godavari project
-
వరదొచ్చేదాకా ... ఎదురుచూపే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది విస్తారంగా కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదలతో ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై భారీ ఆశలే నెలకొన్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు ఖాళీ అవగా నైరుతి రుతుపవనాల రాక సకాలంలో ఉంటుందన్న అంచనాలు రాష్ట్రానికి ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు బేసిన్ల పరిధిలో 525 టీఎంసీల లోటు ఉండగా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే సకాలంలో సమృద్ధిగా కురిసే వానలపై భవిష్యత్తు ఆధారపడి ఉంది. వరదలొస్తేనే ప్రాజెక్టులకు ఊతం.. రాష్ట్రంలో ఖరీఫ్, యాసంగి సాగు అవసరాలకు భారీగా నీటి వినియోగం చేయడంతో ప్రాజెక్టులు నిండుకున్నాయి. అంతకుముందు ఏడాదులతో పోలిస్తే నిల్వలు కొంత మెరుగ్గానే ఉన్నా అవి తాగునీటికి తప్ప సాగు అవసరాలను తీర్చలేవు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకుగాను ప్రస్తు తం 327 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో ప్రస్తుతం 172 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా ఇందులో కనీస నీటిమట్టాలకు ఎగువన ఉన్నది కేవలం 35 టీఎంసీలే. ఈ నీటినే జూలై చివరి వరకు రాష్ట్రం వినియోగించుకోవాల్సి ఉంది. ఇక శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను కేవలం 35 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిండాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లోనే 210 టీఎంసీల నీటి కొరత ఉంది. అవి నిండితే కానీ శ్రీశైలానికి వరద కొనసాగే పరిస్థితి లేదు. గతేడాది భారీ వరదల కారణంగా జూలైలోనే 220 టీఎంసీల మేర నీరొచ్చింది. ఈ ఏడాది సైతం అలా వస్తేనే శ్రీశైలం నిండే అవకాశం ఉంది. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీల్లో) -
గోదారంత సంబురం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతాలను గోదావరి జలాలు సస్యశ్యామలం చేయనున్నాయి. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో గోదావరి బేసిన్ ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం జలాల ఎత్తిపోతల ద్వారా దాని పరిధిలోని రిజర్వాయర్లు, బ్యారేజీలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది గోదావరి ప్రాజెక్టుల్లో ఏకంగా 176 టీఎంసీలకు పైగా నీటి లభ్యత ఉండటంతో పరీవాహక ప్రాంతాల్లో యాసంగి సీజన్ సంబరంగా మారుతోంది. నిండుకుండలా ఎస్సారెస్పీ ప్రాజెక్టు లభ్యత పుష్కలం.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో ఈ ఏడాది నీటి లభ్యత పుష్కలంగా ఉంది. గోదావరి బేసిన్లో ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల పూర్తి నిల్వ సామర్థ్యం 251.61 టీఎంసీలు కాగా, ఈ ఏడాది 176.55 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే 108.83 టీఎంసీల మేర నిల్వలు ఎక్కువగా ఉండటం విశేషం. ముఖ్యంగా ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరులో పూర్తిస్థాయి నిల్వలున్నాయి. లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో 24 టీఎంసీలకు గానూ 17.82 టీఎంసీల మేర నిల్వలున్నప్పటికీ కాళేశ్వరం మోటార్ల ద్వారా రోజూ 7,900 క్యూసెక్కుల మేర నీటిని ఇక్కడికి తరలిస్తున్నారు. ఇందులోంచి 3,600 క్యూసెక్కుల మేర నీటిని కాల్వలకు వదులుతున్నారు. మొత్తంగా మేడిగడ్డ మొదలు ఎల్ఎండీ వరకు 225 కిలోమీటర్ల మేర గోదావరి పరివాహకం అంతా జలకళతో ఉట్టిపడుతోంది. మిడ్‌మానేరు ద్వారా వచ్చే నెల నుంచి కాళేశ్వరంలోని ప్యాకేజీ–10 కింద అనంతగిరి, రంగనాయక్‌సాగర్‌లోకి అటు నుంచి మల్లన్నసాగర్ కాల్వల ద్వారా కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించనున్నారు. దీనిపై ఇటీవలే గజ్వేల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేశారు. మిడ్‌మానేరు నుంచి ఎత్తిపోతలు మొదలైతే ఎగువ మేడిగడ్డ నుంచి లభ్యతగా ఉన్న వరద గోదావరినంతా మోటార్ల ద్వారా ఎత్తిపోస్తూ నీటి లభ్యతను మరింత పెంచనున్నారు. మధ్యమానేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా ఆయకట్టు సాగులోకి.. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–1 కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు 4 లక్షల ఎకరాలకు, అలీసాగర్, గుత్ప, ఇతర పథకాల కింద మరో లక్ష ఎకరాలు, ఎల్ఎండీకి దిగువన 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. గతేడాది 9 తడుల్లో నీళ్లు ఇవ్వగా ఈసారి పది తడులు ఇచ్చేందుకైనా సిద్ధమని ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నెల 26 నుంచి యాసంగికి నీటి విడుదల ఉండే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెయిల్ ఎండ్‌లోని 644 చెరువులను నింపుతున్నారు. కడెం కింద 30 వేల ఎకరాలు, కొమురంభీం, గడ్డెన్నవాగు, సాత్నాల వంటి మధ్య తరహా ప్రాజెక్టుల కింద మరో 2 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా యాసంగి ప్రణాళిక సిద్ధమైంది. ఇక గోదావరి బేసిన్‌లోని 20,151 చెరువులకు గానూ 12,300 చెరువుల్లో పూర్తి స్థాయి నీటి లభ్యత ఉండగా, మరో 4,350 చెరువుల్లో సగానికి పైగా నిండి ఉన్నాయి. ఇదికూడా ఆయకట్టు సాగుకు దోహదం చేయనుంది. -
కృష్ణవేణి గలగలలు
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్: శ్రీశైలం నుంచి కృష్ణవేణి పరవళ్లు కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం వడివడిగా పెరుగుతోంది. మరో నాలుగైదు రోజుల్లో ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకోనుంది. దాదాపు రెండేళ్ల తర్వాత నిండుకుండలా మారనుంది. దీంతో ఈ ఏడాది రబీలో ప్రాజెక్టు కింది ఆయకట్టులో పంట పండినట్లేనని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు అనుగుణంగా 65 టీఎంసీలతో 6.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా అధికారులు రబీ యాక్షన్ ప్లాన్‌ను సైతం సిద్ధం చేశారు. మరో 69 టీఎంసీలొస్తే చాలు.. శ్రీశైలం జలాశయంలోకి బుధవారం సాయంత్రానికి 1,81,768 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రస్తుతం జలాశయంలో 883.9 అడుగుల్లో 209.60 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో క్రస్ట్ గేట్లతోపాటు కుడి, ఎడమగట్టు కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 2,53,324 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో నాగార్జునసాగర్‌లోకి 2,38,036 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. బుధవారం సాయంత్రం కల్లా సాగర్ నీటిమట్టం 564.60 అడుగులకు (243.1976 టీఎంసీలు)చేరింది. గరిష్టస్థాయి నీటిమట్టం 590 అడుగులు. మరో 69 టీఎంసీల నీరు వచ్చి చేరితే సాగర్ క్రస్ట్‌గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. 20 రోజుల్లో 64 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. సుమారుగా 110 టీఎంసీలకు పైచిలుకు నీరు వచ్చి చేరింది. వరద ఇలాగే ఉంటే ఈసారి నాగార్జునసాగర్ నిండటం ఖాయమని జలవనరుల శాఖ అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో 2013–14లో మాత్రమే ప్రాజెక్టుకు భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దిగువకు 250 టీఎంసీల మేర నీరు వెళ్లింది. ఆ తర్వాతి ఏడాది 2014–15లో కూడా భారీ వరదలు వచ్చి ప్రాజెక్టు గేట్లు ఎత్తినా దిగువకు వెళ్లింది మాత్రం 20 టీఎంసీల లోపే. ఆ తర్వాత 2015–16, 2016–17 సంవత్సరాల్లో ప్రాజెక్టుల్లోకి పెద్దగా నీళ్లు రాక గేట్లు ఎత్తలేదు. ప్రస్తుత 2017–18 ఏడాదిలో కూడా ఖరీఫ్ సీజన్లో ఎలాంటి ప్రవాహాలు రాకపోయినా.. కాస్త ఆలస్యంగా అయినా భారీ ప్రవాహాలు కొనసాగుతుండటం రబీ ఆశలకు ప్రాణం పోస్తోంది. పూర్తి ఆయకట్టుకు నీరు? సాగర్‌లోకి వస్తున్న ప్రవాహాలతో రైతులు రబీపై గంపెడాశలు పెట్టుకున్నారు. సాగర్ కింద మొత్తంగా 6,45,085 ఎకరాల మేర ఆయకట్టు ఉంది. నీటి కొరత కారణంగా 2015–16 ఏడాదిలో ఒక్క ఎకరానికి నీళ్లందించకపోగా.. 2016–17లో ఖరీఫ్‌లో కేవలం 2.40 లక్షల ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. రబీలో 4.15 లక్షల ఎకరాలకు నీరందించారు. ప్రస్తుత ఏడాది ఖరీఫ్‌లో ఎకరాకు కూడా తడిపే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం రబీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జోన్–1 పరిధిలోని 4,02,727 ఎకరాలు, జోన్–2లోని 2,24,179 ఎకరాలు, జోన్– పరిధిలోని 18,179 ఎకరాలకు కలిపి 65 టీఎంసీలను సరఫరా చేసేందుకు నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై ఈ నెల 16 తర్వాత జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సాగర్ నీటితోనే ఎస్ఎల్బీసీ కింది ఆయకట్టు 2.79 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. గోదావరి ప్రాజెక్టులకూ ప్రవాహాలు గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోకి కూడా నిలకడగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. బుధవారం శ్రీరాంసాగర్‌లోకి 23,341 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు నిల్వ 90 టీఎంసీలకు గానూ 53.54 టీఎంసీలకు చేరింది. సింగూరుకు సైతం 9,445 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటం, ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకోవడంతో 3,403 క్యూసెక్కుల నీటిని దిగువ నిజాంసాగర్‌కు వదులుతున్నారు. వీటితో పాటే ఎల్లంపల్లి, ఎల్ఎండీ, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ప్రవాహాలు వస్తున్నాయి. -
‘ప్రాణహిత-చేవెళ్ల’ రెండు ముక్కలు
* గోదావరి ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం * తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్‌కు నీరివ్వాలి * కాళేశ్వరం దిగువన మరో బ్యారేజీ చేపట్టి ఐదు జిల్లాలకు నీరందించాలి * దీన్ని నిజాం సాగర్, శ్రీరాంసాగర్లతో అనుసంధానించాలి * గోదావరి బేసిన్‌లోని 50 నియోజకవర్గాల్లో 50 లక్షల ఎకరాలకు నీళ్లు * కేటాయించిన 400 టీఎంసీలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి * సమైక్య రాష్ట్రంలో రూపొందించిన ప్రాజెక్టుల డిజైన్లు తెలంగాణ అవసరాలకు తగినట్టుగా లేవు * తుమ్మిడిహెట్టి నుంచి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వరకూ ప్రతి ప్రాజెక్టు రీ డిజైన్ చేయాలి * ప్రాణహితను విడదీస్తే వ్యయం రూ. 45 వేల కోట్లకు చేరే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండు ముక్కలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని యథాతథంగా నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లివ్వాలని, కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద మరో బ్యారేజీ నిర్మించి మిగతా జిల్లాలకు నీరందించాలని నిర్ణయించింది. గోదావరి నదీ జలాల వినియోగానికి నిర్మించాల్సిన ప్రాజెక్టులు, అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు గురువారం తన అధికారిక నివాసంలో ఆరు గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి హరీశ్‌రావుతో పాటు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, వ్యాప్కోస్ జీఎం శంభూ ఆజాద్ పాల్గొన్నారు. సమీక్ష అనంతరం సీఎం తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో ప్రాణహిత-చేవెళ్ల పేరు మీద కాలయాపన చేశారు. ప్రస్తుత డిజైన్ పనికొచ్చేది కాదు. దాన్ని రెండు భాగాలు చేయాలి. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీరివ్వాలి. కాళేశ్వరం దిగువన మరో బ్యారేజీ కట్టి నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌తో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని కరువు పీడిత జనగామ, భువనగిరి డివిజన్లకు నీరు ఇవ్వాలి’’ అని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. కాళేశ్వరం దిగువన కట్టే బ్యారేజీని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానించాలని కూడా సూచించారు. గోదావరిపై ఎక్కడెక్కడ లిఫ్టులు నిర్మించాలి, ఎక్కడ ఎన్ని టీఎంసీలు వాడాలి, ఏ ప్రాంతానికి ఏ మార్గం ద్వారా నీటిని తీసుకెళ్లాలి అన్న అంశాలపై గూగుల్ ఎర్త్, మ్యాపులు, నివేదికల ద్వారా సమీక్షించారు. 50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా.. గోదావరిలో ప్రాణహిత, దేవాదుల, కంతనపల్లి, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కేటాయించిన 400 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేలా, నిర్ణీత వాటాను సమర్థంగా వాడుకునేలా ప్రాజెక్టులకు రూపకల్పన జరగాలని సీఎం సూచించారు. గోదావరి బేసిన్‌లోని 50 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలకు సగటున లక్ష చొప్పున 50 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, కడెం ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 10 లక్షల ఎకరాలకు సాగునీరందుతోందని, మిగతా 40 లక్షల ఎకరాలకు నీటిని అందించేలా కార్యాచరణ ఉండాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. సమైక్య రాష్ట్రంలో రూపొందించిన ప్రాజెక్టుల డిజైన్ లు తెలంగాణ అవసరాలు తీర్చే విధంగా లేవన్నారు. అందుకే ప్రాణహిత ప్రవేశించే తుమ్మిడిహెట్టి నుంచి ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వరకూ ప్రతి ప్రాజెక్టునూ రీడిజైన్ చేయాలని, ఆ బాధ్యతను విశేష అనుభవమున్న వ్యాప్కోస్ సంస్థకు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దేవాదులకు ఉపయోగపడేలా.. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 170 రోజులు నీటిని లిఫ్టు చేయాల్సి ఉన్నా.. 90 రోజులు కూడా లిఫ్టు చేయలేకపోతున్నారని సీఎం పేర్కొన్నారు. ఈ దృష్ట్యా కంతనపల్లి ప్రాజెక్టును దేవాదులకు ఉపయోగపడేలా డిజైన్ చేయాలని, ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రాంతం వద్ద కాకుండా కొంత ముందుకు కడితే దేవాదులకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసే క్రమంలో ఎక్కువగా రిజర్వాయర్లు ఉండాలని, గ్రావిటీ, లిఫ్ట్ పద్ధతిలో నీటి పారకం ఉండాలని చెప్పారు. అవసరమైన చోట ఎస్సారెస్పీ క్యారీయింగ్ సామర్థ్యం పెంచాలని, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలని ఆదేశించారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, పొలాలకు నీరందించడమే లక్ష్యంగా డిజైన్లు రూపొందించాలని సూచించారు. రెండంటే భారం తడిసి మోపెడు! ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండు భాగాలు చేసి నిర్మాణానికి పూనుకుంటే ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం వద్ద బ్యారేజీల నిర్మాణం చేపడితే ఈ రెండింటికే రూ.3,700 కోట్ల మేర ఖర్చు కానుండగా, కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే కాల్వలు, లిఫ్ట్‌ల భారం మరింత ఉంటుందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు విద్యుత్ అవసరాలు సైతం మరో 400 మెగావాట్ల మేర పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. 160 టీఎంసీల గోదావరి నీటితో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.38,500 కోట్లతో చేపట్టిన ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టులో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం చేయడంతో... ఇప్పుడు అందరి దృష్టి వ్యయ భారంపైనే పడింది. తొలి డిజైన్‌లో భాగంగా నిర్మిస్తున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్లకే పరిమితం చేసి, నిల్వ సామర్థ్యాన్ని తగ్గించినా వ్యయంలో పెద్దగా మార్పుండదని నిపుణులు చెబుతున్నారు. తొలి అంచనా మేరకు తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి 1,900 కోట్లు అంచనా వేయగా, ఇప్పుడూ అంతే స్థాయిలో ఖర్చయ్యే అవకాశముందని చెబుతున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ముందుగా నిర్ణయించిన 56 వేల ఎకరాలకే కాకుండా లక్ష ఎకరాలకు మించి నీరివ్వాలన్నది ధ్యేయమని ప్రభుత్వం అంటోంది. అంటే ఇక్కడా అదనపు కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. దానికి భారీగానే వ్యయమయ్యే అవకాశముంది. ఇక కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి 120 రోజుల పాటు నీటిని మళ్లించేందుకు అయ్యే అదనపు విద్యుత్ అవసరాలకు తోడు 90 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లి వరకు కాల్వల నిర్మాణం వ్యయంతో కూడుకున్నదేనని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఓపెన్ కాస్ట్ మైన్, గిరిజన, అటవీ ప్రాంతాలు కాళేశ్వరం, ఎల్లంపల్లి మధ్యలో ఉన్నట్లయితే అలైన్‌మెంట్‌ను మార్చాల్సి ఉంటుంది. అదే జరిగితే కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి దూరం మరో 30 కి.మీ. వరకు పెరిగే అవకాశం ఉంటుందన్నది వారి వాదన. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం ఇప్పటి అంచనా దాటి రూ.45 వేల కోట్లకు చేరవచ్చని చెబుతున్నారు. -
గోదావరి ప్రాజెక్టులపై ప్రభుత్వ దృష్టి!
ప్రాజెక్టుల వారీగా అధికారుల చర్యలు కంతనపల్లి, దేవాదులపై సమీక్షలు పూర్తి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, వరద కాల్వలో పునరావాసంపై సమీక్షించిన ముఖ్య కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా నిర్మాణంలో ఉన్న పనులను పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా శరవేగంగా కసరత్తులు చేస్తోంది. ప్రాజెక్టు వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, సేకరించాల్సిన భూమి, అటవీ సమస్యలు, సహాయ పునరావాసం తదితరాలపై రోజూవారీ సమీక్షలు నిర్వహిస్తూ వేగం పెంచే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు స్థాయిలో దేవాదుల, కంతనపల్లిపై అటవీ శాఖతో సమీక్షలు జరగ్గా, సోమవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఎల్లంపల్లి, వరద కాల్వ, మిడ్‌మానేరు, కాళేశ్వరం, మంథని ఎత్తిపోతల పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే మిడ్‌మానేరు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన 1,300 ఎకరాల భూసేకరణను పూర్తి చేయాలని, 11 గ్రామాల్లో సహాయ పునరావాసం పూర్తికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోని 2,400 ఎకరాలు, వరద కాల్వ పరిధిలోని మరో 2 వేల ఎకరాలు, మంథని, ఎల్లంపల్లి పరిధిలోని మరో 3,500లకు పైగా ఎకరాల భూసేకరణను వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని జోషి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి, ఇటీవల ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు ప్రాజెక్టుల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీ నిర్వహించారు. దేవాదుల పరిధిలో నెలకొన్న అటవీ, భూసేకరణ సమస్యలను అధిగమించేందుకు 3 రోజుల కిందట అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు వచ్చే ఖరీఫ్ నాటికి 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరందించే చర్యలకు ఆదేశాలిచ్చారు. ఇక కంతనపల్లిలో ముంపు తగ్గింపు కోసం అవసరమైతే బ్యారేజీలో నీటి నిల్వను తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరిగింది. అయితే ఎత్తు ఏ మేరకు తగ్గించాలన్న దానిపై ఇప్పుడు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. భూసేకరణకు కలెక్టర్ల నియామకం భూసేకరణ కోసం డిప్యూటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రాణహిత-చేవెళ్ల సిద్ధిపేట డివిజన్‌కు కుసుమకుమారి, నిజామాబాద్ జిల్లాకు పద్మశ్రీ, ఎస్సారెస్పీ-2కు బీఎస్ లత, దేవాదులకు బి.విద్యాసాగర్, కంతనపల్లికి ఆర్.గోపాల్‌ను నియమించింది. -
గోదావరి ప్రాజెక్ట్‌లపై ఏరియల్ సర్వే
ఏటూరునాగారం: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సత్వర పూర్తి, వాటా మేరకు జలాల పూర్తిస్థారుు విని యోగమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గోదావరి ప్రాజెక్టులకు వాస్తవ నీటి కేటారుుంపు, లభ్యతనీరు, నిర్దేశించుకున్న ఆయకట్టు, ప్రాజెక్ట్‌ల పరిధిలో చేపట్టాల్సిన రిజర్వాయర్, పంప్ హౌస్‌ల నిర్మాణం తదితర అంశాలపై నిపుణుల కమిటీ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని దేవాదుల వద్ద చొక్కారావు ఎత్తిపోతల పథకం పరిధిలోని నీటి నిల్వలు, గోదావరి పొడవునా సర్వే చేశారు. కంతనపల్లి బ్యారేజ్ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు. దేవాదుల 60 టీఎంసీలు, కంతనపల్లి 50 టీఎంసీలు, కాల్వ పరిసరాల్లోనూ పర్యటించారు.