swarna project
-
మత్స్య సంబురం షురూ..
సాక్షి, నిర్మల్: మత్స్యసంబురం ప్రారంభమైంది. జిల్లాలోని మత్స్యకారులకు 100 శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 16న సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేపపిల్లలను వదిలి కార్యక్రమం ప్రారంభించారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రతీ ఏడాది 100శాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. గతేడాది నుంచి వందశాతం సబ్సిడీపై మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. 2019–20 సంవత్సరానికి జిల్లాలో మొత్తం 4కోట్ల 15లక్షల 73వేల చేపలు పెంచడానికి జిల్లా మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో స్వర్ణ ప్రాజెక్ట్‌లో లక్షా 91వేల చేపపిల్లలను వదిలారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 608 చెరువుల్లో, 5 రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు జిల్లావ్యాప్తంగా 608 చెరువులు, 5 రిజర్వాయర్లలో చేపలు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. అందులో 157 డిపార్ట్మెంట్ చెరువులు, మిగిలినవి ఆయా గ్రామ పంచాయతీ ఆధీనంలోని చెరువులు. జిల్లాలోని ఎస్సారెస్పీ, కడెం, సుద్దవాగు, స్వర్ణ, పల్సికర్ రంగారావు(చిన్న సుద్దవాగు) రిజర్వాయర్లు ఉన్నాయి. 2 కోట్ల 86లక్షల 76వేల 500 చేప పిల్లలను చెరువుల్లో, కోటీ 28లక్షల 96వేల500 చేప పిల్లలను రిజర్వాయర్లలో వదల నున్నారు. జిల్లావ్యాప్తంగా 2019–20 సంవత్సరానికి 4 కోట్ల 15లక్షల 73వేల చేపలు పెంచడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి దాదాపు రూ.3కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారు. రోహు చేపలే ఎక్కువ... చెరువులు, రిజర్వాయర్లలో నాలుగురకాల చేపలను అధికారులు విడుదల చేయనున్నారు. అయితే విడుదల చేసే వాటిలో ఎక్కువగా రోహు చేపలే ఉన్నాయి. చెరువుల్లో కట్ల, రోహుతో పాటు సాధారణ రకాలకు చెందిన చేపలను వదులుతున్నారు. రిజర్వాయర్లలో కట్ల, రోహు, మ్రిగాల రకం చేపలను పెంచనున్నారు. చెరువుల్లో 1,03,26,900 కట్ల, రోహు 1,09,07,150, సా«ధారణ చేపలు 74,42,450 లను విడుదల చేస్తున్నారు. అలాగే రిజర్వాయర్లలో కట్ల 51లక్షల 58వేల 600, రోహు 64లక్షల 48వేల 250, మ్రిగాల 12లక్షల 89వేల 650 చేపపిల్లలు పెంచనున్నారు. వెంటనే విడుదల చేస్తే మేలు ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో దాదాపు రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు వచ్చి చేరింది. దీంతో వెంటవెంటనే పూర్తిస్థాయిలో చేపపిల్లలను విడుదల చేస్తే మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం వదిలిన చేపపిల్లలు పూర్తిస్థాయిలో ఎదగాలంటే దాదాపు 6నెలల సమయం పడుతుంది. ఎదిగిన తర్వాత మత్స్యకారులు చేపపిల్లలను పట్టుకుని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటారు. ఇప్పటికే కాస్త ఆలస్యమైనప్పటికీ, వెంటవెంటనే చేపపిల్లల విడుదల ప్రక్రియ పూర్తిచేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. గతేడాది నుంచి మత్స్యకారులకు 100శాతం సబ్సిడీతో ప్రభుత్వం చేపపిల్లలు పంపిణీ చేస్తోంది. చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు చేపలను పట్టుకునేందుకు అవసరమైన సామగ్రిని సైతం సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. ప్రత్యేక ఏజెన్సీల ద్వారా టెండర్లు పిలిచి చేపపిల్లలను కొనుగోలు చేసిన అధికారులు చెరువులు, రిజర్వాయర్లలో వేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వెంటనే పూర్తిచేస్తాం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవలే సారంగాపూర్ మండలంలోని స్వర్ణప్రాజెక్ట్లో చేపపిల్లలను వదిలే కార్యక్రమం ప్రారంభించారు. వర్షాలు ఆలస్యం కావడంతో కార్యక్రమం కొంత ఆలస్యమైంది. స్వర్ణ ప్రాజెక్ట్‌లో లక్షా 91వేల చేపపిల్లలను విడుదల చేశాం. త్వరలోనే మిగిలిన రిజర్వాయర్లు, చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేస్తాం. – దేవేందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్ -
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఆయకట్టు రైతులకు శాపమైంది
డీసీసీ అధ్యక్షుడు ఎలేటి మహేశ్వర్‌రెడ్డి సారంగాపూర్ : స్వర్ణ ప్రాజెక్టు గేట్లు, కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఈ ఖరీఫ్‌లో రైతులకు శాపంగా మారిందని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఎలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును ఆదివారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు రెండుకోట్ల రూపాయల నిధులు మంజూరు వచ్చినా ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టరు వాటికి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టకపోవడంతో గేట్లు మొరాయింపు మొదలు పెట్టాయన్నారు. ఇటీవల వరదగేటును ఎత్తి దింపే క్రమంలో అది సక్రమంగా కూర్చోక విలువైన సేద్యపు నీరు వథా అయ్యిందన్నారు. దీంతో పాటు గేట్ల లీకేజీలు సైతం యథాతథంగా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే సోమవారం వరకు ప్రాజెక్టు గేట్లకు, కాలువలకు మరమ్మతులు చేపట్టి నీరు విడుదల చేయని పక్షంలో వచ్చే సోమవారం 10వేలమంది రైతులతో కలిసి స్వర్ణ ప్రాజెక్టునుంచి పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగ లింగారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దశరథరాజేశ్వర్, స్వర్ణ ప్రాజెక్టు ఆయకట్టు మాజీ అధ్యక్షుడు ఓలాత్రి నారాయణరెడ్డి, నాయకులు బడిపోతన్న, తోట భోజన్న, నక్క రాజన్న, తదితరులు ఉన్నారు. -
రెండో పంట ఇక కల్లే..!
మంచిర్యాల రూరల్ : మంచిర్యాల నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీటిని అందించేందుకు కడెం ప్రాజెక్టు నుంచి కాలువలను ఏర్పాటు చేశారు. దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మూడు మండలాల్లోని పంట పొలాలకు కడెం నీరు అందాల్సి ఉన్నా, కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో, చివరి వరకు నీరు అందడం లేదు. మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్ల గ్రామాల వరకు కడెం కాలువ ఉన్నా, నీరు రాకపోవడంతో ఆ కాలువలు కబ్జాకు గురై చుక్క నీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి గ్రామాల్లోని 6 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో రూ. 33 కోట్లతో మండలంలోని ముల్కల్ల గ్రామంలో ర్యాలీ వాగు ప్రాజెక్టును 2009, ఫిబ్రవరి 23న అప్పటి దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు నీటి మట్టం 151.5 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 151.1 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టు నుంచి సాగునీటిని పంపేందుకు ఏర్పాటు చేసిన కుడి, ఎడమ కాలువలను తవ్వి, సిమెంటు లైనింగ్ చేయకపోవడంతో కాలువల్లో పిచ్చిమొక్కలు, నాచు పెరిగిపోయి నీరు పారడం లేదు. కాలువలు తెగిపోయి, నీరు వృథాగ పోతుండడంతో, ప్రాజెక్టు నీటిని సరఫరా చేయడం లేదు. కాలువల మరమ్మతు లేక ప్రస్తుత ఖరీఫ్‌లో వేసిన 3 వేల ఎకరాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందకుండా పోయింది. ఇటీవల ర్యాలీవాగు ప్రాజెక్టు పనుల పూర్తికి బడ్జెట్లో కోటి రూపాయలను కేటాయించడంతో, అవి పూర్తిస్థాయిలో సరిపోవని రైతులు అంటున్నారు. ముందుగా కాలువలను ఆధునికీకరించి, పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. లేదంటే వచ్చే రబీకి కూడా సాగునీరు అందకుండా పోతుందని, ప్రాజెక్టు నిండా నీరున్నా నిష్ర్పయోజనమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని ఆయకట్టు 6 వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం సాగయ్యేది 3 వేల ఎకరాలే. గడ్డెన్నవాగు ప్రాజెక్టు భైంసా : 2008లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 14 వేల ఎకరాలకు సాగునీరందిస్తూ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాలని అధికారులు ప్రణాళికలు వేసి ప్రాజెక్టును నిర్మించారు. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 357.6 మీటర్లు. ప్రస్తుతం నీటిమట్టం 356.5 మీటర్లుగా ఉంది. పట్టణ ప్రజల తాగునీటి కోసం 355.0 మీటర్ల మేర నీటి నిల్వ ఉంచుతారు. ప్రస్తుతం 1.6 మీటర్ల నీటి మట్టం పెరిగి ఉంది. ప్రస్తుతం కాలువల నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడు కూడా ఆయకట్టు రైతులకు ప్రాజెక్టు నీరు అందదు. స్వర్ణ ప్రాజెక్టు సారంగాపూర్ : నిర్మల్, సారంగాపూర్ మండలాల ప్రజల వరప్రదాయిని అయిన స్వర్ణ ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతోంది. గతంలో 1180 వరకు ఉన్న నీటిమట్టం ఐదు అడుగుల వరకు తగ్గడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1175 అడుగులకు చేరుకుంది. రబీ సాగుకు తైబందు విధించి కేవలం మధ్య కాలువ ద్వారా రబీ సాగుకు నీరందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా తెలియపర్చలేదు. వట్టివాగు ప్రాజెక్టు ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టును 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రూ.100 కోట్లతో నిర్మించారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్ మండలాల్లోని 24,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే అందుతోంది. అంటే లక్ష్యం ప్రకారం చూస్తే కనీసం పది శాతం కూడా నీరందించడం లేదన్నమాట. కాగా, ఈ ఏడాది రూ.35 లక్షలతో కాల్వల మరమ్మతులు చేపట్టారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 239.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 237.8 మీటర్ల నీరు నిల్వ ఉంది. కొమురంభీమ్ ప్రాజెక్టు ఆసిఫాబాద్ : మండలంలోని అడ గ్రామం వద్ద రూ.450 కోట్లతో నిర్మిస్తున్న కొమురంభీమ్ ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. కాల్వల ద్వారా ఈ ఏడాది కూడా సాగునీరందే పరిస్థితి లేదు. ప్రాజెక్టులో పుష్కలంగా సాగు నీరున్నా అసంపూర్తి కాల్వల నిర్మాణంతో సాగు నీరదంని దుస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. ఈ ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వల ద్వారా 45,600 ఎకరాలకు సాగు నీరందాల్సి ఉండగా, అటవీ శాఖ క్లియరెన్స్ లేక పనులు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 239.5 మీటర్లు నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు సమీపంలోని వాంకిడి మండలానికి చెందిన కొంతమంది రైతులు మోటార్లతో నీటిని పంట పొలాలకు అందిస్తున్నారు. -
జోరుగా ఇసుక రవాణా
నిర్మల్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత ఖరీఫ్‌లో అధిక వర్షాలు కురవడంతో నిర్మల్, సారంగాపూర్ మండలాల్లోని సాగు భూములకు నీరందించే స్వర్ణ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు గేట్లను అనేకసార్లు ఎత్తి మిగులు జలాలను స్వర్ణ నదిలోకి వదిలారు. ఆనాటి ప్రవాహంతో స్వర్ణనదిలో ఎప్పుడూ లేనంతగా సన్నని మేలైన ఇసుక వచ్చి చేరింది. దీనిని గ్రహించిన ఇసుక అక్రమార్కులు దానిపై కన్నేశారు. రేయింబవళ్లు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా నది పరీవాహక ప్రాంతాలైన నిర్మల్ మండలం వెంగ్వాపేట్, చిట్యాల్, మంజులాపూర్, కౌట్ల(కె), కడ్తాల్, గంజాల్, జాఫ్రాపూర్, మాదాపూర్, సారంగాపూర్ మండలం ఆలూర్, తాండ్ర, వంజర్, బీరవెల్లి తదితర ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటికే పెద్దమొత్తంలోనే ఇసుకను తరలించారు. బహిరంగంగానే అయినా.. ఇసుక అక్రమ రవాణా బహిరంగంగానే జరుగుతోంది. నిర్మల్-భైంసా రహదారిపై చిట్యాల బ్రిడ్జి సమీపంలో రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఈ తంతు రోజూ జరుగుతున్నా ఆ రోడ్డు వెంట వెళ్లే అధికారులకు మాత్రం కనిపించకపోవడం శోచనీయం. ఈ ఒక్క చోటే కాకుండా అన్నిచోట్ల రేయింబవళ్లు బహిరంగంగానే ఈ తంతు సాగుతోంది. ఇసుకను నదిలో నుంచి తీసుకెళ్లడమే కాకుండా ఆయా చోట్ల పెద్ద ఎత్తున డంపింగ్ చేస్తూ సన్నని ఇసుకను అధిక ధరకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్వర్ణ నదిలో లభిస్తున్న ఇసుక సన్నరకం కావడంతో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2వేలకు పైగా, టిప్పర్‌కు రూ.6వేలపైనే ధర పలుకుతోంది. నది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో సదరు ఇసుకకు అనధికారిక వేలం నిర్వహించడం, ఆ వేలంపాటలు రూ.2 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు పలుకుతున్నాయంటే ఇసుక అక్రమ రవాణాలో ఎంతటి లాభం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కొన్నిచోట్ల సదరు ట్రాక్టర్ల యజమానులే వేలంపాట దక్కించుకోగా.. మరికొన్ని చోట్ల కొందరు వ్యక్తులు కలిసికట్టుగా లేదా ఒక్కరే వేలంపాట దక్కించుకొని ట్రిప్పుకు రూ.300 నుంచి రూ.500 వరకు అనధికారికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భూగర్భ జలాలకు పెనుముప్పు... నదులు, వాగులు తదితర వాటి నుంచి ఇసుకను తరలించడం ద్వారా భూగర్భజలాలకు ముప్పు వాటిల్లుతోందని చాలా చోట్ల వేలంపాటలు రద్దు చేశారు. అయితే ఇసుక అక్రమ రవాణాదారులు దీనిని ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నదిలో పెద్ద పెద్ద గోతులు తీస్తూ, నీళ్ల మధ్యలో నుంచి ఇసుక తీస్తుండడంతో భూగర్భజలాలు పడిపోయి సమీపంలోని పంటపొలాల్లో ఉన్న బోరుబావులు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతోంది. గతంలో నిర్మల్ మండలం చిట్యాల్, మంజులాపూర్ శివారులో ఉన్న పంటపొలాల్లోని బోరుబావులు ఎండిపోవడంతో సంబంధిత రైతులు తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ప్రాజెక్టులపై పట్టింపేది?
కష్టాల్లో.. కడెం ప్రాజెక్టు జిల్లాలోని జలాశయాల్లో అతిపెద్దది కడెం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టును 1978లో నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని శాశ్వత మరమ్మతుకు నిధులు మంజూరు కాలేదు. దీంతో ప్రాజెక్టులో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా ప్రాజెక్ట్‌కు ఉన్న 18 గేట్లలో 9 గేట్లు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, మిగతా గేట్లు జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినవి. ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో రూ పొందించిన గేట్లు పాడయ్యాయి. అప్పట్లో వేసిన రబ్బర్సీల్స్యే ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు మార్చలేదు. దీంతో 17, 18 గేట్ల ద్వారా లీకేజీల రూపంలో రోజుకు సుమారు 25 క్యూసెక్కుల విలువైన నీరు గోదావరి నది పాలవుతోంది. ఖరీఫ్‌లో ఆశించిన స్థాయి కంటే అధిక వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులకు చేరుకోవడంతో మిగు లు జలాలు సుమారు 50 టీఎంసీల నీటిని గో దావరిలోకి వదిలారు. ఇక ప్రాజెక్టు గేట్ల నుంచి లీకవుతున్న నీటిని పరిశీలిస్తే.. ఏదైనా గేటు ఎత్తి బయటకు నీటిని వదులుతున్నారా..? అన్నట్లు అక్కడి పరిసరాలు కనిపిస్తాయి. ఇక వీటితోపాటు రోబ్స్ కూడా పాడయ్యాయి. రబ్బర్సీల్స్ ఏర్పాటు, రోబ్స్ తదితర వాటికి నిధులు మం జూరైనా అధిక వర్షాలతో గతేడాది పనులకు ఆ టంకం కలిగిందని అధికారులు పేర్కొంటున్నా రు. వృథానీటికి అడ్డుకట్ట వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సమస్యల్లో స్వర్ణ ప్రాజెక్టు... నిర్మల్, సారంగాపూర్ మండలాల్లో సుమారు 10 వేల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 1972లో సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించారు. మొత్తం ఆరు గేట్లు కలిగిన ఈ ప్రాజెక్ట్‌కు పుట్టెడు సమస్యలు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వరదగేట్లతోపాటు కాలువల షట్టర్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఆరు గేట్లూ పూర్తిగా అధ్వాన స్థితికి చేరి లీకేజీలకు నిలయంగా మారాయి. ఖరీఫ్ లో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో వరద నీరు రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి మిగులు జలాలను స్వర్ణ నదిలోకి వదిలారు. ఎత్తిన గేట్లలో నుంచి 4వ నంబర్ గేటు దింపే సమయంలో మొరాయించి కిందికి దిగక విలువైన నీరంతా స్వర్ణ నది పాలైంది. గతంలోనూ 5వ గేటు పరిస్థితి ఇలాగే అయింది. గేట్ల ద్వారా అవుతున్న లీకేజీలను రెండు నెలల క్రితం జనుమును అడ్డుపెట్టి నియంత్రించారు. మళ్లీ కొంతమేర లీకేజీలు ఏర్పడడంతో పది రోజుల క్రితం మళ్లీ జనుమును అడ్డుపెట్టారు. ఇలా యేటా జనుము అడ్డుపెట్టి తాత్కాలికంగా నీటి లీకేజీలను అరికట్టడమే తప్ప శాశ్వత మరమ్మతులు మాత్రం కరువయ్యాయి. ప్రాజెక్టు రబ్బర్సీల్స్, రోబ్స్ సైతం దెబ్బతిన్నాయి. ఇక ప్రాజెక్టు వింగ్‌వాల్‌కు బుంగపడి ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. భవిష్యత్తులో దీని ద్వారా ప్రాజెక్టు మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కుడికాలువ షట్టర్ పూర్తిగా దెబ్బతినడంతో ఖరీఫ్‌లో నీటి ప్రవాహానికి అది కొట్టుకుపోయింది. దీంతో కాలువ కింద ఉన్న జౌళి గ్రామంలోకి నీళ్లు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దానికి ఇప్పటికీ ఎలాంటి శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. ఇక ప్రాజెక్టు పైన, కట్టపైన ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు బల్బులు లేక రాత్రివేళ పూర్తిగా అంధకారం నెలకొంటోంది. రాత్రివేళ ప్రాజెక్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది సైతం భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రాజెక్టుల మరమ్మతుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు రైతాంగం కోరుతోంది. ప్రతిపాదనలు పంపించాం - సురేశ్, ఎస్ఈ, నీటిపారుదలశాఖ, నిర్మల్ స్వర్ణ ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. వరద గేట్లు, కుడికాలువతోపాటు అన్నింటికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం.