Fish distribution
-
చేప పిల్లలు వచ్చేనా..!
సాక్షి,మేడ్చల్ జిల్లా : మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ పథకం కొనసాగింపుపై ప్రస్తుత ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవటంతో నీలి నీడలు అలుముకుంటున్నాయన్న అనుమానాలను మత్స్య సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. 👉 ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే చేప పిల్లల కోసం టెండర్లు పిలవాల్సి ఉంటోంది. అలా.. చేస్తేనే చెరువులు నిండే అదను వరకు చేప పిల్లల పంపిణీ సాధ్యమవుతుంది. ఆలస్యమైతే మాత్రం చేప పిల్లలను చెరువుల్లో పంపిణీ చేయడం అసాధ్యమని మత్స్య సహకార సంఘాలు చెబుతున్నాయి. ఊసేలేని టెండర్లు గతంలో చేపపిల్లల సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మే నెలలో మొదలై.. ముగిసేవి. కాంట్రాక్టర్లు కూడా సీజన్ మొదలయ్యే లోపే చేప పిల్లలను జిల్లాకు చేర్చి, నిండిన చెరువుల్లో 100 శాతం ఉచితంగా వదలడంతో వాటి ఎదుగుదల బాగుండేది. మే నెలాఖరు పూర్తవుతున్నా... చేపపిల్లల పంపిణీపై రాష్ట్ర మత్స్యశాఖ స్పష్టత ఇవ్వటం లేదని మత్స్య సహకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి మాట్లాడుతూ.. చేప పిల్లల టెండర్ల విషయంపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేస్తేనే.. జిల్లాస్థాయిలో చేప పిల్లలకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని, దీనికోసమే ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అదను దాటితే.. అంతే... అదను దాటిన తర్వాత చేప పిల్లలను చెరువుల్లో వదిలితే.. వాటి ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఆగస్టు, సెపె్టంబరు రెండోవారం లోపే చేప పిల్లల పెంపకాన్ని మొదలుపెట్టాల్సి ఉంటోంది. అప్పుడే చేపల ఉత్పత్తి బాగా ఉంటోంది. లేదంటే ఏ రకమైనా చేపైనా సరే.. బరువు అంతంత మాత్రమే ఉంటుందని మత్స్య సంఘాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి చేపపిల్లలను పంపిణీ చేసే ఉద్దేశం ఉన్నా.. ఆలస్యం కారణంగా కాంట్రాక్టర్లు నాసిరకం చేపపిల్లలను మత్య్సకారులకు అంటగట్టే అవకాశం ఉంటోందని పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని మత్స్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సకాలంలో చేప పిల్లలకు సంబంధించిన టెండర్లు నిర్వహించేలా చూడాలని సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. గతేడాది 91 లక్షల ఉచిత పిల్లల పంపిణీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 62 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 352 చెరువుల్లో ఉచితంగా 91 లక్షల చేప పిల్లలను మత్స్య శాఖ పంపిణీ చేసింది. ఈ చేప పిల్లలలో పెద్ద సైజు (80–100 ఎం.ఎం.) 13.50 లక్షలు కాగా, చిన్న సైజు చేప పిల్లలు (40–45 ఎంఎం) 77.50 లక్షలు ఉన్నట్లు మత్స్యశాఖ ప్రకటించింది. -
గొర్రెలు, చేపల పంపిణీ కథ తేల్చండి
సాక్షి, హైదరాబాద్: గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు, లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. విజిలెన్స్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఏవైనా అవినీతి, అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే, ఆ ఫైలును అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివరాలు ఎందుకు సేకరించలేదు? ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు గురించి సీఎం మాట్లాడుతూ శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా అని పశు, మత్స్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ.3955 కోట్ల రుణం ఇచ్చిన నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) రెండో విడత రుణం ఇవ్వకుండా ఎందుకు నిలిపివేసిందని అధికారులను నిలదీశారు. అప్పటికే ఈ పథకంపై కాగ్ అభ్యంతరాలను లేవనెత్తడం, అవకతవకలను గుర్తించిన నేపథ్యంలోనే ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అధికారులు బదులిచ్చారు. తమ వాటా కింద 25 శాతం డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు గొర్రెలను ఎందుకు పంపిణీ చేయలేదని సీఎం ప్రశ్నించారు. రెండో విడత కింద 85,488 మంది తమ వాటాగా చెల్లించిన దాదాపు రూ.430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారులు తమ వాటా ఇవ్వలేదన్నారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలు కొనసాగించాలి పాడి రైతులకు ఒక లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని ఏప్రిల్ నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం మూడేళ్ల నుంచి ఈ ప్రోత్సాహకాన్ని నిలిపివేసిందని, ఆ మొత్తం బకాయిలు రూ.203 కోట్లు పేరుకుపోయాయని అధికారులు తెలిపారు. ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా ఈ ప్రోత్సాహకాలు చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలన్నారు. టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఈ విభాగంలో ఏళ్లతరబడి పని చేస్తున్న వారికి వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్ని ఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని ముఖ్య మంత్రి అధికారులకు సూచించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి స్పెషల్ సీఎస్ ఆధర్ సిన్హా, డెయిరీ డైరెక్టర్ లక్ష్మి, ఫిషరీస్ డైరెక్టర్ గోపి సమావేశంలో పాల్గొన్నారు. -
టెండర్లు జీరో.. చేపపిల్లల సరఫరాకు వ్యాపారుల అనాసక్తి
నారాయణపేట: జిల్లాలో చేపపిల్లల పంపిణీకి రెండు సార్లు టెండర్లకు పిలిచినా ఎవరూ ముందుకురావడం లేదు. దీంతో అధికారులు ఎటూ తేల్చలేక ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. మత్య్సకారులకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో కలెక్టర్ దిశానిర్దేశంతో జిల్లా మత్య్సశాఖ అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధంచేసి టెండర్లకు పిలుపునిచ్చింది. కానీ ఎవరూ చేప పిల్లలను సరఫరా చేసేందుకు ముందుకు రాలేదు. ప్రభుత్వం ఽనిర్ణయించిన ధరలకు వ్యాపారస్తులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష నియమించిన టెండర్ల కమిటీ చైర్మన్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, మెంబర్, కం కన్వీనర్‌గా జిల్లా మత్య్సశాఖ అధికారి రానాప్రతాప్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియను ఈ ప్రొక్య్రూట్మెంట్ను ఈనెల 12న ఓపెన్ చేసి చూడగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఈ నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు జిల్లా మత్య్స శాఖ అధికారులు పంపించినట్లు తెలుస్తోంది. గడువు పెంచినా.. చేపపిల్లలను సరఫరా చేసేందుకు గతనెల 5న బిడ్ కాలింగ్ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బిడ్ డాక్యుమెంట్‌ను గతనెల 12 నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు తొలిసారిగా మే 30 గడువు విధించారు. అప్పటి వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో మరోసారి గడువును జూన్ 12వరకు పెంచింది. అయినప్పటికి చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం టెండర్లను ఓపెన్ చేయడంతో స్పష్టమైంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చేప పిల్లలను పంపిణీ చేయలేమని బహిరంగంగానే కాంట్రాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ధరకు గిట్టుబాటు కాదనే ముందుకు రావడంలేదని సమాచారం. ధరలు పెరిగేనా.. టెండర్లు అయ్యేనా? ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాక కాంట్రాక్టర్లు ఆశించిన స్థాయిలో ధరలు పెరుగుతాయనేది కష్టమే అనిపిస్తోంది. చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ట్రాన్స్‌ఫోర్ట్ ఖర్చులతో పాటు విత్తనోత్పత్తి ఖర్చులు పెరిగాయంటూ వ్యాపారస్తులు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరఫరా చేయలేమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేపపిల్లల వ్యాపారస్థులు ఏకమై ఎక్కడా టెండర్లు వేయలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ధరలు పెంచకపోతే సకాలంలో టెండర్లు అయ్యే అవకాశం కనిపించడం లేదనిపిస్తోంది. రూ.1.78 కోట్లతో ఆహ్వానం.. ఈ ఏడాది చేపపిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. పెద్దసైజు చేపపిల్లలు (80–100 ఎంఎం) 81.03 లక్షల చేపలకు గాను రూ.1.22 కోట్లు నిర్ణయించింది. టెండర్లు దక్కించుకున్న వారు బొచ్చ40 శాతం, రోహు 50 శాతం, మ్రిగాల 10శాతం చేప పిల్లలను సరఫరా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్న చేపపిల్లలకు (45–40 ఎంఎం) ధర రూ.56.17 లక్షలు నిర్ణయించి టెండర్లకు పిలిచింది. అయితే టెండర్లు వేసే వ్యాపారస్తులు 106.29 లక్షల చేపపిల్లలను (బొచ్చ 35శాతం, రోహు 35శాతం, బంగారుతీగ 30శాతం చొప్పున) సరఫరా చేయాల్సి ఉంటుంది. టెండర్లు వేయలేదు.. చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ఆన్లైన్లో టెండర్లు వేసేందుకు ఈనెల 12తో గడువు ముగిసింది. అయితే టెండర్లు ఎవరూ వేయలేదు. సంబంధిత నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలో మళ్లీ టెండర్లు పిలిచే అవకాశం ఉంది. – రానాప్రతాప్, జిల్లా మత్య్సశాఖ అధికారి, నారాయణపేట 2020 నుంచి చేప పిల్లల ధరలు ఇలా.. చేప పిల్లల పంపిణీ విషయంలో ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 2020వ సంవత్సరంలో జిల్లాలోని 590 చెరువులు, మూడు రిజార్వాయర్‌లో వదిలేందుకు కావాల్సిన 1.60 కోట్ల చేపపిల్లల(సీడ్స్)ను రూ. 96.10 లక్షలతో కై కలూరి నుంచి కోనుగోలు చేసింది. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ. 1.04,000 చొప్పున 40లక్షలు కొనుగోలు చేయగా, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు 45,786 చొప్పున 1.20 కోట్లు కొనుగోలు చేసింది. ● 2021లో సంవత్సరంలో 1.84 కోట్ల చేప పిల్లలను చేసేందుకు టెండర్లు పిలువగా వనపర్తి జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి రూ.1.49 కోట్లకు టెండర్లు వేసి సరఫరా చేశారు. అందులో 85–100 ఎంఎం సైజు చేపపిల్లలు లక్షకు రూ.1.58,000 చొప్పున 43లక్షల చేప పిల్లలకు గాను రూ.67,46,600లు, 35–40 ఎంఎం సైజు చేపపిల్లలు.. లక్ష పిల్లలకు 58వేల చొప్పున రూ1.41 కోట్ల చేప పిల్లలకుగాను రూ. 82,24,980లకు సరఫరా చేశారు. ● 2022 లో టెండర్లు వేసిన వారిలో ఎల్–1 తప్పుకోవడంతో మిగతా నలుగురు కలిసి చేప పిల్లలను పంపిణీ చేశారు. చేపపిల్లలను పంపిణీ చేసిన వారిలో పద్మనాగ భూని నాగ వెంకటసూర్య సతిస్ రాజ్‌కుమార్ కై కలూరు (ఏపి) 35–40 ఎంఎం రూ.43,800, 80–100 ఎంఎంకు రూ.1,33,650కు ఎల్2గా టెండర్ దక్కించుకున్నారు. అయితే టెండర్లలో పాల్గొన్న మరో ముగ్గురు సైతం రాజ్‌కుమార్‌తో కలసి (అక్వా స్పార్క్ హచారీ నర్వ మండలం ఉందేకోడ్కు చెందిన వ్యాపారి, డి.శివకుమార్ ఆత్మకూర్ మండలం అరెపల్లికి చెందిన వ్యాపారి) చేప పిల్లలను పంపిణీ చేశారు. -
Telangana: ఉచిత చేప పిల్లల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈనెల 5 నుంచి ఉంటుందని, దీన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని మత్స్య శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శనివారం మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చేపపిల్లల పంపిణీకి మత్స్య మిత్ర యాప్‌ను ప్రారంభించారు. ఈ ఏడాది 26,778 నీటి వనరుల్లో రూ.68 కోట్ల వ్యయంతో 88.53 కోట్ల చేపపిల్లలను విడుదల చేస్తామన్నారు. చేపపిల్లలను సరఫరా చేసే వాహనం నెంబర్, డ్రైవర్ వివరాలు, ఫోన్ నెంబర్ వివరాలను ఈ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. చేప పిల్లలను ఏ నీటి వనరులో ఎన్ని విడుదల చేశారు? ఏ రకం విడుదల చేశారు? అనే వివరాలు, ఫొటోలు ఏ రోజుకారోజు యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఈ యాప్ వినియోగం వలన కలిగే ఉపయోగాలను మత్స్యకారులకు కూడా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేప పిల్లల విడుదల ప్రక్రియను పర్యవేక్షించడానికి కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తలసాని వెల్లడించారు. సైజ్, నాణ్యత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చేప పిల్లలను మాత్రమే విడుదల చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వలను పర్యవేక్షించేందుకు 26 వేలకుపైగా నీటి వనరులను జియోట్యాగింగ్ చేసినట్లు వెల్లడించారు. కాగా, సోమవారం జనగామ జిల్లా ఘన్పూర్ రిజర్వాయర్‌లో మంత్రి చేపపిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. -
చేపపిల్లలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలి: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: ఉచిత చేప పిల్లల పంపిణీకి అవసరమైన చేపపిల్లలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే అంశంపై దృష్టి సారించాలని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని సూచించారు. గొర్రెలు, మేకల ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధార్ సిన్హాతో కలిసి సోమవారం మత్స్య భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రాంచందర్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీరోజీ పాల్గొన్న సమావేశంలో... మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పీపీపీ పద్ధతిలో మరింత అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసి, నివేదిక అందజేయాలని సూచించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల్లో మత్స్యశాఖ కార్యక్రమాల నిర్వహణ కోసం అనువైన 159 ఎకరాల భూమిని గుర్తించామని, అందులో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రూ.4,563 కోట్ల ఎన్సీడీసీ రుణం మంజూరైందని, చనిపోయిన గొర్రెల బీమా అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లాల్లో గొర్రెల మార్కెట్ కోసం భూమి కేటాయింపు, నిధుల మంజూరు జరిగినా పనులు జరగడం లేదని, వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశు వైద్యశాలల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. -
చేపల చెరువుల్లో కాసుల వేట
ఇది జనగామ జిల్లాలోని తరిగొప్పుల చెరువు. ఇందులో వల వేస్తే దొరికే చేపల్ని ఏరడానికి రెండు చేతులూ చాలవంటారు ఇక్కడి మత్స్యకారులు. కానీ సంవత్సరం క్రితం వదిలిన చేపపిల్లలు ఇప్పటికీ పిల్లలుగానే ఉన్నాయని, బరువు పెరగలేదని దోసిలి చిన్నబోతోందని అంటున్నారు. మెదక్ చెరువులో ఎదిగీ ఎదగని చేపపిల్లల్ని చూపుతున్న వీరిద్దరు గంగారాం, వెంకటేశ్. ఏడాది పాటు పిల్లల్ని పోసి పెంచితే..చేపలు అరకిలో మేరకైనా బరువు పెరగలేదని, దోసిలైనా నిండలేదని వాపోతున్నారు. ఏడాదిశ్రమ వృథా అయిందని వీరంటున్నారు. శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) చేపా చేపా ఎందుకు ఎదగలే అంటే.. పూర్తిగా ఊపిరి పోసుకోకుండానే పంపిణీ చేశారు.. అదను దాటాక నన్ను చెరువులోకి పంపారంటోంది. మండు వేసవిలోనూ కృష్ణా, గోదావరి నీళ్లతో కళకళలాడే 28,704 నిండు చెరువులు, కుంటల ద్వారా నీలి విప్లవం సాధన దిశగా ప్రభుత్వం వేసిన అడుగులను ఇంటి దొంగలే దారి మళ్లించారు. ఎక్కడికక్కడ నిబంధనలకు తిలోదకాలిచ్చి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ఫలహారంలా పంచుకుతిన్నారు. చెరువును, చేపను నమ్ముకున్న వారిని వంచన చేశారు. కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు లాభపడితే, నెలల తరబడి శ్రమించిన గంగపుత్రులు, ముదిరాజ్‌లు దగాపడ్డారు. కూలీ కూడా గిట్టుబాటు కాలేదు రాష్ట్రంలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత (100 శాతం సబ్సిడీ) చేపపిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే 2021–22 వార్షిక సంవత్సరానికి గాను సుమారు రూ.93 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని మత్స్య సహకార సంఘాలకు 89.09 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశారు. అయితే విత్తన చేపల్లో 40 శాతానికి పైగా చెరువుల్లో వేయగానే మరణించగా, ప్రాణంతో మిగిలిన చేపలను ఎంతో జాగ్రత్తగా పెంచినా ఎక్కడా ఒక్క చేప కూడా 500 గ్రాములకు మించి బరువు పెరగలేదు. ఫలితంగా ఏడాదంతా కష్టపడిన మత్స్యకారులకు కూలీ కూడా గిట్టుబాటు కాకపోగా, అనేక చోట్ల ఎదగని చేపలను పట్టకుండా చెరువుల్లోనే వదిలేశారు. చచ్చిన పిల్లలకూ లెక్కలు చేప పిల్లల పంపిణీని జూన్ – జూలై మాసాల్లో మొదలు పెడితే చెరువులు, కుంటల్లో నీళ్లు తగ్గే మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఎదిగిన చేపలు పట్టేందుకు అనుకూలమైన సమయం. ఆ తర్వాత వర్షాలు వస్తే చెరువులు, కుంటలు పొంగి పొర్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే గత ఏడాది చేప విత్తనాల (పిల్లల) కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం నుంచే కొందరు పెద్దలు, అధికారులు కాసుల వేట ప్రారంభించారు. రాష్ట్రంలోని చెరువుల్లోనే చేప పిల్లలను ఉత్పత్తి చేయాలనే నిబంధన పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. తమకు అనుకూలమైన వారికి కాంట్రాక్టు దక్కేలా చూసే క్రమంలో ఏకంగా ఆరుసార్లు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టులు పొందిన ఇతర రాష్ట్రాల వారు డ్రమ్ములు, ట్యాంకర్ల ద్వారా విత్తనాలు సరఫరా చేశారు. తీరిగ్గా సెప్టెంబర్, అక్టోబర్‌లో చెరువుల్లో వదిలారు. అప్పటికే అనేక చేప పిల్లలు మృత్యువాత పడ్డా వాటిని కూడా చెరువుల్లో కలిపేసి లెక్కలు రాసుకున్నారు. సైజు, నాణ్యతలోనూ రాజీ విత్తన చేప పిల్లలను 35– 40 (చిన్న చెరువులు, కుంటలకు), 80–100 (పెద్ద చెరువులు, రిజర్వాయర్లకు) మిల్లీమీటర్ల (పొడవు) చొప్పున రెండురకాల సైజుల్లో కొనుగోలు చేయాలని నిర్ణయించినా ఎక్కడా నిబంధనలు అమలు కాలేదు. పైగా సైజుతో పాటు పిల్లల నాణ్యతలో కూడా రాజీ పడిపోయారు. ఓ వైపు కాలం దాటాక చెరువుల్లో వేయటం, చిన్న సైజు.. సరిగ్గా అభివృద్ధి చేయని విత్తనాలను (నాణ్యత లేని చేప పిల్లలు) చెరువుల్లో వదలటం వల్ల ఆశించిన దిగుబడిలో సగం కూడా లేదని మత్స్య సహకార సంఘాలు వాపోతున్నాయి. అదను దాటినా నాణ్యమైన చేప పిల్లలను వదిలితే 6–8 మాసాల్లోనే ఒక్కో చేప కిలో నుండి కిలోంబావు వరకు తూకం వచ్చేది. కానీ సగటున 450 గ్రాములు కూడా తూగటం లేదు. వాస్తవానికి గతంలో ప్రభుత్వమే చేప పిల్లలను ఉత్పత్తి చేసి సంఘాలకు ఇచ్చేది. కానీ గత కొన్నేళ్లుగా విత్తనాల పంపిణీని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. దీని వెనుక కూడా భారీ మతలబు ఉందనే ఆరోపణలున్నాయి. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రు కొండ మంగలి కుంట చెరువులో గతేడాది ఆగస్టు నెలలో బంగారు తీగ, బొచ్చ, రవ్వ రకాల చేప పిల్లలను వదిలారు. ఒక్కో చేప కేవలం 100 నుంచి 150 గ్రాములు మాత్రమే పెరిగింది. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో వేసిన 7.20 లక్షల చేప పిల్లల్లో 50 శాతం మాత్రమే బతికాయి. భారీగా ఎదిగిన ‘ప్రైవేటు’ పిల్లలు మా తపాలఖాన్ చెరువులో గత సెప్టెంబర్‌లో 80 వేల చేపపిల్లలు (బొచ్చ, బంగారుతీగ, రవ్వ) వదిలారు. అన్నీ బాగా ఉంటే ఆర్నెల్లలో కిలోకు పైగా తూగాలి. కానీ ఈ రోజుకు 100 గ్రాములకు కూడా పెరగలేదు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసినా మాకు ఏ ప్రయోజనం లేదు. మేము జగిత్యాల నుండి సొంత ఖర్చుతో ప్రైవేటు వ్యక్తుల నుండి తెచ్చిన పిల్లలు భారీ సైజు వచ్చాయి. – బాలయ్య, తున్కిఖల్సా, వర్గల్, సిద్దిపేట జిల్లా -
చేపా.. చేపా ఎందుకు వదల్లే? ‘కాంట్రాక్టు’ అడ్డమొచ్చింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా మత్స్యసంపద పెరుగుతున్నప్పటికీ ఈ కార్యక్రమం అమల్లో ఎదురవుతున్న సమస్యలు విమర్శలకు తావిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందలకోట్ల రూ పాయలు ఖర్చు పెట్టి జలవనరుల్లో ప్రభుత్వం చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ ఈ ప్రక్రియలో అవలంబిస్తోన్న పద్ధతుల పై పలు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమై ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు సకా లంలో జలవనరుల్లో చేప పిల్లలను వదల్లేకపోతు న్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపభూయిష్టంగా కాంట్రాక్టు విధానం.. వాస్తవంగా జలవనరుల్లోకి జూన్, జూలై నెలల్లోనే చేపలు, రొయ్యల పిల్లలు వదలాల్సి ఉంటుంది. అప్పుడే సమయానుకూలంగా అవి పెరిగి పెద్దవయి ఆరోగ్యకరమైన మత్స్య సంపదను సృష్టిస్తాయి. కానీ, మత్స్య శాఖ అవలంబిస్తోన్న కాంట్రా క్టు విధానంతో చెరువుల్లో చేప పిల్లల్ని పోయడం ఆలస్యమవుతోంది. మత్స్యకార సొసైటీల ద్వారా పోసినప్పుడు ఇబ్బందులు రాలేదు కానీ, ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవస్థను తీసుకురావడంతో ఆలస్యం జరుగుతోంది. కాంట్రాక్టుల ఖరారులో ఆలస్యం, కాంట్రాక్టర్లు పేచీలు పెట్టడం, విత్తనాల ధరల నిర్ణయంలో రాజకీయ జోక్యం అనివార్యం కావడం, కాంట్రాక్టర్లు ఈ విషయంలో ఆందోళనకు దిగడంతో టెండర్‌ను రద్దు చేయడం వరకు పరిణామాలు వెళ్లాయంటే ఈ కాంట్రాక్టు విధానం ఎంత లోపభూయిష్టంగా అమలవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను తెచ్చి చెరువుల్లో వదిలేసరికి పుణ్యకాలం కాస్తా అయిపోతోంది. అభాసుపాలవుతున్న ప్రక్రియ ఇక చెరువుల్లో వదిలే సమయంలో కూడా అనవసరమైన రాజకీయ ప్రమేయంతో జాప్యం జరుగుతోంది. ఫలానా చెరువులో చేపలు పోయాలంటే అక్కడి ప్రజాప్రతినిధులందరూ హాజరు కావాల్సి ఉండడం, ఒక్కరికి వీలు లేకపోయినా కార్యక్రమం వాయిదా వేయాల్సి రావడం లాంటి ప్రొటోకాల్ సమస్యలు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని మత్స్యశాఖ అధికారులే చెబుతున్నారు. మరోవైపు చేప విత్తనాలు పూర్తి స్థాయిలో ఏక కాలంలో అందుబాటులోకి రాకపోవడం, నాసిరకంగా ఉన్నాయని, పిల్లలు సరిగా లేవని, తక్కువగా వచ్చాయనే వివాదాలు కూడా ఈ ప్రక్రియను అభాసుపాలు చేస్తున్నాయి. అలాగే రాష్ట్ర చేపగా గుర్తింపు పొందిన కొర్రమీనును చెరువుల్లో పోసేందుకు మత్స్యశాఖ ఇప్పటివరకు ఉపక్రమించకపోవడం విమర్శలకు కారణమవుతోంది. నిబంధనల మేరకు సాగని లెక్క వాస్తవానికి చేప పిల్లలను లెక్కపెట్టి మరీ చెరువుల్లో పోయాలి. ఈ లెక్క పెట్టిన చేప పిల్లలను రెవెన్యూ అధికారులు నిర్ధారించాలి. కెమెరాల మధ్య ఈ కార్యక్రమం జరగాలి. కానీ, అలా జరగడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. చేప పిల్లల లెక్కింపులో జరిగిన అవకతవకల కారణంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు క్షేత్రస్థాయి అధికారులపై ప్రభుత్వం అధికారికంగా అభియోగా లు నమోదు చేసి విచారణ జరుపుతోంది. కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల వారితో పాటు రాజకీయ నాయకులు ఆర్థిక ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నారే తప్ప మత్స్యకారుల సంక్షేమం కోసం ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మత్స్య సొసైటీలకే పూర్తిస్థాయిలో చేప పిల్లలను పోసే కార్యక్రమాన్ని అప్పగించడంతో పాటు మత్స్య శాఖ కచ్చితమైన పర్యవేక్షణతో ఈ సమస్యల్ని అధిగమిస్తే ప్రయోజనం ఉంటుందని, మత్స్య సంపద పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉచిత పంపిణీతో సత్ఫలితాలు మత్స్యకారుల ఆర్థిక స్వావలంబన పెంచే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమం అమల్లో ఎలాంటి సమస్యలున్నప్పటికీ చేప పిల్లల ఉచిత పంపిణీ సత్ఫలితాలనిస్తోందని గణాంకాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిలో మత్స్య సంపద చెప్పుకోదగిన పాత్ర పోషిస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో చేపల పెంపకం, ఆక్వాకల్చర్ జీఎస్డీపీ భాగస్వామ్యం రూ. 2,670 కోట్లు ఉండగా, ఆ తర్వాత ఏడాది నుంచి వరుసగా రూ.2,649 కోట్లు, రూ.2,275 కోట్లు, రూ.3,654 కోట్లు, రూ.4,042 కోట్లు, రూ.4,694 కోట్లు, రూ.5,254 కోట్లుగా నమోదు కావడం గమనార్హం. 2016–17లో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రారంభం కాగా, 2017–18లో రొయ్య పిల్లల పంపిణీ ప్రారంభించారు. మత్స్యకారుల కంటే కాంట్రాక్టర్‌కే ఎక్కువ లబ్ధి ప్రభుత్వం విడుదల చేసే చేప పిల్లల్లో కేవలం రెండు మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. అదే మత్స్యకార సొసైటీలకు నిధులు ఇస్తే పది రకాల చేపలను వదిలే అవకాశం ఉంటుంది. చేపలు పోసే అధికారం కాంట్రాక్టర్‌కు ఉండడంతో నాసిరకం చేపలను వదులుతున్నాడు. అదే సమయంలో ఎక్కువ రేటు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ పథకంలో వాస్తవంగా మత్స్యకారుల కంటే కాంట్రాక్టరే ఎక్కువ లబ్ధి పొందుతున్నాడు. – కాశమేని దేవేందర్, మత్స్యకారుడు, సిరిసిల్ల -
చేపలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరాం: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన మత్స్యరంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏడేళ్లలో చేపలను ఉత్తర భారతదేశంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని ఆయన పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రంగనాయకసాగర్, సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలసి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. గోదావరి, కృష్ణా జలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో రూ.4.87 కోట్లతో అన్ని జలాశయాల్లో 4కోట్ల19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామన్నారు. తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా మారిందని, ఎక్కడ చూసినా ధాన్యం, మత్స్య సంపద కళ్ల ముందు కనిపిస్తోందని చెప్పారు. కుల వృత్తులకు పూర్వవైభవం: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులవృత్తులకు పూర్వవైభవం కోసం కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగు కోసం తమ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 93 కోట్ల చేప పిల్లలను, 20 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తోందన్నారు. రెండేళ్లలో ఫెడరేషన్ ద్వారా చేప పిల్లలను కొని మార్కెటింగ్ చేయాలనే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నామన్నారు. అప్పుడు చేపలకు మంచి ధర వస్తుందన్నారు. అప్పటివరకు మత్స్యకారులు చేపలను తక్కువ ధరకు అమ్మకుండా డిమాండ్ ఉన్న హైదరాబాద్, ఇతర రాష్ట్రాలలో బహిరంగ మార్కెట్లో విక్రయించి లాభాలు పొందాలని సూచించారు. భవిష్యత్‌లో మొబైల్ ఔట్ లెట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మురిసిన మంత్రి హరీశ్‌రావు చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి ఓ చేపపిల్లను చూడగానే తె లియని ఆనందం కలిగింది. దాన్ని చేతితో పట్టుకుని చూస్తూ మురిసిపోయారు. అనంతరం ఆ చేపను నీటిలో వదిలారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువులో మంత్రి హరీశ్‌రావు చేపపిల్లలను వదులుతుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. -
నేటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. సిద్దిపేట జిల్లా చందలాపూర్‌లోని రంగనాయకసాగర్‌లో, సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువులో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలిసి చేప పిల్లలను విడుదల చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని నీటి వనరులలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సహకార సొసైటీల సభ్యులు.. చేప పి ల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని శ్రీనివాస్ యాదవ్ కోరా రు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 30 వేల నీటి వనరులలో రూ. 80 కోట్ల ఖర్చుతో 93 కోట్ల చేప పిల్లలను, 200 వివిధ నీటి వనరులలో రూ. 25 కోట్ల ఖర్చుతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. -
అలుగు దుంకిన చేప
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మొన్నటి వర్షాల దెబ్బకు చెరువుల్లో చేపలు అయిపూ అజా లేకుండా కొట్టుకుపోయాయి. నీటి వనరుల్లో ఎదిగి సిరులు పండిస్తాయని ఆశించిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. వాగుల్లో, చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు పోసి వాటిని మత్స్యకారులకు ఆర్థిక వనరుగా మార్చాలనే సర్కారు లక్ష్యానికి ఈసారి వర్షాలు గండికొట్టాయి. ఇప్పటివరకు ఏ చెరువులో ఎన్ని చేపల్ని పోశారనే లెక్కలున్నాయి కానీ.. వర్షా ల తర్వాత ఎన్ని మిగిలాయనేది తెలియట్లేదు. ఈ ఏడాది లక్ష్యం 77 కోట్లపైనే.. మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 77 కోట్లకుపైగా చేపపిల్లల్ని పంపిణీ చేయాలని సంకల్పించింది. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో గల 21,855 చెరువుల్లో జూలై – ఆగస్టు మధ్యకాలంలో దాదాపు 56 కోట్లకుపైగా చేపపిల్లల్ని వదిలింది. లక్ష్యంలో 78.46 మేర పంపిణీ పూర్తయింది. మిగతావి వదలాలనుకునే వేళలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. చెరువులన్నీ అలుగుపోయడంతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చేపలన్నీ కొట్టుకుపోయాయి. ఇంకా చెరువుల్లో ఎన్ని మిగిలాయో, కొత్తగా మళ్లీ ఎన్ని వదలాలో తెలియక మత్స్యకారులు, మత్స్యశాఖ కిందామీదా పడుతున్నాయి. ముందువరసలో ఆ 4 జిల్లాలు ఉచిత చేపపిల్లల పంపిణీ 4 జిల్లాల్లో ఇప్పటికే వంద శాతం పూర్తయింది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోని చెరువుల్లో వంద శాతం చేపపిల్లల్ని పోశారు. అత్యల్పంగా సూర్యా పేట జిల్లాలో 51.51శాతం మేర మాత్రమే లక్ష్యం నెరవేరింది. ఆయా చెరువుల్లో కొద్దోగొప్పో చేపలు మిగిలినా ఎదుగుదల బాగా లేదని మత్స్యకారులు అంటున్నారు. నెరవేరని ముందస్తు లక్ష్యం ఈ ఏడాది కాస్త ముందే చేపపిల్లల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకుతగ్గట్టే జూలై–ఆగస్టు మధ్యలో పంపిణీ చేపట్టింది. ఇంకో 20 కోట్లకుపైగా చేపలను పోయాలనే సమ యంలోనే భారీ వర్షాలు రావడంతో బ్రేక్ పడింది. మిగిలిన చెరువుల్లో లక్ష్యం మేరకు చేపల్ని వదలడంతో పాటు.. కొట్టుకుపోయిన చోట్ల ఏం చేయాలనే దానిపై నివేదిక తయారు చేస్తున్నారు. ‘చేపపిల్లలు చెరువు దాటి వెళ్లినట్టు మత్స్యకారులు భావిస్తే ఆయా జిల్లాల అధికారులకు తెలిపాలి. అవసరమైన మేర మళ్లీ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయా చెరువుల్లో మళ్లీ చేపప్లిలలు పోయాలని అధికారులకు ఇప్పటికే తెలిపాం’అని మత్స్యశాఖ అధికారి ఒకరు చెప్పారు. -
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20 హబ్‌లు
సాక్షి, అమరావతి : కోవిడ్–19 కారణంగా ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతులు తగ్గిన నేపథ్యంలో స్థానికంగా చేపల మార్కెటింగ్ (డొమెస్టిక్ మార్కెటింగ్) పెంచడం ద్వారా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు గురువారం డొమెస్టిక్ మార్కెటింగ్‌పై సమీక్షించారు. చేపల వినియోగం పెంచడానికి ప్రభుత్వం సత్వరం చేపట్టాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. (అమరావతికి నిధుల సమీకరణ) అదనపు ఆదాయం వచ్చే యూనిట్లు పెట్టించండి వైఎస్సార్ చేయూత పథకం కింద ఇచ్చిన మొత్తంతో నాటుకోళ్లు, పొట్టేళ్లు, గొర్రెల పెంపకం వంటి యూనిట్లు మహిళలతో పెట్టించి ఆరి్థకంగా వారి బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. ► సెప్టెంబర్ లోపు పూర్తిస్థాయిలో మహిళలకు వారు కోరుకున్న యూనిట్లను అందించడానికి చర్యలు తీసుకోవాలి. ► మొదటి విడతగా లక్ష పాడి పశువులు అందించాలి. ► నెలకు కనీసం రూ. 10 నుంచి 15 వేల వరకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి. ► సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యదర్శి రాజబాబు, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ డైరెక్టర్ వాణీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన నిర్ణయాలు ఇవీ.. ► రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20 హబ్‌లు ఏర్పాటు ► హబ్‌ల్లో శీతలీకరణ సౌకర్యాలతోపాటు లైవ్‌ఫిష్ నిల్వలుంటాయి. ► వినియోగదారులకు చేపలు డోర్ డెలివరీ ద్వారా విక్రయాలు ► త్వరలో ప్రత్యేక మత్స్య విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించడానికి చర్యలు ► చిన్న, పెద్ద రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా చేపల పెంపకానికి ప్రోత్సాహం -
'చేతకాని దద్దమ్మలు కుట్రలు పన్నుతున్నారు'
సాక్షి, సూర్యాపేట: చేతకాని దద్దమ్మలు అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని పెద్దచెరువులో 5వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ప్రగతి భవన్‌ను ముట్టడించి అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారు. దేశంలోనే 55 శాతం పంటలు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్నాయి. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకురావడం కోసమే పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చాం. గ్రామాల్లో పల్లె పల్లెల్లో రైతులు ఆనందంగా ఉండటం కోసమే అన్ని వసతులను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతుంది. గతంలో గోపాలమిత్ర జీతాలను 3వేల రూపాయల నుంచి 8వేలకు పెంచిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఉచితంగా గర్భధారణ పరీక్షలు చేస్తున్నాం. కరోనా సమయంలో కూడా రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే' అంటూ మంత్రి తలసాని పేర్కొన్నారు. (తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు) -
‘నేటి నుంచి చేప పిల్లల పంపిణీ ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ గురువారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలోని పెంటాని చెరువులో చేప పిల్లలు పోసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మత్స్యశాఖ గుర్తించిన 24 వేల నీటివనరుల్లో రూ.60 కోట్ల వ్యయంతో 81 కోట్ల చేప, 5 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (తెలంగాణలో కొత్తగా 2092 కరోనా కేసులు) అటవీ శాఖ టెండర్ల స్వీకరణ గడువు తగ్గింపు సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖ పరిధిలోని ఫారెస్ట్ బ్లాక్‌ల్లో అర్బన్ పార్కుల అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కమాండ్ ఏరియాల్లో పనుల నిర్వహణకు సంబంధించిన ఈ–టెండర్ల స్వీకరణ గడువును తగ్గించారు. గతంలో టెండర్ నోటీసు ప్రకటించిన తేదీ నుంచి 14 రోజుల్లో (ఫస్ట్ కాల్) టెండర్ల స్వీకరణ గడువు ఉండగా, ఆ మేరకు గతంలో జారీ చేసిన జీవోలోని నిబంధనను సడలిస్తూ ఈ వ్యవధిని వారం రోజులకు తగ్గిస్తూ బుధవారం అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
కోర్టు బోనులో చేప !
