నూనెగింజల సాగులో మొండి చేయి.. | Scholarly Articles For Cultivation Of Oilseed Crops Agriculture In YSR kadapa | Sakshi
Sakshi News home page

నూనెగింజల సాగులో మొండి చేయి..

Published Tue, Jul 31 2018 9:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Scholarly Articles For Cultivation Of Oilseed Crops Agriculture In YSR kadapa - Sakshi

సాగునీటి పైపులను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు (ఫైల్‌)

ఆహార భద్రత పథకాన్ని పక్కాగా అమలు చేసి ఆహాధాన్యాల కొరతను అధిగమిస్తామని ప్రభుత్వం చెబుతోంది.అందుకు అవసరమైన  ప్రణాళికలను జిల్లా నుంచి పంపినా పట్టించుకోలేదు. నూనెగింజల పథకానికి నిధులు కేటాయిస్తూ జీఓలు మాత్రం  జిల్లా వ్యవసాయశాఖకు పంపింది. పరికరాల విషయంలో ప్రభుత్వంలోని పెద్దలకు, కంపెనీల మధ్య డీల్‌ కుదరక, ధరలు ఖరారుకాక  పథకాలు మూలన పడిపోయాయని వ్యవసాయశాఖ  అధికారులే పెదవి విరుస్తున్నారు.

కడప అగ్రికల్చర్‌ : నూనెగింజల పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీంతో ఏడాది కేడాది నూనెగింజల పంటల సాగు తగ్గిపోతోంది. జిల్లాకు జాతీయ ఆహార భద్రత (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎం), నూనె విత్తుల పథకం (ఐసోఫాం)ను మొన్నటి వరకు వేర్వేరుగా నిర్వహించే వారు, ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి జాతీయ ఆహార పథకాన్ని అమలు చేస్తున్నారు.ఇందుకగాను 600 సాగునీటిపైపుల యూనిట్లు జిల్లాకు కేటాయించారు. నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా తుంపర సేద్య పరికరాలు 600 యూనిట్లు, మరొక పథకానికి కలిపి రూ.50 లక్షల నిధులు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు జారీ చేసింది.

ఈ పథకాల్లోని పరికరాల కోసం టెండర్లు పిలిచింది. ప్రభుత్వం మొండి పట్టుదలతో గత ఏడాది ఇచ్చిన ధరలకే ఇప్పుడు టెండర్లు కోట్‌ చేయాలనే సంకేతాలు ఇవ్వడంతో కాంట్రాక్టర్లు  ముందుకు రాలేదు. దీంతో ఖరీప్‌ నుంచి ఇప్పటి వరకు ఆయా పథకాలు నిర్వీర్యమైపోయే పరిస్థితులు ఉన్నాయి.ఈ టెండర్లు ఖరారై ధరలు నిర్ణయమయ్యే లోపు ఖరీఫ్‌ పంటకాలం ముగిసిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చర్చించుకుంటున్నారు. సాగునీటి కోసం రైతులు భగీరథ పోరాటాలు చేస్తున్నారు. సాగునీటి కష్టాలు కర్షకులకు కన్నీటిగాథను మిగులుస్తోంది. సేద్యపు జలాలను పొదుపుగా వాడడం కోసం సబ్సిడీ పైపులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం రైతుల కళ్లల్లో కాంతులు నింపలేదు. సేద్యపు నీటి కష్టాలు తీర్చలేదు.

600 యూనిట్లు మంజూరు
జాతీయ ఆహార భద్రత పథకం కింద సాగు నీటిపైపులు 600 యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో ఒక్కో యూనిట్లో ఎకరాకు 60 పైపులు ఇవ్వనున్నారు.సాగునీటి పైపులకు గత ఏడాది రూ.7500 రాయితీ ఇచ్చారు. ఈ పథకం మొత్తానికిగాను రూ.35లక్షలు కేటాయించారు. అదే విధంగా నూనె గింజల అభివృద్ధి పథకం కింద దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు పథకాలకు రూ.50 లక్షలు కేటాయించారు. ఇందులో ఒక్కో యూనిట్‌కు 60 పైపులు ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు  పథక ఫలాలు అందడం లేదు.

మార్కెట్‌లో పైపులు, తుంపర సేద్య పరికరాల ధరలు అధికంగా ఉంటున్నాయని, డీజిల్, పెట్రోలు ధరలు పెరిగినందున పాత ధరలకు ఇవ్వలేమని కంపెనీలు నిరాకరించినందున, తాము కూడా ఆయా కంపెనీలు కొత్తగా ప్రకటించిన ధరలకు పైపులు, తుంపర సేద్య పరికరాలు కొనుగోలు చేసి అందించలేమని ప్రభుత్వం చేతులెత్తేయ్యడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం కంటే ఇచ్చేదేదో మాకే ఇస్తే తుంపర సేద్య పరికరాలు, పైపులు మేమే తెచ్చుకుంటాం..కదా? అని రైతులు అంటున్నారు. రైతుల ప్రశ్నలకు అటు ప్రభుత్వం నుంచి, ఇటు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.

రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపు
రైతులకందించే పథకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. ఈ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. సాగునీటి పైపుల విషయంలో ప్రభుత్వ తీరు అధ్వానంగా ఉంది. కమీషన్ల కోసం ప్రభుత్వంలోని పెద్దలు ఏమైనా చేస్తారు. రైతులు ఏమై పోయినా ఫర్వాలేదు.. మాకు రావలసిన ఆమ్యామ్యాలు వస్తే చాలని అనుకుంటారు.

జి.చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement