ప్రాజెక్టులపై పట్టింపేది? | funds not releases to permanent repairs to kadam project | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులపై పట్టింపేది?

Published Sat, Feb 8 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

funds not releases to permanent repairs to kadam project

కష్టాల్లో.. కడెం ప్రాజెక్టు
 జిల్లాలోని జలాశయాల్లో అతిపెద్దది కడెం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద 85 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టును 1978లో నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని శాశ్వత మరమ్మతుకు నిధులు మంజూరు కాలేదు. దీంతో ప్రాజెక్టులో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా ప్రాజెక్ట్‌కు ఉన్న 18 గేట్లలో 9 గేట్లు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, మిగతా గేట్లు జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినవి.

ఇందులో స్వదేశీ పరిజ్ఞానంతో రూ పొందించిన గేట్లు పాడయ్యాయి. అప్పట్లో వేసిన రబ్బర్‌సీల్స్‌యే ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు మార్చలేదు. దీంతో 17, 18 గేట్ల ద్వారా లీకేజీల రూపంలో రోజుకు సుమారు 25 క్యూసెక్కుల విలువైన నీరు గోదావరి నది పాలవుతోంది. ఖరీఫ్‌లో ఆశించిన స్థాయి కంటే అధిక వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులకు చేరుకోవడంతో మిగు లు జలాలు సుమారు 50 టీఎంసీల నీటిని గో దావరిలోకి వదిలారు.

ఇక ప్రాజెక్టు గేట్ల నుంచి లీకవుతున్న నీటిని పరిశీలిస్తే.. ఏదైనా గేటు ఎత్తి బయటకు నీటిని వదులుతున్నారా..? అన్నట్లు అక్కడి పరిసరాలు కనిపిస్తాయి. ఇక వీటితోపాటు రోబ్స్ కూడా పాడయ్యాయి. రబ్బర్‌సీల్స్ ఏర్పాటు, రోబ్స్ తదితర వాటికి నిధులు మం జూరైనా అధిక వర్షాలతో గతేడాది పనులకు ఆ టంకం కలిగిందని అధికారులు పేర్కొంటున్నా రు. వృథానీటికి అడ్డుకట్ట వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

 సమస్యల్లో స్వర్ణ ప్రాజెక్టు...
 నిర్మల్, సారంగాపూర్ మండలాల్లో సుమారు 10 వేల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 1972లో సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించారు. మొత్తం ఆరు గేట్లు కలిగిన ఈ ప్రాజెక్ట్‌కు పుట్టెడు సమస్యలు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వరదగేట్లతోపాటు కాలువల షట్టర్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఆరు గేట్లూ పూర్తిగా అధ్వాన స్థితికి చేరి లీకేజీలకు నిలయంగా మారాయి. ఖరీఫ్ లో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో వరద నీరు రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులకు చేరుకుంది.

 దీంతో అధికారులు గేట్లు ఎత్తి మిగులు జలాలను స్వర్ణ నదిలోకి వదిలారు. ఎత్తిన గేట్లలో నుంచి 4వ నంబర్ గేటు దింపే సమయంలో మొరాయించి కిందికి దిగక విలువైన నీరంతా స్వర్ణ నది పాలైంది. గతంలోనూ 5వ గేటు పరిస్థితి ఇలాగే అయింది. గేట్ల ద్వారా అవుతున్న లీకేజీలను రెండు నెలల క్రితం జనుమును అడ్డుపెట్టి నియంత్రించారు. మళ్లీ కొంతమేర లీకేజీలు ఏర్పడడంతో పది రోజుల క్రితం మళ్లీ జనుమును అడ్డుపెట్టారు. ఇలా యేటా జనుము అడ్డుపెట్టి తాత్కాలికంగా నీటి లీకేజీలను అరికట్టడమే తప్ప శాశ్వత మరమ్మతులు మాత్రం కరువయ్యాయి.

ప్రాజెక్టు రబ్బర్‌సీల్స్, రోబ్స్ సైతం దెబ్బతిన్నాయి. ఇక ప్రాజెక్టు వింగ్‌వాల్‌కు బుంగపడి ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. భవిష్యత్తులో దీని ద్వారా ప్రాజెక్టు మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు కుడికాలువ షట్టర్ పూర్తిగా దెబ్బతినడంతో ఖరీఫ్‌లో నీటి ప్రవాహానికి అది కొట్టుకుపోయింది. దీంతో కాలువ కింద ఉన్న జౌళి గ్రామంలోకి నీళ్లు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

 దానికి ఇప్పటికీ ఎలాంటి శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. ఇక ప్రాజెక్టు పైన, కట్టపైన ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు బల్బులు లేక రాత్రివేళ పూర్తిగా అంధకారం నెలకొంటోంది. రాత్రివేళ ప్రాజెక్టు వద్ద విధులు నిర్వహించే సిబ్బంది సైతం భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు ప్రాజెక్టుల మరమ్మతుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు రైతాంగం కోరుతోంది.

 ప్రతిపాదనలు పంపించాం - సురేశ్, ఎస్‌ఈ, నీటిపారుదలశాఖ, నిర్మల్
 స్వర్ణ ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. వరద గేట్లు, కుడికాలువతోపాటు అన్నింటికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement