వర్షాకాలం సమీస్తున్నా జాడలేని టెండర్లు
ఉచిత చేప పిల్లల పంపిణీపై నీలి నీడలు
గతేడాది 352 చెరువుల్లో 91 లక్షల చేప పిల్లల పంపిణీ
సాక్షి,మేడ్చల్ జిల్లా : మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ పథకం కొనసాగింపుపై ప్రస్తుత ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవటంతో నీలి నీడలు అలుముకుంటున్నాయన్న అనుమానాలను మత్స్య సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.
👉 ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే చేప పిల్లల కోసం టెండర్లు పిలవాల్సి ఉంటోంది. అలా.. చేస్తేనే చెరువులు నిండే అదను వరకు చేప పిల్లల పంపిణీ సాధ్యమవుతుంది. ఆలస్యమైతే మాత్రం చేప పిల్లలను చెరువుల్లో పంపిణీ చేయడం అసాధ్యమని మత్స్య సహకార సంఘాలు చెబుతున్నాయి.
ఊసేలేని టెండర్లు
గతంలో చేపపిల్లల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మే నెలలో మొదలై.. ముగిసేవి. కాంట్రాక్టర్లు కూడా సీజన్ మొదలయ్యే లోపే చేప పిల్లలను జిల్లాకు చేర్చి, నిండిన చెరువుల్లో 100 శాతం ఉచితంగా వదలడంతో వాటి ఎదుగుదల బాగుండేది.
మే నెలాఖరు పూర్తవుతున్నా...
చేపపిల్లల పంపిణీపై రాష్ట్ర మత్స్యశాఖ స్పష్టత ఇవ్వటం లేదని మత్స్య సహకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి మాట్లాడుతూ.. చేప పిల్లల టెండర్ల విషయంపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేస్తేనే.. జిల్లాస్థాయిలో చేప పిల్లలకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని, దీనికోసమే ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
అదను దాటితే.. అంతే...
అదను దాటిన తర్వాత చేప పిల్లలను చెరువుల్లో వదిలితే.. వాటి ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఆగస్టు, సెపె్టంబరు రెండోవారం లోపే చేప పిల్లల పెంపకాన్ని మొదలుపెట్టాల్సి ఉంటోంది. అప్పుడే చేపల ఉత్పత్తి బాగా ఉంటోంది. లేదంటే ఏ రకమైనా చేపైనా సరే.. బరువు అంతంత మాత్రమే ఉంటుందని మత్స్య సంఘాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి చేపపిల్లలను పంపిణీ చేసే ఉద్దేశం ఉన్నా.. ఆలస్యం కారణంగా కాంట్రాక్టర్లు నాసిరకం చేపపిల్లలను మత్య్సకారులకు అంటగట్టే అవకాశం ఉంటోందని పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని మత్స్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సకాలంలో చేప పిల్లలకు సంబంధించిన టెండర్లు నిర్వహించేలా చూడాలని సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
గతేడాది 91 లక్షల ఉచిత పిల్లల పంపిణీ
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 62 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 352 చెరువుల్లో ఉచితంగా 91 లక్షల చేప పిల్లలను మత్స్య శాఖ పంపిణీ చేసింది. ఈ చేప పిల్లలలో పెద్ద సైజు (80–100 ఎం.ఎం.) 13.50 లక్షలు కాగా, చిన్న సైజు చేప పిల్లలు (40–45 ఎంఎం) 77.50 లక్షలు ఉన్నట్లు మత్స్యశాఖ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment