స్వర్ణప్రాజెక్టులో చేప పిల్లలను వదులుతున్న మంత్రి, కలెక్టర్
సాక్షి, నిర్మల్: మత్స్యసంబురం ప్రారంభమైంది. జిల్లాలోని మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 16న సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేపపిల్లలను వదిలి కార్యక్రమం ప్రారంభించారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతీ ఏడాది 100శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. గతేడాది నుంచి వందశాతం సబ్సిడీపై మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. 2019–20 సంవత్సరానికి జిల్లాలో మొత్తం 4కోట్ల 15లక్షల 73వేల చేపలు పెంచడానికి జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్ట్‌లో లక్షా 91వేల చేపపిల్లలను వదిలారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 608 చెరువుల్లో, 5 రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లావ్యాప్తంగా 608 చెరువులు, 5 రిజర్వాయర్లలో చేపలు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. అందులో 157 డిపార్ట్‌మెంట్ చెరువులు, మిగిలినవి ఆయా గ్రామ పంచాయతీ ఆధీనంలోని చెరువులు. జిల్లాలోని ఎస్సారెస్పీ, కడెం, సుద్దవాగు, స్వర్ణ, పల్సికర్ రంగారావు(చిన్న సుద్దవాగు) రిజర్వాయర్లు ఉన్నాయి. 2 కోట్ల 86లక్షల 76వేల 500 చేప పిల్లలను చెరువుల్లో, కోటీ 28లక్షల 96వేల500 చేప పిల్లలను రిజర్వాయర్లలో వదల నున్నారు. జిల్లావ్యాప్తంగా 2019–20 సంవత్సరానికి 4 కోట్ల 15లక్షల 73వేల చేపలు పెంచడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి దాదాపు రూ.3కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారు.
రోహు చేపలే ఎక్కువ...
చెరువులు, రిజర్వాయర్లలో నాలుగురకాల చేపలను అధికారులు విడుదల చేయనున్నారు. అయితే విడుదల చేసే వాటిలో ఎక్కువగా రోహు చేపలే ఉన్నాయి. చెరువుల్లో కట్ల, రోహుతో పాటు సాధారణ రకాలకు చెందిన చేపలను వదులుతున్నారు. రిజర్వాయర్లలో కట్ల, రోహు, మ్రిగాల రకం చేపలను పెంచనున్నారు. చెరువుల్లో 1,03,26,900 కట్ల, రోహు 1,09,07,150, సా«ధారణ చేపలు 74,42,450 లను విడుదల చేస్తున్నారు. అలాగే రిజర్వాయర్లలో కట్ల 51లక్షల 58వేల 600, రోహు 64లక్షల 48వేల 250, మ్రిగాల 12లక్షల 89వేల 650 చేపపిల్లలు పెంచనున్నారు.
వెంటనే విడుదల చేస్తే మేలు
ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో దాదాపు రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు వచ్చి చేరింది. దీంతో వెంటవెంటనే పూర్తిస్థాయిలో చేపపిల్లలను విడుదల చేస్తే మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం వదిలిన చేపపిల్లలు పూర్తిస్థాయిలో ఎదగాలంటే దాదాపు 6నెలల సమయం పడుతుంది. ఎదిగిన తర్వాత మత్స్యకారులు చేపపిల్లలను పట్టుకుని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటారు. ఇప్పటికే కాస్త ఆలస్యమైనప్పటికీ, వెంటవెంటనే చేపపిల్లల విడుదల ప్రక్రియ పూర్తిచేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. గతేడాది నుంచి మత్స్యకారులకు 100శాతం సబ్సిడీతో ప్రభుత్వం చేపపిల్లలు పంపిణీ చేస్తోంది. చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు చేపలను పట్టుకునేందుకు అవసరమైన సామగ్రిని సైతం సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. ప్రత్యేక ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచి చేపపిల్లలను కొనుగోలు చేసిన అధికారులు చెరువులు, రిజర్వాయర్లలో వేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
వెంటనే పూర్తిచేస్తాం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవలే సారంగాపూర్ మండలంలోని స్వర్ణప్రాజెక్ట్‌లో చేపపిల్లలను వదిలే కార్యక్రమం ప్రారంభించారు. వర్షాలు ఆలస్యం కావడంతో కార్యక్రమం కొంత ఆలస్యమైంది. స్వర్ణ ప్రాజెక్ట్‌లో లక్షా 91వేల చేపపిల్లలను విడుదల చేశాం. త్వరలోనే మిగిలిన రిజర్వాయర్లు, చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేస్తాం.
– దేవేందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment