srsp
-
Telangana: భారీ వర్షాలు.. ప్రాజెక్టులన్నీ ఫుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో నదుల్లో ప్రవాహాలు పోటెత్తుతున్నాయి. గోదావరి నది అయితే ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జూలైలోనే శ్రీరాంసాగర్ సహా గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. గోదావరి, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్లోనూ ప్రవాహాలు పెరిగాయి. ఎగువన కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వస్తున్న వరద అంతా శ్రీశైలం, నాగార్జునసాగర్ వైపు ప్రవహిస్తోంది. కేంద్ర జల సంఘం పరీవాహక రాష్ట్రాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది. గోదావరిలో ఫుల్ ఎగువ రాష్ట్రాల నుంచి పెరిగిన ప్రవాహాలు ఓవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మరోవైపు నదులకు వరద పెరిగింది. గోదావరిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోయింది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 90 టీఎంసీల సామర్థ్యానికిగాను 89.76 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో.. 36 గేట్లు ఎత్తి ఐదు లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరద కాళేశ్వరం బ్యారేజీలను దాటి దిగువకు వెళ్లనుంది. ఇప్పటికే ప్రాణహిత ఉధృతితో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 35 గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రవాహాలు చేరితే మొత్తం గేట్లన్నీ ఎత్తివేయనున్నారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీరు కృష్ణాలో జోష్: కృష్ణా నదిలో ఎగువన కర్ణాటక ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ నిండిపోయాయి. నారాయణపూర్ నుంచి లక్షా 28 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల, శ్రీశైలానికి వరద పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి జూరాలకు 70 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 69 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 63 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా.. నీటి నిల్వ 215 టీఎంసీల సామర్థ్యానికిగాను 72.05 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం నుంచి 21 వేల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో కృష్ణానదిలో ఒకట్రెండు రోజుల్లో మూడు నాలుగు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండిపోవడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. గోదావరి బేసిన్‌లోని 28, కృష్ణా బేసిన్‌లోని 8 ప్రాజెక్టులు నిం డాయి. అలాగే చెరువులు అలుగు దుంకుతున్నా యి. గురువారం నాటికి 4,698 చెరువులు నిండిపో గా మరో 7,574 చెరువులు నిండిపోయే దశకు చేరా యి. మరో 9 వేలకుపైగా చెరువులు సగానికిపైగా నిండినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. -
నిండుకుండల్లా ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్, నెట్వర్క్: మూడురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువన కర్ణాటకలోని ప్రాజెక్టుల్లోకి కృష్ణానదీ ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టిలోకి మంగళవారం కేవలం 10 వేల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవగా, బుధవారం సాయంత్రానికి ఏకంగా 56 వేల క్యూసెక్కులకు పెరిగాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది. ఆల్మట్టి నుంచి 20 వేల క్యూసెక్కులను నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా, నారాయణపూర్ నుంచి 24 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఈ నీరంతా గురువారం సాయంత్రానికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ప్రస్తుతం కేవలం 3,800 క్యూసెక్కుల ప్రవాహాలు మాత్రమే నమోదవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సైతం ప్రస్తుతం ప్రవాహాలు తగ్గినా, రెండ్రోజుల్లో మళ్లీ పుంజుకోనున్నాయి. ఇక గోదావరి పరీవాహకంలో ఉన్న ఎస్సారెస్పీకి మంగళవారం 90 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు రాగా, బుధవారం 52 వేల క్యూసెక్కులకు తగ్గాయి. నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 53.54 టీఎంసీలకు చేరింది. ► ఎగువమానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా..పూర్తిస్థాయిలో నీరు చేరింది. ► మూసీ ప్రాజెక్టులో 7 క్రస్టుగేట్లు ఒక అడుగు మేర ఎత్తి 4,600 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ► భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం బుధవారం సాయంత్రానికి 15.3 అడుగులకు చేరింది. తాలిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. కిన్నెరసాని జలాశయంలో 400.90 అడుగుల మేర నీరు చేరింది. ► ఎల్లంపల్లి ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ► కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సరస్వతీ బ్యారేజీ 66 గేట్లలో 26 గేట్లెత్తి కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్‌ను తాకుతూ 8 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. గోదావరి, ప్రాణహితల ద్వారా లక్ష్మీబ్యారేజీకి ఇన్‌ఫ్లో 96,630 క్యూసెక్కులు వస్తోంది. -
చివరి ఆయకట్టుకూ సాగునీరు
సాక్షి, హైదరాబాద్: ‘గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసింది. ఉద్యమ స్ఫూర్తితో చెరువులను పునరుద్ధరించింది. ఇలా చేసిన పనుల ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే మార్గం. ఇప్పటివరకు తెలంగాణ సాగునీటికి గోస పడ్డది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడింది. అలా వచ్చిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. ఇందుకు కార్యాచరణ ప్రణా ళిక సిద్ధం చేయాలి’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వీలైనంత ఎక్కువమంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధా న్యం ప్రభుత్వానికి మరోటి లేదని, దీనికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సాగునీరు అందని ప్రాంతా లను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ‘ముందుగా చెరువులను నింపాలి. తర్వాత రిజర్వా యర్లను నింపాలి. చివరికి ఆయకట్టుకు నీరందించాలి. ఈ విధంగా ప్రణాళిక ప్రకారం నీటి సరఫరా ఉండాలి. దీనివల్ల వానాకాలంలో లభించే నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం సాధ్య మవుతుంది. తెలంగాణలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలి. ఫలితంగా భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు రూ.45 వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్న బోర్లకు నీరందు తుంది. అటు కాల్వలు, ఇటు చెరువులు, మరోవైపు బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుంది’’అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు పంపించడానికి అనువుగా కాల్వల సామర్థ్యం ఉందా లేదా మరోసారి పరిశీలించాలి. అవసరమైతే కాల్వల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి’అని సూచించారు. ఎస్సారెస్పీ కింద 30 లక్షల ఎకరాలు పండాలి ‘శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు వీలైనంత ఎక్కువ ఆఫ్ టేక్ పాయింట్స్ (తూములు) ఏర్పాటు చేసి, ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలి. నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఎస్సారెస్పీ వరకు రెండు టీఎంసీల నీటిని తరలించే వెసులుబాటు కలిగింది. కాబట్టి ఎస్సారెస్పీ పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించాలి. వరద కాలువ, కాకతీయ కాలువ, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు ఏడాది పొడవునా నిండే ఉంటాయి. అవి జీవధారలుగా మారతాయి. ఎస్పారెస్పీ ప్రాజెక్టులో కూడా ఎప్పుడూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచాలి. అవసరానికి తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా ఎస్సారెస్పీని వాడుకోవాలి. గోదావరి నుంచి నీరు వస్తే నేరుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకోవాలి. లేదంటే శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని తరలించాలి’’అని సీఎం చెప్పారు. ‘ఎస్ఆర్ఎస్పీ పరిధిలోని వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య దాదాపు 139 చెరువులున్నాయి. వాటిలో కొన్నింటికి నీరు అందడం లేదు. అలా నీరు అందని చెరువులను గుర్తించాలి. వరద కాలువకు వీలైనన్ని ఎక్కువ తూములు పెట్టి ఆ చెరువులన్నింటినీ నింపాలి. ఈ పని రాబోయే మూడు నాలుగు నెలల్లో పూర్తి కావాలి. అటు ఎస్సారెస్పీ నుంచి, ఇటు కాళేశ్వరం నుంచి వరద కాలువకు నీరందే అవకాశం ఉంది. వరద కాలువ 365 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. కాబట్టి వరద కాలువ ద్వారా ఇప్పటి వరకు ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలకు నీరు ఇవ్వాలి. వరద కాలువ, కాకతీయ కాలువ మధ్య భాగంలోనే కాకుండా, వరద కాలువ దక్షిణ భాగంలో ఇతర స్కీముల ద్వారా నీరందని ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని చెరువులను నింపాలి. ఈ పని ఆరు నెలల్లో పూర్తి కావాలి. ఎల్లంపల్లి నుంచి అందే నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారు. దాన్ని మార్చాలి. ఎల్లంపల్లి నుంచి 90 వేల ఎకరాల లోపే ఆయకట్టుకు నీరందించడం సాధ్యమవుతుంది. మిగతా ఆయకట్టుకు ఎస్సారెస్పీ ద్వారా నీరు అందించాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంటనే చెరువులకు కృష్ణా జలాలు.. ‘ఈ ఏడాది కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు. కాబట్టి వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి. రామల్పాడు రిజర్వాయర్ నింపాలి. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డి 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఉజ్వలంగా రాష్ట్ర సాగునీటి రంగం... ‘తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారింది. భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు వచ్చాయి. చెరువులు బాగుపడ్డాయి. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడింది. వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ప్రతీ ప్రాజెక్టుకు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఆపరేషన్ రూల్స్ రూపొందించాలి. నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతీ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తుంది. ప్రతీ ఏడాది వేసవిలోనే అన్ని ప్రాజెక్టుల్లో అవసరమైన మెయింటనెన్స్ పనులు, రిపేర్లు చేసుకోవాలి. జూన్ నాటికి సర్వం సిద్ధం కావాలి. పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలి. ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రతీ జోన్‌కు ఒక సీఈని బాధ్యుడిగా నియమించాలి. సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు ఉండాలి. గతంలో మాదిరిగా భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడిసి అని నాలుగు విభాగాలుగా ఉండవద్దు. నీటి పారుదల శాఖ అంతా ఒకే విభాగంగా పనిచేయాలి. అధికారులకు కావాల్సిన అధికారాలు అప్పగించాలి. ప్రతీస్థాయి అధికారికి అత్యవసర పనులు చేయడం కోసం నిధులు మంజూరు చేసే అధికారం కల్పించాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రితో ఫోన్లో సంభాషించిన కథలాపూర్ జడ్పీటిసి భూమయ్య, రైతు శ్రీపాల్‌లను కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమీక్షలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాకుండానే రివ్యూ మీటింగ్
-
మానుకోట గులాబీలో గలాటా!
సాక్షి, మహబూబాబాద్: మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మధ్య అంతర్గత విభేదాలు బుధవారం మరోసారి బహిర్గతమయ్యాయి. ఎస్సారెస్పీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అధికారుల ఎదుటే మంత్రి, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నన్ను పిలవకుండానే సమావేశమా? మధ్యాహ్నం 12.30కి సమీక్ష ప్రారంభం కాగా, కొద్దిసేపటికే ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అక్కడకొచ్చి తనకు సమాచారం ఇవ్వకుండా సమీక్ష నిర్వహిం చడం దారుణమని, స్థానిక సమస్యలు తెలియకుండా సమీక్షా సమావేశాలు పెట్టి చాయ్, బిస్కె ట్లు తిని ఫొటోలకు ఫోజులిస్తే ప్రయోజనం ఉండ దని మంత్రిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించా రు. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ ‘మనం ముందుగానే అనుకున్నాం కదా? సమీక్ష గురించి తెలుసు కదా’అని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యే.. తాను రాకుండానే ఎందుకు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డురోలర్ మీద, ఎర్ర బస్సు ఎక్కి రాలేదని.. ఆర్ఈసీలో చదివి రాజకీయాల్లోకి వచ్చానంటూ శంకర్ నాయక్ మంత్రి విద్యాభ్యాసంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. దీంతో మంత్రి అసహనంతో ‘ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. మీ సమస్యలు ఏంటో చెప్పండి చర్చిద్దాం’అని బదులిచ్చారు. అప్పుడే కలెక్టర్ వీపీ గౌతమ్ జోక్యం చేసుకొని ‘సమన్వయ లోపం జరిగింది.. సారీ సర్’అని ఎమ్మెల్యేకు సర్ది చెప్పారు. -
సాగునీటి శాఖకు కొత్త రూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి శాఖ పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ మార్పుచేర్పులతో కూడిన ప్రక్రియ ముగింపు దశకు రాగా దీనికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం దక్కనుంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి కావస్తుండటం.. కాల్వలు, పంపులు, పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో విప్లవాత్మక చర్యలు అత్యంత కీలకం కానున్నాయి. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేనున్నారు. ఈఎన్సీలు, సీఈల వారీగా ఏయే ప్రాజెక్టులు ఉంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉంటుందన్న దానిపై కసరత్తు పూర్తయింది. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్‌హౌస్‌ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించనున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల పనులు చూసేందుకు బేసిన్ల వారీ ఇద్దరు సీఈలు ఉండే అవకాశం ఉంది. ప్రక్షాళన ఇలా... - కరీంగనర్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో 3 బ్యారేజీలు, పంప్‌హౌస్‌లతో పాటు ఎల్లంపల్లి బ్యారేజీతో పాటు దానికింద మిడ్‌మానేరు వరకు నీటిని ఎత్తిపోసే ప్యాకేజీలన్నీ రానున్నాయి. ఈ బ్యారేజీల పరిధిలో కొత్తగా చేపట్టే ఎత్తిపోతలు దీని పరిధిలోనే ఉండనున్నాయి. ఈఎన్సీ కింద మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు ఉండనుంది. - శ్రీరాంసాగర్ సీఈ పరిధిలో లోయర్‌మానేరు వరకు మాత్రమే ఆయకట్టును పరిమితం చేయనున్నారు. దీంతోపాటుగా కడెం, సదర్‌మఠ్, ఆదిలాబాద్‌లోని కాళేశ్వరం ఆయకట్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ఉండనున్నాయి. మొత్తంగా 7.42లక్షల ఆయకట్టు ఉంటుంది. - కరీంనగర్‌లోని మరో ఈఎన్సీ పరిధిలో లోయర్‌మానేరు నుంచి దిగువన సూర్యాపేట వరకు ఉన్న ఆయకట్టును కొత్తగా చేర్చారు. దీంతో పాటే ఎల్లంపల్లి దిగువ ఆయకట్టు, మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్, దానికింద ఆయకట్టును తెచ్చారు. మధ్యతరహా ప్రాజెక్టులు ఈఎన్సీ కిందే ఉండనున్నాయి. మొత్తంగా 13లక్షల ఎకరాల ఆయకట్టు ఈఎన్సీ పరిధిలో ఉండనుంది. - నిజామాబాద్ సీఈ పరిధిలోకి కాళేశ్వరంపై ఆధారపడ్డ నిజాంసాగర్ ఆయకట్టు, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. సీఈ కింద 6.82 లక్షల ఆయకట్టు ఉంటుంది. - వరంగల్ సీఈ పరిధిలో దేవాదుల, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండగా కొత్తగా సమ్మక్క బ్యారేజీని చేర్చారు. ఆయకట్టు 6.07 లక్షల ఎకరాలు. - ఆదిలాబాద్ సీఈ పరిధిలో ప్రాణహిత, చనాకా–కోరటా, పెనుగంగ, కుప్టి, కొమరంభీంతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు. మహబూబ్‌నగర్ సీఈ పరిధిలో జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు, గట్టు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఉండ నుండగా, ఆయకట్టు 11.95 లక్షల ఎకరాలు. - పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ఒక్క సీఈ పరిధిలో ఉండనుంది. ఆయకట్టు 12.30 లక్షల ఎకరాలు. - నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు పాలేరు వరకు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు, డిండి, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఆయకట్టు 10.97 లక్షల ఎకరాలు. - ఖమ్మం సీఈ పరిధిలో సీతారామ, సీతమ్మసాగర్, పాలేరు దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాస, మధ్యతరహా పథకాలు ఉంటాయి. ఆయకట్టు 7.16 లక్షల ఎకరాలు. - హైదరాబాద్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో మిడ్‌మానేరు నుంచి గంధమల వరకు ఉన్న ప్యాకేజీలతో పాటు, కొత్తగా సింగూరు, ఘణపూర్, మధ్యతరహా ప్రాజెక్టులను చేర్చారు. ఆయకట్టు 11.54 లక్షలు. -
డిసెంబర్ నుంచే యాసంగికి నీళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా.. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కింద ఈ ఏడాది డిసెంబర్ 20 నుంచే యాసంగి ఆయకట్టుకు సాగు నీరివ్వాలని నీటి పారుదల శాఖ యోచిస్తోంది. పూర్తి స్థాయి నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని నిర్ణీత ఆయకట్టుకు ఆరు నుంచి ఏడు తడుల ద్వారా నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నాగార్జునసాగర్ కింద కనిష్టంగా 6 లక్షల ఎకరాలకు, శ్రీరాం సాగర్ కింద లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకు అలీసాగర్, గుత్ఫా ఎత్తిపోతలను కలుపుకొని 5 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు బుధవారం జరిగే రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాం డింగ్ కమిటీ (శివమ్) భేటీలో నిర్ణయం తీసుకోనుంది. 50 టీఎంసీలతో.. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 312 టీఎంసీలకు గానూ 305.56 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ప్రస్తుతం 19 వేల క్యూసెక్కుల మేర వరద కొనసాగుతోంది. ఇం దులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన 175 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. దీనికి తోడు ఎగువ శ్రీశైలంలోనూ కనీస నీటిమట్టం 834 అడుగులకు ఎగువన 138 టీఎంసీల లభ్యత ఉంది. మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 313 టీఎంసీల లభ్యత ఉండగా ఇందులో కనిష్టంగా తెలంగాణకు 140 టీఎంసీల మేర దక్కే అవకాశముంది. ఇందులో కల్వకుర్తి కింది అవసరాలకు 35 టీఎంసీలు పక్కనపెట్టినా మిగతా నీరు సాగర్ కింద తాగు, సాగు అవసరాలకు లభ్యతగా ఉంటుంది. ఇందులో 50 టీఎంసీల నీటిని వినియోగించినా సాగర్ కింద ఉన్న 6.40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశముంది. గతేడాది రబీలో 27.39 టీఎంసీల నీటితో ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 4.15 లక్షల ఎకరాలకు నీరందించారు. నీటి విడుదలను డిసెంబర్ 26 నుంచి ఏప్రిల్‌వరకు కొనసాగించారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 20 నుంచే సాగర్ ఎడమ కాల్వ కింద నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 29 వరకు ఆరు లేక ఏడు తడుల్లో నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఎస్సారెస్పీ కింద పుష్కలంగా నీరు.. ఇక ఎస్సారెస్పీలో 90.31 టీఎంసీలకు గానూ 89.76 టీఎంసీల లభ్యత ఉంది. ఎస్సారెస్పీ కింద ఉన్న 9.68 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీలో నిల్వ ఉన్న నీటితో పాటు ఎల్ఎండీ కింద కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో ఎల్ఎండీ వరకు ఉన్న ఎస్సారెస్పీ ఆయకట్టు 4 లక్షల ఎకరాలు, అలీసాగర్, గుత్ఫాల కింది మరో లక్ష ఎకరాలకు ఎస్సారెస్పీలోని 50 టీఎంసీలతో సాగుకు నీరందించడనుండగా, ఎల్ఎండీ కింద ఉన్న ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న నీటిని వినియోగించే అవకాశముంది. ఎస్సారెస్పీ–2 కింద ఉన్న 3.40 లక్షల ఎకరాలకు సైతం కాళేశ్వరం ద్వారానే నీరివ్వనున్నారు. ఎస్సారెస్పీ కింద యాసంగిలో 17.10 టీఎంసీల నీటిని గతేడాది ఫిబ్రవరి నుంచి 9 తడుల ద్వారా నీరివ్వగా, ఈ ఏడాది వచ్చే నెల 20 నుంచే నీటిని విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంజనీర్లకు ఆదేశాలిచ్చారు. ప్రాజెక్టు ఇంజనీర్లు నిర్ణయించిన విధానాన్ని బుధవారం జరిగే శివమ్ కమిటీ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. -
ఓట్ల కోసం ఈ పని చేయట్లేదు : మంత్రి
సాక్షి, నిజామాబాద్ : ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని ఓట్లకోసం చేపట్టలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు, రైతుల రుణం తీర్చుకోవడానికి, పదవిలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక గుర్తుండే పని చేయాలనే తలంపుతో చేశామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేతల మాటలు వింటుంటే జాలేస్తుందన్నారు. కాళేశ్వరం జలాలు ఎలా వస్తాయనే ప్రతిపక్షాల హేళనలన్నీ భరించిన కేసీఆర్ ఇప్పుడు అపర భగీరథుడయ్యాడని ప్రశంసించారు. మరోవైపు తెలంగాణ దేశానికే ఆదర్శమని కొత్త గవర్నర్ చెప్పడం హర్షదాయకమని తెలిపారు. -
ఊపందుకున్న నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఊపందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, కామారెడ్డి జిల్లా భిక్నూరు, వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటల్లో ఏకంగా 14 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అలాగే తాడ్వాయిలో 12, హన్మకొండ, రామాయంపేట, హసన్‌పర్తి, లింగంపేటలలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాళేశ్వరంలో 10, కామారెడ్డి, చెన్నూరులలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో అల్పపీడనం... వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉంది. దీంతో తెలంగాణలో రాగల రెండ్రోజులు అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన... వచ్చే రెండ్రోజులు తెలంగాణలో 75 శాతం ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు సెంటీమీ టర్లు మొదలుకొని ఆరు సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు అంటే 7–11 సెంటీమీటర్లు మొదలు 12–20 సెంటీమీటర్ల వరకు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి పేర్కొన్నారు. ఎస్సారెస్పీకి వరద బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద మొదలైంది. మహారాష్ట్రలోని బాలేగావ్, అముదుర బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో ఎస్సారెస్పీకి ఎగువన గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి 5,490 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అది సోమవారం ఉదయానికి లక్ష క్యూసెక్కులకు పెరిగే అవకాశముందని డ్యామ్ డిప్యూటీ ఈఈ జగదీశ్ తెలిపారు. -
ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు
ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు వెతలు తీరే పరిస్థితి కనిపిస్తోంది. ఈనెల 15వ తేదీలోగా కాళేశ్వరం నీరు ఎస్సారెస్పీకి చేరేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించడంతో.. పునరుజ్జీవన పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఆదేశాలతో ఈ సీజన్లోనే తమ పంటలకు సాగునీరు అందే అవకాశం ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం తీసుకువచ్చింది. రూ. 1,067 కోట్లతో పనులు చేపట్టారు. వరద కాలువ గుండా నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ చేయడానికి వరద కాలువపై మూడు పంపు హౌజ్‌లు నిర్మిస్తున్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ జీరో పాయింట్ వద్ద గల మూడో పంపు హౌజ్ నిర్మాణ పనులతో సంబంధం లేకుండా మొదటి రెండు పంపు హౌజులతో రోజుకు 0.5 టీఎంసీల నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి తరలించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో 60 రోజుల పాటు 0.5 టీఎంసీల నీటిని తరలిస్తే 30 టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి చేరుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి మరో 30 టీఎంసీల నీరు వచ్చి చేరితే ఖరీఫ్‌లో ఆయకట్టుకు ఢోకా ఉండదు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పూర్తయితే రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజులు 60 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా తరలించే అవకాశం ఉంటుంది. పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరదలు లేకపోవడంతో 0.5 టీఎంసీల చొప్పున నీటిని ముందుగా తరలించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి తరలించే పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఈ నెల 15 లోపు ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలున్నాయి. వరద కాలువలో ఏడాదంతా నీరు.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా వరద కాలువలో నీరు రివర్స్ పంపింగ్ చేయడంతో వరద కాలువలో ఏడాదంతా నీరు నిల్వ ఉంటుంది. దీంతో వరద కాలువకు ఇరువైపులా భూగర్భజలాలు పెరగే అవకాశాలున్నాయి. రైతులకు ఈ నీటితో కొంత ఉప శమనం కలుగనుంది. ఆయకట్టు రైతుల్లో ఆనందం.. సీఎం ఆదేశాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుత సంవత్సరం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాక పోవడంతో ప్రాజెక్ట్‌లో నీరు లేదు. దీంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలామంది రైతులు ఖరీఫ్ పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. కానీ సీఎం ఆదేశాలతో ఈనెల 15వ తేదీలోపు కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశాలు ఉండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీని చేరితే తమ పంటలకు ఢోకా ఉండదని రైతులు అంటున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం పనులు -
ఇప్పుడంతా ‘పరీక్షా’ కాలం!
సాక్షి, హైదరాబాద్: ఇది ‘పరీక్ష’ల సీజన్. నీటిపారుదల శాఖకు టెస్టింగ్ పీరియడ్. పంప్‌హౌస్‌లలో డ్రై, వెట్‌రన్ నిర్వహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖరీఫ్ సీజన్లో కనిష్టంగా నూటా ఇరవై టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని నీటి పారుదల శాఖ దృడ సంకల్పంతో ఉంది. ఇప్పటికే ఎల్లంపల్లిలో లభ్యత ఉన్న జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–6 పరిధిలో పంపులు, మోటార్లకు వెట్‌రన్ నిర్వహించిన ఇంజనీర్లు మిగతా ప్యాకేజీల్లోని మోటార్లను సైతం డ్రై, వెట్‌రన్ నిర్వహించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 8వ తేదీన గానీ, 9వ తేదీన గానీ మేడిగడ్డ పంప్‌హౌస్‌ల పరిధిలో, 15వ తేదీలోపే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో, నెలాఖరుకు మిడ్‌మానేరు దిగువన ఉన్న నాలుగు ప్యాకేజీల పరిధిలోని పంప్‌హౌస్‌ల్లో డ్రై, వెట్‌రన్ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ నుంచే ఎత్తిపోతలు గోదావరిలో జూన్ తొలివారం నుంచే నీటి ప్రవాహాలు మొదలవుతాయి. ప్రాణహిత నుంచి గోదావరికి ఉధృత ప్రవాహాలుంటాయి. ఈ ప్రవాహాలు పుంజు కునే నాటికి పంపులు, మోటార్లు అంతా సిద్ధం చేసి వరద కొనసాగే రోజుల్లో కనిష్టంగా రోజకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం లక్ష్యంగా పె ట్టుకున్న విషయం తెలిసింది. అందుకు తగ్గట్లే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, కాల్వల పనులను చేస్తోంది. అత్యంత ముఖ్యమైన మోటార్ల ఏర్పాటును వేగిరం చేసింది. అత్యంత ప్రాధాన్యం గల తొలి పంప్‌హౌస్ అయిన మేడిగడ్డలో 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇందులో 7 ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరో రెండు మోటార్లు ఏర్పాటు దశలో ఉన్నాయి. సిద్ధంగా ఉన్న మోటార్లకు ఈ నెల 8నగానీ, 9న గానీ వెట్‌రన్ నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయిం చారు. ఇటీవల పంప్‌హౌస్ పరిధిలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ సైతం గోదావరిలో లభ్యతగా ఉండే నీటితో ఈ నెల 8న వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాలు కురిసి నీటి లభ్యత ఏర్పడిన అనంతరం అన్నారంలోని 9 మోటార్లు, సుందిళ్లలోని మోటార్లకు వెట్‌రన్ చేయనున్నారు. కాళేశ్వరానికి అనుసంధానంగా ఉన్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని మూడు పంప్హౌస్లకుగానూ రెండింటిని సిద్ధం చేసిన 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగేసి చొప్పున పంపులకు డ్రైరన్ నిర్వహించనున్నారు. ఈ పంప్‌హౌస్‌ల ద్వారా ఈ ఖరీఫ్‌లో కనిష్టంగా 45 నుంచి 60 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యం విధించారు. మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ–10లో 106 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 4 పంపులకు ఈ నెలాఖరున డ్రైరన్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్యాకేజీ–11లోని 135 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 మోటార్లు, ప్యాకేజీ–12లో 43 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న 8 మోటార్లకు జూన్‌లో వెట్‌రన్ చేసే అవకాశం ఉంది. ఇక ప్యాకేజీ–16లోని రెండు పంప్‌హౌస్‌ల్లో జూలైలో వెట్‌రన్ జరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
యాసంగి పంటలకు నిలిచిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ప్రస్తుత సంవత్సరం యాసంగి పంటలకు అన్ని కాలువల ద్వారా నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు నిలిపివేశారు. ఎస్సారెస్పీ నుంచి ప్రస్తుత యాసంగి సీజన్లో కాకతీయ కాలువ ద్వారా, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.. ప్రాజెక్ట్ నుంచి జనవరి 15 నుంచి నీటి విడుదల చేపట్టి మార్చి 31 న పూర్తి చేయాలని మొదట ప్రణాళిక రూపొందించారు. కానీ చివరికి నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్ నుంచి ఫిబ్రవరి 1 నుంచి వారబందీ ప్రకారం నీటి విడుదల చేపట్టారు. నాలుగు విడతలు అందించారు. 19.5 టీఎంసీల నీటి వినియోగం ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటల కోసం అన్ని కాలువలతోపాటు, తాగు నీటి అవసరాల కోసం 19.5 టీఎంసీల నీటిని వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 14.5 టీఎంసీలు, సరస్వతి కాలువ ద్వారా 1.41 టీఎంసీలు, లక్ష్మి కాలువ ద్వారా 1.31 టీఎంసీలు, అలీసాగర్ గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 1.98 టీఎంసీల నీటిని విడుదల చేశామని, తాగు నీటి పథకాల కోసం 0.79 టీఎంసీల నీటిని అందించామని అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 1.18 టీఎంసీల నీరు వృథా అయ్యిందంటున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1,053.30(8.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. -
సాగుకు నీళ్లివ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అన్ని పనులను వేసవికాలంలోగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జూన్ నాటికి.. కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఈ వర్షాకాలంలో నీటిని ఎత్తిపోయడం ప్రారంభమవు తుందని.. ఆ నీటిని మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములకు తరలిస్తామని చెప్పారు. ఈ రెండు డ్యాములకు 50టీఎంసీల సామర్థ్యం ఉంది. ఆ నీటితో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా అన్ని చెరువులు నింపాలని సీఎం ఆదేశించారు. ‘ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తున్నాయి. పనులు చేయడానికి నిధులిస్తున్నాం. అయినా పంట పొలాలకు నీరందించకుంటే పాపం చేసిన వారమవుతాం’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గ్యాదరి కిశోర్, వి సతీష్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బాల్క సుమన్, సుంకె రవిశంకర్, సంజయ్ కుమార్, కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, నీటి పారుదల ఈఎన్సీలు మురళీధర్, అనిల్‌కుమార్, నాగేందర్, సీఈలు శంకర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. నిధుల విడుదలకు ఆదేశం ఎస్సారెస్పీ పరిధిలోని మొత్తం ఆయకట్టుకు నీరందించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూలంకశంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడెక్కడ ఏయే సమస్యలున్నాయో గుర్తించి అప్పటికప్పుడే వాటిని పరిష్కరించారు. భూసేకరణకు, ఇతర పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ‘గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. ఈ నీటిని ఎత్తిపోయడానికి భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఈ ఏడాది వర్షాకాలం నుంచే మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోసి మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములకు తరలిస్తాం. అలా తరలించిన నీటిని ఎస్సారెస్పీ కాల్వల ద్వారా అన్ని చెరువులను మళ్లించాలి. చెరువులను నింపడమే మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. దీనికోసం ఎస్సారెస్పీ కాల్వలన్నింటినీ మరమ్మత్తు చేయాలి. కావాల్సిన చోట వెంటనే తూములను నిర్మించాలి. భూసేకరణ పూర్తి చేయాలి. రెండో దశలో నిర్మించిన కాల్వలకు లైనింగ్ పూర్తి చేయాలి. అవసరమైతే కాల్వల నీటి ప్రవాహ ఉధృతి సామర్థ్యాన్ని (క్యారీయింగ్ కెపాసిటీ) పెంచుకోవాలి. పనులను నిర్ణయించేందుకు వెంటనే 50 మంది ఇంజనీర్లను నియమించండి. యుద్ధ ప్రాతిపదికన సర్వే చేసి అంచనాలు రూపొందించండి. కావాల్సిన నిధులు వెంట వెంటనే మంజూరు చేస్తాం. అన్ని పనులు పూర్తి చేసి ఈ వర్షాకాలానికి ఎట్టి పరిస్థితుల్లో ఎస్సారెప్పీ పరిధిలోని 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతం నుంచి మొదలుకుని చివరి ఆయకట్టు కలిగిన డోర్నకల్, తుంగతుర్తి, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల వరకు అన్ని దిక్కులకు నీరందాలని అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీపై సమీక్షలో సీఎం చెప్పిన మరికొన్ని కీలకాంశాలు: కాకతీయ కాలువ, వరద కాలువ మధ్య ఉన్న 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలి. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేయాలి. వెంటనే ఈ పనుల కోసం సర్వే నిర్వహించి పనులు ప్రారంభించాలి. ఎస్సారెస్పీ రెండో దశలో అన్ని డిస్ట్రిబ్యూటరీలకు లైనింగ్ చేయాలి. దీనికోసం వెంటనే అంచనాలు రూపొందించి టెండర్లు పిలవాలి. ఎండాకాలంలోపు పనులు పూర్తి కావాలి. ఎస్సారెస్పీ కాల్వల పనులు అన్ని చోట్ల పనులు సమాంతరంగా జరగాలి. అన్ని ప్రాజెక్టుల కాల్వలకు సంబంధించిన హద్దులను నిర్ణయించాలి. ప్రాజెక్టుల భూముల సమగ్ర వివరాలను (ఇన్వెంటరీ) రూపొందించాలి. ఎస్సారెస్పీ పంట కాల్వలను ఎవరైనా దున్నుకుంటే వాటిని పునరుద్ధరించాలి. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపి రైతులను ఒప్పించాలి. అన్ని ప్రాజెక్టుల సమగ్ర స్వరూపం (ప్రొఫైల్) తయారు చేయాలి. ప్రతి ప్రాజెక్టుకు ఆపరేషన్ రూల్స్ తయారు చేయాలి. ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం అంచనా వేయాలి. ఆ నిధులను వచ్చే బడ్జెట్లో కేటాయిస్తాం. చనాఖా–కొరాటా పనులు మే 15 నాటికి పూర్తి కావాలి. కడెం గేటు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలి. దేవాదుల నీటిని తరలించే రామప్ప, లక్నవరం, ఘన్పూర్, పాకాల కాల్వల పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఎండాకాలంలోనే పూర్తి చేయాలి. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన పాలకుర్తి, ఉప్పుగల్లు, చెన్నూరు రిజర్వాయర్ల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలి. -
సోమ లేక మంగళ!
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు నిరంతరాయంగా కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవాహాలు ఇలాగే కొనసాగితే వచ్చే సోమ లేక మంగళవారం ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ నెలలోనే ప్రాజెక్టు గేట్లు ఎత్తే చాన్స్ ఉందని ప్రాజెక్టు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 248 టీఎంసీల నిల్వలు ఉండగా, మరో 64 టీఎంసీలు నీరు చేరితే ప్రాజెక్టు నిండు కుండను తలపించనుంది. ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌ల్లోకి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆల్మట్టికి 1.21 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. తుంగభద్రకు 49వేల క్యూసెక్కుల వరదొస్తోంది. ఇక రాష్ట్ర పరిధిలోని జూరాలకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే నీటిని దిగువకు వదిలేస్తున్నారు. శ్రీశైలానికి 1.98 లక్షల క్యూసెక్కుల ప్రవాహమొస్తోంది. గురువారంతో పోలిస్తే కాస్త తగ్గినా, మెరుగ్గానే ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి 2.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ సాగర్‌కు వదిలారు. ఇందులో 1.82 లక్షల క్యూసెక్కులు సాగర్‌కు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు మొత్తం నిల్వ 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 245 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ ద్వారా 7,420 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఆల్మట్టి, నారాయణపూర్‌కు ప్రవాహాలు నిలిచి గేట్లు మూసినా, ఆల్మట్టి నుంచి సాగర్ వరకు నదీ గర్భంలో గరిష్టంగా 100 టీఎంసీల నీరు ఉంటుందని, ఇందులో 70 నుంచి 80 టీఎంసీలు సాగర్ చేరినా, ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎస్సారెస్పీకి 8,535 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అక్కడ 70 టీఎంసీల నిల్వలున్నాయి. -
ఎస్సారెస్పీ నీరొస్తోంది
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆయకట్టు రైతులకు శుభవార్త. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ఈ ఖరీఫ్‌లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రుల బృందం నీటి విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకుంది. నీటి విడుదలకు షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. భారీగా ప్రవాహాలు వస్తున్నందున ఒకట్రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నుంచి నీరు విడుదలయ్యే అవకాశముంది. మూడు రోజుల్లో పూర్తిగా.. ఎస్సారెస్పీకి ఎగువన ఉన్న మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, అంధురా ప్రాజెక్టుల నీటి మట్టాలు పూర్తిస్థాయికి చేరడం.. బాలేగావ్ నుంచి 1.98 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టుకు ఒక్కసారిగా ప్రవాహాలు పెరిగాయి. సాయంత్రానికి 2.68 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవడంతో ఎస్సారెస్పీలో నీటి నిల్వ 58 టీఎంసీలు (సామర్థ్యం 90 టీఎంసీలు) దాటింది. ఎగువన మహారాష్ట్రలోని గోదావరి పరీవాహకంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో వరద స్థిరంగా కొనసాగే అవకాశం ఉం ది. అదే జరిగితే మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండొ చ్చని నీటి పారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి. షెడ్యూల్ ఖరారుకు ఆదేశాలు ఎస్సారెస్పీ నిల్వలు పెరగడంతో మంత్రి హరీశ్‌రావు మంగళవారం జలసౌధలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఈఎన్సీ మురళీధర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇరిగేషన్ ప్రత్యేకాధికారి కె.ప్రసాద్‌లతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం, ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి జలకళ సంతరించుకోవడం పట్ల మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కింద ఈ ఖరీఫ్‌కు నీరు విడుదల చేయాలని తీర్మానించారు. ప్రాజెక్టు కింది కాకతీయ, లక్ష్మీ కాలువలతో పాటు లక్ష్మీ కాంప్లెక్స్‌లోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ కింది ఆయకట్టు.. సరస్వతీ కెనాల్ కాలువ, గుత్ప, అలీ సాగర్, ఐడీసీ ఆధ్వర్యంలో నడిచే 24 లిఫ్ట్‌ల పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 58 టీఎంసీల నీరుందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరొస్తోందని, ఈ ప్రవాహం మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఎస్సారెస్పీకి ఎగువన ఏయే ప్రాజెక్టుల్లోకి నీరు వస్తోంది, వర్షపాతం ఎలా ఉందో మంత్రులు ఆరా తీశారు. గ్రామాల్లో చాటింపు వేయించండి ఎస్సారెస్పీలో నీటి లభ్యత పెరిగిన దృష్ట్యా అందుకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేయాలని ఈఎన్సీని మంత్రి హరీశ్ ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలని ఇంజనీర్లకు చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో ఇంజనీర్లు సమావేశాలు ఏర్పాటు చేసి నీటి విడుదల ప్రణాళికలు వివరించాలన్నారు. కాలువ పరిధిలోని రైతులకు నీటి విడుదల సమాచారం అందించేలా ఇంజనీర్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. నీరు విడుదల చేసే కాలువలను పటిష్ట పరచాలని, ఉపాధి హామీ పథకంలో భాగంగా పూడిక తీయాలని చెప్పారు. నీటి వృథా అరికట్టేందు కు టెయిల్ టు హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి అవలంబించాలన్నారు. గత రబీలో ఈ పద్ధతి అమలు చేయ డం ద్వారా ఒక్క టీఎంసీ నీటితో 13 వేల నుంచి 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామని గుర్తుచేశారు. సాగర్‌లో 210 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు కృష్ణా ప్రవాహం తగ్గింది. శ్రీశైలం నుంచి నీటి విడుదల తగ్గడంతో నిన్నమొన్నటి దాకా 2 లక్షలకు పైగా నమోదైన ప్రవాహం మంగళవారం సాయంత్రానికి 61 వేలకు పడిపోయింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం సాగర్‌లో 210 టీఎంసీల నీరుంది. అయితే ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి 1.60 లక్ష ల క్యూసెక్కుల ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటం, నిన్నటివరకు తగ్గిన తుంగభద్ర వరద మళ్లీ పుంజుకొని లక్ష క్యూసెక్కులకు పెరిగిన నేపథ్యంలో శ్రీశైలానికి మళ్లీ ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తు తం శ్రీశైలానికి 1.31 లక్షల ప్రవాహం వస్తుండగా 92 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కాంగ్రెస్ నేతల కళ్లలో కన్నీరు తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని.. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను సీఎం ప్రారంభించారని మంత్రులు చెప్పారు. సాగు ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేసేం దుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో దేవుడూ కరుణించి చక్కగా వర్షం కురిపించడం వల్ల ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని ఆనం దం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా గోదావరి బేసిన్లో నీరుంటే కృష్ణా బేసిన్లో ఉండేది కాదని.. కృష్ణాలో ఉంటే గోదావరిలో ఉండేది కాదని, కానీ రెండు బేసిన్లలోకి వరద నీరు రావడం, ప్రాజెక్టులు నిండటం తొలిసారని హరీశ్ అన్నారు. ప్రాజెక్టుల్లోకి నీరొస్తుంటే.. కాంగ్రెస్ నేతల కళ్లలో కన్నీరు వస్తోందని విమర్శించారు. -
ఖరీఫ్‌కు ఊపిరి.. సాగర్‌కు కృష్ణమ్మ
సాక్షి, హైదరబాద్: ఖరీఫ్ ఆయకట్టు ఆశలను మోస్తూ నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. తడారిన గొంతుల్ని తడిపేందుకు.. ఆయకట్టు పంటలకు ప్రాణం పోసేందుకు వరద పోటెత్తుతోంది. చాలా రోజుల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో 8 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 2.32 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం నమోదైంది. ఈ ప్రవాహం ఆదివారానికి మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వరదకు సాగర్ మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 590 అడుగులకు గానూ 532 అడుగుల్లో 172.27 టీఎంసీల నిల్వలున్నాయి. వచ్చేదంతా సాగర్‌కే.. కృష్ణానదీ బేసిన్లో సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నా రు. దీంతో జూరాలకు రోజూ స్థిరంగా 1.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ఈ నీటిని దిగువ శ్రీశైలానికి వదలడం, ఈ ప్రవాహానికి సుం కేసుల నుంచి వస్తున్న వరద తోడవడంతో శ్రీశైలంలోకి 3.53 లక్షల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 215 టీఎంసీలకు గానూ 200 టీఎంసీలకు చేరడంతో శనివారం ఉద యం ఆరుగేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 1.59 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. సాయంత్రం మరో 2 గేట్లు ఎత్తారు. దీనికి అదనంగా కుడి, ఎడమ కాల్వల పవర్‌హౌస్‌ల ద్వారా ఏపీ, తెలంగాణ 72 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నాయి. కల్వకుర్తికి 2,400, హంద్రీనీవాకి 2,025, పోతిరెడ్డిపాడు ద్వారా 26 వేల క్యూసెక్కుల నీటి వినియోగం జరుగుతోంది. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో సాగర్‌కు శనివారం సాయంత్రానికి 2.32 లక్షల క్యూసెక్కుల మేర ప్రవా హం వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వలు 312 టీఎంసీలకు గానూ 172.27 టీఎంసీలకు చేరాయి. మరో 140 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండనుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటం, భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇకపై వచ్చిన ప్రవాహాలు వచ్చినట్లుగా సాగర్‌కు చేరనున్నాయి. ఇవే ప్రవా హాలు కొనసాగినా 15 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయి. ఒకవేళ ఎగువ వరద ఆగినా నదీ గర్భంలోనే 100 నుంచి 120 టీఎంసీలు ఉంటాయ న్న అంచనా సాగర్ ఖరీఫ్ఆశలను సజీవం చేస్తోంది. సాగర్ అవసరం.. 52.50 టీఎంసీలు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నిల్వలు పెరు గుతుండటంతో నీటి అవసరాలపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ సమర్పించింది. మొత్తంగా ఈ సంవత్సరం నవంబర్ వరకు తాగు, సాగు నీటి అవసరాలకు కలిపి 52.50 టీఎంసీలు కావాలని కోరింది. ఇందులో సాగర్ కింద 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 33 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ కింద చెరువులను నింపేందుకు 12 టీఎంసీలు, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు 7.50 టీఎంసీలు కలిపి మొత్తంగా 52.50 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఈ అవసరాలపై బోర్డు సోమవారం తర్వాత నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగస్టు వరకు తాగు, సాగునీటి అవసరాలకు కృష్ణా బోర్డు 30 టీఎంసీలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆశలు రేపుతున్న ఎస్సారెస్పీ గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 42,520 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిల్వ 30 టీఎంసీలకు చేరింది. మరో 60 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. క్రమంగా నిల్వ లు పెరుగుతుండటంతో ఇక్కడి 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదలపై త్వరలోనే స్ప ష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి వరద ఉధృతి కొనసాగుతోంది. 38 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ప్రాజెక్టులో 20 టీఎంసీల పూర్తి మట్టం ఉండటంతో 43 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. కడెంలోకి 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. -
ఎస్సారెస్పీకి భారీ వరద
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం దిగువ ప్రాజెక్టుల్లోకి చేరుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి భారీ వరద వస్తోంది. మంగళవారం సాయంత్రానికి 21,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.197 టీఎంసీలకు చేరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో నాలుగైదు రోజులు ప్రవాహాలు కొనసాగుతాయని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. సింగూరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఆశాజనక స్థాయిలో ప్రవాహాలు కొనసాగుతున్నాయి. సింగూరుకు మంగళవారం 1,442 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగగా, 29.91 టీఎంసీల సామర్థ్యానికి చేరింది. కడెంలోకి 2,492 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 1,611 క్యూసెక్కుల మేర వస్తోంది. నిజాంసాగర్, లోయర్ మానేరు డ్యామ్ పరిధిలోకి ఇంకా ఎలాంటి ప్రవాహాలు మొదలు కాలేదు. కృష్ణా బేసిన్లో ఒక్క జూరాలకు మాత్రమే మెరుగైన ప్రవాహాలు వస్తున్నాయి. పరీవాహకంలో కురిసిన వర్షాలతో మంగళవారం 3,903 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో వర్షాలు మొదలయ్యాక గరిష్టంగా జూరాలకే 1.28 టీఎంసీల కొత్తనీరు వచ్చి చేరింది. ఇక నాగార్జునసాగర్‌లోకి 512 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టికి ఎలాంటి ప్రవాహాలు లేకపోగా, నారాయణపూర్‌కు 599 క్యూసెక్కులు, తుంగభద్రకు 1,127 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాజెక్టుల్లో భారీగా వరద చేరితే కానీ దిగువకు ప్రవాహాలు కొనసాగే పరిస్థితి లేదు. -
కాకతీయ కాలువకు పెరిగిన నీటి విడుదల
బాల్కొండ : ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కుల నుంచి 6500 క్యూసెక్కులకు నీటి విడుదలను ప్రాజెక్ట్ అధికారులు శుక్రవారం పెంచారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదని నీటి విడుదలను పెంచినట్లు వారు తెలిపారు. సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 250 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(90టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 1059.40(12.95 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పెరగడంతో జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి పెరిగిందని జెన్కో అధికారులు తెలిపారు. మూడు టర్బయిన్ల ద్వారా 10.70 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. -
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
-
పంట పండేనా..?
దండేపల్లి(మంచిర్యాల) : కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు ఆందోళనకరంగా మారింది. డిస్టిబ్యూటరీ 30 నుంచి 42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించడంతో చాలా మంది రైతులు పంటలు సాగు చేసుకున్నారు. ఇటీవల ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ తరచూ మరమ్మతులకు గురికావడంతో నీటి సరఫరాకు ఆటకం కలుగుతోంది. ఒకోసారి వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోతోంది. దీంతో గూడెం ఎత్తిపోతల కింద ఇప్పటికే సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఆయకట్టు పరిస్థితి ఇదీ.. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. ప్రతి యేటా ప్రాజెక్టు పూర్తిగా నిండితే ఆయకట్టు కింద ఖరీప్‌లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటారు. కడెం నీటిని రబీ సాగుకు ఇచ్చిన దాఖలాలు తక్కువే. రబీ సీజన్లో చెరువులు మాత్రం నింపుతారు. గూడెం ఎత్తిపోతల పథకం ప్రారంభం అయినప్పటినుంచి మాత్రం ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో, రబీకి డీ1 నుంచి డి28 వరకు కడెం నీటిని, డీ30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తున్నారు. రెండోసారీ రబీకి.. కడెం ఆయకట్టు కింద డిస్టిబ్యూటరీ 30 నుంచి 42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని రబీ సాగుకు అందించడం ఇది రెండోసారి. అయితే గత సంవత్సరం ఖరీఫ్‌లో కడెం నీటిని ఆయకట్టు చివరి వరకు అందించారు. ఖరీఫ్ సాగు పూర్తయ్యేనాటికి కడెం ప్రాజెక్టులో 692 అడుగుల నీటిమట్టం ఉంది. దీనికితోడు ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ నుంచి తెచ్చి 2016–17లో రబీకి కూడా డి1 నుంచి డి28 వరకు కడెం నీటిని, డీ30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించారు. ఈ సమయంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు వచ్చాయి. 2017 ఖరీఫ్‌కు కడెం నీటిని డీ1 నుంచి డి42 వరకు అందించారు. ప్రస్తుత యాసంగికి మాత్రం కడెంలో సరిపడా నీళ్లు లేవు. 685 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో డి1 నుంచి డి22 వరకు రెండు తడుల నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని నీటిపారుదల శాఖ అధికారుల సమావేశంలో తీర్మానించారు. ఈనెల 15 నుంచి 23 వరకు మొదటి విడత నీటిని విడుదల చేశారు. రెండో విడత ఫిబ్రవరి 15 నుంచి విడుదల చేయనున్నారు. డీ30 నుంచి డి42 వరకు మాత్రం గూడెం ఎత్తిపోతల నీటిని గతనెల 23 నుంచి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత రబీకీ నీటిని విడుదల చేసినప్పటి నుంచి ఎత్తిపోతల పథకం ఇప్పటికి మూడుసార్లు మరమ్మతులకు గురయ్యింది. దీంతో ఆయకట్టు రైతులు తమ పంటలు పండుతాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఎగువ ప్రాంత రైతుల ఆందోళనలు గూడెం ఎత్తిపోతల నీటిని అధికారికంగా డి30 నుంచి డి42 వరకు ఇవ్వాల్సి ఉంది. అయితే తానిమడుగు వద్ద గల ఎత్తిపోతల పథకం డెలివరీ సిస్టర్న్ వద్ద కడెం ప్రధాన కాల్వలో అడ్డంగా గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఖరీఫ్ సమయంలో ఈ గేట్లు ఎత్తితే కడెం నీళ్లు డి1 నుంచి డి42 వరకు వెళ్తుంటాయి. రబీ సమయంలో ఈ గేట్లు మూసి గూడెం ఎత్తిపోతల నీటిని డీ30 నుంచి డి42 వరకు అందిస్తుంటారు. ఈ సమయంలో గేట్ల నుంచి లీకయిన కొద్దిపాటి నీళ్లు ఎగువ ప్రాంతాలైన దండేపల్లి, మామిడిపల్లి వరకు వెళ్లడంతో ఈ ప్రాంత రైతులు రబీలో పంటలు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈసారి కడెం నీటిని డీ1 నుంచి డి22 వరకు చెరువులు నింపేందుకు విడుదల చేయగా, డీ–30 నుంచి డి42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తున్నారు. మిగిలిన డీ23–24, 24ఏ, 24బీ, 25, 26, 27, 28లకు సాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. గూడెం ఎత్తిపోతల నీళ్లు మొదట్లో కొద్ది రోజులు ఎగువకు రావడంతో గత ఏడాది మాదిరి ఈసారి కూడా పంటలు సాగు చేశారు. అయితే ఎత్తిపోతల పైప్‌లైన్ పగిలింది. దానికి మరమ్మతు చేసినప్పటి నుంచి ఎత్తిపోతల నీరు ఎగువకు వెళ్లకుండా పూర్తిగా సీజ్ చేశారు. దీంతో డీ23–24, 24ఏ, 24బీ, 25, 26, 27, 28 కింది సుమారుగా 5వేల ఎకరాలకు పైగా భూములు బీళ్లుగా మారాయి. కొందరు రైతులు సాగు చేసిన పొలాలు నీళ్లందక ఎండుతున్నాయి. అయితే వీటికి తానిమడుగు వద్ద కడెం ప్రధాన కాల్వలో అడ్డంగా ఉన్న గేట్లను ఎత్తితే ఇక్కడి వరకు సాగునీరు అందుతుందని ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. మళ్లీ నిలిచిన నీటి సరఫరా.. గూడెం ఎత్తిపోతల నీటిని గతనెల 23న విడుదల చేశారు. అప్పటినుంచి మూడుసార్లు పైప్‌లైన్ మరమ్మతులకు గురయ్యింది. దీంతో పైప్‌లైన్ లీకయినప్పుడల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే నెలలో 6న ఒకసారి, 10న మరోసారి, తాజాగా 28న పైప్‌లైన్ మరమ్మతులకు గురయ్యింది. -
ఎస్సారెస్పీకి భారీగా వరద ప్రవాహం
- 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - మిగతా గోదావరి ప్రాజెక్టుల్లోకి స్థిరంగా ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గణనీయంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రాజెక్టులోకి 40వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32.70 టీఎంసీల నిల్వ ఉంది. ఇక గోదావరి బేసిన్‌లోని మిగతా ప్రాజెక్టులకు స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. సింగూరులోకి 3,135 క్యూసెక్కులు, నిజాంసాగర్‌లోకి 1,765, ఎల్లంపల్లికి 12,724, కడెంలోకి 3,130 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. ఇక కృష్ణాబేసిన్‌లో ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవాహాలు వస్తున్నాయి. ఆల్మట్టికి 27వేలకు పైగా క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 18,171 క్యూసెక్కులు వస్తుండగా, శ్రీశైలానికి 4,687, సాగర్‌కు 907, జూరాలకు 9,766 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. -
ఎస్సారెస్పీకి పూర్వవైభవం తెస్తాం
ఈ నెల 10న సీఎం చేతుల మీదుగా పునరుజ్జీవం: హరీశ్‌రావు బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1963లో పునాది పడి చరిత్ర సృష్టిస్తే, ఈ నెల 10న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం మరో చరిత్ర సృష్టిస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి నీరు రాని సమయంలో కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్‌తో రోజుకు టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు నీటిని పంపింగ్ చేసి ప్రాజెక్టు నింపడమే పునరుజ్జీవం పథకం లక్ష్యమని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిలతో కలసి ఆయన బుధవారం సందర్శించారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి హరీశ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. వరద కాలువను 102 కిలోమీటర్ నుంచి ప్రాజెక్ట్ వరకు రిజర్వాయర్‌గా మార్చి నీటిని ప్రాజెక్ట్‌లోకి పంపింగ్ చేయడం వలన కాకతీయ, వరద కాలువల మధ్య ఉన్న మరో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ సొంత ఆలోచనే... ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో నుంచి వచ్చిందేనని హరీశ్ చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో బ్యారేజీలను రిజర్వాయర్లుగా మార్చుకుని పూర్వవైభవం తీసుకు వచ్చారని, తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన ఎస్సారెస్పీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ధృఢ సంకల్పంతోనే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు వివరించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రస్తుత సంవత్సరం ఎస్సారెస్పీలోకి పెద్దగా వరద రాలేదని, కానీ, మేడిగడ్డ, కాళేశ్వరం వద్ద ఇప్పటికే 210 టీఎంసీల నీరు సముద్రంలో కలసి పోయిందన్నారు. ఇప్పటికీ ప్రతి రోజు 54 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోందన్నారు. రివర్స్ పంపింగ్ పథకం పూర్తయి ఉంటే ఇప్పటికే ఎస్సారెస్పీకి రెండు నెలల్లో 60 టీఎంసీల నీటిని తెచ్చుకునే అవకాశం ఉండేదన్నారు. ఏడాది కాలంలోనే పనులు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. -
సాగుకు నీరు.. రైతుకు బతుకు
ఇదే ప్రభుత్వ ప్రాథమిక విధి సీఎం కేసీఆర్ వెల్లడి సాగునీటికి చేసే ఖర్చు నిరర్ధకం కాదు - ఎస్సారెస్పీ కాల్వలకు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే రూ.8 వేల కోట్ల పంట పండింది - ప్రాజెక్టుల వ్యయం కన్నా రైతులకు సమకూరే ఆదాయం చాలా ఎక్కువ - వచ్చే ఖరీఫ్‌కు పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీరివ్వాలి - కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీ కాల్వలు సిద్ధం చేయాలి - ఎమ్మెల్యేలు పనులను పర్యవేక్షించాలి సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులు సాగు చేసే పంటలకు నీరందించడం, వ్యవసాయాన్ని బతికించడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సాగునీటి కోసం చేసే ఖర్చు ఎన్నటికీ నిరర్ధకం కాదని స్పష్టంచేశారు. ‘‘సాగునీటి కోసం పెట్టే ఖర్చు నిరర్ధకమైనదన్న తప్పుడు అవగాహన కొంత మంది ఆర్థికవేత్తలు, పరిపాలకుల్లో కూడా ఉంది. కానీ అది తప్పు. గతేడాది ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతు కోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశాం. దానివల్ల 9 లక్షల ఎకరాల్లో పంట పండింది. దీని విలువ రూ.8,370 కోట్లు. వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే రూ.8 వేల కోట్ల పంట పండింది. కాబట్టి నీటి పారుదల వసతుల కోసం పెట్టే ఖర్చు నిరర్ధకం కాదు. ప్రాజెక్టుల కోసం పెట్టే వ్యయం కన్నా.. రైతులకు సమకూరే ఆదాయం ఎన్నో రెట్లు ఎక్కువ. అన్నింటికి మించి రైతులకు సాగునీరు అందించడం, వ్యవసాయాన్ని బతికించడం ప్రభుత్వ ప్రాథమిక విధి’’అని సీఎం పేర్కొన్నారు. శుక్రవారం నీటి పారుదల శాఖపై ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణా రావు, బీఆర్ మీనా, కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తి చేసి, వచ్చే ఖరీఫ్ నాటికి 10 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టు పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గతేడాది పాలమూరు ప్రాజెక్టుల కింద సగం ఆయకట్టు వరకు నీరు ఇవ్వగలిగామని, వచ్చే ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందించేలా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఇందుకు ఎండాకాలమంతా రేయింబవళ్లు పనిచేయాలని, నీటి పారుదల శాఖకు ఇతర శాఖలు కూడా సహకారం అందించాలని విన్నవించారు. కాళేశ్వరం నీటిని కాల్వలకు మళ్లించాల్సిందే.. దిగువ మానేరు డ్యామ్ కింద ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ‘‘గోదావరి నీటిని మన వాటా ప్రకారం వాడుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యేలోగా మేడిగడ్డ నుంచి నీటిని తోడడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాల్వల నిర్మాణం కూడా పూర్తవుతుంది. పెద్దఎత్తున నీరు అందుబాటులోకి వస్తుంది. ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు తదితర రిజర్వాయర్లలో 140 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది. వీటి ద్వారా పాత కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రెండు పంటలు పండించాలి. అందుకు పంట పొలాలకు, చెరువులకు నీరందించేందుకు ఎస్సారెస్పీ కాల్వలను సిద్ధం చేసుకోవాలి. ఎల్ఎండీ నుంచి అటు భూపాలపల్లి, ఇటు డోర్నకల్ నియోజకవర్గాల చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా కాల్వల వ్యవస్థను పునరుద్ధరించాలి. కొన్ని కాల్వలను మరమ్మతు చేయాలి. మరికొన్నింటిని కొత్తగా నిర్మించాలి. ఒక్క పాత వరంగల్ జిల్లాలోనే ఎస్సారెస్పీ ద్వారా పది లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరివ్వాలి. చెరువులు నింపాలి. ప్రధాన కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం 7 వేల క్యూసెక్కులు ఉండేలా పటిష్టపరచుకోవాలి. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని పనులను పర్యవేక్షించాలి. రైతులకు సాగునీరు అందివ్వడాన్ని అత్యంత ముఖ్యమైన విధిగా భావించాలి. నీటిపారుల శాఖ అధికారులతో ఎప్పటికప్పడు సమన్వయంతో పనిచేయాలి’’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిధులు ఆగొద్దు.. సాగునీటి వసతుల కల్పనకు ఎన్ని నిధులు అవసరమైనా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బడ్జెట్లో ఇప్పటికే ఏడాదికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ఆర్థిక సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అటు నీటి లభ్యత, ఇటు నిధుల లభ్యత ఉందని, దీన్ని సదవకాశంగా తీసుకుని పనుల్లో వేగం పెంచాలని సూచించారు. -
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
దురాజ్‌పల్లి : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్‌కుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీరాంసాగర్ నీటిని విడుదల చేసి జిల్లాలోని పంటలను కాపాడానికి కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజెక్టులో 1,071 అడుగుల మేర నీరు ఉన్నా.. నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అనంతరం కలెక్టర్ సురేంద్రమోహన్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు గంటా నాగయ్య, సైదులు, కిరణ్, సంజీవరెడ్డి, గుండు వెంకన్న, బొడ్డు శంకర్, ఉమేష్, ఉప్పలయ్య, వెంకన్న, అంజయ్య పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీకి కొనసాగుతోన్న వరద
ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల 4 వేల 939 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 90.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 89.763 టీఎంసీల నీరు ఉంది. కాకతీయ కెనాల్‌కు 5 వేల క్యూసెక్కులు, సరస్వతీ కెనాల్‌ఖు 1000 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్‌కు 300 క్యూసెక్కులు, ఎస్కేప్ రెగులేటర్‌కు 3 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొత్తం 74,939 క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. -
నిధులు నీళ్లపాలు
నాసిరకంగా కాలువ పనులు కాకతీయ’కు గండితో వెల్లడైన వైనం పటిష్టతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు వరంగల్ : జిల్లాకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని అందించే కాకతీయ ప్రధాన కాల్వల పటిష్టతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాల్వల్లోకి నీరు రాగానే గండి పడడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఎండీలో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నా ఎస్సారెస్పీ స్టేజ్–1తో పాటు స్టేజ్–2కు నీరు అందించాలంటే కాల్వల్లో పూర్తి సామర్థ్యం మేరకు 5 వేల క్యూసెక్కుల నీరు సరఫరా చేయాలి. గత పదేళ్లుగా జిల్లాలోని ప్రధాన కాల్వలు, మైనర్లు, సబ్మైనర్లు నిర్మించినప్పటికీ కాలువలు బలహీనంగా ఉండడంతో 3వేల క్యూసెక్కులకు మించి నీరు విడుదల చేయలేదు. ఎల్ఎండీ నుంచి మన జిల్లా వరకు ఉన్న స్టేజ్–1లోని ప్రధాన కాలువ 294 కిలోమీటర్లు పటిష్టం చేస్తేనే స్టేజ్ –2కు నీరందించే అవకాశం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జిల్లాలోని 201–875 నుంచి 234 కి.మీ. వరకు మట్టికట్టలు, లైనింగ్ కోసం రూ.60 కోట్లు మంజూరయ్యాయి. అయితే కాలువల పనులు నాసిరకంగా చేపట్టడంతో అదనంగా నీరు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. కోట్లు వ్యయం చేసినా ప్రభుత్వ లక్ష్యం నేరవేరక పోగా నిధులన్నీ నీళ్లులో పోసినట్టయింది. గత వారం రోజులుగా కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యాం నుంచి విడుదల చేస్తున్న నీటి సరఫరాను అధికారులు తగ్గించారు. గత నెల 27న వరంగల్ జిల్లా పరిధిలోని కాకతీయ ప్రధాన కాలువకు పెద్దమ్మగడ్డ సమీపంలో గండి పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధ, గురువారాల్లో కాలువకు బయట పక్క గండి పడిన ప్రాంతంలో మట్టితో పూడ్చారు. 4వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తేనే ఈ పరిస్థితి నెలకొనడంతో ఎస్సారెస్పీ అధికారులు నీటి సరఫరాను తగ్గించారు. ప్రస్తుతం 3500 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో స్టేజ్–2 ఆయకట్టుకు నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారింది. పరిశీలించిన ఈఎన్సీ... అరెపల్లి బ్రిడ్జి సమీపంలోని కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని నీటి పారుద ల శాఖ ఈఎన్సీ విజయప్రకాశ్ గత శుక్రవారం పరిశీలించారు. కాలువ బెడ్ లెవల్లో నీటి ఊట ఎక్కువైనందున భారీగా నీరు విడుదల కావడంతో స్థానికులు అందోళనకు గురైనట్లు ఎస్ఈ సుధాకర్‌రెడ్డి ఆయనకు వివరించారు. దీంతో కాలువ లీకేజీ ప్రాంతంలో అదనంగా మట్టి పోయడంతో పాటు నీరు ప్రవహిస్తున్న చోట ఇసుకబస్తాలతో బండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలువ పనుల సమయంలో పర్యవేక్షణ సరిగా లేనందునే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అధికారులను మందలించినట్లు సమాచారం. ఇప్పటికైనా బయటకు వస్తున్న నీటిని మళ్లించి పర్యవేక్షించాలని ఎస్ఈని ఆదేశించినట్లు సమాచారం. మంత్రి హరీశ్ ఆరా..! కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడిన విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఆరా తీసినట్లు తెలిసింది. గండిని పరిశీలించిన ఈఎన్సీ విజయప్రకాశ్ నుంచి మంత్రి పూర్తి వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. గండి స్థానంలో కొత్త కట్ట నిర్మాణం కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడి వృథాగా నీరు లీక్ కావడంతో అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. లీకేజీని అపేందుకు నాలుగు రోజులుగా శ్రమిస్తున్నారు. అయినా ప్రవాహం అగక పోవడంతో ఆ ప్రాంతంలోని మట్టి మొత్తం తీసి కొత్తగా కట్ట నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అదివారం నీరు లీకేజీ అయిన ప్రాంతంలోని కట్టను పూర్తిగా తొలగించి నాణ్యమైన మట్టితో కొత్తగా నిర్మిస్తున్నారు. కాకతీయ కాలువలో నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తూ పనులు చేపట్టారు. దీంతో మరో వారం రోజుల పాటు నీటి సరఫరా జరగదని సమాచారం. -
ఎస్సారెస్పీ జలాలు వృథా చేయొద్దు
నిండని చెరువులకు మళ్లిస్తే మరో రెండేళ్లు కరువు ఉండదు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తొర్రూరు : మెట్ట ప్రాంతమైన వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలతో నిండని చెరువులను ఎస్సారెస్పీ జలాల ద్వారా నింపుకుంటే మరో రెండేళ్ల వరకు కరువు లేకుండా ఉంటుందని రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం తొర్రూరు మండల కేంద్ర శివారులోని ఎర్రసోమ్లా తండ వద్దనున్న ఎస్సారెస్పీ ఫేస్–2 కాల్వ వద్ద స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ గత నెలరోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండడంతో ప్రాజెక్ట్‌లన్ని వరద నీటితో నిండి వృథాగా సముద్రంలో కలసిపోతున్నాయన్నారు. అం దుకే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుతో మాట్లాడి నిండని చెరువులు, కుంటలను ఎస్సారెస్పీ జలాలతో నింపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాప్రతి నిధులు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉంటూ వరదనీరు, ఎస్సారెస్పీ నీరు వృథా కాకుండా చూసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలను నింపేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ కృషి చేస్తున్నట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమయ్య, జడ్పీటీసీ కమలాకర్, టీఆర్ఎస్ నాయకులు నెహ్రునాయక్, వెంకటనారాయణగౌడ్, డాక్టర్ సోమేశ్వర్రావు, సోమనర్సింహరెడ్డి, నరేందర్‌రెడ్డి, ఈదురు ఐలయ్య, రాజేష్‌నాయక్, శంకర్, కొమురయ్య, ఈనెపెల్లి శ్రీను, నట్వర్, రామిని శ్రీను, సీతారాములు, కుమార్, శ్రీనివాస్, వెంకన్న, కిష¯ŒSయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ 71 డీబీఎం కాల్వకు నీటి విడుదల
అర్వపల్లి : ఎస్సారెస్పీ రెండో దశ పరిధిలోని 71 డీబీఎం కాల్వకు ఎట్టకేలకు అధికారులు నీటిని విడుదల చేశారు. సోమవారం రాత్రి నుంచి నీటిని వదిలారు. వరంగల్ జిల్లా బయ్యన్న వాగు నుంచి కొడకండ్లలోని అవుట్ ఫ్లో గేటు ద్వారా 69 డీబీఎంకు 500 క్యూసెక్కులు, 71 డీబీఎంకు 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 69 డీబీఎం ద్వారా నీళ్లు తుంగతుర్తి, నూతనకల్ మండలాలకు, 71 డీబీఎం ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి నీటిని ఇస్తున్నారు. 15 రోజుల పాటు ఈ కాల్వలకు నీటిని వదలాలని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, కాల్వలను ఈఈ సుధీర్, డీఈలు సునీల్, ప్రసాద్, సలీంబేగ్, ప్రవీణ్, ఏఈఈ హరికృష్ణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలి
తుంగతుర్తి ప్రతి నీటిబొట్టును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొత్తగూడెం, వెంపటి, రావులపల్లిలో ఎస్సారెస్పీ కాల్వలకు విడుదలయిన బయ్యన్న వాగు రిజర్వాయర్ జలాలను పరిశీలించి మాట్లాడారు. 2017 జూన్ వరకు అస్తవ్యస్తంగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వలను పూర్తి చేసి అన్ని గ్రామాల్లోని చెరువులకు నీటిని సరఫరా చేసే విధంగా కృషి చేస్తామన్నారు. రావులపల్లి చెరువులోకి వెళ్లే కాల్వ కోసం భూమి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి నీటిని అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండాయని, దీంతో రైతాంగం సంతోషంగా ఉన్నారని అన్నారు. కాని జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి, నూతనకల్ మండలాలు, సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్‌పహాడ్, మోతె, చివ్వెంల, కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలాల్లో వర్షాలు పూర్తి స్థాయిలో కురవక చెరువులు, కుంటలు నిండలేదని అన్నారు. ఎస్సారెస్పీ రెండవ దశ కాలువల ద్వారా 69,70,71 డీబీఎమ్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆయా మండలాల్లోని చెరువులు, కుంటలు నింపడానికి వరంగల్ జిల్లా బయ్యన్న వాగు నుంచి వృథాగా పోతున్న నీటిని ఎస్సారెస్పీ కాలువలకు సరిపడా నీటిని విడుదల చేయాలని అధికారులను కోరారు. సుమారు 1500 క్యూసెక్కులు విడుదల చేయాలని కోరితే అధికారులు 600 క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేయడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వృ«థాగా పోయే నీటిని చెరువులు నింపడానికి వదిలివేయమంటే ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు వాగు వద్ద గేట్లను పైకిఎత్తించారు. వాగు నుంచి అలుగు బంద్ అయ్యేంతవరకు గేట్లను దించవద్దని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, తహసీల్దార్లు జగన్నాథరావు, పులి సైదులు, ఎంపీడీఓ వెంకటాచారి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పాశం విజయ యాదవరెడ్డి, వైస్ చైర్మన్ గుజ్జ యుగేంధర్ రావు, టీఆర్ఎస్వీ జిల్లా అద్యక్షులు కే.శోభన్‌బాబు, జెడ్పీటీసీలు వరలక్ష్మి, నర్సింగ్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుడిపాటి సైదులు, రజాక్, దుగ్యాల రవీందర్ రావు, దాయం విక్రంరెడ్డి, కోడి శ్రీను, గుండగాని రాములు గౌడ్, వెంకటనారాయణ గౌడ్, తాటికొండ సీతయ్య, నల్లు రాంచంద్రారెడ్డి, బబ్బిసింగ్, గోపాల్ రెడ్డి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేత
-
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేత
నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ)కు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 4.50 లక్షల ఉండటంతో అధికారులు శనివారం ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేశారు. రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులకు చేరింది. కాగా ఇన్‌ఫ్లో 6 లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అంచనా. మూడేళ్ల తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. మరోవైపు అధికారులు దిగువ ప్రాంతాలను కూడా ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేశారు. -
నిండా మునించిన నిర్లక్ష్యం
మానాల వద్ద కాకతీయ కాల్వకు భారీ గండి 1500 ఎకరాల్లో నీట మునిగిన పంటలు మ్యాడంపల్లి ఎస్సీ కాలనీ జలమయం 300 కుటుంబాలు శిబిరానికి తరలింపు మూడేళ్ల క్రితం ఇదే డి–65 వద్ద గండి ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకున్న వైనం నిధులివ్వని సర్కారు.. పూర్తికాని కాల్వ లైనింగ్ పునర్మించడానికి 20–30 రోజులు పట్టే అవకాశం జగిత్యాల అగ్రికల్చర్/మల్యాల : గతకొద్ది రోజులుగా ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా ఎల్ఎండీకి నీటిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో మానాల సమీపంలోని డీ–65 డిస్ట్రిబ్యూటరీకి వద్ద కాల్వకు గండి పడింది. దీంతో మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో గల చెరువులు నిండి, గండ్లు పడటంతోపాటు సుమారు 1500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మల్యాల మండలం మ్యాడంపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు తక్కళ్లపల్లి శివారులో సహాయ శిబిరం ఏర్పాటు చేసి సుమారు 300 కుటుంబాలను అక్కడికి తరలించారు. పలుచోట్ల రోడ్లపై నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, అడిషనల్ జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక సహా ఎస్సారెస్పీ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. కాల్వలో వస్తున్న నీటిని ఎస్కేప్ రెగ్యులేటర్ల ద్వారా ఎగువ ప్రాంతంలోని చెరువులకు మళ్లిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వకు మల్యాల మండలం మానాల వద్ద భారీ గండి పడి, సాగు, తాగునీరు వృథా కావడమే కాకుండా నోటికాడికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. దీనికంతటికి ఎస్సారెస్పీ అధికారుల నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం కారణంగా కనపడుతోంది. మానాల గుట్టల కింద నుంచి సొరంగ మార్గం ద్వారా కాకతీయ కాల్వ వెళ్తోంది. గుట్టలు దాటిన తర్వాత లోతట్టు ప్రాంతం ఉండగా, దాని పక్కనే దమ్మక్క చెరువుంది. దీంతో ఇక్కడ కాకతీయ కాల్వ నిర్మించే సమయంలో కాల్వకు రెండు పక్కల మట్టి పోశారు. ఇక్కడే చెరువు నింపేందుకు, పొలాలకు సాగునీరు అందించేందుకు డి–65 డిస్ట్రిబ్యూటరీ నిర్మించారు. ప్రస్తుతం ఈ డిస్ట్రిబ్యూటరీ దగ్గరే గండి పడింది. నీటి ఒత్తిడి ఎక్కువైనప్పుడల్లా డిస్ట్రిబ్యూటరీ వద్ద లీకేజీ ఏర్పడుతోంది. నీరు విడుదల చేసినప్పుడల్లా ఏర్పడే చిన్న చిన్న లీకేజీలను ఎస్సారెస్పీ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇసుక బస్తాలతో మరమ్మతు ప్రస్తుతం కాలువకు గండిపడ్డ ప్రదేశంలో గతంలో పలుమార్లు లీకేజీలు ఏర్పడ్డాయి. ఇలా జరిగినప్పుడల్లా తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేయడం, చిన్నపాటి మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవడం పరిపాటైంది. సకాలంలో పూర్తిస్థాయి మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలం కావడంతో ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో మరమ్మతు పనుల కోసం దాదాపు రూ.25 లక్షలతో అంచనావేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, నిధులు మంజూరు కాలేదని సమాచారం. తాజాగా ఎస్సారెస్పీ నీటిని ఎల్ఎండీకి తరలించేందుకు కాల్వ సామర్థ్యానికి మించి నీటిని విడుదల చేశారు. దీనికితోడు కాలువకు ఉన్న అన్ని డిస్ట్రిబ్యూటరీ తూములను మూసివేశారు. కొంపల్లె చెరువు వద్ద ఉన్న సైఫన్ వద్ద ఉన్న మూడు గేట్లకు బదులుగా అధికారులు రెండు గేట్లు మాత్రమే తెరవడంతో నీటి కాల్వలో నీటిమట్టం పెరిగింది. దీంతో గతంలో గండిపడిన డీ–65 తూము వద్ద మరోసారి గండి పడింది. మూడేళ్ల క్రితం డీ–65 తూము వద్ద గండిపడగా, తాత్కాలిక చర్యల్లో భాగంగా ఇసుక సంచులతో గండిపూడ్చారు. శాశ్వత పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచినప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో టెండర్ రద్దు చేశారు. మరోవైపు కాకతీయ కాల్వ లైనింగ్‌పై పెరిగిన చెట్లతోపాటు పలుచోట్ల లైనింగ్ పగుళ్లు ఉన్నచోట్ల పెరిగిన చెట్లను కొట్టివేసి కాల్వలోనే పడేస్తుండటం కూడా ఒక కారణంగా కనపడుతోంది. నెలరోజుల క్రితం కొంపల్లె చెరువు సమీపంలోని సైఫన్ వద్ద కాలువలో కొట్టిపడేసిన చెట్లు వచ్చి గేట్లకు అడ్డుగా ఆగడంతో కాలువ మునిగేందుకు ఆరమీటర్ మాత్రమే మిగిలింది. స్థానికుల సమాచారం మేరకు జేసీబీ సాయంతో వాటిని తొలగించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఇక్కడ అత్యవసరంగా చేపట్టాల్సిన మరమ్మతు పనులను అటు ప్రభుత్వం, ఇటు ఎస్సారెస్పీ యంత్రాంగం విస్మరించింది. పూర్తి కాని లైనింగ్ ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ వరంగల్ జిల్లా వరకు 284 కిలోమీటర్లు పొడవుంది. కాల్వ ప్రారంభం నుంచి జగిత్యాల మండలం మోరపల్లి వద్దగల డి–53 (68 కి.మీ) వరకు సిమెంట్ లైనింగ్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. వేసవిలో 68–84 కి.మీ. వరకు లైనింగ్ చేపట్టారు. ప్రస్తుతం 84–146 కి.మీ.(కరీంనగర్ వరకు) లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మధ్యలోనే డి–65 (దాదాపు 90 కి.మీ) వద్ద మానాల వద్ద గండి పడింది. గత రెండేళ్లుగా నీటిని విడుదల చేయకపోవడంతో కాల్వ వెంబడి పిచ్చిమొక్కలు పెరిగాయి. వీటిని గమనించకుండా మామూలు లీకేజిగానే భావించడంతోనే భారీగా గండి పడింది. కాలువ పరిస్థితి అంతంతే.. కాకతీయ కాల్వ గరిష్ట సామర్థ్యం 9750 క్యూసెక్కులు. కాల్వ వెడల్పు 37.796 మీటర్లుంది. కాల్వ బలహీనంగా మారడంతో 4–6 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతుంటారు. గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని వదిలితే కాల్వకు పలుచోట్ల మానాల మాదిరిగా గండ్లు పడే అవకాశం ఉంది. కాల్వ వెంబడి నిర్మించిన సైఫన్లు, అక్విడేట్లు, యూటీలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా యూటీలలో (కింది నుంచి వర్షం నీరు పోవడం, పై నుంచి కాలువ పోవడం) ఇసుక మేటలు వేసి వర్షం వెళ్లేందుకు అడ్డంకిగా మారింది. కాకతీయ కాల్వ వెంబడి దాదాపు 20 వరకు యూటీలు ఉన్నప్పటికీ మరమ్మతులకు నోచుకోవడం లేదు. మరమ్మతులు పూర్తయితేనే పంటలకు నీళ్లు మానాల వద్ద కాల్వ గండి పూడ్చివేత పనులు పూర్తయితేనే తిరిగి పంటలకు సాగునీరు అందించే అవకాశముంది. ప్రస్తుతం గండి పడిన చోట మరమ్మతులు పూర్తి కావాలంటే కనీసం 20–30 రోజులు పట్టే అవకాశం ఉంది. గండి పడినచోట భూమి లెవల్లో కాల్వ ఉండదు కాబట్టి కొత్తగా సిమెంట్‌తో నిర్మించాల్సి ఉంటుంది. -
ఎస్సారెస్పీ ఉద్యోగి దుర్మరణం
హస¯ŒSపర్తి : హన్మకొండ – కరీంనగర్ ప్రధాన రహదారిలోని హస¯ŒSపర్తి పాత సినిమా టాకీస్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సారెస్పీ ఉద్యోగి మృతి చెందాడు. ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కార్యాలయం–1లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న తుమ్మ సురేష్(44) వరంగల్‌లో నివాసం ఉంటున్నాడు. అతను శనివారం సాయంత్రం హస¯ŒSపర్తిలో స్నేహితుడిని పరామర్శించడానికి వచ్చాడు. తిరిగు ప్రమాణంలో హన్మకొండ వైపు వెళ్తున్న క్రమంలో హస¯ŒSపర్తి పాత సినిమా టాకీస్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటన జరిగిన ప్రదేశం పూర్తిగా చీకటిని కమ్ముని ఉండడం వల్లే లారీ కనిపించక ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన వివరాలను మృతుడి తండ్రి తెలిపారు. -
దేవాదుల, ఎస్సారెస్పీపై దృష్టి
భూ సేకరణపై అధికారులతో నేడు మంత్రి హరీశ్‌రావు సమీక్ష వరంగల్: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–1, స్టేజ్–2తో పాటు దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంపై నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు దృష్టి సారిం చారు. ఈ రెండు ప్రాజెక్టులపై సంబ«ంధిత శాఖ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో జరిగే సమావేశంలో సమీక్షిస్తారని తెలిసింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో వ్యయం పెరిగిపోతోంది. ఇప్పటికే పలు దఫాలుగా వీడియో కాన్ఫరె¯Œ్సలో మంత్రి జిల్లా భూసేకరణ అధికారులైన జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవ¯ŒSపాటిల్ తదితరులతో సమీక్షించినా ప్రగతి కనిపిం చడం లేదు. ఏఐబీపీ పథకంలో దేవాదుల నిర్మాణానికి చేసే వ్యయంలో 25 శాతం కేంద్రం నిధులను అందించనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రస్తుత అర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా కేంద్రం రూ.112 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది వరకు ఈ పథకం పూర్తి చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినందున పనులు వేగవంతం చేయాల్సి ఉంది. అందుకోసం ఈ ఏడాది 10 వేల ఎకరాల భూమి సేకరించాలని జిల్లా అధికారులకు లక్ష్యంగా పెట్టారు. ఇందులో ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన 3వేల ఎకరాల భూమి జూ¯ŒSలోగా సేకరించాలని అధికారులను అదేశించారు. అయితే ఆ మేరకు పనులు జరుగకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవాదుల ఫేజ్–3 పనులను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్–3లో టన్నెల్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో ప్రస్తుతం చేపట్టే పనులను కొత్త ఏజెన్సీకి అప్పగించాలని భావిస్తోంది. ఈ పనులవల్ల నష్టపోయినందున ప్రస్తుతం చేపట్టే పనులను అప్పగిస్తే ఇప్పటి వరకు పొందిన బిల్లుల మొత్తాన్ని రానున్న బిల్లుల్లో మినహాయించుకుంటామని సదరు ఏజెన్సీ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం దష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఎస్సారెస్పీ భూసేకరణతో పాటు దేవాదుల ఫేజ్–3 పనులను ప్రారంభించే విషయాన్ని మంత్రి హరీశ్‌రావు అధికారులతో చర్చిస్తారని తెలిసింది. -
పాత చీరలకు కొత్త గిరాకీ
బాల్కొండ : రైతులు తమ పంటలను అడవి పందులు, కోతులు, ఉడుతల బారి నుంచి కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు పాత చీరలను కొనుగోలు చేసి పంటల చుట్టూ కడుతున్నారు. దీంతో పాత చీరలకు కొత్త గిరాకీ ఏర్పడుతోంది. ఆదివారం ఎస్సారెస్పీ కాలనీలో నిర్వహించే సంతలోకి ఆదిలాబాద్ జిల్లా రైతులు తరలి వచ్చి పాత చీరలను కొనుగోలు చేశారు. ఒక్కో చీర రూ. 15 పలికింది. కొందరు రైతులు 100 కుపైగా చీరలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పంటల రక్షణకు పాత చీరలు ఉపయోగపడుతున్నాయని రైతులు పేర్కొన్నారు. ప్రధానంగా మక్క పంటను అడవి పందులనుంచి కాపాడుకోవడానికి చీరలు ఉపయోగ పడుతున్నాయని, చీరల రంగును చూసి అవి బెదిరి పోతున్నాయని పేర్కొంటున్నారు. -
వరద కాలువకు తగ్గిన నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నుంచి ఆయకట్టు కోసం కాలువల ద్వార నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎండీకి వరద కాలువ ద్వార సరఫరా అవుతున్న నీటిని 6,076 క్యూసెక్కుల నుంచి 5,500 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వార 6,125 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వార 50 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వార 488 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి వరద నీరు నిలిచి పోయింది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగ తగ్గుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1076.00(42.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. కాకతీయ కాలువ ద్వార నీటి విడుదల కొనసాగుతుండటంతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు టర్బయిన్ల ద్వార 18 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్కో అధికారులు తెలిపారు. -
ఎస్సారెస్పీ కెనాల్‌కు అడ్డుగోడ?
సింగరేణి..ఎస్సారెస్పీ అధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుతో కుంగిన కాలువ నీటి ప్రవాహంతో ప్రమాదమని భావిస్తున్న సింగరేణి ఎల్–6 పరిధిలోని 12 వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం మంథని(కరీంనగర్) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎల్–6 కెనాల్‌కు అడ్డుగోడ నిర్మించేందుకు సింగరేణి, ఎస్సారెస్పీ అధికారులు పరస్పరం ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే విషయం బయటకు పొక్కితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని సింగరేణి అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారి వెంట ముత్తారం మండలం రాజాపూర్ నుంచి మంథని మండలంలోకి ఎల్–6 కెనాల్ ప్రవేశిస్తుంది. ఈ కెనాల్ ద్వారా 10 గ్రామాల్లోని సుమారు 12 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. కాలువకు సమీపంలోనే అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు ఉంది. సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా రూ.1250 కోట్లతో ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టుకు సమీపం నుంచే కాలువ ఉండడం ప్రమాదమని గుర్తించిన సింగరేణి ప్రత్యామ్నాయంగా కాలువను మళ్లించేందుకు సిద్ధమై ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే వదిలివేసింది. ఐతే అడ్రియాల గ్రామ శివారులోని పెద్ద మోరీ నుంచి సుమారు 1.5 కిటోమీటర్ మేర కాలువ కుంగిపోవడంతో నీరు ముందు సాగడంలేదు. కాలువకు నీరు వదిలితే ముందున్న పంటలకు నీరు పారే పరిస్థితి లేదు. నీరంతా అడ్రియాల సమీపంలోని కల్వర్టు వద్ద వృథాగా పోతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో లోతుగా బొగ్గును వెలికితీయడంతో కాలువ కుంగిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువ ద్వారా నీరు పారితే ప్రాజెక్టులోకి నీటి ఊట వచ్చి ప్రమాదముందని సింగరేణి సైతం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎల్–6 కెనాల్ ప్రారంభంలోనే అడ్డుగోడ నిర్మించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సీజన్లో కాలువ కింద పంట పొలాలకు క్రాప్ హలీడే ప్రకటించి కొంతమేర నష్టపరిహారం చెల్లించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
ఎస్సారెస్పీకాలువకు గండి
కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలం నగునూరుశివారులో డి–89 ఎస్సారెస్పీ కాలువకు కొందరు రైతులు గండికొట్టడం వివాదస్పదంగా మారింది. గ్రామ సమీపంలోని కాలువకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన రైతులు గురువారం తెల్లవారు జామున గండికొట్టారు. కాలువ వద్దే రైతులు పెద్దసంఖ్యలో మోహరించి చెరువుకు నీటిని తరలించడంతో చివరి ఆయకట్టు గ్రామాలకు నీళ్లందని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులకు అక్రమ నీటితరలింపుపై ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. -
ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల
6 లక్షల ఎకరాల సాగుకు నీరు 18 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాల్వల ద్వారా ఆయకట్టుకు గురువారం నీటి విడుదలను ప్రారంభించారు. ఇది వరకే చెరువులు నింపేందుకు ప్రాజెక్ట్ అన్ని కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కానీ గురువారం నుంచి ఉప కాల్వల ద్వారా కూడా నీటి విడుదలను ప్రారంభించారు. వారబంధీ ప్రకారం ప్రాజెక్ట్ నుంచి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని ఎస్ఈ సత్యనారాయణ తెలిపారు. 8 రోజులు కాల్వల ద్వారా నీటి విడుదల చేస్తూ వారం రోజులు నిలిపివేత ఉంటుందన్నారు. ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకతీయ కాలువ ద్వారా 6,125 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 6,076 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 5,215 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో స్థానిక జల విద్యుతుత్పత్తి కేంద్రంలో మూడు టర్బయిన్ల ద్వారా 18 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్కో అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు (90 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1076.60 అడుగుల(43.70 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని చెప్పారు. -
కొత్తపల్లి రిజర్వాయర్‌కు ఎస్సారెస్పీ నీరు
కరీంనగర్ రూరల్: కొత్తపల్లి రిజర్వాయర్‌లోకి కాకతీయకాలువ ద్వారా ఎస్సారెస్పీనీటిని విడుదల చేయడంతో గ్రామస్తుల చిరకాల వాంఛ నెరవేరిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం కొత్తపల్లి రిజర్వాయర్‌లోకి రూ.60 లక్షలతో నిర్మించిన పైపులైన్ షట్టర్గేట్వాల్వ్ను విప్పి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారు. సంప్‌హౌస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఫిల్టర్‌బెడ్స్‌ను పరిశీలించారు. నీటిని శుద్ధి చేసేందుకు నాణ్యమైన ఇసుకను ఉపయోగించాలని సూచించారు. ముందుగా ఎల్ఎండీ నింపిన తర్వాతే సాగుకు నీరు వదులుతామన్నారు. అనంతరం రేకుర్తిలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామిగుట్టపైకి చేపట్టిన రోడ్డునిర్మాణపు పనులను పరిశీలించారు. ఎంపీపీ వాసాల రమేశ్, జెడ్పీటీసీ సభ్యులు ఎడ్ల శ్రీనివాస్, జమిలొద్దీన్, సర్పంచ్ వాసాల అంబికాదేవి, ఉపసర్పంచ్ కనకారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శంకరమ్మ, ఉప్పు శ్రీనివాస్, తహసీల్దార్ జయచంద్రారెడ్డి, ఎంపీడీవో దేవేందర్‌రాజు, టీఆర్ఎస్ నాయకులు బండ గోపాల్‌రెడ్డి, స్వర్గం నర్సయ్య, దూస మునీందర్, ఫకద్దీన్, పిట్టల రవీందర్, గడ్డం శ్రీరాములు, నందెల్లి మహిపాల్ పాల్గొన్నారు. -
మినీ హైడల్ విద్యుత్ ఉత్పత్తి
పెద్దపల్లి : జలవిద్యుత్ కేంద్రాలు మూడేళ్ల తరువాత ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. ఎస్సారెస్పీలో నీళ్లు లేక మూడేళ్లు మూతపడిన మినీ హైడల్ కేంద్రాల్లో మరో మూడు రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. 25 క్రితం పెద్దపల్లి డివిజన్లో కమ్మరిఖాన్‌పేట, కుమ్మరికుంట, కాచాపూర్, చందపల్లి వరకు 10 చోట్ల ఏర్పాటు చేసిన జలవిద్యుత్ కేంద్రాలు గంటకు 9.16 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ 10 కేంద్రాలలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను సుగ్లాంపల్లి స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి ఇతర సబ్స్టేషన్లకు మళ్లిస్తున్నారు. ఎస్సారెస్పీ కాలువల తవ్వకం పూర్తిఅయిన తరువాత పెద్దపల్లి డివిజన్‌లోనే మినీ జల విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరుసగా 2004 వరకు ఏటా వర్షాకాలంలో నాలుగు నెలలు విద్యుత్ ఉత్పత్తి కొనసాగేది. 2004 తర్వాత వర్షాభావ పరిస్థితులతో ఎస్సారెస్పీలో నీటి మట్టం తగ్గిపోవడంతో అప్పుడప్పుడు ఆరుతడి పంటల కోసం నీరు విడుదల చేశారు. కొద్దిపాటి నీటితో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో ఉత్పత్తి సాగలేదు. ఈసారి ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటిమట్టం ఆశాజనకంగా ఉండడంతో కాలువలకు నీటిని విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పెద్దపల్లి ప్రాంతంలోని డి86, డి83 కాలువలకు నీరు చేరనుంది. దీనికోసం జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగులను విద్యుత్ కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ ప్రాంతంలోని మినీ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో రైతులకు మరింత మెరుగైన కరెంటు ఇవ్వొచ్చని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. జలవిద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ పెద్దపల్లి పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలకు 24 గంటలకు సరిపడే విద్యుత్‌కు సమానం. -
నేడు ఎల్ఎండీకి ఎస్సారెస్పీ నీరు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి 15టీఎంసీలు దాటితేనే ఎల్ఎండీ దిగువకు నీరు ఎస్సారెస్పీ సీఈ శంకర్ తిమ్మాపూర్: ఎస్సారెస్పీ నుంచి విడుదల చేసిన నీరు ఎల్ఎండీకి శుక్రవారం చేరుతాయని ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ శంకర్ తెలిపారు. ఎల్ఎండీలోని ఏసీఈ ఆఫీసులో గురువారం విలేకరులతో మాట్లాడారు. 90 టీఎంసీల సామర్థ్యం గల ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 13,086 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 46.45టీఎంసీ(1077.70అడుగులు)ల నీరు ఉందని తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు 4500 క్యూసెక్కులు, వరద కాలువకు 6075 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. వర్షాలు పడుతున్నప్పుడు, నీటివిడుదల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసిన నీరు గురువారం మధ్యాహ్నం 45 కిలోమీటర్లు(కోరుట్ల) వరకు వచ్చాయని పేర్కొన్నారు. ఎల్ఎండీకి శుక్రవారం ఉదయం వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు. పోచంపాడ్ వద్ద రెండింటి ద్వారా ప్రస్తుతం 8యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ నెల 10తేదీ తరువాత రైతులు కోరితే ఎల్ఎండీ ఎగువ ప్రాంత ఆయకట్టుకు ఎనిమిది రోజులు ఆన్, ఏడు రోజులు ఆఫ్ పద్ధతిన ఎస్సారెస్పీ నుంచి నీటిని ఇస్తామని తెలిపారు. వీటికి సంబంధించి ఖరీఫ్ ప్రణాళికలను ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో పెరిగితే గరిష్టంగా కాకతీయ కాలువ ద్వారా 7వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులు ఇచ్చే అవకాశం ఉందని, అయితే శభాష్పల్లె బ్రిడ్జి కారణంగా వరదకాలువకు 10వేల వరకే వదులుతామని పేర్కొన్నారు. సారంగపూర్ మండలం రోళ్లవాగు కింద 15వేల ఎకరాల ఆయకట్టు ఉందని, ఇక్కడ తాగునీటికి ఇబ్బంది ఉండడంతో రోళ్లవాగుకు నీళ్లు ఇస్తామన్నారు.ప్రస్తుతం 2.50టీఎంసీలున్న ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి 15టీఎంసీల నీరు చేరుకోగానే ప్రభుత్వ నిర్ణయం మేరకు దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉండొచ్చని చెప్పారు. ఎస్సారెస్పీ పరిధిలో 2లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యముండగా.. ఇప్పటి వరకు 1.10లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. -
ఎస్సారెస్పీ భూముల పరిశీలన
ఇబ్రహీంపట్నం : మండల కేంద్రం శివారులో కాకతీయ కాలువకు ఇరువైపులా ఉన్న ఎస్సారెస్పీకి చెందిన భూములను గురువారం అధికారులు పరిశీలించారు. హరితహరంలో మొక్కలు నాటేందుకు అణువుగా ఉందోలేదో పరిశీలన జరిపారు. కాకతీయ కాలువనుంచి ఇరువైపులా 180 మీటర్ల వరకు ప్రభుత్వ స్థలమేనని కొందరు రైతులు కబ్జా చేసి పంటలను పండించుకున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. త్వరలో స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో శశికుమార్, వైస్ ఎంపీపీ గూడ పాపన్న, సర్పంచ్ నేమూరి లత, కార్యదర్శి రాజేందర్రావు, లస్కర్లు లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, నాయకులు నేమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాస్కెట్ బాల్ విజేత ఎస్సార్పీ జట్టు
రన్నరప్‌గా కొత్తగూడెం, కార్పొరేట్ జట్టు ముగిసిన కంపెనీ స్థాయి పోటీలు రెబ్బెన(ఆదిలాబాద్) : బెల్లంపల్లి ఏరియా పరిధి గోలేటి టౌన్‌షిప్‌లోని శ్రీ భీమన్న స్టేడియంలో జరిగిన సింగరేణి కంపెనీ స్థాయి బాస్కెల్ బాల్ పోటీల్లో శ్రీరాంపూర్ జట్టు విజయం సాధించింది. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల నుంచి ఆరు జట్లు పాల్గొన్నాయి. పోటీలు మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు కొనసాగాల్సి ఉండగా వర్షం కారణంగా మంగళవారం రాత్రే పూర్తి చేశారు. పూల్–ఏ, పూల్–బీ విభాగాల్లో పోటీలు కొనసాగగా ఫైనల్లో కొత్తగూడెం, కార్పొరేట్ జట్టు, శ్రీరాంపూర్(ఎస్సార్పీ) జట్టు తలపడ్డా యి. కొత్తగూడెం జట్టు 15 పాయింట్లు సాధించగా శ్రీరాంపూర్ జట్టు 16 పాయింట్లు సాధించి ఒక పాయింట్ తేడాతో విజయం సాధించింది. విన్నర్, రన్నర్ జట్లకు ఏరియా జనరల్ మేనేజర్ కె.రవిశంకర్, ఎస్వోటూ జీఎం కొండయ్య బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి రాజేశ్వర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యద ర్శి ఎస్.తిరుపతి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ, క్రీడాకారులు కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
నీటి విడుదల
ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీలోకి.. విడుదల చేసిన మంత్రులు ఈటల, పోచారం కాకతీయ, వరద కాల్వల ద్వారా 8,200 క్యూసెక్కులు ఎల్ఎండీలో 25 టీఎంసీల నీరు లక్ష్యంగా విడుదల వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 47 టీఎంసీలకు చేరిన నీరు త్వరలోనే ఎస్సారెస్పీకి 50 టీఎంసీల నీరు : మంత్రి ఈటల మల్లన్నసాగర్‌కు ప్రజలే అండ.. ఆరు గ్రామాల ప్రజలకు పాదాభివందనం : మంత్రి పోచారం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాం(ఎల్ఎండీ)కు బుధవారం రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ ద్వారా 2,200 క్యూస్కెకులు, వరద కాలువ ద్వారా మరో 6,000 క్యూస్కెల నీటిని ఎల్ఎండీకి విడుదల చేశారు. గురువారం వరదకాల్వ నుంచి అదే 6,000 క్యూసెక్కుల నీరు వెళ్లనుండగా, కాకతీయ కాల్వ నుంచి మాత్రం 4,400 క్యూసెక్కులు పెరగనుందని అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో మంగళవారం 46 టీఎంసీలకు చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం, నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు సూచన మేరకు నీటిని విడుదల చేసినట్లు మంత్రులు ప్రకటించారు. ఎల్ఎండీలో 25 టీఎంసీల నీరు చేరితే.. అక్కడి నుంచి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగు నీటిని సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ నీటి విడుదల అనంతరం మంత్రులు ‘మీడియా’తో మాట్లాడారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపైన ఉన్న మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీరు చేరినందున అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ఇప్పటికి ప్రాజెక్టులో 50 టీఎంసీల నీరు చేరుకున్నదని మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్లు వివరించారు. ఇంకా వస్తున్న ఇన్‌ఫ్లో వల్ల ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశం ఉన్నదని ఆశిస్తున్నామని, తద్వారా ఎల్ఎండీ ప్రాజెక్టులోకి 25 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉందన్నారు. ఈ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చే నీటి వల్ల వరంగల్, కరీంనగర్‌తోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా సాగునీరు లభిస్తుందన్నారు. నిజమాబాద్ జిల్లా దేశానికే ఆదర్షం : ఈటల పంటలు పండించడంలో నిజమాబాద్ జిల్లా దేశానికే ఆదర్శమని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం బాల్కొండ మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.. జిల్లాలో అంకాపూర్, అంక్సాపూర్ వంటి గ్రామాల్లో పసుపు, ఇతర పంటలు పండించడంతో జిల్లా దేశానికే ఆదర్శమైందన్నారు. తెలంగాణాలోని ప్రతి గ్రామం అంకాపూర్ల సాగులో ముందుండాలనే మల్లన్న సాగర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ప్రతి ఎకరానికి నీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ప్రతి పక్షాలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మల్లన్న సాగర్‌కు అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం చూస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిజమాబాద్ జిల్లా మొదటి నుంచి అండగా నిలిచిందన్నారు. అందుకే జిల్లాలో 9 మంది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయుటకు కృషి చేస్తానన్నారు. మల్లన్నసాగర్‌కు ప్రజలే అండ : పోచారం మల్లన్న సాగర్‌ను అడ్డుకుంటే కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండాలంటే ఆగస్టు వరకు ఆగాల్సి వచ్చిందంటే గోదావరి ఎగువ ప్రాంతంలో అనేక ప్రాజెక్ట్‌లు నిర్మించడం వల్లనే అన్నారు. అలా కాకుండా రైతులకు సకాలంలో నీరందించాలనే శాశ్వత పరిష్కారం కోసం మల్లన్న సాగర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నుంచి జూన్–జూలై చివరి వరకు 1000 టీఎంసీల నీరు సముద్రం పాలైందన్నారు. అలా వృథా కాకుండా నీటిని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి మల్లన్న సాగర్‌కు మళ్లించుటకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో ముంపునకు గురవుతన్న ఆరు గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని ప్రకటించారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ఎస్సారెస్పీ నింపుతామన్నారు. ఈ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి, కోరుట్ల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం అ«ధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ సీఈ శంకర్, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ రామారావు, ఆర్డీవో యాదిరెడ్డి, జెన్కో డైరెక్టర్ వెంకటరత్నం, సీఈ మురళీధర్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముత్యాల లక్ష్మారెడ్డి, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు ఎడవల్లి కొండాల్ రెడ్డి, రమేష్‌యాదవ్, ఎంపీపీ అర్గుల్ రాధా, వైస్ ఎంపీపీ శేఖర్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు సామవెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ముస్కు భూమేశ్వర్, యూత్ అధ్యక్షుడు ఆకుల రాజారెడ్డి పాల్గొన్నారు. ఎల్ఎండీలో 2.4 టీఎంసీల నీరు.. అందుకే నీటి విడుదల : ఎస్సారెస్పీ ఏసీఈ శంకర్ ఎస్సారెస్పీ నుంచి బుధవారం కాకతీయ, వరద కాలువల ద్వారా మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా క్రమంగా నీటి విడుదలను పెంచుతామని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ శంకర్ తెలిపారు. ఎల్ఎండీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ భాగన ఉన్న ప్రధాన ప్రాజెక్ట్‌లు విష్ణుపురి, బాబ్లీ ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారన్నారు. గైక్వాడ్ ప్రాజెక్ట్ కూడ 75 శాతం నిండిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో ఉన్న నీటితో ఎస్సారెస్పీ మొదటి దశలో 9.68 లక్షల ఎకరాలకు సాగు నీరందించుటకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మీ లిప్ట్ వద్ద పనులు చేపట్టడానికి వీలు లేకుండా నీరు వచ్చి చేరడం వల్ల అనుకున్న సమయంలో లిఫ్ట్ పనులు పూర్తి చేయలేక పోయామన్నారు. రెండు మోటర్లు సిద్ధమయ్యయయన్నారు. ఆ రెండు మోటర్ల ద్వారా నీటిని సరఫరా చేసి లక్ష్మీ కాలువ ఆయకట్టు రైతుల ప్రయోజనాలు కాపాడుతామని తెలిపారు. కాగా, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 25 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1077.60(46.20 టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్ దిగువ భాగన ఉన్న జల విద్యుతుత్పత్తి కేంద్రంలో ఒక్క టర్బయిన్ ద్వార విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఒక్క టర్బయిన్ ద్వారా 9 మెగావాట్ల విద్యుతుత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా నుంచి కదలివచ్చిన నేతలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ వెంట కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు తరలి వచ్చారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి, కోరుట్ల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు ఎడవల్లి కొండాల్ రెడ్డి, రమేష్‌లు, కన్నూరు సంపత్‌రావు, పొనగండి మల్లయ్య, యేబూసి రామస్వామి, టి.రాజేశ్వర్‌రావు, చెల్పూరు ప్రభాకర్‌లతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు ఎస్సారెస్పీ నీటి విడుదల సందర్భంగా మంత్రి వెంట పోచంపాడుకు వచ్చారు. -
చివరి ఆయకట్టుకు నీరందేనా!
మరమ్మతులు లేని కాల్వలు రైతుల్లో ఆందోళన పెగడపల్లి: మండలంలోని ఎస్సారెస్పీ కాల్వలు ఏళ్లతరబడిగా మరమ్మతులకు నోచుకోవడంలేదు. కాల్వల్లో చెట్లపొదలు పెరిగి చిట్టడివిని తలపిస్తున్నాయి. పలుచోట్ల డ్రాపులు కూలాయి. ఎస్సారెస్సీ కాలువలకు నీటీని విడుదల చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఒక పక్కహర్షం వ్యక్తం అవుతుండగా, మరోపక్క కాల్వల్లో నిండిన పూడికమట్టి, పెరిగినచెట్లతో చివరి ఆయకట్టుకు నీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకతీయ ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్నా డి–83ఏ కాలువ ద్వారా ఉపకాలువలకు నీరు సరఫరా కానుంది. ఈ కాలువల ద్వారా సుమారు పదివేల ఎకరాలకు నీరందించే ఆయకట్టు ఉంది. అయితే రెండేళ్లుగా ఎస్సారెస్సీ నీటివిడుదల కాకాపోవడంతో వ్యవసాయ బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయి భూములన్నీ పడావులుగా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీ నీటీవిడుదల పై రైతులు ఆశలు పెంచుకున్నారు. వర్షాలు కురువక పోతాయా? ఎస్సారెస్సీ నీరురాకపోతుందా అన్న దీమాతో మండల రైతాంగం వరి సాగుకు నార్లుపోసి సిద్ధంగా ఉంచారు. వీటిద్వారా తమ పంట పొలాలకు నీరు పారించుకుందామనుకుంటున్న సమయంలో కాలువలు సక్రమంగా లేక నీరు అందే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని డి–83ఏ ప్రాధాన కాలువ కింద 74, 75, 76, 77, 78, 79, 80, 81 డిస్ట్రిబ్యూటరీ కాలువలున్నాయి. డి76, 77 కాలువల కింద 1ఎల్, 2ఆర్, 3ఎల్, 4ఆర్ ఉపకాలువలున్నాయి. వీటి ద్వారా పెగడపల్లి, మద్దులపల్లి, బతికపల్లి, ఏల్లాపూర్, నంచర్ల, ల్యాగలమర్రి తదితర గ్రామాలకు ప్రదాన డిస్ట్రిబ్యూటరీ కాలువలుండగా, మిగతా గ్రామాల పంట పొలాలకు నీరు అందేవిధంగా ఉపకాల్వలు నిర్మించారు. ప్రస్తుత పరిస్థితిలో కాలువలు మరమ్మతులు లేక అధ్వానంగా తయారయ్యాయని మద్దులపల్లి, ఏడుమోటలపల్లి గ్రామాలకు చెందిన మ్యాక తిరుపతిరెడ్డి, సాయిని రవి తెలిపారు. నీటిæవిడుదలకు ముందుగా కాలువలు మరమ్మతు చేసినట్లయితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. -
ఎల్ఎండీకి ఎస్సారెస్పీ నీళ్లు
రేపటినుంచి కాకతీయ కాల్వ ద్వారా విడుదల ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో ఆనందం సాక్షి ప్రతినిధి, కరీంనగర్/జగిత్యాల అగ్రికల్చర్ : గత రెండేళ్లుగా డెడ్‌స్టోరేజీ నీటి నిల్వతో కళావిహీనంగా మారిన దిగువ మానేరు జలాశయానికి (ఎల్ఎండీ) జలకళ రానుంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని కాకతీయ కాలువ ద్వారా ఎల్ఎండీకి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా బుధవారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఎల్ఎండీకి నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ కింద దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జిల్లా రైతాంగంలో ఆశలు రేకెత్తించింది. సోమవారం మంత్రి ఈటల రాజేందర్ ఎస్సారెస్పీ నీటి విడుదలపై నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో చర్చించారు. ఎస్సారెస్పీ సామర్థ్యం 90టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 43 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సీఈ శంకర్ తెలిపారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు నేరుగా ఎస్సారెస్పీలో నిండుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది. గత రెండేళ్లుగా వర్షాల్లేక 5టీఎంసీల డెడ్‌స్టోరేజీకి వెళ్లిన ఎస్సారెస్పీ నీటిమట్టం 43 టీఎంసీలకు చేరడంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దీనికితోడు ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రాజెక్టులో నీటిమట్టం 40 టీఎంసీలకు చేరితే పంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రకటించారు. ఆశించిన నీరు రావడంతో ఇచ్చిన హామీ మేరకు నీటిని విడుదల చేయనున్నారు. వరదకాల్వ ద్వారా కాకుండా.. కాకతీయ కాలువ ద్వారా ఎల్ఎండీకి నీటిని విడుదల చేసి మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లోని చెరువులను నింపాలని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డిసహా ఆ ప్రాంత రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. అందరి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కాకతీయ కాలువ ద్వారానే ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీకి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే పొలాలకు, ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయమై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రాజెక్టు సీఈ శంకర్ తెలిపారు. మరో 2కోట్ల మొక్కలు నాటాలి హరితహారంలో భాగంగా ఈనెలలో మరో 2కోట్ల మొక్కలు నాటాలని మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ ఏడాది 4 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు 2.09 కోట్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో మిగిలిన 2కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్క అధికారి హరితహారంలో పాల్గొనాలని కోరారు. హరితహారంలో ప్రస్తుతం జిల్లా మూడో స్థానంలో ఉండగా, లక్ష్యం చేరుకుని రాష్ట్రంలోనే మెుదటి స్థానంలో నిలపాలన్నారు. -
అంత్య పుష్కరాలు ఆరంభం
జిల్లాలో ఆదివారం గోదావరి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం, మోర్తాడ్ మండలం తడపాకల్, బాల్కొండ మండలం సావెల్, నందిపేట మండలం ఉమ్మెడ ఘాట్ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదానం నిర్వహించారు. మొదటి రోజు భక్తులు స్వల్పంగానే కనిపించారు. నందిపేట : ఉమ్మెడ గ్రామ శివారులోని గోదావరి నదిలో అంత్య పుష్కరాలను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ప్రారంభించారు. గోదావరికి హారతి ఇచ్చారు. సమీపంలో ఉన్న ఉమా మహేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఆగస్టు 11వ తేదీ వరకు అంత్య పుష్కరాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అంత్యపుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడం, ఎలాంటి ప్రచారం నిర్వహించకపోవడంతో భక్తుల రద్దీ అంతంతగానే ఉంది. కార్యక్రమంలో సర్పంచ్ పోశెట్టి, దేవదాయ శాఖ బోధన్ ఈవో వేణు, ఆలయ ఇన్చార్జి ఈవో సుదర్శన్, నాయకులు సాయరెడ్డి, సాగర్, రాజేందర్, మురళి తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో పుష్కర ఘాట్ల వద్ద అంత్య పుష్కరాలను ప్రారంభించారు. వేదపండితులు పుష్కరుడికి ఎస్సారెస్పీ కోదండ రామాలయం నుంచి ఆహ్వనం పలికారు. ఆది పుష్కరాలకు ఉన్న ప్రాధాన్యతే గోదావరి అంత్య పుష్కరాలకు ఉంటుందని వేద పండితులు తెలిపారు. భక్తులు గోదావరిలో పుష్కర స్నానాలు చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానం నిర్వహించారు. పూజాదుల్లో సర్పంచ్ శ్రీవాణి రమేశ్, దేవాదాయ శాఖ ఈవో గంగాధర్, రామాలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సావెల్ పుష్కర ఘాట్ వద్ద.. సావెల్ పుష్కర ఘాట్ల వద్ద అంత్య పుష్కరాలను సర్పంచ్ వెంకటేశ్, ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు. భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తడపాకల్‌లో.. మోర్తాడ్ : తడపాకల్‌లో సర్పంచ్ లావణ్య అంత్య పుష్కరాలను ప్రారంభించారు. పుష్కర స్నానాలు ఆచరించడానికి స్థానిక భక్తులతో పాటు కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్లలనుంచి భక్తులు తరలివచ్చారు. సర్కారు ఆధ్వర్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. రెంజల్ : కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో గోదావరి అంత్య పుష్కరాలు బోధన్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెంజల్ ఆరోగ్య కేంద్రం సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, గోదావరిలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. వీఆర్వోలతో పాటు వీఆర్ఏలను అప్రమత్తం చేశామని, ఇద్దరు కానిస్టేబుళ్లు భద్రత విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. గోదావరి నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున భక్తులు ఘాట్లపైనే స్నానాలాచరించాలని సూచించారు. అంత్య పుష్కరాలకు అంతంతే.. ఆది పుష్కరాలకు ఘనమైన ఏర్పాట్లు చేసిన సర్కారు.. అంత్య పుష్కరాలను ఏమాత్రం పట్టించుకోలేదు. సరైన ప్రచారం చేయకపోవడంతోపాటు పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలూ కల్పించలేదు. దీంతో పుష్కర ఘాట్ల వద్ద రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం కావడంతో హైదరాబాద్, కామారెడ్డి, అదిలాబాద్లతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పలువురు భక్తులు తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. నిరాశ కలిగింది.. గతేడాది ఆది పుష్కరాలకు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి వెళ్లాం. త్రివేణి సంగమస్థలి, గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాంతం కావడంతో ఈసారి కందకుర్తికి వచ్చాం. కానీ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో నిరాశ చెందాం. అధికారులు భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. – సువర్ణ, హైదరాబాద్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది ఆది పుష్కరాల సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. అప్పుడు పుష్కర స్నానం చేయలేకపోయాను. అంత్య పుష్కరాల్లో పాల్గొందామని కందకుర్తికి వచ్చాను. కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రభుత్వం గోదావరి నది అంత్య పుష్కరాలను చిన్నచూపు చూస్తోంది. ఇది సరికాదు. పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి. – శేర్ల రాములు, కామారెడ్డి వసతులు కల్పించాలి గోదావరి ఆది పుష్కరాలను ఘనంగా నిర్వహించారు. అంత్య పుష్కరాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది సరికాదు. అంత్య పుష్కరాలకూ సరైన ఏర్పాట్లు చేయాలి. పుష్కర స్నానాల నిమిత్తం వచ్చే వారికి అన్ని వసతులు కల్పించాలి. టాయిలెట్లు, బట్టలు మార్చుకునే గదులను తెరిపించాలి. – రమేశ్‌రెడ్డి, నిజామాబాద్ -
ఆశాజనకంగా ఎస్సారెస్పీ నీటి మట్టం
బాల్కొండ : శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. ప్రాజెక్ట్‌లో శనివారం మధ్యాహ్నం వరకు 36.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్‌లోకి ఇప్పటి వరకు 32 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్‌కు జలకళ సంతరించుకుంది. గతేడాది ఇదే రోజు ప్రాజెక్ట్‌లో 1051.70 అడుగుల(7.24 టీఎంసీలు) నీరు మాత్రమే నిల్వ ఉంది. కానీ ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. అలాగే మహారాష్ట్రలోని విష్ణుపూరి ప్రాజెక్టు నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. విష్ణుపురి నుంచి ఇక్కడకు నీరు చేరాలంటే 36 గంటల వ్యవధి పడుతుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఆదివారం ప్రాజెక్టులోకి Ð -
ఎస్సారెస్పీ జలాలతో చెరువులను నింపాలి
తుంగతుర్తి : ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి కాలువల ద్వారా చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని వైస్సార్సీపీ జిల్లా కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో సరిగా వర్షాలు లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా జలాలను మళ్లించి ఈ ప్రాంతంలోని చెరువులను నింపాలని కోరారు. ఆయనతో పాటు ఎస్సారెస్పీ నాయకులు తుమ్మరాస్వామి, సంద రవి, గులాం సందాని, ఇరుగు సైదులు, రమేష్, సతీష్, వీరభద్రం, వెంకన్న, వినయ్ పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ నీటితో చెరువులు నింపాలి
వారంలో నీరు విడుదల చేయకుంటే దీక్ష టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు టవర్‌సర్కిల్ : ఎస్సారెస్పీ ఉపకాలువతోపాటు ఆయకట్టు ప్రాంతంలోని చెరువులు, కుంటలను నింపేందుకు వీలుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్. విజయరమణారావు డిమాండ్ చేశారు. ఈమేరకు పలు అంశాలపై టీడీపీ ప్రతినిధుల బందం సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేయాలని, ఆయకట్టు ప్రాంతంలోని చెరువులు, కుంటలను నీటితో నింపాలని, రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు పడక రైతులు బెంబేలెత్తిపోతున్నారని తెలిపారు. వారంలోగా ఎస్సారెస్పీ నీటి విడుదలపై జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం ప్రకటించకపోతే నిరవధిక దీక్షకు పూనుకుంటానని హెచ్చరించారు. కరువు నివారణ చర్యలను ప్రభుత్వం సకాలంలో చేపట్టకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. నాయకులు అన్నమనేని నర్సింగరావు, గంట రాములుయాదవ్, కళ్యాడపు ఆగయ్య, రొడ్డ శ్రీనివాస్, చెల్లోజు రాజు, సాయిరి మహేందర్, పాలరామారావు, కుమార్కిషోర్, పుట్ట నరేందర్, దూలం రాధిక, అనసూర్యనాయక్ పాల్గొన్నారు. -
చివరి భూములకు ఎస్సారెస్పీ నీళ్లివ్వండి
పీసీసీ సభ్యుడు ఈర్ల కొమురయ్య కాల్వశ్రీరాంపూర్: ఎస్సార్ఎస్పీ చివరి భూములకు డి–86, డి–83 కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని పీసీసీ సభ్యుడు ఈర్ల కొమురయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. రెండేళ్లుగా వర్షాబావంతో టేలాండ్ ప్రాంత రైతులు కరువుతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం హరితహారం పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తోందని ఆరోపించారు. రైతులకు రుణాల మంజూరులో విఫలమైందని విమర్శించారు. హరితహారంపై పర్యవేక్షణ లేకపోతే కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యే అవకాశముందన్నారు. అధికారులు వారాంతపు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. డబుల్‌బెడ్ రూం కోసం నిరుపేదలు గంపెడాశతో ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మునీర్, చిలువేరు రాజయ్య, సతీశ్, అశోక్ గౌడ్, శ్రీనివాస్, శివశంకర్, తాజ్, రాజు, రాజయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్‌ఫ్లో
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్‌లో ఒక్క రోజు వ్యవధిలో 1.10 అడుగలు నీటి మట్టం పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1065.20 (20.55 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. -
అయ్యో ‘శ్రీరామా..’!
►ఎడారిని తలపిస్తున్న ఎస్సారెస్పీ ► 8.26 టీఎంసీలకు పడిపోయిన నిల్వ ►ఇంత దారుణ పరిస్థితులు ఎన్నడూ లేవంటున్న అధికారులు ►వర్షాల్లేక ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌కు చేరని నీరు ►ఉత్తర తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం ► ప్రశ్నార్థకంగా 17.85 లక్షల ఎకరాల ఆయకట్టు ► తాగునీటి పథకాలపైనా ప్రభావం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎండిపోతోంది! నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు నల్లగొండకు సైతం సాగునీరు అందించే ప్రాజెక్ట్ వెలవెలబోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్ట్ నీటి నిల్వ 8.26 టీంఎసీలకు పడిపోయింది. ఎంతటి వర్షాభావ పరిస్థితులు తలెత్తినా.. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ ఇంతలా తగ్గిపోయిన దాఖలాల్లేవు. ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ సహా 11 ప్రాజెక్టులు వరద నీటికి అడ్డంకిగా మారాయి. ఎస్సారెస్పీపై ఆరు జిల్లాల్లో 17,85,605 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉండగా, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రక్షిత మంచినీటి పథకాలకు ఈ ప్రాజెక్ట్ నీరే ఆధారం. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్ట్ ఎడారిని తలపిస్తోంది. ప్రశ్నార్థకంలో ఆయకట్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరితే తెలంగాణలో 18.82 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది. ప్రాజెక్ట్‌లో నీరు లేక పోతే ఆ భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉంది. నిజామాబాద్ జిల్లాలో 1,60,578 ఎకరాలు, ఆదిలాబాద్‌లో 1,45,387, వరంగల్‌లో 4,71,478, కరీంనగర్లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్లగొండలో 2,87,508 ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా నీరందుతోంది. అలాగే నిజామాబాద్‌లో 19 ఎత్తిపోతల పథకాలకు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ముంపు గ్రామాల ఎత్తిపోతలకు నీరు ఉపయోగపడుతోంది. ఈ సంవత్సరం ఆయకట్టు పడావు పడనుండగా.. ఎత్తిపోతలు ఉత్తిపోతలుగానే మారే ప్రమాదం నెలకొంది. పడిపోతున్న నిల్వ సామర్థ్యం ప్రాజెక్టులో పూడిక ఎక్కువగా పేరుకు పోయిందని సర్వేలు చెబుతున్నా.. ఇంతవరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. 1978లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాగానే సర్వే చేపట్టగా.. 112 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని తెలిపారు. 1994లో చేపట్టిన సర్వేలో నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయినట్లు తేలింది. 2006లో సర్వే చేపట్టగా.. నీటి సామర్థ్యం 78 టీఎంసీలకు పడిపోయినట్లు వెల్లడైంది. అయితే ప్రాజెక్ట్ అధికారులు ఈ సర్వేను కొట్టి పారేశారు. 2013, 2014లో ఏపీఈఆర్‌ఎల్ సర్వే చేపట్టినా నివేదిక ఇంకా గుట్టుగానే ఉంది. ఈ నివేదిక వెల్లడైతే శ్రీరాంసాగర్‌లో ప్రాజెక్ట్ వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం, నీటి నిల్వల వివరాలు బట్టబయలు కానున్నాయి. తాగునీరూ కష్టమే.. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 (90 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1,053.60 (8.26 టీఎంసీల) అడుగులే ఉంది. ఇటీవల రెండు రోజులు భారీగా వర్షాలు కురిసినా వరద నీరు 10-15 వేల క్యూసెక్కులను మించి రాలేదు. భవిష్యత్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కింద ఆరు జిల్లాల్లో స్థిరీకరించిన 17.85 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌లో 5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీకే సరిపోతోంది. ఎండ వల్ల ఆవిరి, లీకేజీలు కలుపుకుంటే ఏడాదికి 5 టీఎంసీలు పోతుంది. ప్రస్తుతం 8.26 టీఎంసీలే ఉండటంతో ఆ నీటితో ఆయకట్టుకు నీరందించడం కుదరదు. కనీసం తాగునీటి అవసరాలు కూడా గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై ఆధారిత ప్రాజెక్ట్‌లు, ఆయకట్టు వివరాలు.. పథకం ఎకరాల్లో శ్రీరాంసాగర్ ఒకటో దశ 9,68,640 శ్రీరాంసాగర్ రెండో దశ 4,40,000 ఇందిరమ్మ వరద కాలువ 2,20,000 సదర్మట్ ఆనకట్ట 12,000 కడెం ప్రాజెక్ట్ 68,000 అలీసాగర్ ఎత్తిపోతలు ---- గుత్ప ఎత్తిపోతలు ---- హన్మంతరెడ్డి పథకం 11,600 నిజామాబాద్‌లోని 14 ఎత్తిపోతలు 34,948 ఆదిలాబాద్‌లోని 19 ఎత్తిపోతలు 30,417 మొత్తం 17,85,605 ఎస్సారెస్పీ నీటి నిల్వ సంవత్సరాల వారీగా.. (ప్రస్తుత సమయూనికి) సంవత్సరం నిల్వ(టీఎంసీల్లో) 2010 71.65 2011 57.72 2012 12.72 2103 90 2014 23.5 2015 8.26 -
ఎస్సారెస్పీ తాగునీటి షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ సిటీ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి దిగువ, ఎగువ లోయర్ మానేరు డ్యామ్ కింది ప్రాంతాలకు తాగునీటి కేటాయింపుల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. బుధవారం నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులిచ్చారు. వాటి మేరకు ఎల్ఎండీ ఎగువన ఉన్న నిర్మల్, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్ మున్సిపాల్టీలతో పాటు మరిన్ని గ్రామాలకు కలిపి మొత్తంగా 3.8టీఎంసీల నీటిని, ఎల్ఎండీ దిగువన ఉన్న కరీంనగర్, సిధ్ధిపేట, సిరిసిల్ల తాగు నీటి అవసరాలకు మొత్తంగా 2.57టీఎంసీల నీటిని ఈ నెల నుంచి జులై వరకు నిర్ధారించిన మేరకు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సర్వే పనులను అడ్డుకున్న రైతులు
నిర్మల్ (మామడ) : మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై ఎస్సారెస్పీ సదర్మాట్ బ్యారేజి నిర్మాణంలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించేందుకు కొన్ని రోజులుగా అధికారులు సర్వే చేస్తున్నారు. బుధవారం పొన్కల్ రైతుల పంట పొలాల్లో సర్వే నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. తమ భూముల్లో సర్వే నిర్వహించొద్దని స్పష్టం చేశారు. సర్వే పనులను అడ్డుకోవడంతో అధికారులు గ్రామానికి తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ రామస్వామి, ఎస్పారెస్పీ డీఈ వెంకటేశ్వర్లు పొన్కల్ గ్రామానికి వచ్చారు. అప్పటికే కొందరు రైతులు, గ్రామస్తులు వాహనాల్లో వెళ్లి మామడ మండల కేంద్రంలోని నిర్మల్, ఖానాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బ్యారేజి నిర్మాణం కోసం చేపడుతున్న సర్వే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో తహశీల్దార్ రామస్వామి, డీఈ వేంకటేశ్వర్లు,ఏఎస్ఐ సిద్దేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సర్వేను నిలిపివేసి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. బాధిత రైతులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
ఎస్సారెస్పీ నీటి విడుదలకు ప్రణాళిక
వరంగల్, న్యూస్‌లైన్ : ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళిక ఖరారైంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు నిల్వ ఉండడం, ఇప్పటికే రెండో దశకు నీటిని విడుదల చేస్తుండడంతో.. మొదటి దశకు నీటి విడుదల ఖరారు చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ షెడ్యూల్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈసారి చివరి ఆయకట్టుకు సైతం నీటిని అందించనున్నారు. ఖరీఫ్ సీజన్లో ఆన్ ఆఫ్ పద్ధతిని పాటించనున్నారు. గతంలో ఆన్ ఆఫ్ పద్ధతి సరిసమానంగా ఉండేది. కానీ ఇప్పుడు నీరు నిల్వ ఉండడంతో.. ఆఫ్ పద్ధతిని తగ్గించారు. 9 రోజులు ఆన్.. 6 రోజులు ఆఫ్ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు. అవసరమైన మేరకు చెరువులు, పెద్ద చెరువులు, రిజర్వాయర్లకు సైతం నీటిని అందించనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయని నీటిపారుదల శాఖ భావిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచే ఎస్సారెస్పీ మొదటి దశ కాల్వలకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. కాగా, నేటి నుంచి రెండో దశ నీటి విడుదలకు బ్రేక్ వేస్తారు. అయితే అత్యవసర సందర్భంలో రెండో దశకు నీటిని విడుదల చేసేందుకు కూడా ప్రణాళిక వేశారు. మొదటి దశకు విడుదల చేసిన అనంతరం ఆఫ్ రోజుల్లో రెండో దశకు ఇస్తారు. దిగువ ఎల్ఎండీ పరిధిలో ఆదివారం నుంచి ఎస్సారెస్పీ జలాలు విడుదల కానున్నాయి. డీబీఎం-31 వరకు ఈ నీటిని అందించనున్నారు. రోజూ 3 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ ప్రధాన కాల్వ, ఉప కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 23 వరకు ఎస్సారెస్పీ నీటిని మొదటి దశకు అందిస్తున్నారు. మొదటి దశలో మొత్తం 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటికే ఆయకట్టులో వరి నార్లు పూర్తి చేశారు. పొలాల్లో కూడా వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశకు నీటి విడుదల ప్రణాళిక ఖరారు కావడంతో సాగు మరింత పెరగనుంది.