
పెండ్లిమర్రి మండలంలో ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో సాగైన బత్తాయిపంట
సాక్షి, కడప: రైతు శ్రేయస్సే పరమావధిగా, ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి సేద్యం విస్తరణకు చర్యలు తీసుకుంటోంది. రసాయనాలు వద్దు– ప్రకృతి సేద్యం ముద్దు అనే రీతిలో ప్రోత్సహిస్తూ, ప్రకృతిసాగులో సలహాలు, సూచనలు అందిస్తూ అధిక పెట్టుబడులు పొందేలా భరోసాగా నిలుస్తోంది. ఫలితంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మొదట్లో వరి సాగుకే పరిమితం కాగా ప్రస్తుతం ఉద్యాన పంటలకూ ఈ విధానంలో సాగు విస్తరించింది.
గతం కంటే మెరుగ్గా..
జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారులు గతం కంటే మిన్నగా ప్రకృతి సేద్యాన్ని ప్రజలకు, రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నీతి ఆయోగ్ సదస్సులో ప్రత్యేకించి ప్రసంగించడం తెలిసిందే. అంతేకాదు వైఎస్సార్‌జిల్లా నుంచి ముగ్గురు రైతులు నీతి ఆయోగ్‌లో అవార్డు అందుకున్నారు. ఇందులో మైదుకూరు మండలం టి. కొత్తపల్లెకు చెందిన రైతు శివరామయ్య, పెండ్లిమర్రికి చెందిన గంగిరెడ్డి, కలసపాడు మండలం బ్రహ్మణపల్లెకు చెందిన కోటేశ్వరరావు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఖరీఫ్ సాగు లక్ష్యమిలా..
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 68700 మంది రైతులకు సంబంధించి 78,310 ఎకరాల్లో వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటలను సాగు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో 23700 మంది రైతులకు సంబంధించి 27059 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు 51,251 ఎకరాల్లో వ్యవసాయ పంటల సాగు లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందులో 28,650 మంది రైతులకు సంబంధించి 30920 ఎకరాల్లో వరి, 5720 మంది రైతులకు సంబంధించి 6920 ఎకరాల్లో వేరుశనగ పంటను, 4800 మంది రైతులకు సంబంధించి 6570 ఎకరాల్లో శనగ, మినుములు, 5830 మంది రైతులకు సంబంధించి 6850 ఎకరాల్లో కూరగాయలను సాగు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసి వారికి కావా ల్సిన సూచనలు, సలహాలను ఇవ్వనున్నారు.
కిచెన్ గార్డెన్స్‌పై ప్రత్యేక దృష్టి..
జిల్లా అధికారులు కేవలం రైతులతో ప్రకృతి సాగు చేయించి సరిపెట్టకుండా మహిళలను కూడా ప్రకృతి సాగు వాటి ఉపయోగాల వైపు మరల్చి మహిళా సంఘాల ద్వారా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. తద్వారా ప్రతి మహిళా ఆకుకూరలు, కూరగాయలను ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు లేకుండా పండించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో కలుపుకుని 75 వేల దాకా కిచెన్‌గార్డెన్‌లను ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడంవల్ల మనకు కావాల్సిన మిటమిన్స్, మినరల్స్ అధికంగా లభించే అవకాశం ఉంది.
లక్ష్యం అధిగమించేందుకు కృషి
ఖరీఫ్ సీజన్‌లో 73310 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేశాము. ఆ దిశగా సిబ్బందిని అప్రమత్తం చేశాము. ప్రకృతి వ్యవసాయ సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా రైతులను అప్రమత్తం చేయనున్నాం. వీటి స్థానంలో ఘన జీవామృతం, జీవామృతాలను వాడే విధంగా రైతుల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చి లక్ష్య సాధనకు కృషి చేస్తాం.
– రామకృష్ణమరాజు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయం, వైఎస్సార్ జిల్లా.