ఎస్సారెస్పీకి పూర్వవైభవం తెస్తాం
ఈ నెల 10న సీఎం చేతుల మీదుగా పునరుజ్జీవం: హరీశ్‌రావు
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1963లో పునాది పడి చరిత్ర సృష్టిస్తే, ఈ నెల 10న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం మరో చరిత్ర సృష్టిస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి నీరు రాని సమయంలో కాళేశ్వరం నుంచి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్‌తో రోజుకు టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు నీటిని పంపింగ్ చేసి ప్రాజెక్టు నింపడమే పునరుజ్జీవం పథకం లక్ష్యమని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిలతో కలసి ఆయన బుధవారం సందర్శించారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం మంత్రి హరీశ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. వరద కాలువను 102 కిలోమీటర్ నుంచి ప్రాజెక్ట్ వరకు రిజర్వాయర్‌గా మార్చి నీటిని ప్రాజెక్ట్‌లోకి పంపింగ్ చేయడం వలన కాకతీయ, వరద కాలువల మధ్య ఉన్న మరో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.
సీఎం కేసీఆర్ సొంత ఆలోచనే...
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో నుంచి వచ్చిందేనని హరీశ్ చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో బ్యారేజీలను రిజర్వాయర్లుగా మార్చుకుని పూర్వవైభవం తీసుకు వచ్చారని, తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన ఎస్సారెస్పీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ధృఢ సంకల్పంతోనే ఈ పథకానికి రూపకల్పన చేసినట్లు వివరించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు మంజూరు చేశారన్నారు. ప్రస్తుత సంవత్సరం ఎస్సారెస్పీలోకి పెద్దగా వరద రాలేదని, కానీ, మేడిగడ్డ, కాళేశ్వరం వద్ద ఇప్పటికే 210 టీఎంసీల నీరు సముద్రంలో కలసి పోయిందన్నారు. ఇప్పటికీ ప్రతి రోజు 54 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోందన్నారు. రివర్స్ పంపింగ్ పథకం పూర్తయి ఉంటే ఇప్పటికే ఎస్సారెస్పీకి రెండు నెలల్లో 60 టీఎంసీల నీటిని తెచ్చుకునే అవకాశం ఉండేదన్నారు. ఏడాది కాలంలోనే పనులు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.