రంగంపల్లె సమీపంలో పగిలిన ఎత్తిపోతల పైప్‌లైన్
దండేపల్లి(మంచిర్యాల) : కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు ఆందోళనకరంగా మారింది. డిస్టిబ్యూటరీ 30 నుంచి 42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించడంతో చాలా మంది రైతులు పంటలు సాగు చేసుకున్నారు. ఇటీవల ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ తరచూ మరమ్మతులకు గురికావడంతో నీటి సరఫరాకు ఆటకం కలుగుతోంది. ఒకోసారి వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతోంది. దీంతో గూడెం ఎత్తిపోతల కింద ఇప్పటికే సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు ఆందోళనలకు దిగుతున్నారు.
ఆయకట్టు పరిస్థితి ఇదీ..
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. ప్రతి యేటా ప్రాజెక్టు పూర్తిగా నిండితే ఆయకట్టు కింద ఖరీప్‌లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటారు. కడెం నీటిని రబీ సాగుకు ఇచ్చిన దాఖలాలు తక్కువే. రబీ సీజన్‌లో చెరువులు మాత్రం నింపుతారు. గూడెం ఎత్తిపోతల పథకం ప్రారంభం అయినప్పటినుంచి మాత్రం ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో, రబీకి డీ1 నుంచి డి28 వరకు కడెం నీటిని, డీ30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తున్నారు.
రెండోసారీ రబీకి..
కడెం ఆయకట్టు కింద డిస్టిబ్యూటరీ 30 నుంచి 42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని రబీ సాగుకు అందించడం ఇది రెండోసారి. అయితే గత సంవత్సరం ఖరీఫ్‌లో కడెం నీటిని ఆయకట్టు చివరి వరకు అందించారు. ఖరీఫ్ సాగు పూర్తయ్యేనాటికి కడెం ప్రాజెక్టులో 692 అడుగుల నీటిమట్టం ఉంది. దీనికితోడు ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ నుంచి తెచ్చి 2016–17లో రబీకి కూడా డి1 నుంచి డి28 వరకు కడెం నీటిని, డీ30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించారు. ఈ సమయంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు వచ్చాయి. 2017 ఖరీఫ్‌కు కడెం నీటిని డీ1 నుంచి డి42 వరకు అందించారు. ప్రస్తుత యాసంగికి మాత్రం కడెంలో సరిపడా నీళ్లు లేవు. 685 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో డి1 నుంచి డి22 వరకు రెండు తడుల నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని నీటిపారుదల శాఖ అధికారుల సమావేశంలో తీర్మానించారు. ఈనెల 15 నుంచి 23 వరకు మొదటి విడత నీటిని విడుదల చేశారు. రెండో విడత ఫిబ్రవరి 15 నుంచి విడుదల చేయనున్నారు. డీ30 నుంచి డి42 వరకు మాత్రం గూడెం ఎత్తిపోతల నీటిని గతనెల 23 నుంచి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత రబీకీ నీటిని విడుదల చేసినప్పటి నుంచి ఎత్తిపోతల పథకం ఇప్పటికి మూడుసార్లు మరమ్మతులకు గురయ్యింది. దీంతో ఆయకట్టు రైతులు తమ పంటలు పండుతాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు.
ఎగువ ప్రాంత రైతుల ఆందోళనలు
గూడెం ఎత్తిపోతల నీటిని అధికారికంగా డి30 నుంచి డి42 వరకు ఇవ్వాల్సి ఉంది. అయితే తానిమడుగు వద్ద గల ఎత్తిపోతల పథకం డెలివరీ సిస్టర్న్ వద్ద కడెం ప్రధాన కాల్వలో అడ్డంగా గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఖరీఫ్ సమయంలో ఈ గేట్లు ఎత్తితే కడెం నీళ్లు డి1 నుంచి డి42 వరకు వెళ్తుంటాయి. రబీ సమయంలో ఈ గేట్లు మూసి గూడెం ఎత్తిపోతల నీటిని డీ30 నుంచి డి42 వరకు అందిస్తుంటారు. ఈ సమయంలో గేట్ల నుంచి లీకయిన కొద్దిపాటి నీళ్లు ఎగువ ప్రాంతాలైన దండేపల్లి, మామిడిపల్లి వరకు వెళ్లడంతో ఈ ప్రాంత రైతులు రబీలో పంటలు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈసారి కడెం నీటిని డీ1 నుంచి డి22 వరకు చెరువులు నింపేందుకు విడుదల చేయగా, డీ–30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తున్నారు. మిగిలిన డీ23–24, 24ఏ, 24బీ, 25, 26, 27, 28లకు సాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. గూడెం ఎత్తిపోతల నీళ్లు మొదట్లో కొద్ది రోజులు ఎగువకు రావడంతో గత ఏడాది మాదిరి ఈసారి కూడా పంటలు సాగు చేశారు. అయితే ఎత్తిపోతల పైప్‌లైన్ పగిలింది. దానికి మరమ్మతు చేసినప్పటి నుంచి ఎత్తిపోతల నీరు ఎగువకు వెళ్లకుండా పూర్తిగా సీజ్ చేశారు. దీంతో డీ23–24, 24ఏ, 24బీ, 25, 26, 27, 28 కింది సుమారుగా 5వేల ఎకరాలకు పైగా భూములు బీళ్లుగా మారాయి. కొందరు రైతులు సాగు చేసిన పొలాలు నీళ్లందక ఎండుతున్నాయి. అయితే వీటికి తానిమడుగు వద్ద కడెం ప్రధాన కాల్వలో అడ్డంగా ఉన్న గేట్లను ఎత్తితే ఇక్కడి వరకు సాగునీరు అందుతుందని ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు.
మళ్లీ నిలిచిన నీటి సరఫరా..
గూడెం ఎత్తిపోతల నీటిని గతనెల 23న విడుదల చేశారు. అప్పటినుంచి మూడుసార్లు పైప్‌లైన్ మరమ్మతులకు గురయ్యింది. దీంతో పైప్‌లైన్ లీకయినప్పుడల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే నెలలో 6న ఒకసారి, 10న మరోసారి, తాజాగా 28న పైప్‌లైన్ మరమ్మతులకు గురయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment