తాలిపేరు ప్రాజెక్టు వద్ద జలసవ్వడి
సాక్షి నెట్‌వర్క్: ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తర తెలంగాణ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రోజంతా ముసురేసింది. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద రావడంతో గేట్లను ఎత్తివేశారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం ధాటికి అనేక ఇళ్లు కూలుతుండగా, రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు జన్నారం నుంచే రాకపోకలు సాగుతుండగా, బ్రిడ్జి లేకపోవడంతో జన్నారం మండలం కలమడుగు, ధర్మపురి మీదుగా 50 కిలోమీటర్ల దూరం తిరిగి వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జన్నారం మండలం చింతగూడలో ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది.
ఇందన్‌పల్లి వంతెన అప్రోచ్ రోడ్డు వద్ద ఆదివారం బురదలో దిగబడిన వ్యాన్ సోమవారం వరద ఉధృతికి కొట్టుకుపోగా, పోలీసులు క్రేన్ తెప్పించి బయటకు తీశారు. ఆసిఫాబాద్‌లోని అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, వివేకానందచౌక్ జలమయమయ్యాయి. గుండి వాగు, పెద్దవాగు, తుంపెల్లి ఒర్రె పొంగిపొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులకు భారీ వరద రావడంతో గేట్లు ఎత్తివేశారు. సారంగాపూర్ మండలంలోని ధని కొత్త చెరువు అలుగులో నుంచి 20 గేదెలు కొట్టుకుపోగా, అందులో 17 మృత్యువాతపడ్డాయి. మామడ మండలంలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్‌మాట్ బ్యారేజీ వద్ద మట్టి కట్ట, బిగించడానికి సిద్ధంగా ఉంచిన గేట్లు కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 3 రోజులుగా వరద నీటిలోనే ఉంది. దుబార్‌పేట్ గ్రామం వరద నుంచి తేరుకోలేదు. 300 మందికి మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్‌లోని రైతు విశ్రాంతి భవనంలో ఆశ్రయం కల్పించారు. గిరిజన గురుకుల పాఠశాలలో భారీగా వరద నీరు చేరడంతో 800 మంది విద్యార్థినులకు మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ఆశ్రయం కల్పిస్తున్నారు. కుంటాల జలపాతం వద్ద ఏర్పా ట్లు చేసిన బారికేడ్లు వరదకు కొట్టుకుపోయాయి.
ద్వీపకల్పాన్ని తలపిస్తున్న అశ్వారావుపేట
అశ్వారావుపేట ప్రాంతం ద్వీపకల్పాన్ని తలపిస్తోంది. రెండువైపులా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరు పాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం డివిజన్‌లోని దుమ్ముగూడెం మండలం గంగోలు వద్ద రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులను నిలిపేశారు.
కాళేశ్వరం వద్ద 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద, వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది.కాళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రం 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం వెళ్తోంది. అన్నారం వద్ద లక్ష క్యూసెక్కుల వరద తరలిపోగా, కాళేశ్వరం వద్ద 3.50 లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వైపునకు వెళ్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వాజేడు మండల పేరూరు వద్ద 11.67 మీటర్ల ఎత్తున గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఆదివారం 7 మీటర్ల వరకే ఉన్న గోదావరి ప్రవాహం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 8.4 మీటర్లకు పెరిగింది.
పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం
నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి 10 గంటల వరకు 33.125 టీఎంసీలుగా ఉన్న నీటి మట్టం సోమవారం రాత్రి 7 గంటల వరకు 34.827 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 70,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,090 అడుగుల (90.138 టీఎంసీలు)కుగాను సోమవారం రాత్రి ఏడు గంటలకు వరకు 1072.80 అడుగులు (34.827 టీఎంసీలు)కు చేరుకుంది. నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
గోదావరిఖని: భారీ వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలచింది. మట్టి వెలికితీత పనులు ముందుకు సాగడం లేదు. రామగుండం రీజియన్‌లో 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాలిపేరు, కిన్నెరసానికి వరద
తాలిపేరు, కిన్నెరసాని జలాశయాల్లోకి భారీగా వరదనీరు వస్తోంది. తాలిపేరు జలాశయం పూర్తిగా నిండింది. దీంతో మొత్తం 25 గేట్లు ఎత్తి 1,72,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 1,77,000 క్యూసెక్కులుగా ఉంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నీటిమట్టం 407 అడుగులు కాగా 403.60 అడుగుల మేర నీరుంది. ఇన్‌ఫ్లో 35,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 30,000 క్యూసెక్కులు ఉంది. భద్రాచలం వద్ద గోదావరి 44.5 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తోంది. భద్రాచలంలోని అశోక్ నగర్‌కాలనీలో సుమారు 30కి పైగా ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వారిని పునరావాస శిబిరానికి తరలించారు.
వాగులో పురిటినొప్పులతో...
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ సమీపంలోని కత్తెర్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు రాగా గ్రామస్తులు వాగు దాటించి 108 అంబులెన్స్ ఎక్కించారు.
భద్రాద్రి జిల్లా అతలాకుతలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతలాకుతలం అవుతోంది. అనేకచోట్ల రోడ్లు మునిగిపోవడం, కోతకు గురికావడంతో వందకుపైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,465.2 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 35 హెక్టార్లలో ఇసుక మేటలతో ఆయా రైతులు నష్టపోయారు.
Comments
Please login to add a commentAdd a comment