కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం సరస్వతీ బ్యారేజీ శనివారం కళకళలాడుతున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతాలను గోదావరి జలాలు సస్యశ్యామలం చేయనున్నాయి. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం జలాల ఎత్తిపోతల ద్వారా దాని పరిధిలోని రిజర్వాయర్లు, బ్యారేజీలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది గోదావరి ప్రాజెక్టుల్లో ఏకంగా 176 టీఎంసీలకు పైగా నీటి లభ్యత ఉండటంతో పరీవాహక ప్రాంతాల్లో యాసంగి సీజన్ సంబరంగా మారుతోంది.
నిండుకుండలా ఎస్సారెస్పీ ప్రాజెక్టు
లభ్యత పుష్కలం..
రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో ఈ ఏడాది నీటి లభ్యత పుష్కలంగా ఉంది. గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్‌ల పూర్తి నిల్వ సామర్థ్యం 251.61 టీఎంసీలు కాగా, ఈ ఏడాది 176.55 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే 108.83 టీఎంసీల మేర నిల్వలు ఎక్కువగా ఉండటం విశేషం. ముఖ్యంగా ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరులో పూర్తిస్థాయి నిల్వలున్నాయి. లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)లో 24 టీఎంసీలకు గానూ 17.82 టీఎంసీల మేర నిల్వలున్నప్పటికీ కాళేశ్వరం మోటార్ల ద్వారా రోజూ 7,900 క్యూసెక్కుల మేర నీటిని ఇక్కడికి తరలిస్తున్నారు.
ఇందులోంచి 3,600 క్యూసెక్కుల మేర నీటిని కాల్వలకు వదులుతున్నారు. మొత్తంగా మేడిగడ్డ మొదలు ఎల్‌ఎండీ వరకు 225 కిలోమీటర్ల మేర గోదావరి పరివాహకం అంతా జలకళతో ఉట్టిపడుతోంది. మిడ్‌మానేరు ద్వారా వచ్చే నెల నుంచి కాళేశ్వరంలోని ప్యాకేజీ–10 కింద అనంతగిరి, రంగనాయక్‌సాగర్‌లోకి అటు నుంచి మల్లన్నసాగర్ కాల్వల ద్వారా కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించనున్నారు. దీనిపై ఇటీవలే గజ్వేల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేశారు. మిడ్‌మానేరు నుంచి ఎత్తిపోతలు మొదలైతే ఎగువ మేడిగడ్డ నుంచి లభ్యతగా ఉన్న వరద గోదావరినంతా మోటార్ల ద్వారా ఎత్తిపోస్తూ నీటి లభ్యతను మరింత పెంచనున్నారు.
మధ్యమానేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు
గణనీయంగా ఆయకట్టు సాగులోకి..
నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–1 కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ నుంచి ఎల్‌ఎండీ వరకు 4 లక్షల ఎకరాలకు, అలీసాగర్, గుత్ప, ఇతర పథకాల కింద మరో లక్ష ఎకరాలు, ఎల్‌ఎండీకి దిగువన 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. గతేడాది 9 తడుల్లో నీళ్లు ఇవ్వగా ఈసారి పది తడులు ఇచ్చేందుకైనా సిద్ధమని ఇంజనీర్లు చెబుతున్నారు.
ఈ నెల 26 నుంచి యాసంగికి నీటి విడుదల ఉండే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెయిల్ ఎండ్‌లోని 644 చెరువులను నింపుతున్నారు. కడెం కింద 30 వేల ఎకరాలు, కొమురంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల వంటి మధ్య తరహా ప్రాజెక్టుల కింద మరో 2 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా యాసంగి ప్రణాళిక సిద్ధమైంది. ఇక గోదావరి బేసిన్లోని 20,151 చెరువులకు గానూ 12,300 చెరువుల్లో పూర్తి స్థాయి నీటి లభ్యత ఉండగా, మరో 4,350 చెరువుల్లో సగానికి పైగా నిండి ఉన్నాయి. ఇదికూడా ఆయకట్టు సాగుకు దోహదం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment