Nala
-
వికారాబాద్: అవ్వ మిస్సింగ్, చివరకు..
సాక్షి, వికారాబాద్: ఆ అవ్వ ఆయుష్షు గట్టిదే. ప్రమాదవశాత్తూ ఓ పెద్ద కాలువలో పడినా.. రోజంతా అక్కడే గడిపి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. వికారాబాద్ తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని గీతా మందిర్ సాయిపూర్ ప్రాంతానికి చెందిన కోస్గి భారతమ్మ (75) ఆదివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె మనవడు పట్టణంలో అంతా వెతికాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఉదయం ఇంటి దగ్గర్లో ఉన్న ఓ మురుగు కాలువపై అతనికి అనుమానం వచ్చింది. రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన నిర్మాణం అది. వెంటనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పిలిపించి అందులో వెతికించాడు. సోమవారం సాయంత్రం పెద్ద నాలాలో కింద మూలుగుతూ కూర్చున్న భారతమ్మ అతని మనవడికి కనిపించింది. మున్సిపల్ కార్మికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి. దగ్గర్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించగా.. ఆమె ప్రమాదవశాత్తు అందులో పడిందని మనవడు చెబుతున్నాడు. మరోవైపు.. అవ్వ మిస్సింగ్ కథ సుఖాంతం కావడంతో మృత్యువును జయించిదంటూ స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. -
మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం?
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందిది. మూసీలో లక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని లక్ష్మీ కూతురు గుర్తించినట్లు తెలుస్తోంది. కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.. అయితే, ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్‌లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్‌సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు. Lakshmi's body, found during JCB-assisted garbage removal at #MoosarambaghBridge, is now taken for a postmortem. @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @shibasahu2012 #hyderabad #HyderabadRains pic.twitter.com/D5FumD59Cj — Sri Loganathan Velmurugan (@sriloganathan6) September 6, 2023 చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు? మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు. కాగా, మూసీలో మహిళ మృతదేహం కొట్టుకురావడంతో.. గల్లంతైన లక్ష్మిగా గుర్తించారు. -
ఇంకెన్నాళ్లు నాలా మరణాలు?
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరానికి బాటలు పరుస్తున్న హైదరాబాద్ మహానగరంలో వానలొస్తే.. నాలాలు ఉప్పొంగడం...అందులో పడి ఎవరో ఎవరో ఒకరు చనిపోవడం మామూలైపోయింది. అన్నిరంగాల్లో అద్భుతాలు సాధిస్తున్నప్పటికీ, మిగతా నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వరద కాలువల్లో పడి ప్రాణాలు పోవడం గుండెల్ని పిండి వేస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులకు నూరేళ్లు నిండుతుండటం ఎందరినో కలచివేస్తోంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లు, కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిజాంపేట ప్రగతినగర్‌లో నాలుగేళ్ల పసిబాలుడు మిథున్‌రెడ్డి నాలాలో పడి మృతి చెందితే ఆ పాపం ఎవరిది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేటీఆర్ హెచ్చరించినా.. వర్షాల వల్ల ప్రజలు మరణించే పరిస్థితులుండరాదని మునిసిపల్ మంత్రి కేటీఆర్ పలు దఫాలుగా అధికారుల్ని హెచ్చరించినా.. దారుణం జరిగిపోయింది. గత మూడేళ్లుగా నాలాల్లో పడి చిన్నారులు మరణిస్తుండటం తొలచివేస్తోంది. రెండేళ్ల క్రితం నేరే డ్మెట్లో సుమేధ అనే బాలిక మరణించడం తెలిసిందే. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏప్రిల్‌లో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లు లేక సికింద్రాబాద్ కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి మృతి చెందింది. తాజా ఘటనలోనూ నాలాపై కప్పు సరిగ్గా లేకపోవడం వల్లే బాలుడు అందులో పడి మరణించాడు. స్థానికుల నిర్లక్ష్యం, అధికారుల అశ్రద్ధ ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. #HyderabadRains Four year old Mithun Reddy gets swallowed by the city’s crumbling infrastructure. Mithun was playing at his house when he fell into an open manhole at 11am today. Incident happened at Mechal, Pragathi Nagar, NRI Colony. They found his body at Nizampet, but was… pic.twitter.com/8E8raHbNj3 — Revathi (@revathitweets) September 5, 2023 నాలాల్లో మరణాలు... 2017 నుంచి నాలాల్లో పడి ఎందరో మరణించారు. ● 2017 ఫిబ్రవరిలో యాకుత్‌పురా నియోజకవర్గంలో నాలాలోపడి జకీర్ అబ్బాస్ (2) అనే బాలుడు మరణించాడు. ● 2018 జనవరిలో చందానగర్ రెడ్డి కాలనీకి చెందిన శివకుమార్ అనే నాలుగేళ్ల బాలుడు నాలాలో పడి మరణించాడు. ● 2018 జూన్‌లో సత్యరాఘవేంద్రనగర్ కాలనీ ఓపెన్ నాలాలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ● 2018 సెప్టెంబర్‌లో సరూర్‌నగర్‌లో నాలాలో పడి హరీష్(24) అనే యువకుడు గల్లంతయ్యాడు. ● 2018 అక్టోబర్‌లో బోరబండలో రాజయ్య అనే వ్యక్తి నాలాలో పడి మరణించాడు. ● 2019 సెప్టెంబర్‌లో నాగోల్ దగ్గరి ఆదర్శనగర్ నాలాలో పడి పోచంపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ మరణించాడు. ● 2019లోనే ఇద్దరు అర్చకులు ద్విచక్రవాహనంపై వెళ్తూ నాలాలో పడిపోగా ఒకరు మృతి చెందారు. ● 2020 సెప్టెంబర్ నేరేడ్మెట్లో నాలాలో పడి సుమేధ(12) అనే బాలిక మృతి చెందింది. ● 2020 నవంబర్‌లో సరూర్‌నగర్ కోదండరామ్‌నగర్‌లో మార్నింగ్‌వాక్‌కు వెళ్లిన వృద్ధురాలు ,సమీంలోని మరో ప్రాంతంలో ఇంకో వ్యక్తి నాలాలో పడి మృతి చెందారు. ● 2021 జూన్‌లో ఓల్డ్బోయిన్పల్లిలో ఆనంద్ సాయి అనే ఏడేళ్ల బాలుడు నాలాలో పడి మరణించాడు. ● 2021 సెప్టెంబర్‌లో మణికొండలో నాలా కోసం తవ్విన గుంతలో పడి రజనీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ● 2023 ఏప్రిల్‌లో సికింద్రాబాద్ కళాసిగూడలో నాలాలో పడి మౌనిక అనే నాలుగేళ్ల బాలిక మరణించింది. -
హుస్సేన్‌సాగర్ నాలాలో మహిళ గల్లంతు?
హైదరాబాద్: కవాడిగూడ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య బస్తీలో లక్ష్మి (55) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో ఇంటి దగ్గరే ఉన్న నాలాలో పడిందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి గాంధీనగర్ పోలీసులు, జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది నాలాలో వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామోదర సంజీవయ్యనగర్‌లో నివాసం ఉండే లక్ష్మి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా..భర్త గతంలోనే చనిపోయాడు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలిపోవడంతో ప్రమాదభరితంగా మారింది. హుస్సేన్‌సాగర్ నాలాకు రిటర్నింగ్ వాల్ పూర్తయితే తమ ఇంటికి టాయిలెట్ నిర్మించుకోవాలని అనుకున్నామని ఆమె కూతుళ్లు కన్నీటి పర్యంతరం అయ్యారు. మొహం కడుక్కోవడానికి ప్రయత్నించిన లక్ష్మి ప్రమాదవశాత్తు హుస్సేన్‌సాగర్ నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లక్ష్మి కూతురు సుజాత తన తల్లి దగ్గరికి రాగా..ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెంది పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు నాలాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. వందమంది సిబ్బంది నాలుగు బృందాలుగా నాలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ కోసం డ్రోన్లనూ వినియోగించారు. సోమవారం కవాడిగూడ నుంచి గోల్నాక వరకు దాదాపు 10 కి.మీ.ల మేర గాలింపు జరిపినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం కూడా గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రత
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ కార్పొరేషన్ /కరీంనగర్: ప్రజాభాగస్వామ్యంతోనే నగరాల్లో పరిశుభ్రత సాధ్యమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్మించిన కౌన్సిల్ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడు తూ.. నాలాలు శుభ్రం చేస్తుంటే సోఫాలు, పరుపులు, కుర్చీలు వస్తున్నాయని, ఈ తీరు మారాలని సూచించారు. సిద్దిపేట స్ఫూర్తిగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో స్వచ్ఛబడి ఏర్పాటు చేయాలని ఆదేశించామని, ఇందుకు రూ.79 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేస్తూ హైదరాబాద్ నగరం ఏటా రూ.200 కోట్లు, సిరిసిల్లలో స్వశక్తి సంఘాలు నెలకు రూ.8 లక్షలు సంపాదిస్తున్నాయని వివరించారు. సిద్దిపేటలో దీప్తి అనే కౌన్సిలర్ స్వచ్ఛబడి నిర్వహిస్తోందని, అలా ఇతర కార్పొరేటర్లు ప్రయత్నించాలని సూ చించారు. తాను జపాన్ వెళ్లినప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉండడంపై ఆరా తీయగా.. తాము అపరిశుభ్రం చేయకపోవడమే కారణమని అక్కడి ప్రజ లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సపాయిమిత్ర సురక్షలో దేశంలోనే కరీంనగర్‌కు మొదటి స్థానం రావాల్సి ఉన్నా.. కుట్రతోనే ఆ స్థానం గుజరాత్‌కు వెళ్లిందని పేర్కొన్నారు. నేను పుట్టింది కరీంనగర్‌లోనే.. కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కేటీఆర్ సూచించారు. తొమ్మిదేళ్లలో నగరం ఎలా మారిందో ప్రజలు చూస్తున్నారన్నా రు. 1976లో తాను ఇక్కడి మిషన్ హాస్పిటల్లో జ న్మించానని, కరీంనగర్, ఎల్ఎండీలో మూడునా లుగేళ్లు చదివానని గుర్తు చేశారు. నగరంలో పర్యటించినప్పుడు అంతర్గత రోడ్లు చూశానని, చాలా బాగున్నాయని అభినందించారు. రూ.225 కోట్లతో కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించుకున్నామని, రూ.480 కోట్లతో నిర్మిస్తున్న రివర్‌ఫ్రంట్ పనులు వేగంగా జ రుగుతున్నాయని వెల్లడించారు. మూడు నాలుగు నెలల్లో రివర్‌ఫ్రంట్ పూర్తయ్యాక ప్రజలు ఆశ్చర్యపోయే స్థాయికి కరీంనగర్ చేరుతుందన్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి హౌసింగ్‌బోర్డుకాలనీలో 24 గంటల నీళ్లిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేసుకున్న తొలినగరం కరీంనగర్ అని తెలిపారు. కౌన్సి ల్ హాల్ అసెంబ్లీ హాల్లాగా ఉందని ప్రశంసించా రు. టీవీల్లో కనిపించాలన్న ఆత్రంతో కొందరు కౌ న్సిలర్లు, కార్పొరేటర్లు దిగజారి దూషణలకు దిగుతున్నారని, అందుకే కౌన్సిల్ మీటింగ్‌కు మీడియాను అనుమతించొద్దన్నానని స్పష్టంచేశారు. లైటింగ్ కోసం రూ.20 కోట్లు సాయంత్రం మానేరు తీరాన తీగల వంతెన ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తీగల వంతెన నుంచి మానకొండూరు వరకు లైటింగ్ కోసం మంత్రి గంగుల కమలాకర్ తనను కోరారని, వెంటనే రూ.20 కోట్లు మంజూరు చేశామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రెండు నెలల్లో మానేరు రివర్ ఫ్రంట్ తొలిదశ పూర్తవుతుందన్నారు. శ్రీవేంకటేశ్వర ఆలయం, మెడికల్ కాలేజీలతో జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. వచ్చే దసరా నాటికి రివర్‌ఫ్రంట్‌పై నగర ఆడపడుచులు బతుకమ్మ ఆడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను లండన్‌లా మారుస్తానన్న సీఎం కేసీఆర్ తన మాటలను నిజం చేసి చూపించారన్నారు. వచ్చేవారం సింగపూర్, సియోల్ నగరాలకు వెళ్లి పర్యటించి నగరానికి కావాల్సిన సదుపాయాలపై మంత్రి కేటీఆర్‌కు నివేదిక ఇస్తామని వెల్లడించారు. తీగల వంతెన ఆలోచనకు కారణమైన ఈఎన్సీ రవీందర్రావును ప్రశంసించారు. ప్రైవేట్ రంగాల్లోనూ రాణించొచ్చు విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రైవేట్ రంగంలోనూ రాణించొచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.7 కో ట్ల స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మిస్తున్న మోడ్రన్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన చేశారు. లైబ్రరీలో ఉన్న వి ద్యార్థులతో మాట్లాడారు. ఇక్కడున్న వస్తువు భారతీయులది కాదని, విదేశీయుల వస్తువులు వాడే దుస్థితి మనకు ఉండొద్దని సూచించారు. ఉద్యోగాలు రాలేదని బాధపడొద్దని, మనమే ప్రపంచానికి కొత్త వస్తువులను అందించే స్థాయికి ఎదగాలని సూచించారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా కష్టపడి చదవాలని, ప్రైవేట్ వ్యాపార రంగాలపైనా దృష్టి సారించాలన్నారు. గ్రంథాలయ ఐడీ కార్డును కేటీఆర్‌కు అందించారు. కార్యక్రమాల్లో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రశిశంకర్, సుడా చైర్మన్ జీవీ.రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన సాగిందిలా.. రూ.10 కోట్లతో నిర్మించనున్న కాశ్మీర్‌గడ్డ సమీకృత మార్కెట్, రూ.7కోట్లతో నిర్మించనున్న మోడ్రన్ లైబ్రరీ, నగరపాలక సంస్థ కార్యాలయంలో సిటిజన్ సర్వీస్ సెంటర్, నూతన సమావేశ మందిరం, ఆధునీకరించిన సమావేశమందిరం, కమాండ్ కంట్రోల్ సిస్టంను ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ గురించి వివరాలు తెలుసుకున్నారు. నూతన కౌన్సిల్ హాల్లో మేయర్ యాదగిరి సునీల్‌రావును సీటులో కూర్చొబెట్టి అభినందించారు. -
Hyderabad: 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కూకట్పల్లి నుంచి అమీర్‌పేట, బేగంపేట వైపు, బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు, మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ►కూకట్పల్లి నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్పల్లి మెట్రో రైల్ స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకుని ఐడీఎల్ లేక్ రోడ్డు, గ్రీన్‌హిల్స్ రోడ్డు, రెయిన్బో విస్టాస్, ఖలాపూర్ ఫ్లైఓవర్, పర్వతనగర్, టాడీ కాంపౌండ్, కావూరిహిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాలి. ►కూకట్పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కూకట్పల్లి వై జంక్షన్లో బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లైఓవర్ కింద, న్యూబోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, అమీర్‌పేట్ నుంచి మళ్లిస్తారు. ►మూసాపేట, గూడ్స్ షెడ్ నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పర్వత్‌నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
Hyderabad : గోషామహల్లో నాలా కుంగిన దృశ్యాలు
-
నిబంధనల మేరకు నాలాలను నిర్మిస్తాం: మంత్రి తలసాని
-
హైదరాబాద్ గోషామహల్లో కుంగిపోయిన పెద్ద నాలా
-
Hyderabad: గోషామహల్లో కుంగిన పెద్ద నాల
హైదరాబాద్: నగరంలోని గోషామహల్లో గల పెద్ద నాల కుంగిపోయింది. దాంతో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, బైక్‌లు సైతం ధ్వంసమయ్యాయి. శుక్రవారం కావడంతో గోషామహల్ బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేశారు. సంతమార్కెట్ దుకాణాలు నాలపై ఉండటంతో ఆ దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. నాలా కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పెద్దనాలా కుంగిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మార్కెట్‌కు పెద్ద ఎత్తున వచ్చిన జనాలను ఇళ్లను తరలిస్తున్నారు. -
Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని జింకలవాడ ఎదురుగా ఉన్న నాలా కల్వర్టు స్థానంలో బాక్స్ టైప్ కల్వర్టు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ►బాలానగర్ నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వచ్చే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. అయితే ఖైతాన్నగర్ వద్ద వాహనాలను కుడివైపు మళ్లించి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్, జింకలవాడ నాలా, దుర్గామాత ఆలయం, సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ►మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు అనుమతించరు. వాటిని నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి కూకట్పల్లి వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తీసుకుని మూసాపేట క్రాస్‌రోడ్డు మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► ద్విచక్ర వాహనాల రాకపోకలు మాత్రమే భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్ రోడ్డు వైపునకు అనుమతిస్తారు. ఈ వాహనాలను సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ (ఎదురుగా ఎడమ వైపునకు), దుర్గామాత ఆలయం(కుడి మలుపు), జింకలవాడ నాలా, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్(కుడి మలుపు), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ఖైతాన్నగర్ రహదారిలో ఎడమవైపు తీసుకుని నర్సాపూర్ క్రాస్‌రోడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ►ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు, లైట్ మోటార్ వాహనాలు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు అనుమతించరు. వాటిని భరత్‌నగర్ మార్కెట్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద కుడివైపు మళ్లి ఐడీపీఎల్ కంపెనీ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్ -
Hyderabad: పనులు పూర్తి కాలేదు.. మరింత టైమ్ కావాలి!
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం(ఎస్ఎన్డీపీ) వింగ్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, నిధులు మంజూరు అయినప్పటికీ పనులు కాలేదు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపునే మే నెలాఖరులోగా వీలైనన్ని పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ పనులు పూర్తవలేదు. ఇందుకు కారణాలనేకం. ఈ సంవత్సరం ఆరంభం వరకు అసలు పనుల్లో కదలిక లేకుండాపోయింది. కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. ఒక్కో పనికి మూడు నాలుగుసార్లు టెండర్లు పిలవాల్సి వచ్చింది. తీరా పనులు ప్రారంభమయ్యాక క్షేత్రస్థాయి పరిస్థితులతో అలైన్మెంట్లు, డిజైన్లు మార్చాల్సివచ్చింది. కొన్ని ప్రాంతాల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలా చెబుతూపోతే.. ఎన్నో కారణాలున్నాయి. పనులు మాత్రం పూర్తి కాలేదు. వర్షాకాలం వచ్చి నేపథ్యంలో ఉన్నతాధికారులు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల వివరాల ఆధారంగా రాబోయే నెలన్నరలో దాదాపు పది పనులు పూర్తి చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు ఉన్నతాధికారులకు జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్లు హామీ ఇచ్చారు. ఫాస్ట్ట్రాక్గా .. హామీ ఇచ్చిన పనుల్ని ఫాస్ట్ట్రాక్గా, ఎక్స్‌ప్రెస్ వేగంతో పూర్తి చేయాలని భావిస్తున్నారు. కానీ.. వర్షాలు కురిస్తే ఇంజినీరింగ్ పనులు.. అందునా నాలాల వంటి పనులు చేయడం అసాధ్యం. సమస్య పరిష్కారం కంటే ప్రమాదాలు కొనితెచ్చుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూలై నెలాఖరు వరకు దాదాపు రూ.200 కోట్ల విలువైన పనుల్ని పూర్తి చేయగలమని జోనల్ కమిషనర్లు హామీ ఇచ్చినా ఏమేరకు అమలవుతాయన్నది వేచి చూడాల్సిందే. పనుల వేగం క్షేత్రస్థాయి స్థితిగతులు, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. జూలై ఆఖరు వరకు పూర్తవుతాయనుకుంటున్న పనుల వివరాలు.. పని పేరు.. అంచనా వ్యయం.. పూర్తయ్యే తేదీ.. ► నాగిరెడ్డి చెరువు– కాప్రా చెరువు వరద కాల్వ పనులు. రూ.41 కోట్లు: (జూన్ 30) ► ఫాక్స్‌సాగర్ కెమికల్ నాలా, కోల్‌కాల్వ– కెమికల్ నాలా. రూ.95 కోట్లు: (జూలై 15) ► కరాచీ బేకరీ వద్ద పికెట్ నాలా ఆధునికీకరణ పనులు (ఒకవైపు).రూ.10 కోట్లు: (జూన్ 30) ► ఈర్ల చెరువు– నేషనల్ హైవే 65.రూ.15.58 కోట్లు: (జూలై 15) ► ఇసుకవాగు– నక్కవాగు.రూ.5 కోట్లు: (జూలై 15) ► మోదుకుల కుంట– కొత్తచెరువు. రూ.17.80కోట్లు: (15 జూలై) ► అప్పాచెరువు– ముల్గుంద్ చెరువు. రూ.8.54 కోట్లు: (జూలై 31) ► బాతుల చెరువు– ఇంజాపూర్ నాలా.రూ.9.65 కోట్లు: (జూన్ 30) ► బండ్లగూడ చెరువు – నాగోల్ చెరువు. రూ.7.26 కోట్లు: ( జూలై 31) ► నెక్నాంపూర్ నాలా– మూసీ. రూ.24 కోట్లు: (జూలై 31) ఫాక్స్‌సాగర్, కెమికల్ నాలా, కోల్‌కాల్వ–కెమికల్నాలా రెండు పనులు ఒకే ప్యాకేజీ కింద చేపట్టారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 04021111111కు ఫోన్ చేయవచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1912కు కూడా ప్రజలు ఫోన్ చేయవచ్చని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. -
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
ముషీరాబాద్: నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తో వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీఎస్టీ రోడ్డులోని నాగమయ్యకుంట వద్ద, నల్లకుంట కూరగాయల మార్కెట్ రోడ్డులో హెరిటేజ్ బిల్డింగ్ వద్ద రూ.12 కోట్ల వ్యయంతో బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రెండు బ్రిడ్జిల నిర్మాణ పనులను హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్ సి.సునిత ప్రకాష్‌గౌడ్‌లతో కలిసి మంత్రి తలసాని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా వర్షాకాలంలో నాగమయ్యకుంట, సాయిచరణ్ కాలనీ, పద్మాకాలనీ, అచ్చయ్యనగర్ తదితర కాలనీలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. సమస్యకు ప్రధాన కారణమైన ఇరుకు బ్రిడ్జిలను తొలగించి ఆ స్థానంలో విశాలమైన బ్రిడ్జిలు నిరి్మస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 8వేల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందన్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూ.6వేల 700 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జితో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. హుస్సేన్‌సాగర్ నుంచి అంబర్‌పేట మీదుగా మూసీ వరకు ఉన్న హుస్సేన్‌సాగర్ నాలాకు 2020లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని మంత్రి తలసాని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిరి్మంచడానికి పూనుకున్నట్లు తెలిపారు. ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు రూ.426 కోట్లతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సీఈ కిషన్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎంసీ హరికృష్ణ, వాటర్ వర్క్స్ జీఎం సుబ్బారాయుడు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు, ముఠా జైసింహా, మాజీ కార్పొరేటర్ బి.హేమలత, బి.శ్రీనివాస్‌రెడ్డి, కె.మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జి పనులను ప్రారంభిస్తున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ సునీత తదితరులు -
నాలాల అభివృద్ధిపై జెడ్సీ సమీక్ష
బంజారాహిల్స్: వర్షాకాలం ప్రారంభం అయ్యేలోగా నాలాల రక్షణ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ సూచించారు. ఆదివారం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆయన సంబంధిత ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎన్డీపీ కింద చేపట్టిన నాలాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి అన్నదానిపై సంబంధిత ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. సమీక్షలో పాల్గొన్న ఖైరతాబాద్ జెడ్సీ రవికిరణ్ -
మూడు నెలల్లో నాలా పనులు పూర్తి చేయండి
ఎల్బీనగర్: జోనల్ పరిధిలో చేపట్టిన నాలా నిర్మాణ పనులను మూడు నెలలో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలలో వరద ముంపు ప్రభావిత ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని ప్రభుత్వం రూ.858 కోట్లతో 52 పనులను చేపట్టిందని ఆమె తెలిపారు. ఎల్బీనగర్ జోనల్ స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ పంకజతో కలిసి ఆమె నిర్వహించారు. సమావేశంలో ఎల్బీనగర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమయానికి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, రూ.114 కోట్లతో చేపట్టిన పనులు మూడు నెలలో పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయ్యే వరకు ఎవరికీ సెలవులు ఇవ్వొదని సీఈని మేయర్ ఆదేశించారు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే ఏజెన్సీలు పనులు ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం కింద 14 పనులు చేపట్టామని, వాటిలో 6 పనులు పూర్తి కాగా , మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ››ఈ విషయంలో ఏఎంహెచ్‌ఓలదే పూర్తి బాధ్యత అని అన్నారు. జోనల్లో మరుగుదొడ్లు వంద శాతం అందుబాటులో ఉండాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీలో ఘన పదార్థాలు రోజు రోజుకూ పెరుగుతున్నందున సమర్థ నిర్వహణకు సర్కిళ్లలో ప్రత్యామ్నాయంగా రెండో స్థాలాన్ని చూసి ఉంచాలని డీసీలకు సూచించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రధాన రహదారులకు ఉన్న లింకు రోడ్డులను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈలు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, అశోక్‌రెడ్డి, సీపీ ప్రసాద్‌రావు, హార్టికల్చర్ డీడీ రాజ్‌కుమార్, ఈఈ ఎలక్ట్రికల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. వరదనీటి కాలువ పనుల పరిశీలన నాగోలు: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 103 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల (వరదనీటి కాలువ పనులు)ను మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎస్ఎన్డీపీ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ చెరువు వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, ఈ పనులు పూర్తి అయితే నియోజకవర్గ పరిధిలోని కాలనీలు నీట మునిగే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆనంతులరాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్, టీఆర్ఎస్ పార్టీ నాగోలు డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఆగేదే లే! ముందుకెళ్లాల్సిందే.. మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాన సమస్యలకు ప్రధాన కారణమైన నాలా పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వానొలొచ్చినప్పుడు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించేందుకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) కింద పనులు చేసేందుకు రూ.858 కోట్లు మంజూరు చేసింది. వివిధ కారణాలతో ఇటీవలి కాలం వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. వర్షాకాలంలోగా ఆ పనుల్ని పూర్తి చేయాల్సి ఉంది. అంటే నాలుగు నెలల్లోగా పనులు జరగాలి. అన్నీ అసాధ్యం కావడంతో అత్యంత సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లోని పనులు ప్రాధాన్యతతో చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనులకు టెండర్లు ఖరారయ్యాక అంగీకార పత్రం (ఎల్ఓఏ) కోసం కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు (సీఓటీ) పంపించాల్సి ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ఎల్ఓఏ వచ్చాకే కాంట్రాక్టర్లు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ తతంగమంతా జరగడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనుండటం, వర్షాకాలానికి ఇక ఎంతో సమయం లేకపోవడంతో, ఎల్‌ఓఏలు వచ్చేంతదాకా ఆగకుండా టెండర్లు ఖరారైన కాంట్రాక్టర్లతో పనులు చేయించాలని అధికారులకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచించారు. నాలా పనుల పురోగతిపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి దృష్టికి ఈ అంశం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఓఏ రాకముందే డీమ్డ్ అప్రూవల్‌గా భావించి పనులు చేయించాల్సిందిగా అధికారులకు సూచించినట్లు తెలిసింది. వేసవి కాలంలోగా వీలైనన్ని పనుల్ని పూర్తిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: పేద విద్యార్థినుల కల నిజం చేసిన కేటీఆర్ దీంతోపాటు పనుల్ని త్వరితంగా చేసేందుకు టెండర్ల సమయాన్ని సైతం రెండు వారాల బదులు ఒకవారం గడువుతో పిలవాలని సూచించినట్లు సమాచారం. ఇంజినీరింగ్ నిబంధనల మేరకు అత్యవసర పనులకు వారం రోజుల వ్యవధితో స్వల్పకాలిక టెండర్లు పిలవవచ్చు. నాలా పనులు సైతం అత్యవసరమైనవే అయినందున వారం గడువుతో స్వల్పకాలిక టెండర్లు పిలవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టేందుకు 55 ప్యాకేజీలుగా పనుల్ని ఖరారు చేయగా, వాటిల్లో 27 ప్యాకేజీల అంచనా వ్యయం రూ.10 కోట్లకు పైగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
ముంపు సమస్యను ముగిద్దాం
సాక్షి, సిటీబ్యూరో: బేగంపేట నాలా పొంగిపొర్లినప్పుడు ముంపు బారిన పడుతున్న బ్రాహ్మణవాడి, అల్లంతోటబావి, ప్రకాశ్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించడమే కాక ఆయా కాలనీల్లో వరదనీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం), జలమండలి అధికారులు సమన్వయంతో ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. శుక్రవారం మునిసిపల్ పరిపాలనశాఖ కార్యాలయంలో ఆ శాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌తో కలిసి జీహెచ్ఎంసీ, జలమండలి, ఎస్ఎన్డీపీ, రెవెన్యూ, ఎండోమెంట్స్ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముషీరాబాద్ మండలం భోలక్‌పూర్‌లోని సోమప్ప మఠానికి చెందిన 3571 గజాల స్థలంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న దాదాపు 130 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. వారిలో 53 కుటుంబాలకు 1996లోనే పట్టాలు కూడా ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా జీరా కాంపౌండ్‌లోని దాదాపు 70 కుటుంబాలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెబుతూ, ఎండోమెంట్స్‌కు చెందిన ఆ స్థలాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన పరిహారాన్ని చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆ గృహాలకు ఓకే.. రాంగోపాల్ పేట డివిజన్లోని 134 గృహాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్‌కు మునిసిపల్ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇటీవల సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు. వీటితోపాటు న్యూ బోయగూడ, హైదర్ బస్తీ,మోండామార్కెట్ డివిజన్లోని శంకర్స్ట్రీట్, సజ్జన్లాల్స్ట్రీట్, రాంగోపాల్ పేట డివిజన్ లోని వెంగళరావునగర్, సనత్ నగర్ డివిజన్లోని శ్యామల కుంట తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ఆ స్థలాల రెగ్యులరైజేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. మోండా మార్కెట్, ఓల్డ్ జైల్ ఖానా భవనాలను మోజంజాహీ మార్కెట్ తరహాలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనులకు కార్యాచరణ రూపొందించాలన్నారు. సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అండర్‌పాస్, ఫతేనగర్ వంతెన విస్తరణ, రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి పనులు చేపట్టేందుకు రైల్వే, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించనున్నట్లు తెలిపారు. -
ఉదృతంగా ప్రవహిస్తున్న నల్లకుంట నాలా
-
హైదరాబాద్ లో భయపెట్టిస్తోన్న నాలాలు
-
సికింద్రాబాద్: బోయిన్‌పల్లిలో విషాదం
-
బోయిన్పల్లి: నాలాలో పడి ఏడేళ్ల బాలుడు మృతి
కంటోన్మెంట్: అప్పటివరకు తోటిపిల్లలతో కలసి ఆనందంగా ఆడుకుంటున్న ఓ బాలుడిని నాలా గుంత కబళించింది. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. శనివారం బోయిన్‌పల్లిలోని ఆనంద్‌నగర్ ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజుల గ్రామానికి చెందిన ఆంజనేయులు, చంద్రకళ దంపతులు పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని బోయిన్పల్లి ప్రాంతానికి వలసవచ్చారు. ఆంజనేయులు ప్రైవేటు డ్రైవర్ కాగా, చంద్రకళ ఇళ్లలో పనిచేస్తోంది. వీరికి చరణ్(9), ఆనంద్ సాయి(7) సంతానం. ఆనంద్‌నగర్ నాలా పక్కనే ఓ ఇంట్లో ఆంజనేయులు కుటుంబం అద్దెకుంటోంది. శనివారం ఉదయం ఆనంద్‌సాయి తోటి పిల్లలతో కలసి ఆడుకుంటున్నాడు. గతేడాది వర్షాలకు దెబ్బతిన్న నాలా బ్రిడ్జి పునర్ నిర్మాణపనుల్లో భాగంగా తీసిన గుంతలో ఆనంద్‌సాయి ప్రమాదవశాత్తు పడిపోయాడు. నాలాలో పడిపోయిన బాలుడి కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. పోలీసులు వచ్చి అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బందితో కలసి రెండుగంటలు గాలించారు. గజ ఈతగాడు ట్యాంక్‌బండ్ శివ నాలా అడుగుభాగం వరకు వెళ్లి ఆనంద్‌సాయి మృతదేహాన్ని వెతికి వెలికితీశాడు. స్థానికుల ఆగ్రహం... బ్రిడ్జి పునర్ నిర్మాణపనుల్లో నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 నెలల క్రితం పనులు ప్రారంభించినా ఇంకా పూర్తికాలేదు. గతేడాది వర్షాకాలంలో సమీపంలోని హస్మత్‌పేట ప్రాంతంలో నాలా ఉప్పొంగి చుట్టుపక్కల కాలనీలు, బస్తీలను ముంచెత్తింది. అదే సమయంలో ఆంజనేయులు– చంద్రకళ దంపతులు వాచ్‌మన్‌గా పనిచేసే ఆనంద్‌నగర్‌లోని అపార్ట్మెంట్ సెల్లార్ కూడా నీట మునిగింది. దీంతో సమీపంలోని ఓ అద్దె ఇంట్లోకి ఆంజనేయులు కుటుంబం మారింది. కాగా, బ్రిడ్జి నిర్మాణ కాం ట్రాక్టర్ నిర్లక్ష్యమే తమ కుమారుడి మృతికి కారణమని బాలుడి తల్లి చంద్రకళ పోలీసులకు ఫిర్యా దు చేసింది. దీంతో కాంట్రాక్టర్ రాము, ఇతరులపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో బాలుడు నాలాలో పడి ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగించిం దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్యెల్యే కూన శ్రీశైలం గౌడ్ వేర్వేరు ప్రకటనల్లో విచారం వ్యక్తం చేశారు. చదవండి: పోలీసులపై టీఆర్ఎస్ జడ్పీటీసీ అనుచరుల దాడి -
చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నేరేడ్మెట్ ఠాణా పరిధిలో ఉన్న ఈస్ట్ దీనదయాళ్నగర్ ఓపెన్ ప్రమాదవశాత్తు నాలాలో పడి శుక్రవారం మృతి చెందిన పన్నెండేళ్ల చిన్నారి సుమేధ కపూరియా అంత్యక్రియలు శనివారం జరిగాయి. మల్కాజిగిరిలోని పటేల్ నగర్ స్మశాన వాటికలో దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. దహన సంస్కారాలకు సమేధ మృత దేహాన్ని తరలించిన తల్లిదండ్రులు, కుంటుంబ సభ్యులు శోకసంద్రంతో ఉన్నారు. శుక్రవారం సరదాగా సైకిల్ తొక్కుదామని బయటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయి దాదాపు పన్నెండు గంటల తరువాత నాలా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండచెరువులో విగతజీవిగా లభించింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని చిన్నారి బలైపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. (ఉసురు తీసిన నాలా) సుమేధ మృతికి జీహెచ్ఎంసీ అధికారులే కారణం: తమ కూతురు సుమేధ మృతి చెందడానికి పరోక్షంగా జీహెచ్ఎంసీ అధికారులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులపై బాలిక తల్లిదండ్రులు నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నాలాల ఆక్రమణపై కేటీఆర్ సీరియస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తడంతో మహానగరం అతలాకుతలమైంది. ముంపునకు నాలాల ఆక్రమణే కారణమంటూ ‘సాక్షి’లో ఈనెల 17న ‘ఈ పాపం ఎవరిది..!?’ శీర్షిక ప్రచురితమైన కథనం కలకలం రేపింది. వరంగల్ మహానగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో కథనం ద్వారా సవివరంగా వెల్లడైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం వరంగల్‌లో పర్యటించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్... మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ముంపు కాలనీల్లో పరిశీలించారు. ఆ తర్వాత నిట్‌లో సమీక్ష చేసిన సందర్భంగా నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించడం దసరా లోపు పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ కథనంతో 435 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు అధికారులు కేటీఆర్‌కు వివరించగా.. వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం హన్మకొండ నయీంనగర్‌లోని నాలా వెంట నిర్మించిన వాగ్దేవి కళాశాల నుంచి నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. -
ఎప్పుడూ..‘నాలా’గేనా ?!
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో నాలాల సమస్య ఏళ్లు గడుస్తున్నా తీరడం లేదు. ప్రతి వర్షాకాలంలో వరద ముంపు సంభవించినప్పుడు సమస్య గురించి చర్చిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదు. విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ వర్షం వస్తే అనేక ప్రాంతాల్లో ముంపు సమస్యకు గురవుతోంది. నాలాల గుండా వెళ్లాల్సిన వరద నీరు.. రోడ్లపైకి చేరుతోంది. నాలాల్లో వేస్తున్న వివిధ రకాల వ్యర్థాలు ఇందుకు ఒక కారణం కాగా.. భారీ వర్షాలొస్తే తట్టుకునే సామర్ధ్యం నాలాలకు లేదు. గంటకు 2 సెం.మీ.ల కంటే ఎక్కువ వర్షం కురిసినా మునిగే ప్రాంతాలెన్నో ఉన్నాయి. ప్రధాన ర హదారుల వెంబడి వరదకాలువల్లో సాఫీగా నీరు వెళ్లేలా చేయడం.. పెద్ద వరదకాలువల్లో(నాలాల్లో) పూడిక లేకుండా చేయడంతోపాటు నాలాలను విస్తరించి ఆధునీకరించనిదే సమస్యకు పరిష్కారం ఉండదని కిర్లోస్కర్, ఓయెంట్స్ సొల్యూషన్స్ వంటి కన్సల్టెన్సీ సంస్థలు గతంలోనే సిఫారసు చేశాయి. జీహెచ్ఎంసీలో ఈ సమస్యల పరిష్కారానికి దాదాపు 390 కిలోమీటర్ల మేర పరిధిలోని మేజర్ నాలాల్ని విస్తరించాలంటే 12వేలకు పైగా ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గుర్తించారు. ఇది సాధ్యమయ్యే పనికాదని భావించి తొలిదశలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న బాటిల్‌నెక్స్‌లోనైనా నాలాలను విస్తరిస్తే అతి తీవ్ర సమస్యలకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని భావించారు. అలా దాదాపు 16 కి.మీ.ల మేరనైనా మేజర్ నాలాలను విస్తరించి, ఆధునీకరించాలని భావించారు. అందుకు దాదాపు వెయ్యి ఆస్తులు తొలగించాల్సి ఉంటుందని గుర్తించి దాదాపు 700 ఆస్తులకు సంబంధించి çపూర్తి సమాచారం సిద్ధం చేశారు. ఇప్పటి వరకు వాటిల్లో 25 శాతం ఆస్తులను కూడా తొలగించలేకపోయారు. అందుకు కారణాలనేకం. స్థానికుల వ్యతిరేకత, రాజకీయ కారణాలు, తదితరమైనవెన్నో వీటిల్లో ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా .. దాదాపు రెండు దశాబ్దాల నాడు 2000 సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షానికి నగరం కకావికలమైంది. ఇందిరాపార్కు రోడ్డు, తదితర ప్రాంతాల్లో కార్లు సైతం రోడ్లపై వరదల్లో కొట్టుకుపోయాయి. వరదలతో ముంపు సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏంచేయాలని ఆనాటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారాయి. ఎంసీహెచ్.. జీహెచ్ఎంసీగా అవతరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కానీ ఈ సమస్య మాత్రం నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి 28 వేల ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. 12 వేలకు పైగా ఆస్తులు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఎన్ని చేసినా పరిస్థితి మాత్రం మారలేదు. -
యూపీలో ఘోరం
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లక్నో నుంచి ఢిల్లీకి యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాల్వలో పడిపోవడంతో 29 మంది ప్రయాణికులు ప్రాణాలుకోల్పోయారు. 18 మంది గాయపడ్డారు. యూపీలోని అవథ్ డిపోకు చెందిన ‘జనరథ్’ బస్ లక్నో నుంచి ఢిల్లీలోని ఆనంద్‌విహార్ బస్‌స్టేషన్‌కు బయల్దేరింది. సోమవారం వేకువజామున 4 గంటలవేళ ఎత్మద్‌పూర్ సమీపంలో అదుపు తప్పిన బస్సు రైలింగ్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న నాలాలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో మునిగి ఉండటం, నాలాలో సుమారు 8 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. గాయపడిన ప్రయాణికులను రక్షించగలిగారు. కొన్ని మృతదేహాలు కొట్టుకుపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన 29 మందిలో 19 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 18 మంది క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. పూర్తిగా నుజ్జయిన బస్సును కాల్వ నుంచి బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ‘టూ టయర్ స్లీపర్ కోచ్ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై నుంచి అదుపు తప్పి ఝర్నా నాలాలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది చనిపోగా 18 మంది గాయపడ్డారు’ అని యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ ఘటనా స్థలికి చేరుకుని, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రమాద బాధితులకు అవసరమైన అన్ని రకాల సాయం తక్షణమే అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరిపి 24 గంటల్లో నివేదిక అందజేయాలని సీఎం ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించింది. నోయిడాను ఢిల్లీ శివార్లలోని ఆగ్రాతో కలిపే 165 కిలోమీటర్ల ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. విశాలమైన ఈ రహదారిపై వాహనాల అతివేగం కారణంగా, ముఖ్యంగా రాత్రివేళ, వేకువజామున ఎక్కువగా సంభవిస్తున్నాయని రోడ్డు భద్రత నిపుణులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. బస్సు నుంచి మృతదేహాలను బయటకు తెస్తున్న పోలీసులు -
ఆ 3 కోట్లు ఉత్తమ్‌వి కావా?
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘‘2014 ఎన్నికలప్పుడు కోదాడలో రూ.3 కోట్లు ఇన్నోవాలో దొరికింది వాస్తవం కాదా..? అవి ఉత్తమ్‌కుమార్‌రెడ్డివి కావా? ఉన్నమాట అంటే జానారెడ్డికి అం త ఉలుకు ఎందుకు?’’అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. మంగళవారం సూర్యాపేటలో రూ.81 కోట్లతో నిర్మించనున్న మురుగు నీటి శుద్ధి ప్లాంట్, నాలా, కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో 1,110 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను శంకరగిరి మాన్యాలు పట్టించాలని పిలుపునిచ్చారు. కోదాడ నుంచే విజయయాత్ర .. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలు చేసినట్లు 40 మంది కాంగ్రెస్ నాయకులు బస్సు యాత్రల పేరుతో దొంగ యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చరమగీతం పాడి, తెలంగాణ ముఖ ద్వారం కోదాడ నుంచే విజయయాత్ర ప్రారంభం కావాలని, గులాబీ జెండా పాతాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీతారామ ప్రాజెక్టుతో గోదావరి నీళ్లు పాలేరుకు తెస్తామని, నాగార్జునసాగర్ నీళ్లతో కోదాడను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రైతు బిడ్డగా, రైతుగా.. రైతుల పక్ష పాతిగా ఉంటూ వారి కోసం ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి పథకం ప్రవేశపెట్టారని దేశంలో ఏ సీఎం ఇలా రైతుల గురించి ఆలోచించలేదన్నారు. రైతులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ప్రకటించారని, రాష్ట్రంలోని 72 లక్షల రైతు కుటుంబాలు దీని పరిధిలోకి వస్తాయన్నారు. నల్లగొండలో ఫ్లోరిన్ భూతం జిల్లాలోని కాంగ్రెస్ నేతల పుణ్యమేనన్నారు.. జానారెడ్డి నియోజకవర్గం పక్కనే ఉన్న దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో ఏటా ఫ్లోరోసిస్ పెరిగిందని.. 7 సార్లు గెలిచిన ఆయన ఏం చేశారన్నారు. ఆడకూతుళ్లకు మేనమామ కేసీఆర్.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రాష్ట్రంలోని ఆడకూతుళ్లకు కేసీఆర్ మేనమామ లాగా మారారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.5,500 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ జలాల కోసం ఇదే కోదాడ నుంచి హాలియా వరకు నాడు కేసీఆర్ పాదయాత్ర చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతంలో సుద్ద బావులు ఇస్తే.. రాష్ట్రం వచ్చాక ఊట బావులను ఇచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సభలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
వాగులోకి కాలువ
శంకరపట్నం : కేశవపట్నం వాగులోకి ఎస్సారెస్పీ ప్రధానకాలువ నీటిని విడుదల చేయడంతో ముత్తారం చెరువు మత్తడి దూకుతోంది. ఎల్ఎండీ ప్రాజెక్ట్ నుంచి ఆన్ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తుండగా ఆదివారం నిలిపివేశారు. ఉపకాలువల ద్వారా చివరి ఆయకట్టుకు సాగు నీరందకపోవడంతో రైతులు కాలువ వెంట తిరుతున్నారు. డీబీఎం–13 కాలువ నుండి 8ఎల్ ఉపకాలువలో పేరుకుపోయిన పూడికను ఆదివారం కన్నాపూర్ రైతులు శ్రమదానంతో తొలగించారు. కాగా కన్నాపూర్, కాచాపూర్, ధర్మారం, గద్దపాక, అర్కండ్ల రైతుల పంటలకు నీరందుతుందని ఆశిస్తే కేశవపట్నం ఎస్కేఫ్ గేటు ఎత్తడంతో కేశవపట్నం వాగు ప్రవహిస్తోంది. ఈ నీరు ముత్తారం చెరవు నిండిపోవడంతో కల్వల ప్రాజెక్ట్‌లోకి నీరు చేరనుంది. వాగువెంట రైతులకు మేలు కేశవపట్నం వాగులో ఎస్సారెస్పీ కాలువ నీటిని విడుదల చేయడంతో ఈ వాగుపై ఆధారపడిన పంటలకు సాగునీరంది రైతులకు లాభం చేకూరనుంది. కేశవపట్నం, మక్త, ముత్తారం, ఏరడపెల్లి, అర్కండ్ల వాగులతో నీరు ప్రవహించి కల్వల ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ఈ ప్రాంత రైతులు సాగు చేసిన పంటలకు నీరందిస్తున్నారు. కల్వల ప్రాజెక్ట్ నీరు నిండితే ఈ ప్రాజెక్ట్ కింద రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటికి డోకా ఉండదు. వాగు ప్రవహిస్తే సమీపంలో వ్యవసాయబావిలో నీటి ఊటపెరిగి పంటలకు నీరు సమకూరనుంది. వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరాఫరా చేస్తుండడంతో కాలువ వెంట సాగు చేసిన వరిపంటలకు ఇబ్బందులు తీరనున్నాయి. చివరి ఆయకట్టుకు అందని నీరు ఎస్సారెస్పీ ప్రధానకాలువతో యాసంగి సాగుకు నీటిని విడుదల చేయగా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు గస్తీతిరుగుతున్నారు. రోజుకో ప్రాంతానికి నీటిని పంపించే ఏర్పాట్లు చేస్తున్నా... నీటి తడులు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు తడులు ఉందించినా చివరి ఆయకట్టుకు సాగు నీరందని రైతులు కళ్లముందే పంట ఎండుతున్నా చేసేదీ లేక రైతులు దిగులు చెందుతున్నారు. నీరందడం లేదు కాచాపూర్ గ్రామంలో డీబీఎం– 15 కాలువతో నీటిని విడుదల చేస్తున్నారు. కాలువ నీళ్లు వత్తయని 6 ఎకరాల్లో వరిపంట సాగు చేసిన. మూడు రోజులు కాలువ చుట్టూ తిరిగితే నీళ్లు అచ్చినయ్. మళ్లీ కాలువకాడికి వెళ్తే నీళ్లు బంద్ చేసిండ్రని తెలిసింది. వేసిన పంటలు ఎండిపోకుండా చివరి ఆయకట్టుకు సాగు నీరందించాలి. – మల్గిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, కాచాపూర్ -
తాగిన మైకంలో నాలాలోకి దిగి... కొట్టుకుపోయి..
హైదరాబాద్: తాగిన మైకంలో నాలాలోకి దిగి, నీటి ఉధృతికి ఓ యువకుడు కొట్టుకుపోయిన సంఘటన హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ వర్షం కురిసింది. అదే సమయంలో ఓ నల్ల చొక్కా వేసుకున్న యువకుడు చింతల్ మధుసూదన్‌రెడ్డి నగర్ నాలాలోకి దిగాడు. ఒక్కసారిగా నాలాలోని నీటి ఉధృతి పెరగడంతో కొద్దిసేపు సిమెంట్ దిమ్మెను పట్టుకుని నిల్చున్నాడు. ఇది గమనించిన స్థానికులు గుంపులుగా అక్కడకు చేరుకుని, యువకుడిని రక్షించేందుకు నీటిలోకి తాడును విసిరారు. యువకుడు తాడును గట్టిగా పట్టుకోవడంతో నెమ్మదిగా లాగడం ప్రారంభించారు. ఇక బయటికి వచ్చినట్లే అనుకుంటుండగా తాడు యువకుడి చేజారింది. దీంతో ప్రవాహ ఉధృతిలో అతను కొట్టుకుపోయాడు. అంత మంది ఉండి.. కళ్ల ముందే ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోతుండటంతో కాపాడేందుకు కొందరు స్థానికులు నాలా వెంట పరుగు తీశారు. నాలాలో నీరు ఎక్కువగా వస్తుండటంతో యువకుడు కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై వీరబాబు ఇతర పోలీసులతో వెంటనే రంగంలోకి దిగారు. ద్వారకానగర్ నాలా వద్ద చెత్త తట్టుకుని ఉండటంతో జేసీబీతో తొలగించారు. ప్రవాహ వేగానికి అక్కడికి కొట్టుకుని వస్తాడని భావించినా, యువకుడి ఆచూకీ లభ్యంకాలేదు. కాగా తాగిన మైకంలోనే యువకుడు నాలాలోకి దిగాడని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ యువకుడు ఎవరన్న విషయం ఇంకా తెలియరాలేదు. -
కూల్చివేతలను పరిశీలిస్తున్న మేయర్
హైదరాబాద్: నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపు మూడోరోజు కొనసాగుతోంది. ఈ కూల్చివేతలను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలిస్తున్నారు. మల్కచెరువు, రాయదుర్గం చెరువుల్లో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. అలాగే, చెరువు లోతట్టు ప్రాంతంలోని బఫర్ జోన్లో నిర్మించిన పెద్ద షెడ్డును కూల్చివేస్తున్నారు. మేయర్ వెంట జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి కూడా ఉన్నారు. -
ఒత్తిళ్లకు తలొగ్గవద్దు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నాలాలపై అక్రమంగా వెలిసిన కట్టడాల కూల్చివేతను కొనసాగించాలని.. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని జీహెచ్ఎంసీ అధికారులను పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. నాలాలపై ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన సూచనలను, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపు పురోగతిని సమీక్షించేందుకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి నర్సింగ్‌రావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు బి.జనార్దన్‌రెడ్డి, చిరంజీవులు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్‌మిట్టల్ తదితరులతో భేటీ అయ్యారు. వర్షాలతో నగరంలో ఏర్పడిన పరిస్థితులను జీహెచ్ఎంసీ అధికారులు మంత్రికి వివరించారు. నగరంలో తక్షణమే రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు అవసరమైన సహకారాన్ని జీహెచ్ఎంసీకి ప్రభుత్వం అందిస్తుందని.. ఇతర శాఖల్లోని ఇంజనీర్లను తాత్కాలికంగా జీహెచ్ఎంసీకి కేటాయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 30 మంది ఇంజనీర్లను జీహెచ్ఎంసీకి డిప్యుటేషన్‌పై పంపాలని వివిధ ఇంజనీరింగ్ శాఖల అధిపతులను సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఆ ఇంజనీర్లను సర్కిళ్ల వారీగా నియమించుకుని.. బుధవారం నుంచే నగరంలో రోడ్ల మరమ్మతు పనులకు వినియోగించుకోవాలని సూచించారు. రోడ్ల మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలన్నారు. కూల్చివేతలపై కేసీఆర్ ఆరా హైదరాబాద్ నగరంలో నాలాలను ఆక్రమించి, నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలోనే కేటీఆర్‌కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయవద్దని సూచించారు. కూల్చివేతల వివరాలను రోజువారీగా తనకు పంపించాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులుతో సైతం కేసీఆర్ మాట్లాడి కూల్చివేతల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గవద్దని సూచించారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
* నాలాలు, చెరువుల్లో వెలసిన భవనాలపై ఉక్కుపాదం * ఆపరేషన్ మొదలుపెట్టిన డిమాలిషన్ స్క్వాడ్ సాక్షి, హైదరాబాద్: నాలాలు, చెరువుల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే రాజధానిలో ‘డిమాలిషన్ స్క్వాడ్’ ఆపరేషన్ షురూ చేసింది. గత పదేళ్లలో కుప్పలుతెప్పలుగా వెలసిన కట్టడాలను గుర్తించిన ప్రత్యేక బృందాలు... సోమవారం ఉదయమే రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు ఈ బృందాల్లో ఉన్నారు. కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, బంజారాహిల్స్, నాంపల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తొలిరోజు కూల్చివేతల సందర్భంగా గుర్తించిన అక్రమాల్లో గ్యాస్ ఏజెన్సీ, ఫంక్షన్‌హాల్‌తో పాటు వివిధ వాణిజ్య భవనాలున్నాయి. నాలాలు, చెరువు భూముల్లో వెలసినవి... బీఆర్ఎస్ దరఖాస్తులకు గడువు ముగిశాక, ఎలాంటి అనుమతి లేకుండా జరుగుతున్నవి... మొత్తం కలిపి 39 నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ ఆక్రమణల్లో బడా బాబులు నిర్మించినవే అధికంగా ఉండటం విశేషం. వీటితోపాటు శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను సైతం నేలమట్టం చేశారు. మొత్తం 39 నిర్మాణాలను కూల్చివేశారు. ఇరిగేషన్, విద్యుత్, జలమండలి తదితర శాఖల అధికారులు ఈ ఆపరేషన్‌లో సహకరించారు. కూల్చివేతల పర్వం ఇకపై కూడా కొనసాగుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. నేలమట్టం చేసిన నిర్మాణాల్లో కొన్ని... కాప్రా నల్లచెరువు నాలాపై వెలసిన మహాలక్ష్మి ఎల్పీజీ గ్యాస్ గోడౌన్ 685 మీటర్ల నాలాను కబ్జా చేసి బంజారా ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేసిన పార్కింగ్ నాలాను పూడ్చివేసి శేరిలింగంపల్లి మదీనాగూడలోని ఎన్ఎస్కే బ్లిస్ మెడోస్ అపార్ట్మెంట్లో చేపట్టిన నిర్మాణం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉన్న నాలాపైనా అక్రమ నిర్మాణాలు హస్తినాపురం దేవకమ్మతోట సమీపంలో నాలాను ఆక్రమంచి జరిపిన నిర్మాణాలు సరూర్‌నగర్‌లో అనుమతి లేకుండా నిర్మించిన నాలుగో అంతస్తు మైలార్ దేవ్‌పల్లి అలీనగర్ వద్ద పల్లెచెరువును ఆక్ర మించి కట్టిన నిర్మాణాలు కుత్బుల్లాపూర్ ఫాక్స్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఆరు ప్రహరీలు. ఓకే చెప్పిన కేటీఆర్.. అడ్డుకున్న కార్పొరేటర్ విశ్వనగరం దిశగా అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తొలిరోజే అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అడ్డు చెప్పారు. మూసాపేట ఆంజనేయనగర్ రోడ్డునంబర్ 4లో అనుమతులు లేకుండా భారీ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన ఓ వైద్యురాలు ట్వీటర్లో ఫొటోలతో సహా వివరాలను మంత్రి కేటీఆర్‌కు పంపారు. స్పందించిన కేటీఆర్.. ఆ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. సోమవారం భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ అనురాధ ఆధ్వర్యంలోని బృందాన్ని మూసాపేట టీఆర్ఎస్ కార్పొరేటర్ తూము శ్రవణ్ అడ్డుకున్నారు. ‘అక్రమ భవనాలు మస్తుగా ఉన్నయ్.. అన్నింటినీ కొట్టేయ్యండి. మూసాపేట మొత్తం డీవియేషనే. నా ఇల్లు కూడా డీవియేషన్‌తోనే ఉంది. ఎలా కూలుస్తారో కూల్చండి. మున్సిపల్ ఆఫీసు ముందు టెంటు వేస్తా’ అని సదరు కార్పొరేటర్ హెచ్చరించారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. -
నగరంలో ‘నాలా’ రహస్యం..?
* భాగ్యనగరానికి సంకటంగా మారిన నాలాలు * చిన్నపాటి వర్షానికే కాల్వలుగా మారుతున్న రోడ్లు ఈ నగరానికేమైంది? ఓ వైపు కాస్త వర్షానికే చెరువును తలపించే రోడ్లు.. మరోవైపు ముంపు బారిన పడుతున్న లోతట్టు ప్రాంతాలు.. ఎవరూ నోరుమెదపరేంటి? పేరడీని తలపిస్తున్నా.. ఇది పచ్చి నిజం.. వర్షమంటేనే విశ్వనగరం వణుకుతోంది.. నగరవాసి కలవరపడుతున్నాడు.. అసలు నీళ్లు పారాల్సిన నాలాలు ఏమయ్యాయి? చిన్న వర్షానికే ఎందుకు పొంగిపొర్లుతున్నాయి? ఇంతకీ నగరంలోని నాలాల రహస్యమేంటి? సాక్షి, హైదరాబాద్: నగరంలో వాన పడిందంటే చాలు.. రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని నగరవాసులు అల్లాడుతున్నారు. బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నడుంలోతు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి కారణం.. నీళ్లు పారాల్సిన నాలాలను కబ్జా చేయడమే.. ఎక్కడికక్కడ అక్రమాల అడ్డుగోడలు.. నేలపై కట్టాల్సిన నిర్మాణాలను నాలాల్లో కట్టేస్తున్నారు. గ్రేటర్లో మైనర్, మేజర్ నాలాలపై మొత్తం 30 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అంచనా. ఇది పదేళ్ల క్రితం నాటి లెక్క మాత్రమే. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దీనికితోడు నాలాల్లోకి చేరుతున్న వ్యర్థాలు కూడా ముంపు కష్టాలకు కారణమవుతోంది. ప్రతి రోజు నాలాల్లో సుమారు 60 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి. ఇవి నీటి ప్రవాహానికి అడ్డుపడుతుండటంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు వర్షపు నీరు రోడ్లపైకి వస్తోంది. నాలాలను ఆక్రమించి అపార్ట్మెంట్లు, ఇళ్లు నిర్మిస్తున్నా.. డ్రైనేజీ కనెక్షన్లు నాలాల్లోకే ఇస్తున్నా పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులకు ఈ పాపంలో భాగస్వామ్యం ఉంది. గ్రేటర్ దుస్థితిని మారుస్తామని రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. సమస్యకు నాలాల ఆధునీకరణే శాశ్వత పరిష్కారమని, ఆ పని తాము చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీలు గుప్పించారు. ఇందుకు ప్రణాళికలు కూడా రూపొందించారు. రెండేళ్లు గడిచింది.. ఇప్పటి వరకూ కార్యాచరణ మాత్రం లేదు. జీహెచ్ఎంసీ పాలకమండలి సమావేశంలో గళమెత్తినా మార్పు లేదు. రూ.10 వేల కోట్లతో నాలాలను ఆధునీకరిస్తే నగరానికి ముంపు తప్పుతుందని ఈ అంశంపై ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ కమిటీ నివేదిక చెబుతోంది. సమస్య తెలుసు. పరిష్కార మూ తెలుసు. కానీ.. కర్ణుని చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా పనులు ముందుకు జరగడం లేవు. ఇందుకు నిధుల లేమి ఓ కారణమైతే.. పాలనా యంత్రాంగం తగిన శ్రద్ధ చూపకపోవడం మరో కారణం. సిఫార్సులు బుట్టదాఖలు ఆక్రమణల తొలగింపు ఒకేసారి సాధ్యం కానందున తొలిదశలో అత్యం త సమస్యాత్మకంగా ఉన్న 26 కి.మీ. మేర ఆక్రమణలు తొలగించాలని ఏడాది క్రితం స్వచ్ఛ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మొత్తం 1,152 నిర్మాణాలను తొలగించేందుకు రూ. 223 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇంకా అనేక సిఫార్సులు చేసింది అయితే ఇవన్నీ బుట్టదాఖలయ్యాయి. ఎప్పుడు ఆపద వస్తే అప్పుడే.. మరికొద్ది రోజులు భారీ వ ర్షాలు తప్పవనే సూచనలతో అధికారులు తాత్కాలిక చర్యలకు సిద్ధమయ్యారు. నాలాలు తెగే ప్రమాదం ఉండటంతో ఇప్పటికే జామ్ అయిన నాలాల్లో ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాలేవీ వేయకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. నాలాల్లో వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చేవారికి నెలకు రూ.10 వేల వంతున ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు. స్వచ్ఛ వలంటీర్లనూ నియమించాలని భావించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి, వారి ద్వారా అవగాహన కల్పించే ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ఆరు మాసాలకు కార్యాచరణ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. -
కబ్జానుంచి.. నాలా విడుదల!
♦ శాశ్వత నిర్మాణాలతో మూసేసిన ♦ వ్యాపారులు 15 ఏళ్ల తర్వాత ♦ తెరుచుకున్న మోరీలు ♦ పోలీస్ పహారాలో ఆక్రమణల తొలగింపు పట్టణంలోని నాలాను ఆక్రమిస్తూ వ్యాపారులు నిర్మించిన కట్టడాలను బుధవారం పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. ఓపెన్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ఆరు నెలల క్రితం మున్సిపల్ కౌన్సిల్లో ఏకగ్రీవ తీర్మానం చేసి.. దీనికి అవసరమైన రూ.5 లక్షలు మంజూరు చేశారు. కానీ టెండర్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆరు నెలలైనా పనులు ప్రారంభించకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు పనులకు అడ్డు తగలడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నాలాలను ఆక్రమించి మళ్లీ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ ఎంకేఐ అలీ హెచ్చరించారు. - వికారాబాద్ పట్టణంలోని నాలాలో పదిహేనేళ్లుగా పేరుకుపోయిన మురుగు, చెత్తాచెదారం తొలగింపునకు ఎట్టకేలకు బీజం పడింది. నాలాను కబ్జా చేసిన వ్యాపారులు దీనిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతో.. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వీలు లేకుండా పోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆరు నెలల క్రితం కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిధులు విడుదల చేసినా.. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోవడంతో మున్సిపల్ అధికారులు నడుంబిగించారు. వర్షాకాలం వస్తే మురుగు నీరు మొత్తం రోడ్లపై చేరుతుందనే ఉద్దేశంతో స్వయంగా పనులు ప్రారంభించారు. వారం రోజుల్లో పూర్తి చేస్తాం... బీజేఆర్ చౌరాస్తా నుంచి ఆలంపల్లి వరకు రెండు వైపులా ఓపెన్ డ్రైనేజీగా మార్చనున్నట్లు కమిషనర్ అలీ తెలిపారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వ్యాపార సముదాయాల ముందు నిర్మాణాలు చేసుకోవాలనుకునే వారు సొంత స్థలాన్ని వాడుకోవాలని సూచించారు. పార్కింగ్ కోసం స్థలాన్ని వదలాలని తెలిపారు. మళ్లీ ఎవరైనా నాలాపై నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపెన్ నాలాను మూసేసే ప్రయత్నం చేయొద్దని తెలిపారు. నాలాకు 5 ఫీట్ల సెట్‌బ్యాక్ ఉంచి వ్యాపార సముదాయలు నిర్మించుకోవాలని ఆదేశించారు. పనులను అడ్డుకుంటే చర్యలు తప్పవన్నారు. పాత మూస హోటల్ వెనక స్థలంలో మంచి నీటి బావిని ఆక్రమించి మున్సిపల్ స్థలంలో చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టంచేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపు ఇన్చార్జ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యేసు ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగాయి. కార్యక్రమంలో టీపీఎస్ సత్యనారాయణ, డీఈ గోపాల్, ఏఈ శ్రీనివాస్, జవాన్లు వినోద్ పాల్గొన్నారు. -
నాలాపై ఇరుక్కుపోయిన కారు...
హన్మకొండ: అదుపు తప్పిన కారు..నాలా పైకి దూసుకెళ్లి ఇరుక్కుపోయింది. వరంగల్ జిల్లా హన్మకొండలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు పక్కనే గల నాలాలోకి దూసుకెళ్లిన కారు.. నాలా అంచుల మధ్య ఇరుక్కుంది. అదృష్టవశాత్తూ.. కారు నాలాలోకి పడిపోకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులోకి జారుకోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. -
ఆ వర్షం మనకొస్తే..!
⇒ చెన్నై స్థాయిలో కురిస్తే వరద ముప్పు ⇒ కాలం చెల్లిన నాలాలే ప్రధాన సమస్య ⇒ అమలుకు నోచుకోని కీలక సిఫార్సులు వరదలతో అతలాకుతలమవుతున్న చెన్నై నగరంలో ఇటీవల ఒక రోజులో కురిసిన వర్షం 118 సెం.మీ. ఊళ్లూ ఏళ్లూ ఏకం చేసిన ఆ వర్ష బీభత్సాన్ని తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. మరి హైదరాబాద్ మహా నగరంలో ఆ స్థాయి వర్షం కురిస్తే? అమ్మో... ఇంకేమైనా ఉందా? 2000వ సంవత్సరంలో కురిసిన 24 సెం.మీ. వర్షానికే నగరం ‘మునిగిపోయింది.’ రహదారులు గోదారులయ్యాయి. రోడ్లపై పడవలు తిరిగాయి. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా అప్రమత్తమవ్వాల్సిన అవసరాన్ని చెన్నై అనుభవం చెబుతోంది. సిటీబ్యూరో: నగరంలో ఓ మాదిరి వాన కురిసినా రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. చిన్న చినుకుకే రహదారులు చిత్తడిగా మారి... రోత పుట్టిస్తున్నాయి. ఏమాత్రం వర్షం కురిసినా వరదలు తప్పడం లేదు. ఫలితంగా ట్రాఫిక్‌తో పాటు జనజీవనమూ స్తంభిస్తోంది. ఇలాంటి ‘సున్నితమైన’ నగరంలో చెన్నైలో కురిసిన స్థాయిలో వర్షం పడితే... ఈ ఊహకే చిగురుటాకులా వణికిపోవాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం నాలాల పరి(దు)స్థితి. ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన నాలాలే ఇప్పటికీ ఉపకరిస్తున్నాయి. ఉన్న వాటిలో చాలా వరకు పూడుకుపోవడం... మరికొన్ని ఆక్రమణలకు గురికావడంతో మా వల్ల కాదంటూ మ్యాన్‌హోళ్లు మురికినీ, నీటినీ రోడ్లపైకి కక్కేస్తున్నాయి. నేటి పాలకుల కన్నా నాటి నవాబే మిన్న... నిజాం నవాబు హయాంలో 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో అప్రమత్తమైన నవాబు ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా మేరకు యుద్ధ ప్రాతిపదికన నాలాల నిర్మాణం ప్రారంభించారు. దాదాపు పదేళ్ల పాటు ప్రణాళికా బద్ధంగా వీటిని నిర్మించారు. ఇప్పటి మన పాలకులకు... నిజాంకు ఉన్న దానిలో కొంతైనా నిబద్ధత కనిపించడం లేదు. 2000వ సంవత్సరం ఆగస్టులో సిటీలో రికార్డు స్థాయిలో 240.5 మిల్లీమీటర్ల వర్షం కురిసి వరదలు ముంచెత్తాయి. ఈ పరిణామాలకు నాలాలే కారణమని గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఓ హైపవర్ కమిటీని నియమించి నాలాల అభివృద్ధిపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈమేరకు అధ్యయనం చేసిన కమిటీ కొన్ని కీలక సిఫార్సులు చేసింది. దశాబ్దం దాటినా ఇప్పటికీ ఇవి అమలు కాలేదు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే నగర జీవికి నరకం తప్పడం లేదు. నిజాం కాలంలో నాలాలను గంటకు 12 మిల్లీ మీటర్ల వర్షాపాతాన్ని తట్టుకునే సామర్థ్యంతో నిర్మించారు. ప్రస్తుతం వీటిని గంటకు 40 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని సైతం తట్టుకునే స్థాయికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మ్యాన్‌హోల్స్ రూపంలో మరో ముప్పు... నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, వాటర్బోర్డ్లకు చెం దిన మ్యాన్‌హోళ్లతో వర్షాకాలంలో మరో ముప్పు పొం చి ఉంటుంది. శాఖల మధ్య సమన్వయ లోపం... సరైన స్పందన లేని కారణంగా ఏటికేడు రోడ్ల ఎత్తు పెరుగుతోంది. అందుకు తగ్గట్టు మ్యాన్‌హోళ్ల ఎత్తును పెంచకపోవడంతో అనేక ప్రాంతాల్లో వీటి దగ్గర గోతులు ఉన్నాయి. వర్షాకాలంలో వీటిలో నీరు నిండి గుర్తించడం కష్టంగా మారుతోంది. ఇవే వాహన చోదకులను ప్రమాదాల బారినపడేలా చేస్తున్నాయి. ఇక, మూతలేని మ్యాన్‌హోళ్లలో పడి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు ఎన్నో. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదు. ట్రాఫిక్ జామ్‌తో... వర్షాకాలంలో రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడటానికి వాటర్ లాగింగ్ ఏరియాలు ప్రధాన కారణం. ఇలాం టివి నగర వ్యాప్తంగా 132 ఉన్నాయి. వీటిలో 14 అ త్యంత సమస్యాత్మకమైనవిగా ట్రాఫిక్ అధికారులు తే ల్చారు. ఈ ప్రాంతాల్లో గంటలకొద్దీ నీళ్లు నిలుస్తుండటం తో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇవీ హైపవర్ కమిటీ సిఫార్సులు ► అత్యవసరంగా నగరంలోని 8 ప్రధాన నాలాలను విస్తరించాలి. ► వాటికి రిటైనింగ్ వాల్స్ నిర్మించాలి. ► నాలాల ఆధునికీకరణకు రూ.1000 కోట్లు కేటాయించాలి. ► నాలాల సగటు వెడల్పు 40 నుంచి 50 మీటర్లు ఉండాలి. ► రానున్న 50 ఏళ్లలో 240 మిల్లీమీటర్ల వర్షపాతం ఎన్నిసార్లు నమోదైనా ప్రమాదం లేని స్థితిలో నాలాలు విస్తరించాలి. ► నాలాల్లో ఉన్న 6,520 ఆక్రమణలను తొలగించడానికి *53.19 కోట్లు కేటాయించాలి. సంఖ్యల్లో వాస్తవాలు ►నగరంలోని వాహనాల సంఖ్య: దాదాపు 30 లక్షల పైనే ► రోడ్ల పొడవు: 3,823 కి.మీ. ► నగర విస్తీర్ణంలో రోడ్ల వంతు: 6 శాతం ► వాస్తవంగా ఉండాల్సింది: 13 శాతం ► నగరంలోని నాలాల సంఖ్య: 750 ► వీటిలో ప్రధానమైనవి: దాదాపు 71 ► నాలాల పొడవు: 2,800 కి.మీ. ► ప్రధాన నాలాలు ఆక్రమణలో ఉన్న ప్రదేశాలు: 2,192 ► సిటీలోని మ్యాన్‌హోళ్లు: దాదాపు 2 లక్షలు ► అత్యవసరంగా ఎత్తు పెంచాల్సిన ►మ్యాన్‌హోళ్లు: 149 ప్రాంతాల్లో 726 -
డేంజర్ నాలాట
సిటీలో పొంచి ఉన్న ముప్పు వందల ఏళ్ల చరిత్ర గల భాగ్యనగరంలో అడుగుకో సమస్య కనిపిస్తుంది. ఐటీ రంగంలో ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేసిన హైటెక్ సిటీ మౌలిక వసతుల కల్పనలో తీసికట్టుగా మారింది. కోటిమంది జనాభాకు చేరువైన నమ నగరంలో పాలకుల నిర్లక్ష్యం బుసలు కొడుతోంది. కాలనీల్లో ఓపెన్ నాలాలు కోరలు సాచి ప్రజలను కాటేస్తున్నాయి. చినుకు పడితే చెరువులను తలపించే రహదారులు.. కొద్ది పాటి వర్షానికే ఉగ్రరూపం దాల్చే నాలాలు ప్రాణసంకటంగా మారాయి. దుర్ఘటన జరిగినప్పుడు నాయకులు ఇచ్చే హామీలు ఒట్టి ‘కోతలే’ అన్న చందంగా మిగిలాయి. ఆర్నెల్ల క్రితం నల్లవాగు సంజయ్ అనే బాలుడిని పొట్టనబెట్టుకుంది. ఐదేళ్ల క్రితం కుత్బుల్లాపూర్‌లో ఓపెన్ నాలా చారి అనే వ్యక్తి ప్రాణాలు మింగింది. ఇన్ని జరుగుతున్నా అధికారుల్లో చలనం ఉండదు. పాలకుల తీరులో మార్పు రాదు. పాలకుల్లో చలనం తీసుకువద్దాం.. మనం ఎదుర్కొంటున్న సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ ప్రాంతంలో ప్రధానమైన ప్రజా సమస్యను ‘సాక్షి’ దృష్టికి తీసుకురండి. ఓపెన్ నాలా.. ఎన్నాళ్లిలా.. కుత్బుల్లాపూర్: అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతోంది.. ప్రాణాలు పోతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. జీడిమెట్ల నుంచి పాపయ్య యాదవ్‌నగర్ వరకు ఉన్న నాలా విస్తరణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో 2010లో కురిసిన భారీ వర్షాలకు వెంకటేశ్వర్ నగర్లో ఓ ఉపాధ్యాయుడు నాలాలో కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయినా నాలా పనులు ముందుకు సాగలేదు. రూ. 4.5 కోట్లతో ప్రారంభించిన ఈ పనులు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సాగుతునే ఉన్నాయి. ప్రమాదపుటంచున కాలనీలు నాగోలు: ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఉన్న ఓపెన్ నాలాలు ప్రమాదకరంగా మారాయి. పైకప్పు లేకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు నాలాలు కనిపించక పాదచారులు అందులో పడి గాయపడ్డ సంఘటనలు ఉన్నాయి. మన్సూరాబాద్, సరూర్‌నగర్, కొత్తపేట, ఆర్కేపురం, కర్మన్‌ఘాట్, హయత్‌నగర్ డివిజన్లలో ఓపెన్ నాలాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా వాటిపై కప్పులు వేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పిన మాట ఆచరణ పెట్టలేదు. చెత్తతో పూడుకుపోయి మురుగు కాలనీల్లోని ఇళ్లల్లో చేరుతోందని బండ్లగూడలోని త్యాగరాయనగర్, అయ్యప్పనగర్ ప్రజలు వాపోతున్నారు. ఓపెన్ నాలాలోని మురుగు నుంచి విపరీతమైన దుర్వాసన వెలువడుతోంది. వీటిపై పైకప్పు వేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు. దుర్వాసనతో సావాసం.. మోతీనగర్: మోతీనగర్ డివిజన్లో బబ్బుగూడ, రామారావునగర్, స్నేహపురికాలనీ, లక్ష్మీనగర్, గాయత్రినగర్‌లో ఉన్న ఓపెన్ నాలాల్లో తరచూ కాలనీల్లోని చిన్న పిల్లలు, పశువులు పడి గాయాల పాలవుతున్నారు. నాలాపై ఎలాంటి కప్పుగాని, రక్షణ గోడలు లేకపోవడంతో చిన్నారులను బయటకు పంపించాలంటే వారి తల్లిదండ్రులు జంకుతున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నారులు ఇంట్లోని వస్తువులను తెచ్చి ఈ ఓపెన్ నాలాలో పడేస్తున్నారు. కాలనీల్లోని మహిళలు చెత్తను సైతం నాలాలోనే వేస్తుండడంతో మురుగునీరు పారుదలకు అడ్డం పడుతోంది. జీహెచ్ఎంసీ అధికారులు చుట్టం చూపుగా ఒకసారి వచ్చి చూసిపోతున్నారే గాని పైకప్పు వేయాలన్న తలంపు చేయడం లేదు. అప్పుడప్పుడు నాలాలో తీసిన మట్టిని పక్కనే వేస్తుండడంతో వర్షానికి అది తిరిగి నాలాలోకే వెళుతోంది. ఎన్నికల సమయంలో నేతలు ఓపెన్ నాలాపై పైకప్పు వేయిస్తామని హామీ ఇవ్వడం.. అమలు చేయకపోవడం పరిపాటిగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నాలాలు పొంగి సమీపంలోని నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉస్మాన్‌గంజ్‌లో అబిడ్స్: ఉస్మాన్‌గంజ్ ఓపెన్‌నాలా స్థానికులకు ప్రాణసంకటంగా మారింది. అఫ్జల్‌సాగర్ నుంచి వస్తున్న ఈ నాలా గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ మీదుగా ఉస్మాన్‌గంజ్ నుంచి ఇమ్లిబన్ మూసీలో కలుస్తుంది. ఉస్మాన్‌గంజ్‌లోని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న ఈ నాలా అటూ ఇటూ వందలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాగా వర్షాకాలంలో నాలా నిండడంతో వర్షపునీరు ఇళ్లలోకి, రోడ్లపైకి ప్రవహిస్తోంది. వర్షం పడినప్పుడల్లా ఈ ఓపెన్ నాలాతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఇటీవల వర్షాలకు నాలాలోని నీరు బేగంబజార్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. వర్షం వస్తే ప్రమాదమే.. గచ్చిబౌలి: గచ్చిబౌలి నాలాకు పైకప్పు లేకపోవడంతో వాహనదారులు, పాదాచారులకు ప్రమాదకరంగా మారింది. వర్షం వచ్చినప్పుడు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ఒపెన్ నాలా ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ సమయంలో ఎవరూ ఈ రోడ్డులో వెళ్లేందుకు సాహసించడం లేదు. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని బరంకుంట నుంచి ఖాజాగూడ పెద్ద చెరువు వరకు గచ్చిబౌలి నాలా విస్తరించి ఉంది. ఇందిరానగర్, గచ్చిబౌలి, గుల్షన్ నగర్, పీజేఆర్ నగర్, జనార్దన హిల్స్, డైమండ్ హిల్స్ మీదుగా ఇది ప్రవహిస్తుంది. దశాబ్ధాలు గడిచినా నాలాకు పైకప్పు వేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒపెన్ నాలాను కొన్ని చోట్ల కబ్జా చేశారు. గచ్చిబౌలిలోని హెచ్‌పీ గ్యాస్ ఆఫీస్ సమీపంలో వర్షం వస్తే నాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. రోడ్డుపై రెండున్నర అడుగుల ఎత్తున వరద ప్రవహించడంతో నాలా, రోడ్డు కలిసిపోతున్నాయి. ప్రాణాలకు ‘రక్షణ’ లేదు.. మూసాపేట: కూకట్పల్లి సర్కిల్ పరిధిలో ఓపెన్ నాలా హుస్సేన్ సాగర్‌లోకి ప్రవహిస్తుంది. అయితే దీనికి పలుచోట్ల రక్షణ గోడగాని, ఇనుప కంచె గాని లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్‌దయాళ్ నగర్లో రోడ్డు కింది నుంచి ఓపెన్ నాలా ప్రవహిస్తుంది. ఇది రోడ్డుకు సమాంతరంగా ఉంది. కానీ గ్రేటర్ అధికారులు రోడ్డుకు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు ప్రమాదవశాత్తు నాలాలో పడిపోతున్నారు. భరత్‌నగర్ కూరగాయాల మార్కెట్ వద్ద మరీ ప్రమాదకరంగా ఉంది. మార్కెట్ రైతులు, వినియోగదారులతోను, జింకలవాడకు వెళ్లే ప్రజలతోను నిత్యం రద్దీగా ఉంటుంది. భవన నిర్మాణ వ్యర్థాలను నాలా పక్కన పోయడంతో మట్టి జారి కాలువలోకి జారుతోంది. పాదచారులు కూడా ఈ మట్టిపై వెళుతూ నాలాలోకి జారి పడిపోతున్నారు. రాజీవ్‌గాంధీనగర్ నుంచి ప్రశాంత్ నగర్ మార్గంలో ప్రజలు చెత్తను ఓపెన్ నాలాలో వేస్తున్నారు. దీంతో కాలువ మొత్తం పూడుకుపోయింది. కొట్టుకు వస్తున్న పరిశ్రమల వ్యర్థాల వాసన తట్టుకోలేక అవస్థలు పడుతుంటే, ఈ చెత్త కుళ్లి మరింత దుర్వాసన వెదజల్లుతూ రోగాలను పెంచుతోంది. నిత్యం భయం..భయం.. సైదాబాద్: వర్షం వస్తే రోడ్డు ఎక్కడో.. నాలా ఎక్కడో తెలియని పరిస్థితి. అడుగు తడబడితే పాణాలు పోతాయి. ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణి ఆఫీసర్స్ కాలనీ, సింగరేణి కాలనీ, మీటర్ సెల్ ఆఫీస్ ప్రాంతాలలో ఓపెన్ నాలాలు స్థానిక ప్రజలను భయపెడుతున్నాయి. వర్షాకాలంలో ఇక్కడి కాలనీలు చెరువులను తలపిస్తాయి. వరదనీటితో ఇంటికి వెళ్లే దారి మూసుకుపోతుంది. మెకాళ్ల లోతు వర్షపునీటితో నిండిపోతుండడం అడుగు బయట పెట్టాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇది చాలదన్నట్లు ఇక్కడ రెండు ఓపెన్ నాలాలు. మీటర్ సెల్ ఆఫీస్ ముందు ఒకటి, సింగరేణి ఆఫీసర్స్ కాలనీ నుంచి గ్రీన్‌పార్క్ కాలనీ వెళ్లేదారిలో మరోటి ఉంది. ఇక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు, మీటర్‌సెల్ ఆఫీస్, ఏటీఎం సెంటర్లు ఉండటంతో నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. వర్షపు నీటికి ఈ నాలాలు పొంగి దారి కనిపించని పరిస్థితి. ఈ సమయంలో వచ్చి చూసి పోయే అధికారులు తర్వాత ఏం చర్యలు తీసుకోవడం లేదు. బుసకొడుతున్న నల్లవాగు చాంద్రాయణగుట్ట: నల్లవాగు నాలాకు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. నాలుగేళ్ల క్రితం 17 మీటర్ల మేర నాలా విస్తరణకు జీహెచ్ఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. పల్లె చెరువు దిగువ నుంచి ప్రారంభమయ్యే ఈ నాలా బండ్లగూడ, ఫలక్‌నుమా, పూల్‌బాగ్, అహ్మద్ కాలనీ, పార్వతీనగర్, సాయిబాబానగర్, అరుంధతి కాలనీ, భయ్యాలాల్ నగర్, మహ్మద్‌నగర్, యాకుత్‌పురా, డబీర్‌పురా మీదుగా ప్రవహించి మూసీ నదిలో కలుస్తుంది. ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి నుంచి ఉప్పుగూడ లక్కీ స్టార్ హోటల్ వరకు నాలా విస్తరణ పనులు పూర్తి కావడంతో అధికారులు రక్షణ గోడ నిర్మించారు. కాని అక్కడి నుంచి సమస్య మొదలవుతోంది. అహ్మద్ కాలనీ నుంచి అరుంధతి కాలనీ వరకు కొనసాగాల్సి ఉంది. నాలాకి ఇరువైపులా ఇళ్లను కోల్పోతున్న బాధితులకు సరైన పరిహారం చెల్లించక పోవడంతో ఈ విస్తరణ పనులు ఆగిపోయాయి. దీంతో పలు కాలనీల్లో నాలాకు రక్షణ గోడ నిర్మించలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 14న రాజీవ్‌గాంధీ నగర్లో బస్తీ చిన్నారులు నాలా పక్కన క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ బంతి వెళ్లి నాలా ఒడ్డున పడడంతో దానికోసం వెళ్లిన సంజయ్ (7) నాలాలో పడి మృతి చెందాడు. ఇలాంటి ప్రమాదాలు ఇక్కడ సర్వసాధారణమయ్యాయి. శివారుకు పెద్ద గండం నాచారం: చినుకు పడితే నాచారం పెద్ద నాలా స్థానికులకు కునుకు లేకుండా చేస్తుంది. ఇక్కడి పటేల్‌కుంట చెరువు నుంచి ప్రారంభమైన నాలా కిలో మీటర్ పొడవునా పలు కాలనీలలో మధ్య నుంచి ప్రవహించి హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువులో కలుస్తుంది. ఈ నాలాకు రక్షణ కంచె లేక పోవడంతో తరచు జీవాలు, వాహనదారులు పడిపోతున్నారు. గతేడాది అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి నాలాలో పడి మృతి చెందాడు. కంచె లేకపోవడంతో స్థానికులు చెత్తను ఇందులోనే పడేస్తున్నారు. చిన్న వర్షానికే నాలాలో నీరు పోటెత్తి రోడ్డును ముంచెత్తుతుంది. దీంతో రాక పోకలు నిలిచిపోతున్నాయి. ఈ నాలా యమ డేంజర్.. ఉప్పల్: హెచ్ఎంటీనగర్ పెద్ద చెరువు నుంచి దిగువ ఉన్న ఉప్పల్ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల మేర నాలా విస్తరించింది. ఈ నాలా నీరు హైకోర్టు కాలని, కళ్యాణపురి మీదుగా, స్వరూప్ నగర్ నుంచి నల్ల చెరువుకు చేరుతుంది. దారిలో 30 ఫీట్ల వెడల్పు ఉండాల్సిన నాలా కేవలం పది ఫీట్ల వెడల్పు మాత్రమే మిగిలింది. కొన్ని చోట్ల అదికూడ లేదు. నాలుగేళ్ల క్రితం క్రికెట్ ఆడుకుంటూ ముగ్గురు చిన్నారులు నాలాలో పడి చనిపోయారు. అయినా ఇప్పటి దాకా నాలాకు రక్షణ కంచె మాత్రం నిర్మించలేదు. ఈ దుస్థితిని ఏమ‘నాలా’.. జూబ్లీహిల్స్: యూసుఫ్‌గూడ మీదగా అమీర్‌పేట మైత్రీవనం వద్ద కలిసే ఓపెన్ నాలా ప్రజలను భయపెడుతోంది. పూడుక పేరుకుపోయి మురుగు ప్రవాహం కదలని పరిస్థితి. కొద్దిపాటి వర్షానికే పొంగి ఇళ్లను ముంచెత్తుతుంది. దీంతో ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో నివసించే వారు వరద ముంపుతో అవస్థలు పడుతున్నారు. ప్రతిఏటా తప్పనిసరిగా పూడిక తీయాల్సి ఉన్నా కొన్నేళ్లుగా ఆ సంగతే పట్టించుకోవడం మానేశారు. సమస్యను పదేపదే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. -
ఛిద్రం.. జర భద్రం
రోడ్లపై గుంతలు పొంగుతున్న నాలాలు ఏటా తప్పని కష్టాలు మేలుకోని అధికారులు ఇదీ విశ్వ నగర ‘చిత్రం’ అడుగడుగునా గుంతలు... మడుగులను తలపించేలా నీళ్లు... ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా... వెన్ను విరిగే ప్రమాదం... ఇదీ మహా నగర రహదారుణ చిత్రం. వాన దెబ్బతో ‘విశ్వ’నగరం అసలు రూపం మరోసారి బట్టబయలైంది. రోడ్లపై గోతులు గ్రేటర్ దుస్థితిని తెలియజెప్పాయి. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టింది. యంత్రాంగం పనితీరులోని డొల్లతనాన్ని ఎత్తి చూపింది. ’సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్...జూబ్లీహిల్స్...బాలానగర్... ఎల్బీనగర్... ఏ మార్గమైనా ఒకటే రూపం. కాలు కింద పెడితే ఏ గోతిలో దిగిపోతామోననే భయం. వాహనం బయటకు తీస్తే ఏ గుంతలో పడి... ఎముకలు విరగ్గొట్టుకుంటామోననే భీతి. ఇదీ మహానగరంలో వర్షం వస్తే ప్రజల దుస్థితి. దారి పొడవునా గోతులు... నిలిచిపోయే నీళ్లు వాహనదారులకు, పాదచారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇవే దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. ఫ్లై ఓవర్ల వైపు చూస్తున్న అధికారులు...ప్రజాప్రతినిధులు నాలాలు, రహదారులపై దృష్టి సారించ డం లేదు. దీంతో నగర ప్రజలకు అవస్థలు తప్పడం లే దు. వానా కాలంలో సమస్యలు తలెత్తకుండా వేసవిలోనే చర్యలు తీసుకోవాలి. నాలాల్లో పూడిక తొలగింపు... లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా అవసరమైన మరమ్మతులు చేస్తే చాలా వరకు సమస్యలు తలెత్తవు. కానీ ఈ దిశగా యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు. షరా మామూలుగా నాలాలు సీజనల్ సమస్యల నుంచి బయట పడేందుకు చేపట్టాల్సినతాత్కాలిక పనులు కూడా లేకపోవడంతో ప్రజలకు కడగండ్లు తప్పడం లేదు. ఏటా నాలాల్లో పూడికతీత పనుల పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ... వర్షం వ స్తే నీరు వెళ్లే మార్గం లేదు. దీంతోఅవి పొంగి రహదారులపై ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది 749 కి.మీ. మేర పనులు చేపట్టాల్సి ఉంది. ఏ మేరకు జరిగాయో అధికారులకే తెలియాలి. నగరంలోని నాలాలు చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 7 అడుగులకు కుంచించుకుపోయాయి. ఆధునీకరణ పనులు ముందుకు సాగడం లేదు. దీంతో సమస్యలు అలాగే ఉంటున్నాయి. 30 నాలాలున్నా వివరాల్లేవు.. గ్రేటర్‌లోని రహదారుల కింద వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పెద్ద నాలాలు ఉన్నట్లు అంచనా. ఇవి 60 కి.మీ.ల మేర ఉన్నాయనే అంచనాలు తప్ప... కచ్చితంగా ఎక్కడున్నాయో తెలియదు. ఈ నాలాల వల్ల సమీప రహదారులకు ప్రమాదం పొంచి ఉంది. కంకర తేలి... బంజారాహిల్స్: భారీ వర్షాలకు రోడ్లపైన తారు కొట్టుకుపోవడంతో కంకర తేలి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్లు అడుగడుగునా దెబ్బతిన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పది రోజుల క్రితమే బీటీ రోడ్డు వేశారు. నాలుగు రోజుల క్రితం పైప్‌లైన్ కోసం తవ్వి గాలికి వదిలేశారు. ఇటీవల వర్షాలకు రోడ్డంతా కొట్టుకుపోయి వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతోంది. అటు వె ళ్లాలంటే భయం దూలపల్లి: నర్సాపూర్ రాష్ట్ర రహదారి మరమ్మతులకు నోచుకోవడం లేదు. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని బహదూర్‌పల్లి చౌరస్తా నుంచి గండిమైసమ్మ వరకు గల రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం ఈ రహదారి గుండా మెదక్, బోధన్, నిజామాబాద్‌లకు ఆర్టీసీ బస్సులు, లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. గుంతలతో వాహనాల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయ పడుతున్నారు. వర్షం పడితే ఇక వారి ఇబ్బందులు చెప్పనలవి కాదు. రహదారులను మెరుగుపరిచేందుకు అధికారులు కృషి చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.స్వచ్ఛ హైదరాబాద్ పర్యటనల్లోనూ నాలాలను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అయినా కార్యాచరణ మొదలు కాలేదు. అమలు ఎప్పుడో.. తొలి దశలో 350 కి.మీ. మేర నాలాలను అభివృద్ధి చేయాలని గత నవంబర్‌లో నిర్ణయించారు. దశల వారీగా పనులు చేయాలనుకున్నారు. దీనికి ఇద్దరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇంజినీర్లు, సర్వేయర్లతో ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. కానీ వారెక్కడ పని చేస్తున్నారో తెలియడం లేదు. ఈ పరిస్థితులతో వానొచ్చిన ప్రతిసారీ నగర ప్రజలకు సంతోషం కంటే.. ఇంటి నుంచి బయటకు వెళితే...తిరిగి రాగలమా? అనే సందే హమే వేధిస్తోంది. వెన్నువిరుస్తున్న రహదారులు అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు... గత నాలుగైదు రోజులుగా కురిసిన వానతో మరింత దెబ్బతిన్నాయి. గుంతలు మరింత ఎక్కువై... కంకరతేలిన రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు హడలిపోతున్నారు. వాహనదారులు గోతుల్లో పడి వెన్ను విరగ్గొట్టుకుంటున్నారు. మెట్రో పనులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, కేబుల్ సంస్థలు రోడ్లను ఇష్టానుసారం తవ్వి పారేస్తున్నాయి. వర్షం పడినప్పుడు నీరు నిలిచి... ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. -
నాలాలో శవం లభ్యం
కాచిగూడ: హైదరాబాద్ నగరం కాచిగూడ పరిధి రాంనగర్లో నాలాలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్న శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగి పొర్లుతుండటంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. -
వ్యక్తి మృతదేహం లభ్యం
హైదరాబాద్: తాగిన మత్తులో ప్రమాదవశాత్తు కాచిగూడ కబేళ వద్దనున్న హుస్సేన్‌సాగర్ నాలాలో పడిన వ్యక్తి మృతదేహాన్ని ఎట్టకేలకు పోలీసులు వెలికి తీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ డి.రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన ఎం.శ్రీనివాస్ (46) శనివారం రాత్రి నాలాలో పడిపోయాడు. శ్రీనివాస్ మృతదేహాన్ని వెలికితీయడానికి శనివారం రాత్రే ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం కాచిగూడ కబేళ ట్రీట్మెంట్ ప్లాట్ నీటిని బంద్ చేయడంతో నాలాలో శ్రీనివాస్ మృతదేహం తేలింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
‘నాలా’ నిబంధనతో అసలుకే మోసం!
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా వినియోగ మార్పిడి చేసినందుకు రెవిన్యూ శాఖకు ‘నాలా’ చార్జీలు చెల్లించాలనే నిబంధన ఇప్పుడు హెచ్ఎండీఏ ఆదాయానికి గండికొడుతోంది. కొత్తగా నిర్మాణాలు చేపట్టబోయే రియల్టర్లు హెచ్ఎండీఏ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే..తప్పకుండా ‘నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్)’ చార్జీలు చెల్లించాలని నిబంధన విధించడంతో వారు వెనక్కు తగ్గుతున్నారు. ఫలితంగా హెచ్ఎండీఏ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే దాదాపు రూ.100 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. సిటీబ్యూరో: కొత్త లే అవుట్స్‌కు పర్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ‘నాలా’ (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్-ఎన్‌ఏఎల్‌ఏ-కన్వర్షన్) చార్జీలు చెల్లించాలన్న నిబంధనే హెచ్ఎండీఏ కొంప ముంచింది. ఈ నిబంధన వల్లే సుమారు రూ.100 కోట్ల ఆదాయం సంస్థకు అందకుండా పోయిందని ఉద్యోగులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త లేఅవుట్‌కు అనుమతివ్వాలంటే వ్యవసాయ భూమిని నివాస వినియోగ భూమిగా మార్చడానికి ఎకరానికి 10 శాతం చార్జీ చెల్లించాలని గతంలో ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే... దీన్ని హెచ్ఎండీఏలో పక్కాగా అమలు చేయలేదు. ఈ కారణంగా ఇప్పటివరకు రెవిన్యూ శాఖకు రూ.1000 కోట్ల వరకు ఆదాయం అందకుండా పోయిందన్న విషయం తేలడంతో హెచ్ఎండీఏ కమిషనర్ శాలినీ మిశ్రా లోతుగా దీనిపై అధ్యయనం చేసి ఇకపై కొత్త లే అవుట్లకు అనుమతుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. నాలా యాక్టు- 2006 ప్రకారం రెవెన్యూ శాఖకు ఎకరానికి 10 శాతం ‘నాలా చార్జీ’ చెల్లించి ఆర్డీఓ నుంచి ఎన్ఓసీ తీసుకువచ్చాకే కొత్త లే అవుట్స్‌కు పర్మిషన్లు ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ తాజా నిర్ణయం ఇటు ప్లానింగ్ విభాగం అధికారులకు, అటు రియల్టర్లకు మింగుడుపడడం లేదు. ఇప్పటికే 100 ఫైళ్లకు (దరఖాస్తులకు) అప్రూవల్ ఇస్తూ హెచ్ఎండీఏ డీసీ (డెవలప్మెంట్ చార్జెస్) లెటర్లు జారీ చేసింది. అయితే... దరఖాస్తుదారులు ఫీజును చెల్లించేందుకు ముందుకు రాగా నాలా చార్జి చెల్లించాల్సిందేనని మెలికపెట్టడంతో వారంతా వెనుదిరిగారు. ఇదే అదనుగా భావించి ప్రస్తుతం ప్రాసెసింగ్‌లో ఉన్న మరో 100 ఫైళ్లను కూడా సిబ్బంది పరిష్కరించకుండా పక్కకు పడేశారు. దీంతో దాదాపు200 ఫైళ్ల వరకు పెండింగ్‌లో పడిపోయాయి. ఫలితంగా గడచిన 2 నెలల వ్యవధిలో హెచ్ఎండీఏ ఖజానాకు జమ కావాల్సిన సుమారు రూ.100 కోట్లు అందకుండా పోయాయని సిబ్బంది పేర్కొంటున్నారు. సంస్థకే నష్టం ఇప్పటివరకు పట్టించుకోని నాలా చార్జీల నిబంధనను ఇప్పుడు తెరపైకి తేవడం వల్ల హెచ్ఎండీఏకే నష్టం వాటిల్లుతోంది తప్ప ప్రభుత్వానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని ప్లానింగ్ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు మొదట టెక్నికల్ అప్రూవల్ ఇస్తూ, భవన నిర్మాణ సమయంలో మాత్రం నాలా చార్జీలు స్థానిక సంస్థలకు చెల్లించి ఎన్ఓసీ తెచ్చుకోవాలని సూచించేవారు. ఇప్పుడు కొత్త కమిషనర్ ఆదేశాల వల్ల రెవిన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకురాని వారికి పర్మిషన్లు నిలిపేశామంటున్నారు. కాగా రియల్టర్లు మాత్రం కోర్టు నుంచి అనుమతి తీసుకువచ్చి పర్మిషన్లు పొందుతున్నారు. మా వల్ల కాదు: రియల్టర్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం భూ వినియోగ మార్పిడి కింద తాము ఇప్పటికే చార్జీలు చెల్లించామని, మళ్లీ నాలా పేరుతో అదనపు భారం మోపడం ఎంతవరకు సమంజసమని రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. అసలే రియల్ మాంద్యం, పెరిగిన ఖర్చులతో సతమతమవుతుండగా నాలా చార్జీలు మరింత భారం అవుతున్నాయని వాపోతున్నారు. -
పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదు
- నాలాలు శుభ్రం చేసే పనులు మందకోడిగా సాగుతున్నాయి - ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎంసీ కార్పొరేటర్లు - 40 శాతం పనులు పూర్తయ్యాయన్న కార్పొరేషన్ సాక్షి, ముంబై: నగరంలో మురికి కాల్వలు, నాలాలు శుభ్రపరిచే పనులు 20 శాతం కూడా పూర్తికాలేదని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా మే మాసం వచ్చే సరికి 50 శాతం మురికి కాల్వలు, నాలాల పనులు పూర్తవుతాయని, కానీ ఈ ఏడాది ఇప్పటి వ రకు పనులు అనుకున్న మేర జరగలేదని కార్పొరేటర్లు ఆరోపించారు. వర్షాకాలానికి ఇంకా నెల రోజులు కూడా సమయం లేదని హెచ్చరించారు. నగరంలో 1.75 లక్షల మురికి కాల్వలు 45 పెద్ద నాలాలు, 38 చిన్న నాలాలు ఉన్నాయి. వీటిలో పేరుకుపోయిన చెత్త, బురద వెలికితీసే పనులు 40 శాతం పూర్తయ్యాయని బీఎంసీ పరిపాలన విభాగం వెల్లడించింది. కాని వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని బీఎంసీలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఆంబేకర్ ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో నాలాల నుంచి బయటకు తీసిన బురద, చెత్త అలాగే పడి ఉందని, దీంతో దుర్గంధం వ్యాపించడంతో ప్రజలనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు మందకోడిగా సాగుతున్నాయన్నారు. ఇచ్చిన సమయానికల్లా కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాలని నిబంధనలు ఉన్నాయని, అయితే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా నాలాలు శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.