సాక్షి ప్రతినిధి, కడప : ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. భవిష్యత్తులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని వ్యవసాయాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమవుతోంది. రాత్రికి రాత్రే పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకు రాలేకపోయినా దశల వారీగా ఈ తరహా వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇందుకోసం పులివెందుల ఐజీ కార్ల్ ప్రాంగణంలో ఇండో–జర్మన్ ప్రపంచ వ్యవసాయ విజ్ఞాన పరిశోధన–శిక్షణా అకాడమి (ఐజీజీఏఏఆర్‌ఎల్)ని ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 7వ తేదీన పులివెందుల పర్యటనలో శంకుస్థాపన చేశారు.
రూ. 222 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. ఇందుకోసం జర్మనీ రూ. 174 కోట్లు గ్రాంటుగా ఇస్తుండగా, మిగిలిన రూ. 48 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చిస్తోంది. దీంతోపాటు పులివెందులలోని ఐజీ కార్ల్ ప్రాంగణంలో 25 హెక్టార్ల భూమితోపాటు భవనాలను యూనివర్సిటీ కోసం కేటాయించారు. ఈ అకాడమి ప్రకృతి వ్యవసాయ పరిశోధనలకు దిక్సూచిగా నిలువనుంది. ప్రామాణికమైన శాస్త్రీయ, ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా విరాజిల్లనుంది. రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా దీనిని విస్తరించనున్నారు.
రైతులకు శిక్షణ
ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం అవసరమైన మాస్టర్ ట్రైనర్స్‌ను, వ్యవసాయ శాస్త్రవేత్తలను అందుబాటులో ఉంచనున్నారు. ఆగ్రో ఎకాలజీపై పరిశోధన చేసిన మాస్టర్ ట్రైనర్, కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్, అగ్రి సైంటిస్టులను నియమిస్తారు. వారి ద్వారా రైతులకు శిక్షణ ఇప్పిస్తారు. రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి సాగుకు కావాల్సిన ఉపకరణాలను కూడా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)ల ద్వారా అందుబాటులో ఉంచుతారు. దశల వారీ ప్రకృతి వ్యవసాయాన్ని పెంచాలన్నది లక్ష్యం. తొలుత రైతు పొలంలో మూడోవంతు, ఆ తర్వాత 50 శాతం పొలాన్ని, ఆ తర్వాత మొత్తం పొలాన్ని ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకు రానున్నారు. ఫెస్టిసైడ్స్, ఎరువుల వాడకం లేకపోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మరోవైపు భూమిలో సారం పెరగడం వల్ల ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
నాణ్యమైన దిగుబడి
ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు వస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ప్రధానంగా రైతుల పెట్టుబడుల ఖర్చు తక్కువగా ఉంటోంది. భూసారం క్షీణించదు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని కలుషిత రహిత ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని రైతులు పేర్కొంటున్నారు. రసాయనిక ఎరువులతో పండించే పంట ధర కంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ధర ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు రసాయనిక ఎరువులతో పండించిన పుట్టి వరి ధాన్యం రూ. 10 వేలు ఉంటుండగా, అదే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వడ్ల ద్వారా రూ. 50 వేలకు పైగానే ఉంటుంది. అన్ని పంటల పరిస్థితి అలాగే ఉంటుంది.
2023 నాటికి 1.26 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
2018 నాటికి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని 51 మండలాల పరిధిలో కేవలం 14,803 ఎకరాల్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయం సాగులో ఉండేది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక ఈ ఏడాది నా టికి ఉమ్మడి జిల్లాలో 372 గ్రామ పంచాయతీల ప రిధిలో 90,191 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. 2023 నాటికి 1.26 లక్షల ఎకరాలు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జిల్లాలో వరిలో నవార, బర్మా బ్లాక్, మణిపూర్ బ్లాక్, కుజి పటాలియా, కృష్ణ వ్రీహి, కాలాపట్టు, మాపులేసాంబ, బహురూపి, రా ధాజిగేల్, రత్నచోడి, రక్తసాలి, ఇంద్రాణి, సుగంధి, సిద్ది సన్న, పరిమళ సన్న రకాలతోపాటు వేరుశనగ, చీనీ, అరటి, కూరగాయల పంటలు సైతం పండిస్తున్నారు.పులివెందులలో ప్రకృతి వ్యవసాయం యూనివర్సిటీ ఏర్పాటుతో భవిష్యత్తులో జిల్లాలో ప్రకృతి వ్యవసాయం మరింత విస్తరించనుంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం సాగును విస్తృతం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
పర్యావరణం మెరుగుపడుతుంది
జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జిల్లాలో 2018 వరకు దా దాపు 15 వేల ఎకరాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయం ప్రస్తుతానికి 90 వేల ఎకరాలకు చేరింది. వచ్చే ఏడాది నాటికి 1.26 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాలన్నది లక్ష్యం. ప్రకృతి వ్యవసాయంతో భూములు దెబ్బతినకుండా ఉంటాయి. పర్యావరణం మెరుగు ప డుతుంది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. పులివెందులలో యూనివర్శిటీ ఏర్పాటు తో ప్రకృతి వ్యవసాయం మరింత విస్తరించనుంది.
– రామకృష్ణరాజు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయం, కడప
Comments
Please login to add a commentAdd a comment