
ఆశించిన ఫలితాలనివ్వని ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం
టెండర్ల ఆలస్యం.. నాసిరకమైన చేపపిల్లల సరఫరానే కారణమంటున్న మత్స్యకారులు
రికార్డుల్లో చూపుతున్న చేపపిల్లల సంఖ్యకు.. సరఫరా చేసిన సంఖ్యలో భారీగా వ్యత్యాసం
కాంట్రాక్టర్లతో మత్స్యశాఖ అధికారుల కుమ్మక్కు.. బిల్లులు డ్రా చేసేందుకు సన్నాహాలు
చేపా.. చేపా ఎందుకు ఎండలేదు అన్న కథ గుర్తుంది కదా.. ఇప్పుడు చేపా.. చేపా ఎందుకు ఎదగలేదు అంటే అదే మాదిరి కథలా ఉంది పరిస్థితి. చేప పిల్లల టెండర్లు వాయిదా పడుతూ రావడం ఒక కారణమైతే.. చెరువుల్లో వాటిని ఆలస్యంగా వదలడం మరో కారణం. ఇంకో కారణం ఏమిటంటే.. నాసిరకమైన చేప పిల్లలను వదలడమే అంటున్నారు మత్స్యకారులు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం ఆశించిన మేర ఫలితాలివ్వలేదు. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు కురిసి..నీరు చేరిన వెంటనే చేపపిల్లలను చెరువుల్లో వదలాలి. జూలై నుంచి ఆగస్టులోపు పిల్లలను చెరువుల్లో వదిలితే.. ఏప్రిల్ చివరివారం వరకు చేపలు పెరిగి దిగుబడి బాగా వస్తుంది. చేపపిల్లల సరఫరా కాంట్రాక్టర్ల ఎంపిక కోసం రాష్ట్ర స్థాయిలో చేపట్టిన టెండర్ ప్రక్రియలో జరిగిన అక్రమాల కారణంగా ఈ పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది.
అక్టోబర్‌లో ప్రారంభమై డిసెంబర్ వరకు చేప పిల్లల పంపిణీ కొనసాగింది. దీంతో ఈ పిల్లలు పెరగలేదు. ఈ కారణంగా ఆశించిన మేరకు దిగుబడి రాలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని, తమ ఉపాధిపై దెబ్బపడిందని మత్స్యకారులు వాపోతున్నారు. నాసిరకం చేపపిల్లలను పంపిణీ చేయడం కూడా మరో కారణమని వారు ఆరోపిస్తున్నారు.
పంపిణీలోనూ కాకిలెక్కలే..
చేపపిల్లల సరఫరా ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా చెరువుల్లో వదిలినట్టు రికార్డుల్లో చూపుతున్న చేపపిల్లల సంఖ్య, వాస్తవంగా వదిలిన చేపపిల్లల సంఖ్యను పొంతన లేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే ఈసారి 76 చెరువుల్లో 68 లక్షల చేపపిల్లలను వదిలినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. కానీ జిల్లా మొత్తం మీద 40 లక్షల చేపపిల్లలు కూడా వదలలేదని మత్స్యకారులు వాపోతున్నారు.
మత్స్యశాఖ అధికారులు మాత్రం 80 నుంచి 100 ఎంఎం సైజు ఒక్కో చేప పిల్లకు రూ.1.73 చొప్పున, మొత్తం రూ.1.17 కోట్లు డ్రా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం చెరువుల్లో చేప పిల్లలు వదిలినప్పుడు వాటిని లెక్కిస్తున్న తీరును వీడియో తీయాలి. ఆ చెరువు మత్స్యకారుల సమక్షంలో చేప పిల్లలను వదలాలి. అయితే మెజారిటీ జిల్లాల్లో ఇవేవీ పాటించకుండా పూర్తిస్థాయిలో బిల్లులు డ్రా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ శాఖ అధికారులు కూడా కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
» సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహబూబ్‌సాగర్ చెరువులో ఏటా 1.60 లక్షల చేపపిల్లలను వదిలేవారు. ఈసారి 80 వేల చేపపిల్లలను వదులుతున్నామని సరఫరా కాంట్రాక్టర్ ఆ చెరువుకు సంబంధించిన మత్స్యకారులకు చెప్పారు. తీరా లెక్కిస్తే అవి 35 వేలకు మించి లేవు. అవికూడా నాణ్యత లేని పిల్లలు వేశారని మత్స్యపారిశ్రామిక సంఘం సభ్యుడు నగేష్ వాపోయారు. తమ సంఘం సుమారు 4 లక్షల చేప పిల్లలను కొన్నామని, ఇందుకు రూ.6 లక్షలకు మించి ఖర్చు అయ్యిందని చెప్పారు.
చిన్న చేపలను రూ.20కే విక్రయిస్తున్నాం
పెద్దదేవులపల్లి చెరువులో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాం. చేప పిల్లల పంపిణీలో నాణ్యత లేకపోవడంతో పావుకిలో, అరకిలో మాత్రమే ఎదుగుదల ఉంది. దీంతో ఈ చిన్న చేపలను వ్యాపారులకు రూ.20కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 3 కిలోల నుంచి 5కిలోల వరకు పెరిగితేనే మాకు ఉపాధి దొరుకుతుంది.
– ముత్తయ్య, మత్స్యకారుడు, నల్లగొండ జిల్లా
అరకిలో సైజు కూడా పెరగలేదు..
» మా ఊరి చెరువులో దసరా టైంలో 20 వేల చేప పిల్లలను వదిలారు. ఆలస్యంగా వదలడంతో ఇప్పుడు అవి 100 గ్రాముల నుంచి అరకిలో వరకు మాత్రమే పెరిగాయి. ఇప్పుడున్న ఎండలకు చెరువులో నీరు ఇంకిపోతోంది. దీంతో చేప సైజు చిన్నగా ఉన్నా, పట్టుకొని అమ్ముకుంటున్నాం. మా సంఘం తరపున జూన్‌లో చేప పిల్లలను కొనుక్కొని వచ్చి పోసినం. వాటి సైజు కిలో వరకు ఉన్నయి. – కంచం సంపత్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు ఆన్‌సాన్‌పల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
ప్రైవేట్ చేప విత్తనమే బాగుంది
» ప్రభుత్వం ఉచితంగా చెరువుల్లో వదిలిన చేపపిల్లలు పెరగలేదు. ఇప్పటివరకు అరకిలో లోపే ఉన్నాయి. మేమే ప్రైవేట్‌గా చేపపిల్లలను కొన్నాం. ఇవి కిలో వరకు పెరిగాయి. ప్రభుత్వం మత్స్యకార సంఘాలకు నేరుగా డబ్బులు ఇస్తే మేమే నాణ్యమైన చేపలను కొంటాము. ప్రభుత్వం వేసిన చేపపిల్లలతో పెద్దగా ఉపాధి లేకుండా పోయింది. – పుట్టి శంకర్, నర్సాపూర్(డబ్ల్యూ), లక్ష్మణ్ చందా, నిర్మల్ జిల్లా
సరఫరా చేసిన చేపపిల్లల రకాలు..
రవ్వ, బొచ్చ, మ్రిగాల, బంగారు తీగ
చేపపిల్లల సైజులు..
80 ఎంఎం –100 ఎంఎం, 35ఎంఎం–40 ఎంఎం
నాణ్యమైన చేపలు పెరగాల్సిన సైజులు
కిలో నుంచి 1.5 కిలోలు..
ప్రస్తుతం పెరిగిన సైజు 250 గ్రాముల నుంచి 750 గ్రాముల లోపు..