సాక్షి, హన్మకొండ: మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ఆరేళ్లుగా వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న చేపపిల్లల పంపిణీపై ఈ ఏడాది రాజకీయ నీడ పడింది. నిబంధనలకు లోబడి టెండర్లు దాఖలు చేయలేదని పేర్కొంటూ అన్ని టెండర్లను మత్స్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. దీంతో ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉచిత చేప పిల్లల విషయమై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతుండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఒకే సంస్థ ఉండడంతో. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలతో పాటు సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో ఒకే సంస్థ బాధ్యులు ఉచిత చేపపిల్లల పంపిణీకి టెండర్లు దాఖలు చేసినట్లు తెలిసింది. దీంతోనే టెండర్లను రద్దు చేసినట్లు అనధికారిక వర్గాలు చెబుతున్నాయి. సదరు సంస్థకు దాదాపు దశాబ్దకాలంగా చేపపిల్లల పంపిణీలో అనుభవం ఉన్నా ఈ ఏడాది మాత్రమే టెండర్లను రద్దు చేయడం వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి నాలుగు టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో ఒక సంస్థ మాత్రమే నిబంధనలకు లోబడి ఉండగా, మిగతా మూడు సంస్థలను సాంకేతిక కమిటీ పరిశీలన తర్వాత పక్కన పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అన్నీ సక్రమంగా ఉన్నట్లు చెబుతున్న ఓ సీడ్ సంస్థ బాధ్యులు ఇక్కడే కాకుండా సిద్ధిపేట, నల్లగొండ జిల్లాల్లో సైతం టెండర్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఏ అధికారం లేనప్పటికీ అనేక ఏళ్లుగా సదరు సంస్థ బాధ్యులు కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు కొందరు ఓ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. చివరకు మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సదరు సంస్థను కూడా బరి నుంచి తప్పించినట్లు ప్రచారం సాగుతోంది. దీనికి నిబంధనలను సాకుగా చూపెట్టారని మత్స్యశాఖ అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మా వద్ద తనిఖీకి రాలేదు... నిబంధనలకు లోబడి టెండర్లు వేసినా రద్దు చేయడంతో అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొండా సుస్మితాపటేల్ సంస్థ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తమ సంస్థ సీడ్ ప్లాంట్ వద్దకు అధికారులెవరూ తనిఖీకి రాలేదని న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఫిషింగ్ సీడ్ ఫాంలో సుమారు దశాబ్దకాలం అనుభవం కలిగిన తమ సంస్థ టెండర్‌ను రాజకీయ దురుద్దేశంతోనే రద్దు చేశారని పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు మత్స్యశాఖ అధికారుల తీరును తప్పుపట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తిరిగి సదరు సంస్థ టెండర్లను పరిశీలించాలని ఆదేశించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం కాగా, ఉమ్మడి వరంగల్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. కోర్టు ఆదేశాలతో తిరిగి టెండర్లు పిలవాలా, గతంలో దాఖలైన టెండరుదారుల నుంచి ఒకరిని ఎంపిక చేయాలా అనే విషయమై అధికారులు తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం జిల్లాలో ఉచిత చేపపిల్లల పంపిణీకి నాలుగు టెండర్లు దాఖలయ్యాయి. అందులో ఒకరి టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఉండగా, మిగిలిన మూడు సంస్థలను సాంకేతిక కమిటీ నిపుణులను తోసిపుచ్చారు. ప్రభుత్వం ఈనెల 6నుంచి చేపపిల్లలను పంపిణీ చేయాలని సూచించింది. కానీ ఇక్కడ టెండర్లు కూడా ఖరారు కాని విషయాన్ని మత్స్యశాఖ కమిషనర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి టెండర్లు పిలవాలా లేక ఏం చేయాలనే విషయమై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. అక్కడి నుంచి అందే ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. – డాక్టర్ టి.విజయభారతి, మత్స్యశాఖ అధికారి, వరంగల్ అర్బన్ -
చేప.. ఎంతకీ పెరగక!
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. చెరువుల్లో పోసిన చేపపిల్లలు ఎనిమిది నెలలైనా అరకిలో పరిమాణానికి కూడా పెరగకపోవడంతో మత్స్యకారులు దిగాలు పడుతున్నారు. నాణ్యత లేని చేపపిల్లల్ని పంపిణీ చేయడమే ఇందుకు కారణమని మత్స్యకారులు అంటుండగా, ఫీడింగ్ లోపాలే కారణమని అధికారులు అంటున్నారు. జీవన ప్రమాణాలు పెంచాలని.. మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల ను అటు సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు ఇటు మత్స్య సంపద కేంద్రాలుగా మార్చడం ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 80 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసింది. ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు చేపపిల్లలను చెరువుల్లో అట్టహాసంగా వదిలారు. అయితే, ఈ చేపపిల్ల ల్లో ఎంతకీ ఎదుగుదల లేదు. దీంతో ఇవి పెరిగాక పట్టుకుని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఉపాధి పొందాలనుకుంటున్న మత్స్యకారుల ఆశలకు గండి ప డుతోంది. తమను ఆదుకోవాలనే ఉద్దే శంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి నా చేపలు పెరగకపోవడంతో నష్టాల పా లుకావాల్సి వస్తోందని వారంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి తెచ్చుకున్న చేపపిల్లలు 8 నెలల్లో కనీసం కిలో నుంచి రెండు కిలోల వరకు పెరిగాయని, ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లలు అరకిలో కూడా పెరగలేదని అంటున్నారు. పెరిగిన చేపల్ని పట్టే వారికిæ కిలోకు రూ.10 – రూ. 15 ఇవ్వాలని, దీనికి తోడు లారీ, ఐస్, బాక్సులు, కూలీలకు కలిపి కిలోకు రూ.80 వరకు ఖర్చవుతుందని, ఇంత చేసినా ఈ పెరగని చేపల ధర రూ.60 – రూ.80 మించడంలేదని వాపోతున్నారు. చిన్న చేపలకు డిమాండ్ తక్కువ మార్కెట్లో చేపలు అమ్మాలన్నా, కొనాలన్నా వాటి కనీస సైజును బట్టి ధర పలుకుతుంది. కిలో కంటే తక్కువున్న వాటికి ధర, డిమాండ్ తక్కువ. ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా పోస్తున్న వాటిలో ఎక్కువగా రవ్వ, బొచ్చ వెరైటీలు ఉన్నాయి. నిజానికి మార్కెట్లో ఈ రకాలకు డిమాండ్ ఎక్కువ. రవ్వ కిలో రూ.140 – రూ.200, బొచ్చ రూ.150 – రూ.220, కొర్రమీను రూ.450 – రూ.650 ధర పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం పోసిన చేపలు అరకిలో కూడా తూగడం లేదు. దీంతో అంత ధరరాక, అయినకాడికి అమ్ముకుంటున్నట్టు మత్స్యకారులు వాపోతున్నారు. కష్టపడి చేపలు పడుతున్నా.. వాటికి కనీస ధర రావట్లేదని, అలాగని చెరువుల్లోనే ఉంచితే చనిపోతున్నాయని అంటున్నారు. అధికారులు ఏమంటున్నారంటే.. చేపపిల్లల్లో నాణ్యతంటూ ఏమీ ఉండదని, ఆశపడి పిల్లలు ఎక్కువగా పోసినా పెరుగుదలలో తేడా వస్తుందని, దాణా సరిగా ఇవ్వకపోవడం కూడా కారణం కావచ్చని అధికారులు చెబుతున్నారు. నాణ్యతపై అనుమానాలుంటే, విచారణ జరిపిస్తామని అంటున్నారు. చిన్న చేపలు కొనడం లేదు ప్రభుత్వం ఉచితంగా పోసిన చేపపిల్లలు ఏడు నెలలైనా కనీసం అరకిలో కూడా పెరగడం లేదు. చిన్నసైజు చేపల్లో ముళ్లు ఎక్కువ ఉంటాయని ప్రజలు కొనడం లేదు. – జి.గణేష్, సిరిసిల్ల, మత్స్యకారుడు నాణ్యతలేకే ఇలా.. చేపపిల్లల్లో నాణ్యత లేకే ఎదగడం లేదు. మత్య్సకారుల మంచి కోసమే చేపపిల్లల పంపిణీ చేపట్టినా.. నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలి. – కనకయ్య, సిద్దిపేట, మత్స్యకారుడు చెరువును బట్టి చేపలు వదలాలి చెరువును బట్టి చేపపిల్లలు పోస్తే బాగుంటుంది. ఇష్టానుసారం చెరువుల్లో వదలడం వల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇచ్చిన చేపల్లో కొన్ని సోడిపట్లపోతున్నాయి. – శ్రవణ్‌కుమార్, భిక్షపతి చేపల వ్యాపారి -
చేపా.. చేపా ఎందుకురాలేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో జలకళ ఉట్టిపడుతోంది. జలాశయాలు, చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నా యి. ఇటువంటి పరిస్థితుల్లో చేప పిల్లలను జలాశయాల్లోకి విడుదల చేయడంలో మత్స్యశాఖ విఫలమైందన్న ఆరోపణలున్నాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారంటే నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. నీరు సమృద్ధిగా ఉన్న జలాశయా ల్లోనూ కేవలం లక్ష్యంలో 59.38 శాతం మాత్రమే చేప పిల్లలను వదలడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది 22,203 జలాశయాల్లో 82.28 కోట్ల చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. 12,778 జలాశయాల్లోకి మాత్రమే నీరు వచ్చిందని, అందులో 55.60 లక్షల చేప పిల్లలు అవసరమని నిర్ధారించారు. ఆ ప్రకారం చూసినా ఇప్పటివరకు కేవలం 9,283 జలాశయాల్లో 33.02 కోట్ల చేప పిల్లలను మాత్రమే విడుదల చేసినట్లు మత్స్యశాఖ నివేదిక వెల్లడించింది. అంటే కేవలం 59.38 శాతం మాత్రమే విడుదల చేశారు. సూర్యాపేటలో 11.44 శాతమే.. ప్రభుత్వం మూడేళ్లుగా మత్స్యకార సొసైటీల ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని మొదలుపెట్టింది. 2016–17లో 27.85 కోట్ల చేప పిల్లలను, 2017–18లో 51 కోట్లు, 2018–19లో 49.15 కోట్ల చేప పిల్లలను వదిలిపెట్టింది. ఈసారి భారీ వర్షాలు కురిసినా లక్ష్యాన్ని చేరుకోవ డంలో అధికారులు తంటాలు పడుతున్నా రు. సూర్యాపేట జిల్లాలో 3.14 కోట్ల చేపపిల్లలను వదలాలని నిర్ణయించ గా, 36 లక్షల చేప పిల్లలను విడుదల చేయడంపై విమర్శలొచ్చాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 94.49 శాతం, ఖమ్మం జిల్లాలో 94.07%, వరంగల్ రూరల్ జిల్లాలో 93.66 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 89.14 శాతం, వరంగల్ అర్బన్ జిల్లాలో 88.99 శాతం చేప పిల్లలను వదిలారు. చాలా జలాశయాల్లో వరదల కారణంగా నీరు బయటకు పోవడంతో అప్పటికే వేసిన చేప పిల్లలు కూడా వెళ్లిపోయాయని సొసైటీల ప్రతినిధులు చెబుతున్నారు. -
చేప పిల్లలు మింగేశారు..!
‘‘ చేప పిల్లలను మింగేశారు.. ఇదేంటి.. మృగశిరకార్తె కూడా కాదు.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు చేపమందు పంపిణీ చేయడం లేదు.. మరి చేప పిల్లలను మింగేయడం ఏంటని అనుకుంటున్నారా..! అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇదీ.. మత్స్యశాఖ అధికారుల మాయాజాలం.’’ వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షల చేప పిల్లలను డిండి మండల పరిధిలోని చెరువుల్లో ఆ శాఖ అధికారులు పోయాల్సి ఉండగా సగానికి సగం మాయం చేసేసి ఆ చెరువుల్లోనే వాటిని వదిలామని చెబుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. సాక్షి, దేవరకొండ: డిండి మండల పరిధిలో నీటి సౌకర్యం ఉన్న చెరువులు, కుంటలు సుమా రు 20 వరకు ఉన్నాయి. చేపల వేటనే జీవనధారంగా చేసుకుని మండలంలో దాదాపు 500 మంది మత్యకారులు బతుకుతున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మండలంలోని తంబాలబండ, ఏనెకుంట, మొద్దులకుంట, బాపన్‌కుంట, కాంట్రోన్‌కుంట తదితర చెరువుల్లో నీటి సౌకర్యం ఉన్నందున 6.60 లక్షల చేప పిల్లలను వదిలేందుకు మత్య్సశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. లెక్కింపు యంత్రం లేకుండానే.. అధికారుల ప్రతిపాదనల మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు డిండి మండలానికి ఈ నెల 19వ తేదీన 6.60 లక్షల చేప పిల్లలను పంపించారు. అదే రోజు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చేప పిల్లల లెక్కింపు యంత్రం లే కుండానే ఆయా చెరువుల్లో వాటిని వదిలేశారు. మిగిలిన 3.20 లక్షల చేప పిల్లలు ఏమైనట్టు..? మండలంలోని ఆయా చెరువుల్లోని మత్స్య సహకార సొసైటీ సభ్యుల లెక్కల ప్రకారం మత్స్యశాఖ అధికారులు ఆయా చెరువుల్లో వదిలింది.. 3.40 లక్షల చేప పిల్లలే. అయితే మిగిలిన చేప పిల్లలు ఏమయ్యాయని అధికారులను కోరితే ఆయా చెరువుల్లోనే సర్దేశామంటూ పొంతలేని సమాధానాలు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి చెరువులో చేప పిల్లలు వదిలిన తర్వాత మళ్లీ పోయాలంటే సొసైటీ సభ్యుల తీర్మానం, ఉన్నతాధికారుల ఉత్తర్వులు ఉండాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుం డా అధికారులు బుకాయిస్తుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత శాఖ క్షేత్ర స్థాయి అధికారులు చేప పిల్లలను పక్కదారి పట్టించి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించుకున్నారని మత్స్యసహకరా సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. వర్షపాతం లెక్కలు చూడకుండానే.. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చెప పిల్లలు వదిలే కార్యక్రమంలో భాగంగా సంబంధిత మత్స్యశాఖాధికారులు ముందుగానే మండలంలో వర్షపాతం ఎలా ఉంది? చెరువులు, కుంటల్లో ఏ పాటి నీరు ఉందోనని గుర్తించిన తర్వాతే ఆ నీటికి తగినట్లుగా చేప పిల్లలను వదిలే నివిదికను ఉన్నతాకారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మండల మత్స్యశాఖాధికారులు అలాంటి లెక్కలేమి లేకుండా సుమారుగా లెక్కలు వేసి ఇచ్చిన నివేదిక ప్రకారంగా వచ్చిన చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలారు. మండలంలోని చెరువులు, కుంటల్లోకి డిండి ప్రాజెక్టు ద్వారా, లేదా వర్షాధారంతోనే నీరు చేరుతోంది. ప్రస్తుతం డిండి ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. అదే విధంగా ఐదు నెలలుగా మండలంలో కురవాల్సిన దానికంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో నెల రోజుల పాటు వర్షం కురవకపోతే చేప పిల్లలు వదిలిన సదరు కుంటల్లో మూడు మాత్రం పూర్తిగా ఎండిపోయే ప్రమా దం ఉంది. అలాగైతే ఆ చేప పిల్లలు బతికే పరి స్థితి లేదని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారుల మాయాజాలం మండలంలోని ఆయా చెరువుల సొసైటీ సభ్యుల నిర్ణయం మేరకు అంతంతమాత్రంగానే ఉన్నా చెరువుల్లో నిర్ణయించిన మేరకు చేప పిల్లలను వదిలే అవకాశం లేదని మత్స్యసహకార సొసైటీ సభ్యులు తేల్చారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని ఏం చక్కా వినియోగించుకున్నారు. లెక్కించే యంత్రం లేకుండానే తంబాలబండ చెరువులో 2,95,800 చేప పిల్లలను వదలాల్సి ఉండగా లక్ష పిల్లలను మాత్రమే వదిలారు. అదే విధంగా ఏనెకుంటలో 97,500కు 50వేలు, మొ ద్దులకుంటలో 70,500కు 20 వేలు, బాపన్‌కుం టలో 1,20,000లకు 1,20,000, కాంట్రోన్‌కుం టలో 76,200కు 50వేల చొప్పున వదిలారు. చేప పిల్లలు పోయలేదు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చెప పిల్లలను మండలలోని చెరువులు, కుంటలకు పంపిన ప్రతిపాదలన ప్రకారంగా వదలలేదు. ఇదేమిటని సంబందితాధికారులను నిలదీయగా ఈ చెరువులో నీరు తక్కువగా ఉందని వేరే చెరువులో వదులుతామని సమాధానం ఇచ్చారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి. – నూకం చంద్రయ్య, మత్స్యకారుడు, డిండి నీరులేక అడుగంటి పోతున్నాయి మండలంలో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో డిండి ప్రాజెక్టుతోపాటు చెరువులు, కుంటలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయి. చెరువుల్లో వదిలిన చేప పిల్లలు బతికేందుకు కేఎల్కేవై ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీరందించి తద్వారా మండలంలోని చెరువులు, కుంటలు నింపాలి. – తవిటి సైదులు, మత్స్యకారుడు అమ్ముకున్న మాట అవాస్తవం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత చెప పిల్లలను ఇటీవల మండలంలోని పలు కుంటల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వదిలాం. దీనిపై మండల కేంద్రానికి చెందిన పలువురు మత్స్యకారులు అక్రమంగా చెప ప్లిలలను సంబంధిత అధికారులు అమ్ముకున్నారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మారయ్య, ఎఫ్డీఓ -
మత్స్య సంబురం షురూ..
సాక్షి, నిర్మల్: మత్స్యసంబురం ప్రారంభమైంది. జిల్లాలోని మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 16న సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేపపిల్లలను వదిలి కార్యక్రమం ప్రారంభించారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతీ ఏడాది 100శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. గతేడాది నుంచి వందశాతం సబ్సిడీపై మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. 2019–20 సంవత్సరానికి జిల్లాలో మొత్తం 4కోట్ల 15లక్షల 73వేల చేపలు పెంచడానికి జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్ట్‌లో లక్షా 91వేల చేపపిల్లలను వదిలారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 608 చెరువుల్లో, 5 రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు జిల్లావ్యాప్తంగా 608 చెరువులు, 5 రిజర్వాయర్లలో చేపలు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. అందులో 157 డిపార్ట్మెంట్ చెరువులు, మిగిలినవి ఆయా గ్రామ పంచాయతీ ఆధీనంలోని చెరువులు. జిల్లాలోని ఎస్సారెస్పీ, కడెం, సుద్దవాగు, స్వర్ణ, పల్సికర్ రంగారావు(చిన్న సుద్దవాగు) రిజర్వాయర్లు ఉన్నాయి. 2 కోట్ల 86లక్షల 76వేల 500 చేప పిల్లలను చెరువుల్లో, కోటీ 28లక్షల 96వేల500 చేప పిల్లలను రిజర్వాయర్లలో వదల నున్నారు. జిల్లావ్యాప్తంగా 2019–20 సంవత్సరానికి 4 కోట్ల 15లక్షల 73వేల చేపలు పెంచడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి దాదాపు రూ.3కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారు. రోహు చేపలే ఎక్కువ... చెరువులు, రిజర్వాయర్లలో నాలుగురకాల చేపలను అధికారులు విడుదల చేయనున్నారు. అయితే విడుదల చేసే వాటిలో ఎక్కువగా రోహు చేపలే ఉన్నాయి. చెరువుల్లో కట్ల, రోహుతో పాటు సాధారణ రకాలకు చెందిన చేపలను వదులుతున్నారు. రిజర్వాయర్లలో కట్ల, రోహు, మ్రిగాల రకం చేపలను పెంచనున్నారు. చెరువుల్లో 1,03,26,900 కట్ల, రోహు 1,09,07,150, సా«ధారణ చేపలు 74,42,450 లను విడుదల చేస్తున్నారు. అలాగే రిజర్వాయర్లలో కట్ల 51లక్షల 58వేల 600, రోహు 64లక్షల 48వేల 250, మ్రిగాల 12లక్షల 89వేల 650 చేపపిల్లలు పెంచనున్నారు. వెంటనే విడుదల చేస్తే మేలు ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో దాదాపు రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు వచ్చి చేరింది. దీంతో వెంటవెంటనే పూర్తిస్థాయిలో చేపపిల్లలను విడుదల చేస్తే మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం వదిలిన చేపపిల్లలు పూర్తిస్థాయిలో ఎదగాలంటే దాదాపు 6నెలల సమయం పడుతుంది. ఎదిగిన తర్వాత మత్స్యకారులు చేపపిల్లలను పట్టుకుని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటారు. ఇప్పటికే కాస్త ఆలస్యమైనప్పటికీ, వెంటవెంటనే చేపపిల్లల విడుదల ప్రక్రియ పూర్తిచేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. గతేడాది నుంచి మత్స్యకారులకు 100శాతం సబ్సిడీతో ప్రభుత్వం చేపపిల్లలు పంపిణీ చేస్తోంది. చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు చేపలను పట్టుకునేందుకు అవసరమైన సామగ్రిని సైతం సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. ప్రత్యేక ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచి చేపపిల్లలను కొనుగోలు చేసిన అధికారులు చెరువులు, రిజర్వాయర్లలో వేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వెంటనే పూర్తిచేస్తాం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవలే సారంగాపూర్ మండలంలోని స్వర్ణప్రాజెక్ట్లో చేపపిల్లలను వదిలే కార్యక్రమం ప్రారంభించారు. వర్షాలు ఆలస్యం కావడంతో కార్యక్రమం కొంత ఆలస్యమైంది. స్వర్ణ ప్రాజెక్ట్‌లో లక్షా 91వేల చేపపిల్లలను విడుదల చేశాం. త్వరలోనే మిగిలిన రిజర్వాయర్లు, చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేస్తాం. – దేవేందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్ -
చెరువుకు చేరని ‘చేప’
సాక్షి, వరంగల్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేప పిల్లల పంపిణీ నత్తనడకన కొనసాగుతోంది. మత్స్యకారులకు చేయూతను అందించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఐదు జిల్లాల్లో మొత్తం 13.01 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5.31 కోట్ల చేప పిల్లలను మాత్రమే మత్స్యకారులకు అందించారు. చెరువుల్లో చాలా వరకు 20 రోజులక్రితం కురిసిన వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో చేప పిల్లల పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. 50 శాతం కూడా పంపిణీ కాలేదు.. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారం వరకే చేప పిల్లలను పంపిణీ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. అయితే వర్షాలు ఆలస్యంగా కురవడంతో సెప్టెంబర్ చివరి వారం వరకు సమయమిచ్చారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరడంతో చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని మాధన్నపేట చెరువులో ఆగస్టు 28న చేప పిల్లలు వదిలి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాన్ని సమయమిచ్చారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెరువుల్లో నీళ్లు చేరడంతో చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురు చూస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని మాధన్నపేట చెరువులో ఆగస్టు 28న చేప పిల్లలు వదిలి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో 50 శాతం చేప పిల్లల పంపిణీ కూడా పూర్తి కాలేదు. వరంగల్ అర్బన్ జిల్లాలో 1.49 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 83 లక్షలు, వరంగల్ రూరల్ జిల్లాలో 2.16 కోట్ల చేప పిల్లలకుగాను 85 లక్షల చేపల పిల్లలు మహబూబాబాద్ జిల్లాలో 4.43 కోట్ల చేప పిల్లలకు 2.50 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2.13 కోట్లకుగాను 85 లక్షలు, జనగామ జిల్లాలో 2.80 కోట్ల చేపపిల్లలకుగాను 28 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. మండల కేంద్రాల్లో పంపిణీ.. చేప పిల్లల పంపిణీ కోసం కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు హన్మకొండలోని భీమారం ఫిషరీస్ నిర్వాహకులతోపాటు కొండా సుష్మితాపటేల్, పట్టాభి చేప పిల్లల పంపిణీని దక్కించుకున్నారు. భీమారం ఫిషరీస్ వారు వరంగల్ అర్బన్ జిల్లాలోని మెజార్టీ చెరువులకు పంపిణీ చేయాల్సి ఉండగా, మిగిలిన చెరువులతోపాటు వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు పట్టాభి, సుష్మితా పటేల్ చెరిసగం చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉంది. పటాభికి వరంగల్‌లోని కాజీపేట మండలం అమ్మవారిపేటలో ఫాం ఉండగా, కొండా సుష్మితా పటేల్‌కు గీసుకొండ మండలం వంచనగిరిలో ఫాం ఉంది. సదరు కాంట్రాక్టర్లు ఆయా మండల కేంద్రాలకు చేప పిల్లలను తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ చివరికల్లా పంపిణీ పూర్తి చేస్తాం జిల్లాలో ఎంపిక చేసిన అన్ని చెరువుల్లో సెప్టెంబర్ చివరికల్లా చేప పిల్లల పంపిణీ పూర్తిచేస్తాం. మా శాఖ పర్యవేక్షణలో చేప పిల్లల పంపిణీ జరుగుతోంది. చేప పిల్లలు గతంలో నేరుగా చెరువుల్లో వదలడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడింది. అందుకే ఫాం దగ్గరనే పంపిణీ చేస్తున్నాం. – నరేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
చేపా చేపా 'ఎక్కడికెళ్లావ్?'
రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఈ ఏడాది 74.73 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా 15 శాతానికి మించి పంపిణీ జరగలేదు. రాష్ట్రంలోని 21 వేల నీటి వనరులకుగాను 3 వేల చెరువులు, కుంటల్లోనే చేపలను వదిలారు. మిగిలిన కోట్లాది చేపల్ని ఎప్పుడు వదులుతారో స్పష్టత లేదు. నీటిపారుదల వర్గాల లెక్కల ప్రకారం ఇటీవలి భారీ వర్షాలకు అనేక జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి అవసరమైన స్థాయిలో నీరొచ్చింది. కానీ ఆ సమయంలో అధికారులు మేలుకోకపోవడంతో పూర్తిస్థాయిలో చేపలను వదలలేకపోయారని ప్రజలు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఈసారి 74.73 కోట్లు మత్స్యకారులను ఆర్థి కంగా బలోపేతం చేసేందుకు మత్స్యకార సొసైటీల ద్వారా ‘ఉచిత చేప పిల్లల పంపిణీ’కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రెండేళ్లుగా చేప పిల్లలలను ఉచితంగా పం పిణీ చేస్తూ వస్తోంది. పథకంతో 4 లక్షల మత్స్య కార కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలనేది సర్కారు సంకల్పం. ఈ ఏడాది 74.73 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 21,569 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటివరకు 3,147నీటి వనరుల్లో 11.40 కోట్ల చేప పిల్లలనేవదిలినట్లు ప్రభుత్వానికి మత్స్య శాఖ వెల్లడించింది. అంటే లక్ష్యంలో 15.25 శాతమే. ఆ జిల్లాల్లో .. కొన్ని జిల్లాల్లో దారుణంగా చేప పిల్లల పంపిణీ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో అక్కడి 160 నీటి వనరుల్లో 99.68 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలనుకున్నారు. కానీ 6 నీటి వనరుల్లో 7.67 లక్షలనే వదిలారు. భద్రాద్రి జిల్లాలోనూ కుండపోత వర్షాలు కురిశాయి. ఆ జిల్లాలో 702 నీటి వనరుల్లో 2.03 కోట్ల చేపలను వదలాలనుకున్నారు. కానీ 2 నీటి వనరుల్లో 3.82 లక్షల చేపలనే వదిలిపెట్టారు. కొమురంభీం జిల్లాలో 242 నీటి వనరుల్లో 1.14 కోట్ల చేపలను వదలాలనుకున్నా కేవలం ఒకే నీటి వనరులో 70 వేల చేపలను వదిలారు. గతం లో ఆలస్యంగా అక్టోబర్ వరకు చేప పిల్లల పంపిణీ జరగడంతో అప్పటికే అనేకచోట్ల మత్స్యకారులు సొంతంగా చేపలను కొన్నారు. దీంతో ఈసారి ఆగస్టు మూడు లేదా చివరి వారంలోనే చేపలను వదలాలని అనుకున్నా.. గడువులోగా చేయలేకపోయారు. దీంతో మిగిలిన చేప పిల్లలను పంపిణీ చేయడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందోనని చర్చ జరుగుతోంది. ఏటికేడు లక్ష్యం పెంపు 2016– 17లో చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 22 కోట్లు ఖర్చు చేసి 27 కోట్ల చేప పిల్లలను వదిలింది. 2017–18లో రూ. 44 కోట్లతో 51 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. గతేడాదితో పోలి స్తే ఈసారి 23.72 కోట్లు అదనంగా 74.73 కోట్ల చేపల పంపిణీకి సిద్ధ మైంది. ఇలా ఏటికేడు పంపిణీ లక్ష్యం పెరుగుతోంది. కానీ సకాలంలో చేపలను వదలడంలోనే అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు విని పిస్తున్నాయి. -
చేపాచేపా ఎందుకు ఎదగలేదు?
కమ్మర్పల్లి(బాల్కొండ) : చేపలు పట్టే వృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారులకు ఈయేడు నిరాశే మిగిలింది. చెరువుల్లో పెంచిన చేపల దిగుబడి రాక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేపపిల్లలు చెరువుల్లో ఎదగలేదు. చెరువు ల్లో చేపలు పెరగకపోవడంతో ఆదాయం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సారి సరఫరా చేసిన చేప పిల్లలు తగిన పరిమాణంలో పెరగలేవని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చెరువుల్లో ఎదగని చేప కమ్మర్పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసింది. చెరువు విస్తీర్ణం ఆధారంగా చేప పిల్లలను సరఫరా చేయగా చెరువుల్లో వదిలారు. నవంబర్ నెలాఖరులో చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. నాగాపూర్ మంజీరా చెరువులో 26,500, కమ్మర్పల్లి గుండ్లకుంట చెరువులో 41,500, కుడికుంట చెరువులో 15,600, పల్లె చెరువులో 6700, హాసాకొత్తూర్ గోనె చెరువులో 69 వేలు, కొత్త చెరువులో 70 వేలు, బషీరాబాద్ కాడి చెరువులో లక్షా 10 వేలు, చింతల చెరువులో 80 వేలు, అమీర్‌నగర్ ఊర కుంటలో 25 వేలు, నర్సాపూర్ ఊర చెరువులో 38 వేలు, కోనాసముందర్ పెద్ద చెరువులో 65 వేలు, కోనాపూర్ రాళ్లవాగు రిజర్వాయర్‌లో లక్షా 50 వేల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదిలారు. ప్రస్తుతం చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో మత్స్యకారులు చేప వేట మొదలుపెట్టారు. వేటకు చిక్కిన చేపలు ఇంకా చిన్న పిల్లలు గానే ఉండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఒక్కో చేప 50 గ్రాముల నుంచి 300 గ్రాములకు మించి పరిమాణం లేకపోవడంతో మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. చెరువులో వదిలిన చేప పిల్లలు ఆరు నెలలు గడిచినా తగిన పరిమాణంలో పెరగలేదు. సాధారణంగా చేప పిల్లలు ఆరు నెలల్లో సుమారు 750 గ్రాముల నుంచి 1250 గ్రాముల వరకు పెరుగుతుందని, ప్రభుత్వం సరఫరా చేసిన చేప పిల్లలు 300 గ్రాములకు మించి పెరగలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చెరువుల్లోనైతే 100 గ్రాములకు మించి పెరగలేదు. మరికొన్ని చెరువుల్లో చేపలు మృత్యువాత పడ్డాయి. నాసిరకం చేప పిల్లలను సరఫరా చేయడం వల్లే చేపలు పెరగలేదని మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో ఈయేడు ఆదాయం కోల్పోయామన్నారు. కమ్మర్పల్లి గుండ్లకుంట చెరువులో వదిలిన చేప పిల్లల జాడే లేకుండా పోయిందని స్థానిక మత్స్యకారులు వాపోయారు. కొంతమంది మత్స్యకారులు సొంతంగా కొనుగోలు చేసి చెరువుల్లో వదిలిన చేప పిల్లలు ఒక్కోటి కిలో పరిమాణం వరకు పెరిగాయని చెబుతున్నారు. ఆలస్యంగా సరఫరా వర్షాకాలంలో చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరిన తర్వాత చేప పిల్లలు వదులుతారు. కానీ గత సంవత్సరం నవంబర్ నెలాఖరులో చేప పిల్లలను వదిలారు. సాధారణంగా జూన్, జూలై నెలలో వర్షాలు పడితే ఆగస్టు లేదా, సెపెంబర్ నెలలో చేపపిల్లలను వదులుతారు. కానీ నవంబర్ నెలలో వదలడంతో అప్పటికే చెరువుల్లో నీరు నీటిమట్టం తగ్గిపోయింది. నీటి మట్టం తగ్గిన చెరువుల్లో చేప పిల్లలు ఎదగకపోవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. చేపలు తగిన పరిమాణంలో పెరగక ఆదాయం కోల్పోయిన మత్స్యకారులు ప్రభుత్వం రాయితీపై అందించే యూనిట్లపై ప్రభావం చూపనుంది. ఆదాయం లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వం అందించే వాహనాలు, తెప్ప లు, వలలు, ఐస్ బాక్స్‌లు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. చేపలు పెరగలేదు.. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలు చెరువుల్లో వృద్ధి చెందలేదు. 300 గ్రాములకు మించి చేపలు పెరగలేదు. నాసిరకమైన చేప పిల్లలు సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఈయేడు పూర్తిగా ఆదాయం కోల్పోయాం. ఉపాధిపై దెబ్బ పడింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి. – ఆల్గోట్ రమేశ్, మత్స్యకారుడు,హాసాకొత్తూర్ చేపల దాణా అందించాలి ప్రభుత్వం ఉచితంగా అందించిన చేప పిల్లలను చెరువుల్లో వదిలారు. చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోయాక వదిలారు. చేప పిల్లలకు పోషకాలు లభించక(ఫీడింగ్) పెరగలేవు. ప్రభుత్వం ఉచితంగా చేపల దాణా సరఫరా చేయడంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పించాలి. – ఎర్ర ఆశన్న, అధ్యక్షుడు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, కోనాసముందర్ పావు కిలో కూడా లేవు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలు పావు కిలో కూడా పెరగలేదు. కాడి చెరువు పెద్ద చెరువు. చేపలు పట్టుకొనే వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. చేపలు పెరగకపోవడం వల్ల ఆదా యం నష్టపోయాం. సొంతంగా కొనుగోలు చేసిన పిల్లలు వేరే చెరువుల్లో పెంచాం. మంచి దిగుబడి వచ్చింది. – తోపారం శ్రీనివాస్, మత్స్యకారుడు, బషీరాబాద్ పెట్టుబడి సాయం అందించాలి ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న విధంగానే మత్స్యకారులకు చేపల పెంపకానికి పెట్టుబడి సాయం అందించాలి. సాయంతో మత్స్యకారులు తమకు నచ్చిన చేప పిల్లల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేస్తారు. చేపల పెంపకంతో ఆదాయంపై భరోసా కలుగుతుంది. – ఊట్నూర్ రాజేశ్, మత్స్యకారుడు, కమ్మర్పల్లి -
ఎంబీసీ చిట్టా.. తేలేదెట్టా?
సాక్షి, హైదరాబాద్: బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) చెందిన వారెవరన్న అంశంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గత బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఎంబీసీ కులాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ ఏడాది గడిచినా ఏయే కులాలను ఎంబీసీ జాబితాలో చేర్చాలో నిర్ణయించలేదు. బీసీల్లో మొత్తం 113 కులాలు ఉండగా.. వీటిలో 96 కులాలను ఎంబీసీలుగా పరిగణించాలని పలుమార్లు సీఎం సమక్షంలో జరిగిన సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. కానీ ఏయే కులాలను చేర్చాలి, వేటిని మినహాయించాలనేది ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ బాధ్యతను తెలంగాణ బీసీ కమిషన్‌కు అప్పగించినా... కమిషన్ సైతం ఈ దిశగా తమ నివేదికను అందించలేదు. గతేడాది బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ.250 కోట్ల చొప్పున కేటాయించింది. బడ్జెట్ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ బీసీల సమగ్రాభివృద్ధి పేరుతో జాప్యం జరగడంతో ఈ నిధులు ఇప్పటికీ ఖర్చు కాలేదు. ఈ లోగా యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ, నేతన్నలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వచ్చే బడ్జెట్లో నాయీ బ్రాహ్మణులు, రజకులకు కులవృత్తులకు వీలుగా రాయితీతో ఆధునిక పనిముట్లు అందించాలని, విశ్వకర్మలు, శాలివాహనులు, సంచార జాతులకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. సంచార జాతులను ఎంబీసీలుగా పరిగణిస్తారనే విషయం ప్రచారంలో ఉంది. కానీ తమను ఎంబీసీల్లో చేర్చవద్దని, ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని సంచార జాతులు డిమాండ్ చేస్తున్నాయి. -
పంపిణీకి రాజస్తాన్, గుజరాత్ గొర్రెలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా నుంచి గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేశామని, ఇకపై రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గొర్రెల పంపిణీలో 96.13 శాతంతో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 94.04 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. రంగారెడ్డి, సూర్యాపేట, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి, కొమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో తొలి జాబితా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ పూర్తయిందని, రెండో జాబితా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తలసాని తెలిపారు. త్వరలో గొర్రెల పెంపకందారులు, మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చెరువులు, రిజర్వాయర్లలో గతేడాది 22 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా, ఈ ఏడాది 51 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో ఆక్వా ఎక్స్పో నిర్వహిస్తున్నామని, 25 దేశాల ప్రతినిధులు రానున్నట్లు వివరించారు. -
రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ
- 77 రిజర్వాయర్లు... 20 వేల చెరువుల్లో వేసేందుకు ఏర్పాట్లు - మొత్తం 69.66 కోట్ల చేపలను పంపిణీ చేస్తాం: మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులో చేప పిల్లలను బుధవారం విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఏడాది 77 రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 20,391 గ్రామపంచాయతీ చెరువుల్లో మొత్తం 69.66 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనున్నామని చెప్పారు. గతేడాది రిజర్వాయర్లు, ప్రభుత్వ చెరువుల్లో 29 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశామన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పున రావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. పంపిణీ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొనాలని కోరుతూ లేఖలు రాయనున్నట్లు వివరించారు. చేపల విడుదల వీడియో చిత్రీకరణ.. : అవసరమైన చేప పిల్లలను ఈ–ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో జాయింట్ కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కొనుగోలు చేసినట్లు మంత్రి తలసాని చెప్పారు. చెరువులు, రిజర్వాయర్లలో చేపపిల్లలను విడుదల చేసే ప్రక్రియను వీడియో చిత్రీకరణ జరపాలని, నిబంధనల మేరకు లేని చేపపిల్లలను తిరస్కరించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మత్స్యశాఖలో సరిపడా సిబ్బంది లేనందున చేపపిల్లల పంపిణీలో పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందిని భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకారులు చేపలను విక్రయించేందుకు మార్కెట్ల నిర్మాణం చేపడతామన్నారు. సబ్సిడీపై వాహనాలను కూడా అందజేస్తున్నట్లు వివరించారు. త్వరలో నూతన మత్స్య సొసైటీలు.. అర్హులైన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించి 31 జిల్లాలకుగాను నూతన మత్స్య సొసైటీలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం 3,831 సొసైటీల్లో 2,79,871 మంది సభ్యులు ఉన్నారన్నారు. గొర్రెల పంపకందారులకు ఇప్పటివరకు 14.76 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని తెలిపారు. 100 సంచార పశువైద్య వాహనాలను త్వరలోనే సీఎంతో ప్రారంభిస్తామన్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో లబ్ధిదారులు గొర్రెలను విక్రయించినట్లు ఫిర్యాదు రావడంతో వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. గొర్రెల కొనుగోలుకు టెండర్లు పిలవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.