అక్రమ నిర్మాణాల కూల్చివేత | Demolition of illegal structures | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల కూల్చివేత

Published Tue, Sep 27 2016 1:16 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

అక్రమ నిర్మాణాల కూల్చివేత - Sakshi

అక్రమ నిర్మాణాల కూల్చివేత

* నాలాలు, చెరువుల్లో వెలసిన భవనాలపై ఉక్కుపాదం    
* ఆపరేషన్ మొదలుపెట్టిన డిమాలిషన్ స్క్వాడ్

సాక్షి, హైదరాబాద్: నాలాలు, చెరువుల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే రాజధానిలో ‘డిమాలిషన్ స్క్వాడ్’ ఆపరేషన్ షురూ చేసింది. గత పదేళ్లలో కుప్పలుతెప్పలుగా వెలసిన కట్టడాలను గుర్తించిన ప్రత్యేక బృందాలు... సోమవారం ఉదయమే రంగంలోకి దిగాయి. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌లు ఈ బృందాల్లో ఉన్నారు. కాప్రా, ఉప్పల్, ఎల్‌బీనగర్, బంజారాహిల్స్, నాంపల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

తొలిరోజు కూల్చివేతల సందర్భంగా గుర్తించిన అక్రమాల్లో గ్యాస్ ఏజెన్సీ, ఫంక్షన్‌హాల్‌తో పాటు వివిధ వాణిజ్య భవనాలున్నాయి. నాలాలు, చెరువు భూముల్లో వెలసినవి... బీఆర్‌ఎస్ దరఖాస్తులకు గడువు ముగిశాక, ఎలాంటి అనుమతి లేకుండా జరుగుతున్నవి... మొత్తం కలిపి 39 నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ ఆక్రమణల్లో బడా బాబులు నిర్మించినవే అధికంగా ఉండటం విశేషం. వీటితోపాటు శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను సైతం నేలమట్టం చేశారు. మొత్తం 39  నిర్మాణాలను కూల్చివేశారు. ఇరిగేషన్, విద్యుత్, జలమండలి తదితర శాఖల అధికారులు ఈ ఆపరేషన్‌లో సహకరించారు. కూల్చివేతల పర్వం ఇకపై కూడా కొనసాగుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.
 
నేలమట్టం చేసిన నిర్మాణాల్లో కొన్ని...
కాప్రా నల్లచెరువు నాలాపై వెలసిన మహాలక్ష్మి ఎల్‌పీజీ గ్యాస్ గోడౌన్  685 మీటర్ల నాలాను కబ్జా చేసి బంజారా ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేసిన పార్కింగ్  నాలాను పూడ్చివేసి శేరిలింగంపల్లి మదీనాగూడలోని ఎన్‌ఎస్‌కే బ్లిస్ మెడోస్ అపార్ట్‌మెంట్‌లో చేపట్టిన నిర్మాణం  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉన్న నాలాపైనా అక్రమ నిర్మాణాలు  హస్తినాపురం దేవకమ్మతోట సమీపంలో నాలాను ఆక్రమంచి జరిపిన నిర్మాణాలు  సరూర్‌నగర్‌లో అనుమతి లేకుండా నిర్మించిన నాలుగో అంతస్తు  మైలార్ దేవ్‌పల్లి అలీనగర్ వద్ద పల్లెచెరువును ఆక్ర మించి కట్టిన నిర్మాణాలు  కుత్బుల్లాపూర్ ఫాక్స్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఆరు ప్రహరీలు.
 
ఓకే చెప్పిన కేటీఆర్.. అడ్డుకున్న కార్పొరేటర్
విశ్వనగరం దిశగా అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తొలిరోజే అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అడ్డు చెప్పారు. మూసాపేట ఆంజనేయనగర్ రోడ్డునంబర్ 4లో అనుమతులు లేకుండా భారీ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ అదే ప్రాంతానికి చెందిన ఓ వైద్యురాలు ట్వీటర్‌లో ఫొటోలతో సహా వివరాలను మంత్రి కేటీఆర్‌కు పంపారు. స్పందించిన కేటీఆర్.. ఆ భవనాన్ని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

సోమవారం భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ అనురాధ ఆధ్వర్యంలోని బృందాన్ని మూసాపేట టీఆర్‌ఎస్ కార్పొరేటర్ తూము శ్రవణ్ అడ్డుకున్నారు. ‘అక్రమ భవనాలు మస్తుగా ఉన్నయ్.. అన్నింటినీ కొట్టేయ్యండి. మూసాపేట మొత్తం డీవియేషనే. నా ఇల్లు కూడా డీవియేషన్‌తోనే ఉంది. ఎలా కూలుస్తారో కూల్చండి. మున్సిపల్ ఆఫీసు ముందు టెంటు వేస్తా’ అని సదరు కార్పొరేటర్ హెచ్చరించారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement