పెండ్లిమర్రి మండలం చీమపెంటలో మూత పడిన పశువైద్యశాల సబ్‌సెంటర్ (ఇన్‌సెట్) వైద్యం అందక మృత్యువాత పడిన పశువ
సాక్షి ప్రతినిధి కడప: పాడిపరిశ్రమ జీవనోపాధికి ఊతంగా నిలుస్తోంది. రైతులు దీనిని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవా లని నాటి పాలకులు ప్రోత్సహించారు. పాల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు కృషి చేశారు. కాగా ప్రస్తుతం పాడి తిరోగమనంలో ఉంది. సకాలంలో వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయి.ఆశాఖలో 129 ఉద్యోగాలు వివిధ స్థాయిల్లో ఖాళీలు ఉండడమే దీనికి ప్రధాన కారణం. పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత జిల్లాలో ఇలాంటి దుస్థితి నెలకొంది. కనీసం ఖాళీలు భర్తీ చేసుకోలేని దుర్గతిలో ఉండిపోయారు.
పదవులు ప్రాంతం ఉన్నతికి ఉపయోగపడాలి. తద్వారా ప్రజామెప్పు పొందగలిగితే ఆ పదవికి వన్నే తెచ్చినవారు అవుతారు. జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనైతికంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా జిల్లాలో ఉన్న లోటుపాట్లు సవరిస్తూ సమగ్రాభివృద్ధి దిశగా జిల్లాను పయనింపజేయగల్గితే ప్రజలల్లో పేరు ప్రతిష్టలు పెరిగేవి. జిల్లా అభివృద్ధి అలా ఉంచితే సొంత శాఖలో ఉన్న లోటుపాట్లను కూడా సవరించలేని స్థితిలో మంత్రి ఆది ఉండిపోయారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అందుకు పశుసంవర్ధకశాఖ దర్పంగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 224 ఉద్యోగాల్లో 129 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మంత్రిగా ఖాళీలను భర్తీ చేయాలనే స్పృహ కూడా లేకపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.
తిరోగమనదిశగా...
2004 సంవత్సరానికి ముందు జిల్లాలో కేవలం 35వేల లీటర్లు పాల ఉత్పత్తి ఉండేది. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయదారులు ప్రత్యామ్నాయంగా పాడిని వృద్ధి చేసుకోవాలని తద్వారా ఒడిదుడుకులు లేని జీవనం కొనసాగించాలని హితవు పలికారు. అందుకు అనుగుణంగా పశుక్రాంతి పథకం ప్రవేశపెట్టి పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. ఏకకాలంలో 1లక్ష లీటర్లు బల్క్‌మిల్క్ సెంటర్ల ద్వారా సేకరించి పాడిరైతులకు అండగా నిలిచారు. 2009నాటికి పాల ఉత్పత్తి 2లక్షల లీటర్లకు చేరింది. అక్కడి నుంచి పాడి పరిశ్రమ తిరోగమనంలో పడిపోయింది. ప్రస్తుతం 30వేల లీటర్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. అంటే ఏస్థాయిలో పడిపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా బల్క్‌మిల్క్ సెంటర్లను ఎత్తేయడం, ఉన్న వాటిని ప్రైవేటు పరం చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. పాడి వృద్ధి అలా ఉంటే పశువుల సంరక్షణ మరీ అధ్వానంగా ఉండిపోయిందని పలువురు వాపోతున్నారు. ప్రతిరోజు 50 నుంచి 80 పశువులు మృతి చెందుతున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటికి సకాలంలో వైద్య సేవలు అందకపోవడమే ప్రధాన కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు.
మంత్రి ఇలాఖాలో 129 పోస్టులు ఖాళీ....
జిల్లాలో 1.69లక్షల ఆవులు, 5.96 లక్షల బర్రెలు, 15.4లక్షల గొర్రెలు, 5లక్షల మేకలు ఉన్నాయి. వీటి సంరక్షణ నిమిత్తం 126 పశువైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 224 మంది వివిధ హోదాల్లో పనిచేయాల్సి ఉండగా కేవలం 95 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మరో 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇలాఖాలో 129 ఉద్యోగులు భర్తీ చేయాల్సి ఉండగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించే జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్లు, లైవ్‌స్టాక్ అసిస్టెంట్లు కలిసి జిల్లా వ్యాప్తంగా 111 ఖాళీలు ఉన్నాయి. వైద్యులు పోస్టులు 14 ఖాళీలు ఉండిపోయాయి. వీటిని భర్తీ చేద్దాం, సొంత జిల్లాలోలైనా ఖాళీలు లేకుండా చూద్దాం అన్న ఆలోచన మంత్రికి లేకుండా పోయిందని పలువురు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత పరపతి పెంచుకోవాలనే తపన పట్ల జిల్లా ఉన్నతి పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకుండా పోయిందని పరిశీలకులు సైతం వాపోతున్నారు. జిల్లాలో ఉన్న ఖాళీలు భర్తీ చేసి మెరుగైన పశువైద్యం అందించడంతోపాటు గణనీయంగా పాల ఉత్పత్తి పెంచాలనే దృక్పథం కొరవడిందని పలువురు వెల్లడిస్తున్నారు. ఇకనైనా మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment