మంగళవారం జలసౌధలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్. చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం తదితరులు
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఆయకట్టు రైతులకు శుభవార్త. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ఈ ఖరీఫ్‌లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రుల బృందం నీటి విడుదలపై సానుకూల నిర్ణయం తీసుకుంది. నీటి విడుదలకు షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. భారీగా ప్రవాహాలు వస్తున్నందున ఒకట్రెండు రోజుల్లోనే ప్రాజెక్టు నుంచి నీరు విడుదలయ్యే అవకాశముంది.
మూడు రోజుల్లో పూర్తిగా..
ఎస్సారెస్పీకి ఎగువన ఉన్న మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్, అంధురా ప్రాజెక్టుల నీటి మట్టాలు పూర్తిస్థాయికి చేరడం.. బాలేగావ్ నుంచి 1.98 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టుకు ఒక్కసారిగా ప్రవాహాలు పెరిగాయి. సాయంత్రానికి 2.68 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవడంతో ఎస్సారెస్పీలో నీటి నిల్వ 58 టీఎంసీలు (సామర్థ్యం 90 టీఎంసీలు) దాటింది. ఎగువన మహారాష్ట్రలోని గోదావరి పరీవాహకంలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో వరద స్థిరంగా కొనసాగే అవకాశం ఉం ది. అదే జరిగితే మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండొ చ్చని నీటి పారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి.
షెడ్యూల్ ఖరారుకు ఆదేశాలు
ఎస్సారెస్పీ నిల్వలు పెరగడంతో మంత్రి హరీశ్‌రావు మంగళవారం జలసౌధలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఈఎన్‌సీ మురళీధర్, ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, ఇరిగేషన్ ప్రత్యేకాధికారి కె.ప్రసాద్‌లతో సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం, ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి జలకళ సంతరించుకోవడం పట్ల మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కింద ఈ ఖరీఫ్‌కు నీరు విడుదల చేయాలని తీర్మానించారు. ప్రాజెక్టు కింది కాకతీయ, లక్ష్మీ కాలువలతో పాటు లక్ష్మీ కాంప్లెక్స్‌లోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్, నవాబ్ లిఫ్ట్ కింది ఆయకట్టు.. సరస్వతీ కెనాల్ కాలువ, గుత్ప, అలీ సాగర్, ఐడీసీ ఆధ్వర్యంలో నడిచే 24 లిఫ్ట్‌ల పరిధిలోని ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 58 టీఎంసీల నీరుందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరొస్తోందని, ఈ ప్రవాహం మరి కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఎస్సారెస్పీకి ఎగువన ఏయే ప్రాజెక్టుల్లోకి నీరు వస్తోంది, వర్షపాతం ఎలా ఉందో మంత్రులు ఆరా తీశారు.
గ్రామాల్లో చాటింపు వేయించండి
ఎస్సారెస్పీలో నీటి లభ్యత పెరిగిన దృష్ట్యా అందుకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేయాలని ఈఎన్‌సీని మంత్రి హరీశ్ ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలని ఇంజనీర్లకు చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో ఇంజనీర్లు సమావేశాలు ఏర్పాటు చేసి నీటి విడుదల ప్రణాళికలు వివరించాలన్నారు. కాలువ పరిధిలోని రైతులకు నీటి విడుదల సమాచారం అందించేలా ఇంజనీర్లు, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. నీరు విడుదల చేసే కాలువలను పటిష్ట పరచాలని, ఉపాధి హామీ పథకంలో భాగంగా పూడిక తీయాలని చెప్పారు. నీటి వృథా అరికట్టేందు కు టెయిల్ టు హెడ్, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి అవలంబించాలన్నారు. గత రబీలో ఈ పద్ధతి అమలు చేయ డం ద్వారా ఒక్క టీఎంసీ నీటితో 13 వేల నుంచి 14 వేల ఎకరాలకు నీరు ఇవ్వగలిగామని గుర్తుచేశారు.
సాగర్‌లో 210 టీఎంసీలు
నాగార్జునసాగర్‌కు కృష్ణా ప్రవాహం తగ్గింది. శ్రీశైలం నుంచి నీటి విడుదల తగ్గడంతో నిన్నమొన్నటి దాకా 2 లక్షలకు పైగా నమోదైన ప్రవాహం మంగళవారం సాయంత్రానికి 61 వేలకు పడిపోయింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం సాగర్‌లో 210 టీఎంసీల నీరుంది. అయితే ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి 1.60 లక్ష ల క్యూసెక్కుల ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటం, నిన్నటివరకు తగ్గిన తుంగభద్ర వరద మళ్లీ పుంజుకొని లక్ష క్యూసెక్కులకు పెరిగిన నేపథ్యంలో శ్రీశైలానికి మళ్లీ ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తు తం శ్రీశైలానికి 1.31 లక్షల ప్రవాహం వస్తుండగా 92 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
కాంగ్రెస్ నేతల కళ్లలో కన్నీరు
తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని.. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను సీఎం ప్రారంభించారని మంత్రులు చెప్పారు. సాగు ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేసేం దుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో దేవుడూ కరుణించి చక్కగా వర్షం కురిపించడం వల్ల ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని ఆనం దం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా గోదావరి బేసిన్‌లో నీరుంటే కృష్ణా బేసిన్‌లో ఉండేది కాదని.. కృష్ణాలో ఉంటే గోదావరిలో ఉండేది కాదని, కానీ రెండు బేసిన్లలోకి వరద నీరు రావడం, ప్రాజెక్టులు నిండటం తొలిసారని హరీశ్ అన్నారు. ప్రాజెక్టుల్లోకి నీరొస్తుంటే.. కాంగ్రెస్ నేతల కళ్లలో కన్నీరు వస్తోందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment