), సానియా (8)తో సహా 14 మంది శనివారం రాత్రి కోవై నుంచి తూత్తుక్కుడి జిల్లా కోవిల్పట్టిలో ఉన్న తమ కులదైవం ఆలయానికి వ్యాన్‌లో బయలుదేరి వెళ్లారు. వ్యాన్‌ను శరవణన్ నడిపాడు. అదే సమయంలో గోపిచెట్టి పాళయం నుంచి మదురైకి ఓ ప్రభుత్వ బస్సు బయలుదేరింది. బస్సును మదురైకు చెందిన భూపతి నడిపాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు వాడిపట్టి సమీపం దాదమ్‌పట్టి కాలువ ప్రాంతంలో దిండుక్కల్ – మదురై హైవే రోడ్డులో వస్తుండగా హఠాత్తుగా వ్యాన్ వెనుక భాగంలో ప్రభుత్వ బస్సు ఢీకొంది. ప్రమాదంలో వ్యాన్ బోల్తాపడి నుజ్జునుజ్జయింది. వ్యాన్‌లో చిక్కుకుని దయానంద్, సానియా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు శరవణన్, శరణ్యా, హరిష్, హరిణి, సూర్యాశ్రీ, వసంతా, గంగాదేవి, భూపతి ఈ ఎనిమిది మంది తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వాడిపట్టి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని చికిత్స కోసం మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.∙ -
పల్టీ కొట్టిన బస్సు
బరంపురం/భువనేశ్వర్ : నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో గల దిగపండి 56వ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సు పల్టీ కొట్టడంతో ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో ఆరుగురు ప్రయాణికుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. దిగపండి ఐఐసీ అధికారి అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్‌లోని సాలియా సాహి బస్తీ వాసులు 25 మంది గంజాం జిల్లాలోని బంకేశ్వరి పీఠం సందర్శనకు బస్సులో బయల్దేరారు. వారంతా బస్సులో సోమవారం ఉదయం సురడా నుంచి బరంపురం వస్తుండగా సరిగ్గా దిగపండి పోలీసు స్టేషన్ పరిధి 56వ జాతీయ రహదారి గోకర్ణపూర్ గ్రామం దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు పల్టీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తొలుత దిగపండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. జరిగిన ధుర్ఘటనపై దిగపండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం
జైపూర్: రాజస్తాన్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 33 ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. డ్రైవింగ్ నేర్చుకుంటున్న మైనర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని లాల్సోట్ నుంచి జిల్లా కేంద్రానికి 45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు సూర్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బనాస్ నదిపై ఉన్న వంతెనపైకి రాగానే అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, నలుగురు చిన్నారులు, ఏడుగురు మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. గాయపడిన వారిని సమీపంలోని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ , కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయినవారికి సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోందని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 19 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణికులు క్షేమం
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రెలగూడెం స్టేజి వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. సూర్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం హైదరబాద్ నుంచి సూర్యపేటకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్లా పడింది. ఈ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. కొందరికి స్వల్పగాయలు కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు, ఆర్టీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణికులు క్షేమం
-
‘ప్రభుత్వంలోని పెద్దల వాహనాలతోనే ప్రమాదాలు’
విజయవాడ: ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెందిన వాహనాలే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలు తమ పలుకుబడి వినియోగించి నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన గొల్లపూడి ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రవాణా రంగంలో ప్రైవేట్ ఆధిపత్యం పెరిగిపోయిందన్నారు. అంతేకాదు, ప్రైవేట్ వాహనాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుతున్నాయని తెలిపారు. చనిపోయిన వారికి చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు ఇస్తామనడం దారుణన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. హైవేలపై ప్రమాదాలను నివారించకుండా మొక్కుబడి చర్యలు తీసుకోవటం తగదని అన్నారు. -
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
అమరావతి: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చంద్రన్న బీమా ఉన్నవారికి 5 లక్షలు, చంద్రన్న బీమా లేనివారికి 3 లక్షలు, ఇతర రాష్ట్రాల వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. అతివేగమే కారణం: బస్సు ప్రమాదానికి అతివేగమే కారణమని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ రోజు ఉదయం బస్సు ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. -
పెనుగంచిప్రోలుకు బయల్దేరిన వైఎస్ జగన్
-
పెనుగంచిప్రోలుకు బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు బయల్దేరారు. పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. బస్సు ప్రమాద బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ రోజు ఉదయం పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని నందిగామ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా అదుపుతప్పి కల్వర్ట్‌లో పడింది. పోలీసులు దివాకర్ ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు. -
ప్రైవేట్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోగూరు మండలం మన్నేగూడ వద్ద బుధవారం వేకువజామున కర్ణాటకకు చెందిన ప్రైవేట్ ట్రావెల్సస్ బస్సు బోల్తా పడడంతో 20 మంది గాయపడ్డారు. శ్రీసాయి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు వెళుతుండగా మన్నేగూడ వద్ద బోల్తాపడింది. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నదిలో పడిన బస్సు, 16 మంది మృతి
లిమా: పెరూలో బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో కనీసం 16 మంది ప్రయాణికులు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. సోమవారం పిచానకి వెళ్లేందుకు ప్రయాణికులను తీసుకెళ్తుండగా పర్వత ప్రాంతంలో ప్రమాదం జరిగింది. టర్మ నది వద్ద బస్సు పర్వత ప్రాంతంపై వెళ్తుండగా అదుపుతప్పి 35 అడుగుల లోతున ఉన్న నదిలోకి పడిపోయింది. డ్రైవర్ బస్సును వేగంగా నడపడం వల్ల నియంత్రణ కోల్పోయినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. పర్వత ప్రాంతాలపై నాసిరకం రోడ్ల కారణంగా పెరూలో ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి.