ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లక్నో నుంచి ఢిల్లీకి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాల్వలో పడిపోవడంతో 29 మంది ప్రయాణికులు ప్రాణాలుకోల్పోయారు. 18 మంది గాయపడ్డారు. యూపీలోని అవథ్ డిపోకు చెందిన ‘జనరథ్’ బస్ లక్నో నుంచి ఢిల్లీలోని ఆనంద్‌విహార్ బస్‌స్టేషన్‌కు బయల్దేరింది. సోమవారం వేకువజామున 4 గంటలవేళ ఎత్మద్‌పూర్ సమీపంలో అదుపు తప్పిన బస్సు రైలింగ్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న నాలాలోకి దూసుకుపోయింది.
ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో మునిగి ఉండటం, నాలాలో సుమారు 8 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. గాయపడిన ప్రయాణికులను రక్షించగలిగారు. కొన్ని మృతదేహాలు కొట్టుకుపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన 29 మందిలో 19 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 18 మంది క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. పూర్తిగా నుజ్జయిన బస్సును కాల్వ నుంచి బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
‘టూ టయర్ స్లీపర్ కోచ్ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై నుంచి అదుపు తప్పి ఝర్నా నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది చనిపోగా 18 మంది గాయపడ్డారు’ అని యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఘటనా స్థలికి చేరుకుని, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సాయం తక్షణమే అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరిపి 24 గంటల్లో నివేదిక అందజేయాలని సీఎం ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించింది. నోయిడాను ఢిల్లీ శివార్లలోని ఆగ్రాతో కలిపే 165 కిలోమీటర్ల ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. విశాలమైన ఈ రహదారిపై వాహనాల అతివేగం కారణంగా, ముఖ్యంగా రాత్రివేళ, వేకువజామున ఎక్కువగా సంభవిస్తున్నాయని రోడ్డు భద్రత నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.
బస్సు నుంచి మృతదేహాలను బయటకు తెస్తున్న పోలీసులు
యూపీలో ఘోరం
Published Tue, Jul 9 2019 3:52 AM | Last Updated on Tue, Jul 9 2019 9:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment