శిథిలాలు తగిలి హోంగార్డుకు తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఘటన
కొండాపూర్ (సంగారెడ్డి): హైడ్రాను స్ఫూర్తిగా తీసుకొని సంగారెడ్డిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముందస్తుగా పెద్దఎత్తున పోలీసులను మోహరించారు.
చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన భవనం పూర్తిగా నీటిలో ఉండటంతో బుల్డోజర్ల సహాయంతో కూల్చివేసేందుకు వీలు కాలేదు. దీంతో తహసీల్దార్ జిలెటిన్ స్టిక్స్ స్పెషలిస్టులను పిలిపించి వారి సహాయంతో భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. అయితే భవనం కూలుస్తున్న సమయంలో అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్‌కు రాయి ఎగిరి వచ్చి బలంగా తాకడంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
12 ఏళ్ల క్రితమే నిర్మాణం
కొండాపూర్ మండలం కుతుబ్‌షాహీ పేట శివారులోని సర్వే నంబర్ 93లో ఉన్న చెరువుకు సంబంధించిన మూడెకరాల భూమిని సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అక్కడ ఐదంతస్తుల భవనంతోపాటు స్విమ్మింగ్ పూల్, గెస్ట్‌హౌస్‌ను నిర్మించాడు. ఆ భవనం ఎఫ్‌టీఎల్‌లో ఉండటంతో భవనం చుట్టూ నీరు చేరకుండా ప్రత్యేకంగా చిన్నపాటి బ్రిడ్జిని కూడా నిర్మించుకున్నాడు. ఇది నిర్మించి 12 ఏళ్లయింది.
అయినా హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాక, గ్రామస్తులు ఫిర్యాదు చేసే వరకు అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులో నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు భవనాన్ని పరిశీలించడం, మామూళ్లు తీసుకోవడం పరిపాటిగా మారిందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment