గులాబీ కండువా కప్పుకుంటే పునీతులవుతారా?
హైదరాబాద్: రాజధానిలో చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన ప్రజా ప్రతినిధులు, అధికారులపై కఠిన చర్య తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అక్రమాలకు దోహదపడిన సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, ఇతర నాయకులు ఇప్పుడు గులాబీ కండువా కప్పుకుని సీఎం కేసీఆర్ పక్కనే ఉన్నారని ముందుగా వారిపై చర్య తీసుకోవాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వాల పాపాల వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని సీఎం చెబుతున్నారని, ఆ ప్రభుత్వాల్లోని ఆయా స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరగానే పునీతులు అయిపోతారా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించకపోతే ఎలాంటి సంకేతాలు వెళతాయోనని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వపరంగా శాశ్వత ప్రాతిపదికన చేపట్టబోయే చర్యలేమిటో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చెబుతున్నట్లు నగరంలో 10 శాతం రోడ్లు కాదు, 99 శాతం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. ప్రజా సమస్యలపై ఉద్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యక్రమాలను రూపొందించుకుంటున్నట్లు లక్ష్మణ్ వెల్లడించారు. మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న పార్టీ కార్యకర్తలంతా విధిగా చేనేత వస్త్రాలు ధరించాలని, కొనుగోలు చేయాలని సూచించారు.