సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్: శ్రీశైలం నుంచి కృష్ణవేణి పరవళ్లు కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం వడివడిగా పెరుగుతోంది. మరో నాలుగైదు రోజుల్లో ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకోనుంది. దాదాపు రెండేళ్ల తర్వాత నిండుకుండలా మారనుంది. దీంతో ఈ ఏడాది రబీలో ప్రాజెక్టు కింది ఆయకట్టులో పంట పండినట్లేనని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు అనుగుణంగా 65 టీఎంసీలతో 6.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా అధికారులు రబీ యాక్షన్ ప్లాన్‌ను సైతం సిద్ధం చేశారు.
మరో 69 టీఎంసీలొస్తే చాలు..
శ్రీశైలం జలాశయంలోకి బుధవారం సాయంత్రానికి 1,81,768 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రస్తుతం జలాశయంలో 883.9 అడుగుల్లో 209.60 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో క్రస్ట్ గేట్లతోపాటు కుడి, ఎడమగట్టు కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 2,53,324 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో నాగార్జునసాగర్‌లోకి 2,38,036 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. బుధవారం సాయంత్రం కల్లా సాగర్ నీటిమట్టం 564.60 అడుగులకు (243.1976 టీఎంసీలు)చేరింది. గరిష్టస్థాయి నీటిమట్టం 590 అడుగులు. మరో 69 టీఎంసీల నీరు వచ్చి చేరితే సాగర్ క్రస్ట్‌గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. 20 రోజుల్లో 64 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. సుమారుగా 110 టీఎంసీలకు పైచిలుకు నీరు వచ్చి చేరింది.
వరద ఇలాగే ఉంటే ఈసారి నాగార్జునసాగర్ నిండటం ఖాయమని జలవనరుల శాఖ అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో 2013–14లో మాత్రమే ప్రాజెక్టుకు భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. దిగువకు 250 టీఎంసీల మేర నీరు వెళ్లింది. ఆ తర్వాతి ఏడాది 2014–15లో కూడా భారీ వరదలు వచ్చి ప్రాజెక్టు గేట్లు ఎత్తినా దిగువకు వెళ్లింది మాత్రం 20 టీఎంసీల లోపే. ఆ తర్వాత 2015–16, 2016–17 సంవత్సరాల్లో ప్రాజెక్టుల్లోకి పెద్దగా నీళ్లు రాక గేట్లు ఎత్తలేదు. ప్రస్తుత 2017–18 ఏడాదిలో కూడా ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి ప్రవాహాలు రాకపోయినా.. కాస్త ఆలస్యంగా అయినా భారీ ప్రవాహాలు కొనసాగుతుండటం రబీ ఆశలకు ప్రాణం పోస్తోంది.
పూర్తి ఆయకట్టుకు నీరు?
సాగర్‌లోకి వస్తున్న ప్రవాహాలతో రైతులు రబీపై గంపెడాశలు పెట్టుకున్నారు. సాగర్ కింద మొత్తంగా 6,45,085 ఎకరాల మేర ఆయకట్టు ఉంది. నీటి కొరత కారణంగా 2015–16 ఏడాదిలో ఒక్క ఎకరానికి నీళ్లందించకపోగా.. 2016–17లో ఖరీఫ్‌లో కేవలం 2.40 లక్షల ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. రబీలో 4.15 లక్షల ఎకరాలకు నీరందించారు. ప్రస్తుత ఏడాది ఖరీఫ్‌లో ఎకరాకు కూడా తడిపే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం రబీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జోన్–1 పరిధిలోని 4,02,727 ఎకరాలు, జోన్–2లోని 2,24,179 ఎకరాలు, జోన్– పరిధిలోని 18,179 ఎకరాలకు కలిపి 65 టీఎంసీలను సరఫరా చేసేందుకు నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై ఈ నెల 16 తర్వాత జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సాగర్ నీటితోనే ఎస్‌ఎల్‌బీసీ కింది ఆయకట్టు 2.79 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు.
గోదావరి ప్రాజెక్టులకూ ప్రవాహాలు
గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోకి కూడా నిలకడగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. బుధవారం శ్రీరాంసాగర్‌లోకి 23,341 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు నిల్వ 90 టీఎంసీలకు గానూ 53.54 టీఎంసీలకు చేరింది. సింగూరుకు సైతం 9,445 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటం, ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకోవడంతో 3,403 క్యూసెక్కుల నీటిని దిగువ నిజాంసాగర్‌కు వదులుతున్నారు. వీటితో పాటే ఎల్లంపల్లి, ఎల్‌ఎండీ, నిజాంసాగర్ ప్రాజెక్టులకు ప్రవాహాలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment