సాగర్ కుడి కాలువ
నీటి నిల్వ ఫుల్.. విడుదల నిల్
Published Thu, Oct 6 2016 6:06 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
* కాలువకు రెండో రోజు నీటి విడుదల కొనసాగింపు
* కుడికాలువ నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్న రైతులు
* ఈ ఏడాది సాగు చేయకపోతే బతుకు భారమే
* నీటి విడుదలకు ప్రభుత్వం మీనమేషాలు
ప్రస్తుతం నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వస్తుండడం, శ్రీశైలం నిండుగా ఉన్నందున రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం వరిపంటకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం రైతుల మొర ఆలకించడం లేదు.
మాచర్ల: నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతున్నా నీటిని విడుదల చేసేందుకు అధికారులు మీనమేషాలు లెక్కించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా సాగర్ రిజర్వాయర్‌కు నీరు రాలేదని ఒక్క పంటకు కూడా నీరు ఇవ్వలేదు. కేవలం మంచినీటి అవసరాలకే నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో కూడా మంచినీటి అవసరాలకు మాత్రమే మూడుసార్లు సాగర్ కుడికాలువ నుంచి నీటిని విడుదల చేశారు. ఇటీవల భారీ వర్షాలు కురిసి, నీరు సమృద్ధిగా చేరడంతో ఇప్పటి వరకు ఖరీఫ్ వేయని రైతులు నీటి విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పరి«ధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు బుధవారం 2162 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్‌ఎల్‌బీసీకి 1000 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి ఉండడంతో సాగర్ రిజర్వాయర్‌కు కూడా ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో కుడికాలువకు నీటిని విడుదల చేయాలని రైతుల్లో డిమాండ్ పెరుగుతోంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ సోమవారానికి 532.90 అడుగులకు పైగా నీటిమట్టం చేరుకుంది. ఇది 173.8625 టీఎంసీలకు సమానం. బుధవారం 48వేల క్యూసెక్కుల నీరు జూరాల నుంచి శ్రీశైలానికి ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం 882.70 అడుగులకు సమీపంలో ఉంది. ఇది 202.9676 టీఎంసీలకు సమానం. శ్రీశైలం నుంచి సాగర్‌కు 13,782 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సాగర్ రిజర్వాయర్ నుంచి 3,926 క్యూసెక్కుల నీరు మాత్రమే ఔట్‌ఫ్లోగా విడుదల అవుతుంది. ఈ పరిస్థితిలో సాగర్ కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేసి పంట వేసుకునేందుకు అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.
రైతుల బాధ పట్టదా..?
పల్నాడులో రెండేళ్లుగా సాగునీరు విడుదల చేయక పంటలు పండించలేదు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్‌లలో నీటి నిల్వలున్నాయి. ప్రభుత్వం తక్షణమే సాగర్ కుడికాలువకు నీరు విడుదల చేయించాలి. ప్రభుత్వం రైతుల ఆవేదనను పట్టించుకోకుండా రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ రైతుల నోట్లో మట్టికొడుతోంది. వెంటనే కుడికాలువ పరిధిలోని ఆయకట్టు పంటలు సాగు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతులకు అండగా నీరు విడుదల చేసే వరకు పోరాటం చేస్తాం.
– ఎమ్మెల్యే పీఆర్కే
Advertisement
Advertisement