![Hydra Demolition Of Illegal Constructions in Koheda](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/2112332.jpg.webp?itok=J4WlXmuD)
అక్రమ కట్టడాలను కూల్చేసిన అధికారులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆదివారం పంజా విసిరింది. అక్కడి అనేక ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. సర్వే నంబర్ 951, 952ల్లోని గ్రామపంచాయతీ లేఔట్‌లో తమ ప్లాట్లను సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని, రహదారులు లేకుండా అడ్డుగోడలుగా కట్టారని రాధే ధామం లే ఔట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు పలు పత్రాలను పరిశీలించారు.
1986లో భూ యజమానులు కె.రాములు, పెద్దయ్య, ఈసయ్య గ్రామ పంచాయతీ లేఔట్ వేసినట్టు నిర్ధారించారు. సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి ఆ భూమిని స్వా«దీనం చేసుకుని, ఫాం హౌస్ నిర్మించడంతో పాటు లే ఔట్‌లోని పలు ప్లాట్లను సొంతం చేసుకుంటూ అంతర్గత రహదారులను బ్లాక్ చేసినట్టు వెల్లడైంది. దీంతో అన్ని పత్రాలతో తమ కార్యాలయంలో హాజరు కావాలని ఇరుపక్షాలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. శనివారం వారు హాజరు కాగా రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించింది. ఫామ్‌హౌస్, షెడ్, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవంటూ తుర్కయాంజాల్ మున్సిపల్ అధికారుల స్పష్టం చేశారు.
ప్లాట్లను తమకు అమ్మిన తర్వాత సమ్మిరెడ్డి ఈ భూమిని తాను కొన్నట్టు రికార్డులు సృష్టించారని ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఆరోపించారు. హైడ్రా ఇరుపక్షాలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులను విచారించి సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి నిరి్మంచిన ఫాంహౌస్‌తో పాటు ప్రహరీ, ఫెన్సింగ్ కూల్చివేతకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆదివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఈ సందర్భంగా సుమారు 170 ప్లాట్లకు కబ్జాదారుల నుంచి అధికారులు విముక్తి కల్పించారు. వీటిలో పార్కులు, క్రీడా స్థలాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment