సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి అక్రమ నిర్మాణాలను హైడ్రా(Hydra) కూల్చివేస్తోంది. తాజాగా ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల గోడను అధికారులు కూల్చివేశారు. అలాగే, మేడిపల్లిలోని దివ్యనగర్‌లో కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామునే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను అధికారులు కూల్చివేశారు. అయితే, నల్లమల్లారెడ్డి విద్యా సంస్థలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్కడ సర్వే చేసి అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించారు. ఈ క్రమంలోనే గోడ కూల్చివేతలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామునే అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు.
అలాగే, రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.
ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్‌షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. హైడ్రా ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకు మంచి నగరాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు అయ్యిందన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా.. గతేడాది జూలైకి ముందు కట్టిన ఏ ఒక్క ఇంటిని హైడ్రా కూల్చివేయలేదని.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని వ్యాపార కేంద్రాలను, నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలను మాత్రమే నేలమట్టం చేసినట్లు తెలిపారు. వీరిలో ప్రముఖులకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment