srsp project
-
కష్టంలోనే కాళేశ్వరం విలువ తెలిసేది
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్‌కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ ఒక టీఎంసీ నీళ్లను మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు ఎత్తిపోసేలా మోటార్లను నిర్విరామంగా 24 గంటలూ నడిపించాలి. సుందిళ్ల నుంచి అంతే నీటిని మధ్య మానేరుకు తరలించాలి. అక్కడి నుంచి సగం నీటిని దిగువ మానేరుకు, సగం నీటిని పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలి. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యాపేటలోని చివరి ఆయకట్టు చినసీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బంది చర్యలు చేపట్టాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఆదివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత కష్టపడ్డారో, అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగు, సాగునీటికి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని నొక్కిచెప్పారు. ‘ఇన్ని రోజులు ఒకెత్తు... ఇప్పుడు ఒకెత్తు. ఇది నీటిపారుదల శాఖకు పరీక్షా సమయం’అని వ్యాఖ్యానించారు. పాలేరు రిజర్వాయర్‌కు నాగార్జునసాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సూచించారు. చుక్క చుక్కనూ ఒడిసిపట్టాలి... తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. నీటిపారుదల, విద్యుత్ శాఖలు ఈ మేరకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి లోటు రానీయకుండా చుక్కచుక్కనూ ఒడిసిపట్టి ప్రజలకు నీటిని అందించాలన్నారు. ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నీటిపారుదల, విద్యుత్ శాఖ సమన్వయం చేసుకోవాలని సూచించారు. మళ్లీ విత్తనాలు, ఎరువుల పంపిణీకి ప్రణాళిక... ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, ఇతర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులతో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకొనే పరిస్థితులున్నాయని ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా అత్యవసర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖను కేసీఆర్ ఆదేశించారు. సంక్షోభంలో సైతం పంటలు పండించి చూపాలి... ‘ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగునీరు, సాగునీటి అవసరాలకు సమృద్ధిగా నీరు అందుతున్నది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం. అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ ఎవరి పని వారు సమర్థంగా నిర్వహిస్తూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుంది. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే ఉండి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలి. ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి’అని సీఎం స్పష్టం చేశారు. తాగునీటి సమస్య రాకూడదు.. రాష్ట్రంలో తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని సీఎం ఆదేశించారు. ఉదయసముద్రం, కోయిల్ సాగర్ రిజర్వాయర్లలో కొంత నీటి కొరత ఉందని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. పంపింగ్ నిర్వహణ జెన్కోకు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్కోకు ఇచ్చేలా విధివిధానాల ఖరారుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదల అధికారులను సీఎం ఆదేశించారు. నీటిని పొదుపుగా వాడాలి... ప్రస్తుత కష్టకాలంలో ప్రజలు, రైతాంగం నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖల సూచనలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని రైతులను కోరారు. -
SRSP: ప్రమాదపు అంచుల్లో చారిత్రక కట్టడం
-
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం : అంచనాలు రెట్టింపా?
సాక్షి, హైదరాబాద్: ఎగువ నుంచి ప్రవాహాల్లేక నిర్జీవంగా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జవసత్వాలు ఇచ్చేందుకు చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం అంచనా వ్యయాలను ఇష్టారీతిన పెంచడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై ఆయనే స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏకంగా రెట్టింపు చేయడం ఏమిటని, ఇదంతా ఎలా జరిగిందో తేల్చి సమగ్ర నివేదిక ఇవ్వాలని సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌ను సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వంలోని అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. ఏయే పనుల కింద ఎంతమేర అంచనాలు పెరిగాయో వివరాలు ఇవ్వాలని, తప్పుడు లెక్కలుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం స్పష్టం చేశారని తెలిపాయి. ఎస్సారెస్పీకి జవసత్వాలు ఇచ్చేందుకు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–1 కింద 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్–2 కింద 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నాయి. కానీ ప్రాజెక్టులో పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పడిపోయింది. ఎగువన మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు కట్టి నీళ్లన్నీ వాడేసుకుంటోంది. దిగువన ఉన్న ఎస్సారెస్పీకి 50 టీఎంసీల మేర కూడా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎస్సారెస్పీకి తరలించి జవసత్వాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో.. ఒక టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి 2017 జూన్‌లో రూ.1,067 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోసేలా డిజైన్ చేశారు. 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరు నెలలకే మార్పులు షురూ.. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం టెండర్ల ప్రక్రియ మొదలైన ఆరు నెలలకే డిజైన్‌లో మార్పులు జరిగాయి. ఈ సమయంలోనే అంచనా వ్యయాన్ని రూ.1,067 కోట్ల నుంచి.. ఏకంగా రూ.1,751.46 కోట్లకు పెంచారు. ఈ వ్యయాల మార్పు సమయంలో స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా పెరిగిన వ్యయాలను యథాతథంగా ఆమోదించారు. తర్వాత వేగంగా పనులు కొనసాగాయి. ఇప్పటికే మూడు పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తయింది. ఇరిగేషన్ శాఖ లెక్కల మేరకు.. ఈ పనులకు సంబంధించి రూ.1,250 కోట్లు, సబ్ స్టేషన్ల నిర్మాణాలకు మరో రూ.220 కోట్లు, పెరిగిన ధరలకు అనుగుణంగా చెల్లించిన మొత్తాలు మరో రూ.70 కోట్లు కలుపుకొని.. మొత్తంగా రూ.1,540 కోట్ల మేర నిధులు ఖర్చు చేసినట్టు చూపారు. మరో రూ.150 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రాజెక్టుపై మొత్తంగా రూ.1,700 కోట్ల వరకు ఖర్చు జరిగింది. అయినప్పటికీ ప్రాజెక్టు ఇంజనీర్లు మరోమారు అంచనాలను సవరిస్తూ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రూ.1,999.55 కోట్లతో ఈ ప్రతిపాదనలు వెళ్లినట్టు తెలిసింది. అంటే తొలి అంచనాతో పోలిస్తే ఏకంగా రూ.932 కోట్లు వ్యయం పెరిగినట్టు. రెండో సవరించిన అంచనాతో పోల్చినా కూడా రూ. 248.55 కోట్లు పెరిగిపోయింది. జరిగింది వేరే.. లెక్కలు వేరే.. మంగళవారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా లేవనెత్తినట్టు తెలిసింది. అంచనా వ్యయం ఏకంగా రెట్టింపు కావడం ఏమిటని ఇంజనీర్లను సీఎం నిలదీయగా.. డిజైన్‌లో మార్పులు జరిగాయని, పంపుహౌజ్ లోతు పెరిగిందని, ఫౌండేషన్ సైతం తొలి ప్రతిపాదనతో పోలిస్తే మారిందని ఇంజనీర్లు చెప్పినట్టు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న ఓ మంత్రి దీనిపై స్పందిస్తూ.. సివిల్ పనుల్లో మార్పులు జరిగితే ఎలక్ట్రో, మెకానికల్ పనుల అంచనాలు ఎలా పెరిగాయని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రాజెక్టులో మొదట రూ.600 కోట్లుగా ఉన్న ఎలక్ట్రో, మెకానికల్ పనుల విలువ.. ఇప్పుడు ఏకంగా రూ.1,400 కోట్లకు చేరిందన్న విషయాన్ని సీఎంకు వివరించినట్టు సమాచారం. మంత్రి చెప్పిన అంశాలతో ఏకీభవించిన సీఎం.. వ్యయం పెరగడం మామూలే అయినా, ఏకంగా రెట్టింపు ఎలా అయిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై విజిలెన్స్ విచారణ చేయించి, తనకు సమగ్ర నివేదిక అందించాలని.. అక్కడికక్కడే సాగునీటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌ను ఆదేశించినట్టు సమాచారం. ఈ సమయంలో ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. భారీ ఎత్తున పనులు జరుగుతున్న ఇరిగేషన్ శాఖలో చిన్నచిన్న తప్పులు జరుగుతున్నా, ఉపేక్షిస్తూ వస్తున్నానని.. దీన్ని ఆసరాగా చేసుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అంచనా వ్యయాలను సవరిస్తే ‘వీపులు పగులుతాయ్’ అంటూ ఘాటుగా హెచ్చరించారని సమాచారం. ఏం జరిగింది? తొలి అంచనా వ్యయం రూ. 1,067 కోట్లు సవరించిన అంచనా మొత్తం రూ. 1,999.55 కోట్లు పెరిగిన వ్యయం:రూ.932.55 కోట్లు -
భారీ ప్రాజెక్టుల్లో ‘పని’ విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జల వనరుల శాఖ సమూల ప్రక్షాళనలో భాగంగా భారీ మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయి. భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల సమర్థ నిర్వహణకు వీలుగా.. ఒక్కరి కిందే ఉన్న ప్రాజెక్టు పనులను అవసరాలకు తగ్గట్టు విభజించనున్నారు. ప్రాజెక్టుల కింది ఆయకట్టు, రిజర్వాయర్, పంప్‌హౌస్‌లు, కాల్వలు, ఐడీసీ పథకాలు, చెరువులను లెక్కలోకి తీసుకుంటూ పని విభజన చేస్తూ పునర్విభజన చేశారు. ప్రధానమైన కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలను ఏకంగా ఐదుగురు చీఫ్ ఇంజనీర్లు (సీఈ)లకు కట్టబెట్టనుండగా, పాలమూరు–రంగారెడ్డి బాధ్యతల నిర్వహణకు ఇద్దరు సీఈలను నియమించనున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు ఇద్దరు సీఈలు, ఎస్సారెస్పీ కింది కాల్వల బాధ్యతలు ముగ్గురు సీఈల పరిధిలోకి వెళ్లనుంది. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)ని పూర్తిగా రద్దుచేసి, ఆయా జిల్లాల పరిధిలోని సీఈలకే బాధ్యతలు కట్టబెట్టనున్నారు. ఇప్పటివరకు ఉన్న గోదావరి, కృష్ణా బేసిన్లలోని చెరువుల బాధ్యతలను చూస్తున్న ప్రత్యేక సీఈలను తొలగించనున్నారు. కొత్తగా నియమించే సీఈలకు ఈ చెరువుల బాధ్యతలు అప్పగిస్తారు. కీలక నిర్ణయాల్లో కొన్ని.. ► ప్రస్తుతం పరిపాలన వ్యవహారాలు చూస్తున్న ఈఎన్సీ అడ్మిన్ యథావిధిగా కొనసాగుతారు. ఆయన పరిధిలో ఉండే కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) మాత్రం ఇరిగేషన్ ఈఎన్సీ పరిధిలోకి వెళ్తుంది. గోదావరి, కృష్ణా బేసిన్‌లోని పంప్‌హౌస్‌ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)కు ప్రత్యేక ఈఎన్సీ నియామకానికి సీఎం అవకాశం కల్పించారు. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహితతో పాటు చనాకా–కొరాటా, చెన్నూరు ఎత్తిపోతల, సాత్నాల, గడ్డెన్నవాగు, వట్టివాగు ఎత్తిపోతల పథకాలన్నీ ప్రస్తుతం ఒక్క సీఈ పరిధిలోనే ఉండగా, దానిని ఇప్పుడు రెండుగా విభజించి మంచిర్యాల కేంద్రంగా ఇద్దరు సీఈలను నియమించనున్నారు. ఈ జిల్లాలో అన్ని రకాల సాగునీటి వనరుల కింద ఉన్న 8.12లక్షల ఎకరాల ఆయకట్టును వీరిద్దరికి అప్పగిస్తారు. ► ఎస్సారెస్పీ–1 కింద ఒక సీఈని నియమించనుండగా, ఆయన కింద డ్యామ్, లోయర్ మానేరు వరకు కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మీ కాల్వ, కాళేశ్వరంలోని ప్యాకేజీ– 27, 28, కుఫ్తి, కడెం, సదర్మట్ బ్యారేజీలు ఉండనున్నాయి. ఆయకట్టు 6.62 లక్షలు ఉండనుంది. ► కరీంనగర్ జిల్లా సీఈ పరిధిలో లోయర్‌మానేరు కింద కాకతీయ కాల్వ 245వ కిలోమీటర్ వరకు, మిడ్‌మానేరు, గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి, అప్పర్‌మానేరు, బొగ్గులవాగు ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఆయకట్టు 8.25 లక్షల ఎకరాలు. ► ఎస్పారెస్పీ–2 వరంగల్ సీఈ పరిధిలో కాకతీయ కాల్వ 245 కిలోమీటర్ నుంచి 346వ కిలోమీటర్ వరకు, ఇతర ఎత్తిపోతల పథకాలు ఉండనున్నాయి. వీటి కింది ఆయకట్టు 6.66 లక్షల ఎకరాలు. ► కొత్తగా ఉమ్మడి నిజామాబాద్ ప్రాజెక్టుల కింద సీఈని నియమించనుండగా, ఆయన కింద నిజాంసాగర్, లెండి, గుత్ప, అలీసాగర్, కాళేశ్వరం ప్యాకేజీ–20, 21, 22 పనులు ఉండనున్నాయి. మొత్తం ఆయకట్టు 8.20 లక్షలు. ► కాళేశ్వరం ప్రాజెక్టు–1 సీఈ పరిధిలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, మిడ్‌మానేరు ఎగువన మూడు ప్యాకేజీలు, ప్యాకేజీ–9, ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం, మంథని, గూడెం లిఫ్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం, వరద కాల్వ ఉండనున్నాయి. ఆయకట్టు 3.41 లక్షల ఎకరాలు. ► హైదరాబాద్ కేంద్రంగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ–2 పరిధిలో అనంతగిరి రిజర్వాయర్ నుంచి బస్వాపూర్ వరకు ఉన్న ప్యాకేజీలు ఉంటాయి. ఆయకట్టు 7.85 లక్షల ఎకరాలు. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఒక సీఈని నియమించి ఆయన కింద సింగూరు, ఘణపూర్, నల్లవాగుతో పాటే కాళేశ్వరంలోని ప్యాకేజీ 17, 18, 19ని ఉంచనున్నారు. ► వరంగల్ సీఈ పరిధిలో సమ్మక్క బ్యారేజీ, దేవాదుల, దేవాదుల కింది వ్యవస్థ ఉండనుంది. ఆయకట్టు 10.32 లక్షల ఎకరాలు. ► నల్లగొండ–1 సీఈ పరిధిలో పాలేరు వరకు నాగార్జునసాగర్ ఆయకట్టు, ఎస్ఎల్బీసీ, ఉదయసముద్రం, మూసీ, ఆసిఫ్‌నహర్ వంటివి ఉంటాయి. ఆయకట్టు 9.86 లక్షల ఎకరాలు. ► నల్లగొండ–2 సీఈ పరిధిలో డిండి ఎత్తిపోతలు, డిండి ఉండనుండగా, 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ► ఖమ్మం జిల్లా సీఈ పరిధిలో సీతారామ, పాలేరు కింద నాగార్జునసాగర్ ఆయకట్టు, మధ్యతరహా ప్రాజెక్టులుంటాయి. ఆయకట్టు 9.61లక్షల ఎకరాలు. ► మహబూబ్‌నగర్ కేంద్రంగా ఉండే పాలమూరు–రంగారెడ్డి–1 సీఈ పరిధిలో ఉధ్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ల కింది కాల్వలు, ఆయకట్టు 9.15 లక్షల ఎకరాలతో పాటు ఇతర ఐడీసీ ఎత్తిపోతల పథకాలు ఉండనున్నాయి. ► నాగర్‌కర్నూల్ కేంద్రంగా ఉండే పాలమూరు–రంగారెడ్డి–2 సీఈ పరిధిలో కల్వకుర్తి, కర్వెన్ వరకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర ఐడీసీ పథకాలు ఉంటాయి. ఆయకట్టు 9.83 లక్షల ఎకరాలు. ► వనపర్తి కేంద్రంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సీఈ పరిధిలో జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్, ఆర్డీఎస్ ఉండనున్నాయి. ఆయకట్టు 8.16 లక్షల ఎకరాలు. వెంటనే ప్రాజెక్టుల నిధుల సమీకరణ నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులతోపాటు పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాటికి నిధుల సమీకరణ అంశంపై సీఎం మంగళవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘నీటి లభ్యతగల సమయంలో ప్రతిరోజూ గోదావరి నది నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 3 టీఎంసీల నీటిని తరలించి రాష్ట్రంలోని కోటీ 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం బడ్జెట్ నిధులతోపాటు వివిధ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆర్థిక సహాయానికి సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరఫున కట్టాల్సిన వాటాను చెల్లించి వెంటనే నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. వర్షాకాలం పూర్తి కాగానే అన్ని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలి’అని చెప్పారు. -
ఎస్సారెస్పీ నుంచి సాగునీటికి ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, వాటిపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాల కింద వానాకాలంలో ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) తేల్చింది. ఒక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనే చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత ఉన్నందున ఇక్కడ తాగునీటి అవసరాలకు పక్కనపెట్టి మిగిలిన 20 టీఎంసీలను వానాకాలం పంటల అవసరాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది మినహా మరెక్కడా తగినంత నీటి లభ్యత లేనందున నీటి విడుదల సాధ్యం కాదని, ప్రవాహాలు వచ్చాకే ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని నిశ్చయానికి వచ్చింది. 9 టీఎంసీలు తాగునీటికి పక్కనపెట్టి... రాష్ట్రంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజె క్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు బుధవారం నీటిపారుదలశాఖ శివమ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. ఈ భేటీలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్, వెంకటేశ్వర్లు, అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజ నీర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా ఆ అవసరాల మేరకు ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాలను నిర్వహిస్తూనే సాగుకు నీటి విడుదల అంశంపై చర్చించారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 90 టీఎంసీలకుగాను 29 టీఎంసీల నీటి లభ్యత ఉందని, తాగునీటికి 9 టీఎంసీలను పక్కనపెట్టి 20 టీఎంసీలను సాగునీటికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ 20 టీఎంసీలను స్థానిక అవసరాల మేరకు వచ్చే 2 నెలలపాటు ఎల్ఎండీ ఎగువన ఉన్న 4.60 లక్షల ఎకరాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రాజెక్టుల్లోకి వచ్చే ప్రవాహాల ద్వారా, లేనిపక్షంలో కాళేశ్వరం ద్వారా పునరుజ్జీవన పథకాన్ని వాడుకొని నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీకి పూర్తిస్థాయిలో నీరొస్తే ఎల్ఎండీ ఎగువ, దిగువన ఉన్న 9.60 లక్షల ఎకరాలతోపాటు స్టేజ్–2 కింద 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. 100 టీఎంసీలు వస్తేనే సాగర్ కింద.. సాగర్ ఎడమ కాల్వ కింద ఈ ఏడాది 6.30 లక్షల ఎకరాలకు, ఏఎంఆర్పీ కింద 2.63 లక్షలు, మూసీ, డిండి, ఆసిఫ్నహర్ల కింద 57 వేల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. 9.50 లక్ష ల ఎకరాలకు నీరివ్వాలంటే కనీసం 105 టీఎంసీలు అవసరం అవుతాయని శివం కమిటీ లెక్కగట్టింది. ఇందులో సాగర్ కింద వానాకాలం అవసరాలు 60 టీఎంసీలు ఉంటాయని తేల్చింది. ప్రస్తుతం సాగర్‌లో నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను 169. 10 టీఎంసీల నీరు ఉంది. ఇందులో కనీస నీటిమట్టాలకు ఎగువన ఉన్నది 40 టీఎంసీలే. ఈ నీటితో నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండాలంటే మరో 75 టీఎంసీల మేర నీరు కావాల్సి ఉందని, మంచి వర్షాలు కురిసి ప్రవాహాలు పెరిగితే 15 రోజుల్లో ఇవి నిండుతాయని అంచనా వేసింది. ఇక శ్రీశైలం లో 215 టీఎంసీలకుగాను కేవలం 35 టీఎంసీల లభ్యత ఉన్నందున కల్వకుర్తి కింద 4.50 లక్షల ఎకరాలకు నీటి విడుదల సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది. జూరాలపై ఉన్న కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు కింద సైతం వరదొస్తే 5 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చని తేల్చింది. సింగూరులో నీటి లభ్యత లేని దృష్ట్యా 40 వేల ఎకరాలకు నీరిచ్చే పరిస్థితి లేదని, నిజాంసాగర్ కింద సైతం నీరివ్వలేమంది. మధ్యతరహా ప్రాజెక్టులైన కడెం, కొమురం భీం, తదితర ప్రాజెక్టుల్లోకి నీరొస్తే 2 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించింది. -
శ్రీరాముడికి జలాభిషేకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే వానాకాలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద పూర్తి ఆయకట్టు సాగులోకి తెచ్చేలా బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. ఎస్సారెస్పీ కింద నిర్ణయించిన పూర్తి ఆయకట్టుకు నీరివ్వడంతో పాటే ప్రతి చెరువును నింపి నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పరిధిలోని 16.40 లక్షల ఎకరాలకు జూలై నుంచి నీరు విడుదల చేసి, చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఎగువ నుంచి వచ్చే ప్రవాహాల మేరకు కాళేశ్వరం ద్వారా నీటిని ఎస్సారెస్పీకి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం ఆయకట్టుకు నీరు.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్జేజ్–1 కింద 9.60 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో 3.97 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. గతేడాది వానాకాల సీజన్లో పుష్కలంగా వర్షాలు కురవడంతో నీటి వినియోగం పెద్దగా అవసరం లేక పోయింది. అదే యాసంగి సీజన్లో మాత్రం స్టేజ్–1 కింద 9.50 లక్షల ఎకరాలు, స్టేజ్–2 కింద 2.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. దీనికోసం మొత్తంగా 90 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఇందులో 25 నుంచి 30 టీఎంసీల నీరు కాళేశ్వరం ద్వారా తరలించిన నీటి వాటా ఉంది. అయితే ఈ ఏడాది స్టేజ్–1, 2ల కింద ఉన్న మొత్తం ఆయకట్టు 13 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ఆయకట్టుకు జూలై ఒకటి నుంచే నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా ప్రాజెక్టులోకి ఆగస్టు నుంచి అధిక ప్రవాహాలుంటాయి. గత పదేళ్ల ప్రవాహాల లెక్కలు తీసుకుంటే జూన్, జూలైలో వచ్చిన ప్రవాహాలు సగటున 10 నుంచి 15 టీఎంసీల మేర ఉండగా, ఆగస్టులో 50 నుంచి 60 టీఎంసీలుంది. కానీ ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది ఎస్సారెస్పీలో 30 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఇందులో 10 టీఎంసీలు తాగునీటికి పక్కనపెట్టి మిగతా 20 టీఎంసీల నీటిని జూలై నుంచే సాగుకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటే ఎస్సారెస్పీపైనే ఆధారపడ్డ అలీసాగర్, గుత్ఫా కింద ఉన్న 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్‌మానేరు కింద 30 వేల ఎకరాలు, సదర్‌మఠ్, గౌరవెల్లి రిజర్వాయర్ల కింద మరో 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. వస్తే వరద.. లేదంటే ఎత్తిపోత ఆగస్టులో ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరద ప్రవాహాలను అంచనా వేసుకుంటూ, ప్రవాహాలు ఉంటే ఆ నీటితో, లేనిపక్షంలో కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేశారు. ఎస్సారెస్పీలో భాగంగా ఉండే లోయర్ మానేరు కింద 5 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసే నీటిని తరలించనున్నారు. ఇక్కడి నుంచే స్టేజ్–2 కింద సూర్యాపేట జిల్లా వరకున్న 3.50 లక్షల ఎకరాలకు నీరివ్వనున్నారు. ఇక ఎల్ఎండీ ఎగువన ఉన్న 4.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడితే ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాళేశ్వరం నీటిని ప్రాజెక్టులోకి తరలించి, ఆయకట్టుకు నీరివ్వనున్నారు. ఇప్పటికే పునరుజ్జీవ పథకం పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఈ సీజన్లో కాళేశ్వరం ద్వారా కనీసంగా 200 టీఎంసీల ఎత్తిపోతలకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎస్సారెస్పీ నీటితో పాటే కాళేశ్వరం నీటిని కలిపి మొత్తంగా 2,200 చెరువులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వరద కాల్వ కింద 49, ఎస్సారెస్పీ కింద 900 చెరువులు, కాళేశ్వరం కింద మరో 1,200 చెరువులున్నాయి. ఆరునూరైనా ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు వరకు నీరందించడం, ప్రతి చెరువునూ నింపడం లక్ష్యంగా సాగు నీటి విడుదల ప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఇదే అంశమై సోమవారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్షించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా నీటి విడుదల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. -
విద్యుత్ డిమాండున్నా సరఫరాకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్లకు చేరినా, సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ, గృహావసరాలకు కనెక్షన్లు పెరగడంతో వినియోగం పెరిగిందని వెల్లడించారు. కొత్తగా 40 లక్షల కనెక్షన్లు ఇవ్వడంతో విద్యుత్ డిమాండ్ రెండు రెట్లు పెరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు అదనంగా విద్యుత్ వాడకం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే హెచ్చరించారని, అందుకు అనుగుణంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపుపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. సోమవారం ఆయన ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల ద్వారా నీటి పంపిణీ, కాల్వలకు అవసరమైన మరమ్మతులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు సూర్యాపేటకు వస్తాయా? అంటూ ప్రతిపక్ష నేతలు అవహేళన చేశారని, వారికి నీళ్లు తెచ్చి సమాధానమిచ్చామన్నారు. కాగా, ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డిండి ప్రా జెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే దీనిపై సీఎం సమీక్షిస్తారని తె లిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు సైతం అడ్వాన్సులు చెల్లించామని, సాంకేతిక ఇబ్బందుల వల్ల పనులకు ఆటంకం కలిగినా వాటినీ పరిష్కరిస్తామన్నారు. -
గోదారంత సంబురం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతాలను గోదావరి జలాలు సస్యశ్యామలం చేయనున్నాయి. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం జలాల ఎత్తిపోతల ద్వారా దాని పరిధిలోని రిజర్వాయర్లు, బ్యారేజీలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది గోదావరి ప్రాజెక్టుల్లో ఏకంగా 176 టీఎంసీలకు పైగా నీటి లభ్యత ఉండటంతో పరీవాహక ప్రాంతాల్లో యాసంగి సీజన్ సంబరంగా మారుతోంది. నిండుకుండలా ఎస్సారెస్పీ ప్రాజెక్టు లభ్యత పుష్కలం.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో ఈ ఏడాది నీటి లభ్యత పుష్కలంగా ఉంది. గోదావరి బేసిన్లో ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల పూర్తి నిల్వ సామర్థ్యం 251.61 టీఎంసీలు కాగా, ఈ ఏడాది 176.55 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే 108.83 టీఎంసీల మేర నిల్వలు ఎక్కువగా ఉండటం విశేషం. ముఖ్యంగా ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరులో పూర్తిస్థాయి నిల్వలున్నాయి. లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో 24 టీఎంసీలకు గానూ 17.82 టీఎంసీల మేర నిల్వలున్నప్పటికీ కాళేశ్వరం మోటార్ల ద్వారా రోజూ 7,900 క్యూసెక్కుల మేర నీటిని ఇక్కడికి తరలిస్తున్నారు. ఇందులోంచి 3,600 క్యూసెక్కుల మేర నీటిని కాల్వలకు వదులుతున్నారు. మొత్తంగా మేడిగడ్డ మొదలు ఎల్ఎండీ వరకు 225 కిలోమీటర్ల మేర గోదావరి పరివాహకం అంతా జలకళతో ఉట్టిపడుతోంది. మిడ్‌మానేరు ద్వారా వచ్చే నెల నుంచి కాళేశ్వరంలోని ప్యాకేజీ–10 కింద అనంతగిరి, రంగనాయక్‌సాగర్‌లోకి అటు నుంచి మల్లన్నసాగర్ కాల్వల ద్వారా కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించనున్నారు. దీనిపై ఇటీవలే గజ్వేల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేశారు. మిడ్‌మానేరు నుంచి ఎత్తిపోతలు మొదలైతే ఎగువ మేడిగడ్డ నుంచి లభ్యతగా ఉన్న వరద గోదావరినంతా మోటార్ల ద్వారా ఎత్తిపోస్తూ నీటి లభ్యతను మరింత పెంచనున్నారు. మధ్యమానేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా ఆయకట్టు సాగులోకి.. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–1 కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు 4 లక్షల ఎకరాలకు, అలీసాగర్, గుత్ప, ఇతర పథకాల కింద మరో లక్ష ఎకరాలు, ఎల్ఎండీకి దిగువన 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. గతేడాది 9 తడుల్లో నీళ్లు ఇవ్వగా ఈసారి పది తడులు ఇచ్చేందుకైనా సిద్ధమని ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నెల 26 నుంచి యాసంగికి నీటి విడుదల ఉండే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెయిల్ ఎండ్‌లోని 644 చెరువులను నింపుతున్నారు. కడెం కింద 30 వేల ఎకరాలు, కొమురంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల వంటి మధ్య తరహా ప్రాజెక్టుల కింద మరో 2 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా యాసంగి ప్రణాళిక సిద్ధమైంది. ఇక గోదావరి బేసిన్‌లోని 20,151 చెరువులకు గానూ 12,300 చెరువుల్లో పూర్తి స్థాయి నీటి లభ్యత ఉండగా, మరో 4,350 చెరువుల్లో సగానికి పైగా నిండి ఉన్నాయి. ఇదికూడా ఆయకట్టు సాగుకు దోహదం చేయనుంది. -
కిసాన్‌నగర్ వరకే ‘కాళేశ్వరం’ నీరు
సాక్షి, బాల్కొండ: ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా శనివారం ప్రారంభించిన వెట్‌రన్ నిలిచిపోయింది. దీంతో వరద కాలువలో నీరు బాల్కొండ మండలం కిసాన్‌నగర్ వరకు మాత్రమే వచ్చి నిలిచి పోయింది. వరద కాలువపై రాజేశ్వర్‌రావుపేట్ వద్ద నిర్మించిన రెండో పంపుహౌస్ నుంచి రెండు మోటార్ల ద్వారా వెట్‌రన్ నిర్వహించారు. శనివారం కిసాన్‌నగర్ వరకు చేరుకోగానే మోటార్లు నిలిపి వేయడంతో నీరు అక్కడికే నిలిచి పోయింది. ఎస్సారెస్పీకి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం నీళ్లు ఆగాయి. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే, మంత్రివర్గ విస్తరణ ఉండటంతో పర్యటన వాయిదా పడటంతో మోటార్ల ద్వారా వెట్‌రన్ నిలిపి వేసినట్లు తెలిసింది. దీంతో కిసాన్‌నగర్ వరకు మాత్రమే కాళేశ్వరం నీళ్లు వచ్చి చేరాయి. త్వరలోనే ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు చేర వేసే కార్యక్రమం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. -
ద్వీపకల్పాన్ని తలపిస్తున్న అశ్వారావుపేట
సాక్షి నెట్వర్క్: ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తర తెలంగాణ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రోజంతా ముసురేసింది. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద రావడంతో గేట్లను ఎత్తివేశారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం ధాటికి అనేక ఇళ్లు కూలుతుండగా, రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు జన్నారం నుంచే రాకపోకలు సాగుతుండగా, బ్రిడ్జి లేకపోవడంతో జన్నారం మండలం కలమడుగు, ధర్మపురి మీదుగా 50 కిలోమీటర్ల దూరం తిరిగి వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జన్నారం మండలం చింతగూడలో ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇందన్పల్లి వంతెన అప్రోచ్ రోడ్డు వద్ద ఆదివారం బురదలో దిగబడిన వ్యాన్ సోమవారం వరద ఉధృతికి కొట్టుకుపోగా, పోలీసులు క్రేన్ తెప్పించి బయటకు తీశారు. ఆసిఫాబాద్‌లోని అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, వివేకానందచౌక్ జలమయమయ్యాయి. గుండి వాగు, పెద్దవాగు, తుంపెల్లి ఒర్రె పొంగిపొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులకు భారీ వరద రావడంతో గేట్లు ఎత్తివేశారు. సారంగాపూర్ మండలంలోని ధని కొత్త చెరువు అలుగులో నుంచి 20 గేదెలు కొట్టుకుపోగా, అందులో 17 మృత్యువాతపడ్డాయి. మామడ మండలంలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ వద్ద మట్టి కట్ట, బిగించడానికి సిద్ధంగా ఉంచిన గేట్లు కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 3 రోజులుగా వరద నీటిలోనే ఉంది. దుబార్పేట్ గ్రామం వరద నుంచి తేరుకోలేదు. 300 మందికి మండల కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్లోని రైతు విశ్రాంతి భవనంలో ఆశ్రయం కల్పించారు. గిరిజన గురుకుల పాఠశాలలో భారీగా వరద నీరు చేరడంతో 800 మంది విద్యార్థినులకు మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. కుంటాల జలపాతం వద్ద ఏర్పా ట్లు చేసిన బారికేడ్లు వరదకు కొట్టుకుపోయాయి. ద్వీపకల్పాన్ని తలపిస్తున్న అశ్వారావుపేట అశ్వారావుపేట ప్రాంతం ద్వీపకల్పాన్ని తలపిస్తోంది. రెండువైపులా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరు పాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం డివిజన్లోని దుమ్ముగూడెం మండలం గంగోలు వద్ద రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. కాళేశ్వరం వద్ద 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద, వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది.కాళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రం 8 మీటర్ల ఎత్తులో ప్రవాహం వెళ్తోంది. అన్నారం వద్ద లక్ష క్యూసెక్కుల వరద తరలిపోగా, కాళేశ్వరం వద్ద 3.50 లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వైపునకు వెళ్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వాజేడు మండల పేరూరు వద్ద 11.67 మీటర్ల ఎత్తున గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఆదివారం 7 మీటర్ల వరకే ఉన్న గోదావరి ప్రవాహం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో 8.4 మీటర్లకు పెరిగింది. పెరుగుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి 10 గంటల వరకు 33.125 టీఎంసీలుగా ఉన్న నీటి మట్టం సోమవారం రాత్రి 7 గంటల వరకు 34.827 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 70,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,090 అడుగుల (90.138 టీఎంసీలు)కుగాను సోమవారం రాత్రి ఏడు గంటలకు వరకు 1072.80 అడుగులు (34.827 టీఎంసీలు)కు చేరుకుంది. నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి గోదావరిఖని: భారీ వర్షాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలచింది. మట్టి వెలికితీత పనులు ముందుకు సాగడం లేదు. రామగుండం రీజియన్‌లో 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తాలిపేరు, కిన్నెరసానికి వరద తాలిపేరు, కిన్నెరసాని జలాశయాల్లోకి భారీగా వరదనీరు వస్తోంది. తాలిపేరు జలాశయం పూర్తిగా నిండింది. దీంతో మొత్తం 25 గేట్లు ఎత్తి 1,72,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 1,77,000 క్యూసెక్కులుగా ఉంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయం నీటిమట్టం 407 అడుగులు కాగా 403.60 అడుగుల మేర నీరుంది. ఇన్‌ఫ్లో 35,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 30,000 క్యూసెక్కులు ఉంది. భద్రాచలం వద్ద గోదావరి 44.5 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తోంది. భద్రాచలంలోని అశోక్ నగర్‌కాలనీలో సుమారు 30కి పైగా ఇళ్లలోకి వరదనీరు చేరడంతో వారిని పునరావాస శిబిరానికి తరలించారు. వాగులో పురిటినొప్పులతో... మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ సమీపంలోని కత్తెర్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచాయి. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటినొప్పులు రాగా గ్రామస్తులు వాగు దాటించి 108 అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి జిల్లా అతలాకుతలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతలాకుతలం అవుతోంది. అనేకచోట్ల రోడ్లు మునిగిపోవడం, కోతకు గురికావడంతో వందకుపైగా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,465.2 హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 35 హెక్టార్లలో ఇసుక మేటలతో ఆయా రైతులు నష్టపోయారు. -
మధ్యమానేరుకు జలసిరి
బోయినపల్లి/సిరిసిల్ల: భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. దిగువకు వెళ్తున్న ఈ నీటిని వివిధ ప్రాజెక్టుల్లోకి మళ్లించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మధ్యమానేరు జలాశయాన్ని గోదావరి నీటితో నింపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు జలాశయానికి శ్రీరాంసాగర్ నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిరుడు 5 టీఎంసీల నీటిని మళ్లించిన అధికారులు.. ఈ ఏడాది 24 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి: మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాల ధాటికి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది నిండుగా పారుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 90 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం 28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పైనుంచి వచ్చే వరదతో రోజుకు 5–8 టీఎంసీల నీరు వచ్చి చేరుతోందని అధికారులు చెబుతున్నారు. శనివారం నాటికి 30–35 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిండితే వరద కాల్వ ద్వారా మధ్యమానేరు జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి నీరు చేరేందుకు 48 గంటల సమయం పడుతుందని లెక్కకట్టారు. అంటే.. 3 రోజుల్లో మధ్యమానేరులోకి గోదావరి జలాలు వచ్చి చేరనున్నాయి. దాదాపు 21 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. మధ్యమానేరు పూర్తిగా నిండుతుంది. ఈ ప్రాజెక్టు నిండితే.. అక్కడ నుంచి దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లోకి నీటిని వదిలిపెడతారు. మరోవైపు.. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్, ఎగువ మానేరుకు నీరు అందించే వీలు కలుగుతుంది. తద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జలాశయాలకు మధ్యమానేరు గుండెకాయలా మారుతుంది. ముంపు గ్రామాలు ఖాళీ చేయాలి మధ్యమానేరులో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులు వెంటనే ఊర్లు ఖాళీ చేసి.. పునరావాస కాలనీలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్‌ఠాణా, బోయినపల్లి మండలం కొదురుపాక, వర్దవెల్లి, నీలోజిపల్లి గ్రామస్తులు కొందరు ఊర్లు ఖాళీ చేసి పునరావాస కాలనీకు చేరారు. ఇంకా కొన్ని గ్రామాల ప్రజలు ముంపు గ్రామాల్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. వారంతా పునరావాస కాలనీలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. మూడు రోజుల్లో మధ్యమానేరు జలాశయానికి జలకళ రాబోతుంది. ప్రాజెక్టు నిండితే.. సిరిసిల్ల ప్రాంతంలో కొంత మేరకు భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. మిడ్‌మానేరుకు వరద నీరు మహారాష్ట్రలోని నాందేడ్ ఎస్‌సీవీపీ, ఆందూర, బాలేగావ్, బాబ్జీ బ్యారేజీల నుంచి రోజూ 9 టీఎంసీల నీరు ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 23 టీఎంసీల నీరు నిల్వఉంది. వరుసగా మూడురోజులపాటు నీరు ఇలానే వస్తే ఎస్సారెస్పీలో 30 టీఎంసీలకు పైగా చేరుతుంది. ఆ ప్రాజెక్టులో ఈ మేరకు నీరు చేరితే మధ్యమానేరులోకి వరద కాలువ ద్వారా నీరు వదిలే అవకాశం ఉంది. –శ్రీకాంత్‌రావు, ఎస్ఈ, మిడ్‌మానేరు ఎస్సారెస్పీకి భారీగా వరద ఇన్‌ఫ్లో 62,520 క్యూసెక్కులు జగిత్యాల అగ్రికల్చర్: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరదనీరు వస్తోంది. ప్రాజెక్టులో 1067.4 అడుగుల(24.277 టీఎంసీల) నీటి నిల్వ ఉంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో 42,385 క్యూసెక్కుల వరదనీరు రాగా.. ఏడు గంటలకు 46,940 క్యూసెక్కులకు, 10 గంటలకు 49,240, 11 గంటలకు 58,330, 12 గంటలకు 68,650, మధ్యాహ్నం ఒంటిగంటకు 76,540, సాయంత్రం 4 గంటల వరకు 82,650 క్యూసెక్కు లకు చేరింది. తిరిగి సాయంత్రం ఆరు గంటల వరకు 62,520 క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1054.90 (9.214 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. -
పోచంపాడు వద్ద మరోసారి ఆందోళనకు దిగిన రైతులు
-
నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఉద్రిక్తత
-
వర్షాలతో దిగువకు భారీ వరద
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగుతోంది. ఎగువ నీరంతా గోదావరి వైపు ఉరకలెత్తి వస్తోంది. ప్రాణహితకు 2.25 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతం ఉండటం, అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. ఐదు రోజుల కిందట వరకు ప్రాణహిత నదికి 3 వేల క్యూసెక్కుల వరద కొనసాగగా, 3 రోజుల కిందట అది 7 వేలకు చేరింది. మంగళవారం కాళేశ్వరం వద్ద వరద 36 వేల క్యూసెక్కుల మేర నమోదు కాగా, బుధవారం ఒక్కసారిగా 80 వేల క్యూసెక్కులకు పెరిగింది. 2016లో ఇదే సమయానికి ఈ స్థాయి వరద రాగా, ప్రస్తుతం అంతకు మించి కొంత ఎక్కువ వరదే వస్తోంది. ప్రాణహిత నది నుంచి భారీగా ప్రవాహాలు వస్తుండటంతో మున్ముందు వరద పెరిగే అవకాశాలున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ పనులపై ప్రభావం ప్రాణహిత వరద ప్రభావం మేడిగడ్డ బ్యారేజీ పనులపై పడింది. వరద ప్రవాహం వల్ల కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. మంగళ వారం ఇక్కడ 3,009 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరగ్గా, బుధవారం ఒక్క క్యూబిక్ మీటర్ పనికూడా జరగలేదు. ప్రాణ హిత గోదావరిలో కలవక ముందు ప్రాంతంలో నిర్మి స్తున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు యథావిధిగా కొనసాగాయి. బుధవారం అన్నారం పరిధిలో 2,315 క్యూ.మీ., సుందిళ్ల పరిధిలో 2,596 క్యూ.మీ. పనులు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో గోదావరి నది నుంచి మహారాష్ట్ర వైపునకు రాకపోకల కోసం రోడ్డు వేయగా, ప్రస్తుత వరదలతో పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నియంత్రణకు కాఫర్ డ్యామ్ నిర్మించాలని భావించగా, తెలంగాణ వైపు (కుడి) పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్ర వైపు (ఎడమ) పనులు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు సాగక పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పాటే 85 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. వీటిని 8 బ్లాకులుగా విభజించారు. ప్రస్తుతం వరద నేపథ్యంలో 4 బ్లాకుల్లోని పనులు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మేడిగడ్డ పంప్‌హౌజ్ పరిధిలోని 13 కి.మీ. గ్రావిటీ కెనాల్‌లోనూ నీళ్లు చేరడంతో అక్కడ పనులు నెమ్మదించాయి. 60 హెచ్‌పీ మోటార్లు 6 ఏర్పాటు చేసి డీ వాటరింగ్ చేస్తూ పనులు కొనసాగిస్తున్నారు. ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్‌ఫ్లో నిన్నమొన్నటి వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగవ ఎస్సారెస్పీకి ప్రవాహాలు పెరగ్గా, బుధవారం నుంచి క్రమంగా తగ్గాయి. మంగళవారం 21 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా, బుధవారం ఉదయానికి 13 వేల క్యూసెక్కులకు చేరాయి. సాయంత్రానికి 5,050 క్యూసెక్కులకు చేరాయి. మహారాష్ట్ర బాబ్లీ గేట్లను తిరిగి ఈ నెలాఖరున ఎత్తిన తర్వాతే దిగువకు భారీ ప్రవాహాలు వచ్చే అవకాశం ఉంటుంది. సింగూరులోకి 2,113 క్యూసెక్కులు, ఎల్లంపల్లిలో 2,040, కడెంలో 1,860 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ఇక కృష్ణా బేసిన్లో తుంగభద్రలోకి 20 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, జూరాలకు 2,700 క్యూసెక్కుల వరద వస్తోంది. -
ఎస్సారెస్పీ నీటి కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధర్నా
సాక్షి, జగిత్యాల: తిప్పనపేట గ్రామానికి చెందిన పంటపొలాలకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అందడంలేదని నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సారెస్పీ అధికారులకు నీటి విడుదలపై కార్యాచరణ లేదన్నారు. అలాగే చివరి ఆయకట్టుకు నీరందించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతేగాక సింగూర్ నుంచి నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, మిడ్ మానేరుకు 14 టీఎంసీల నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన రైతులు నీటిపారుదలశాఖ ఈఈ దరూర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. -
ఆందోళన చెందవద్దు: ఎంపీ కవిత
నిజామాబాద్: జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఎంపీ కవిత భరోసా ఇచ్చారు. ప్రాజెక్ట్ నీటిని నిజామాబాద్ జిల్లా రైతులకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అందిస్తామని స్పష్టం చేశారు. పంటల సాగుకు రైతులు సన్నద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా రైతులకు నీరు అందించే విషయమై ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిశామని తెలిపారు. ఈ విషయంలో రైతులు అపోహలకు గురికావద్దని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణలు, ఆందోళనలు అర్థరహితమని ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. -
సాగుకు 38.4 తాగుకు 12.6 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) కింద యాసంగి కార్యాచరణను నీటిపారుదల శాఖ ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం కల్పించి, మిగతా లభ్యత నీటితో యాసంగికి నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. లభ్యతగా ఉన్న నీటిలో 38.4 టీఎంసీలను సాగు అవసరాలకు, 12.6 టీఎంసీలను తాగు అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించింది. మొత్తంగా ఎస్సారెస్పీ పరిధిలో 5.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించింది. రెండు రోజుల కిందట ఎస్సారెస్పీ కింది ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అంశమై సమీక్షించిన ముఖ్యమంత్రి, మిషన్ భగీరథ అవసరాలకు పోనూ, మిగతా నీటితో యాసంగి ప్రణాళిక రూపొందించాలని సూచించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఎస్సారెస్పీలో లభ్యతగా ఉన్న 55.16 టీఎంసీలకు అదనంగా సింగూరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా మరో 5 టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఎస్సారెస్పీలో నీటి నిల్వలు 60.16 టీఎంసీలకు చేరుతాయి. ఈ నీటిలో 15 టీఎంసీలను లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండీ)కు కాకతీయ కెనాల్ ద్వారా విడుదల చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో ఆవిరి, సరఫరా నష్టాలు పోనూ 11.5 టీఎంసీల మేర ఎల్ఎండీని చేరినా, ప్రాజెక్టులో ఇప్పటికే లభ్యతగా ఉన్న నీటితో ప్రాజెక్టు నిల్వ 19.39 టీఎంసీలకు చేరనుంది. ఎగువన 4 లక్షలు.. దిగువన 1.60 లక్షలు ఎస్సారెస్పీ, ఎల్ఎండీలో నిల్వలకు అనుగుణంగా ఎల్ఎండీ ఎగువన, దిగువన యాసంగి ప్రణాళిక ఖరారు చేశారు. ఎగువన తాగునీటికి 6.5 టీఎంసీలు పక్కనపెట్టి, 28.88 టీఎంసీలతో ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఏడు తడులకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 4 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయిం చారు. ఇందులో లక్ష్మీ కెనాల్ కింద 16,055 ఎకరాలు, సరస్వతి కెనాల్ కింద 16,300 ఎకరాలు, కాకతీయ కెనాల్ కింద 3,63,645 ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందిం చారు. ఇందులో లక్ష్మీ కెనాల్ కింద ఇవ్వాల్సిన ఆయకట్టులోనే చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం ఆయకట్టు ఉండనుంది. ఇక ఎల్ఎండీ దిగువన మిషన్ భగీరథకు 6.16 టీఎంసీలు పక్కనపెట్టి, 9.53 టీఎంసీలను సాగుకు ఇవ్వనున్నారు. డిసెంబర్ 15 నుంచి మార్చి 14 వరకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన 6 తడుల్లో 1.60 లక్షల ఎకరాలకు నీళ్లివ్వను న్నారు. ఇక వీటితో పాటే సింగూరు కింద 5.7 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటా యించి, 5 టీఎంసీలు దిగువ నిజాం సాగర్‌కు విడుదల చేయనున్నారు. సింగూరు కింద 2 టీఎంసీలతో 30 వేల ఎకరాలు, నిజాం సాగర్‌లో మొత్తంగా లభ్యమయ్యే 18 టీఎంసీల నీటితో 1.50 లక్షల ఎకరాలు, గుత్పా, అలీసాగర్ ఎత్తిపోతల కింద 2 టీఎంసీ లతో 20 వేల ఎకరాలు కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. -
నదుల అనుసంధానం ఎవరికోసం?
అభిప్రాయం నా చిన్నతనంలో కూడెళ్లి వాగు పొంగితే జాతరకు పోయినట్టు పోయి చూసి సంబురపడేటోళ్లు. కానీ ఆ నీళ్లు ఎటుపో తున్నయో మాకు సోయి లేకుండే. నీళ్లన్నీ అప్పర్‌మానేరు మీదుగా గోదావరిలో కలిసేవి. తెలంగాణ ఉద్యమ నేపధ్యం నీళ్ల గోసను విడమరిచి చెప్పింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నీళ్లే ఆధారం. నీళ్లుంటేనే పల్లె పచ్చగా ఉంటుంది. నీళ్ల విలువేంటో తెలిసిన సీఎం కేసీఆర్.. వెళ్లిపోయిన కూడెళ్లి నీళ్లనే కాదు. గోదావరి నీళ్లనే మలుపుకొచ్చి తెలంగాణ రైతుల పాదాలు కడగాలని సంకల్పించారు. బడ్జెట్లో ఏటా 25 వేల కోట్ల నిధులను ప్రాజెక్టులకు కేటాయించి కోటి ఎకరాల మాగాణికి జీవం పోసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గోదావరిలో మనకొచ్చే 954 టీఎంసీల వాటాలో ఒక్క చుక్క వృథాగా పోకుండా జల ప్రాజెక్టులకు రూపం ఇచ్చారు. ఇప్పుడు నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను బలవంతంగా తీసుకుపోయి కృష్ణా, కావేరిలోకి మళ్లించి దిగువ రాష్ట్రాల్లో ఓట్ల సాగుకు మోదీ సర్కారు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణకు రావలసిన జలాలను కేటాయించడంలో మొద టినుంచి అన్యాయమే జరుగుతూ వచ్చింది. కనీసం ఉన్న గోదావరి జలాలనైనా పోతం చేసుకుందామంటే మోదీ ప్రభుత్వం తెర మీదకు తెచ్చిన నదుల అనుసంధానంతో మళ్లీ తెలంగాణను ఎండబెట్టేటట్టే కనబడుతోంది. మహానదిని గోదావరితో కలిపి, గోదావరిని కృష్ణానది మీదుగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కావేరి నదికి అనుసంధానం చేయాలని ప్రతిపాదించారు. తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉండగా నిర్మించిన ప్రాజె క్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్ధ్యం కలిపి 684 టీఎం సీల జలాలే వాడుకుంటున్నారని, మిగిలిన 270 టీఎంసీల నీళ్లు మిగులు జలాలే అని కేంద్రం చెప్తోంది. ఇవి అన్యాయమైన లెక్కలు అని జలరంగ నిపుణులు దివంగత విద్యాసాగర్‌రావు బతికి ఉన్నంత కాలం నెత్తీనోరు బాదుకున్నారు. ఇప్పుడు గోదావరి మీద కాళేశ్వరం, కంతనపల్లి, తుపాకుల గూడెం, దుమ్ముగూడెం, దేవాదుల ప్రాజెక్టులు రూపం పోసుకుం టున్నాయి. ఏ నది జలాలనైనా మరో 30 ఏళ్ల నాటికి పెరగనున్న జనాభా, వారికి అవసరమైన నీటి పరిమాణాన్ని నిర్ధారించి లెక్క గట్టాలి. ఆ తరువాతే మిగులు జలాలను గుర్తించాలి. కానీ కేంద్రం చెప్పే లెక్కలు 20 ఏళ్ల కిందట 75 శాతం నీటి లభ్యతతో తీసిన లెక్కలు చెప్తోంది. ఆ లెక్కలు ఇప్పటి నీటి లభ్యతతో ఎలా సరి పోలుతాయి? నిర్మాణం పూర్తి అయిన ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలు మనకు అవసరపడతాయి. రాష్ట్రాల అభ్యర్ధనలను పరిగణనలోకి తీసు కోకుండా మొండిగా నదులను అనుసంధానం చేసి తెలంగాణ మాగాణాన్ని ఎండబెట్టి గోదావరి జలాలను కృష్ణా, కావేరిలకు పంపించే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజానీకం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. పశ్చిమ కనుమల్లో వర్ష ప్రభావం ఎక్కువ. అంతా గుట్టలు, లోయలతో కూడిన ప్రాంతం కాబట్టి వ్యవసాయ భూమి, నివాస ప్రాంతాలు కూడా తక్కువే. ఏటా వందల కోట్ల క్యూసెక్కుల జల రాశులు వచ్చి చేరుతున్నాయి. ఇందులో 90 శాతం నీళ్లు పశ్చి మంగా ప్రవహించి వృథాగా అరేబియా మహా సముద్రంలో కలు స్తున్నాయి. వీటిలో పావు వంతు నీళ్లను ఒడిసి పట్టుకుని, వాటిని తూర్పు దిశగా తీసుకొచ్చి మహానదిలోకి మళ్లిస్తే ఆ జలాలు గోదా వరి, కృష్ణాల మీదుగా కావేరి నదిని తడుతాయి. అప్పుడు నాలుగు నదులు ఏమిటీ? దక్షిణ భారతంలోని నదులన్నిటినీ అనుసం ధానం చేయవచ్చు. మోదీ అటు దిశగా ఆలోచన చేయకుండా గోదావరిని కృష్ణా, కావేరితో అనుసంధానం చేస్తానంటే మాత్రం తెలంగాణ ప్రజలు మరో మహా ఉద్యమానికి సిద్ధపడతారు. వ్యాసకర్త దుబ్బాక శాసనసభ్యులు ‘ 94403 80141 సోలిపేట రామలింగారెడ్డి -
ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల
6 లక్షల ఎకరాల సాగుకు నీరు 18 మెగావాట్ల విద్యుదుత్పత్తి బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాల్వల ద్వారా ఆయకట్టుకు గురువారం నీటి విడుదలను ప్రారంభించారు. ఇది వరకే చెరువులు నింపేందుకు ప్రాజెక్ట్ అన్ని కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కానీ గురువారం నుంచి ఉప కాల్వల ద్వారా కూడా నీటి విడుదల ప్రారంభించారు. వారబంధీ ప్రకారం ప్రాజెక్ట్ నుంచి 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తామని ఎస్ఈ సత్యనారాయణ తెలిపారు. 8 రోజులు కాల్వల ద్వారా నీటి విడుదల చేస్తూ వారం రోజులు నిలిపివేత ఉంటుందన్నారు. ఆయకట్టు రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకతీయ కాలువ ద్వారా 6,125 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 6,076 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి 5,215 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో స్థానిక జల విద్యుతుత్పత్తి కేంద్రంలో మూడు టర్బయిన్ల ద్వారా 18 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్కో అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091అడుగులు (90 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1076.60 అడుగుల(43.70 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని చెప్పారు.