ఎర్రి పుచ్చకాయలు, నల్లేరు కాడలను చూపుతున్న రైతు శాస్త్రవేత్త విజయకుమార్
మిరప, బత్తాయి తదితర పంటలను ఆశిస్తూ అనేక రాష్ట్రాల్లో రైతులను బెంబేలెత్తిస్తున్న వెస్ట్రన్ త్రిప్స్ లేదా నల్లపేను లేదా మిన్నల్లికి ఎర్రి పుచ్చకాయలు, నల్లేరు (వై. ఎన్.) ద్రావణం అద్భుతంగా పనిచేస్తున్నదని వైఎస్సార్ జిల్లా వెంపల్లె మండలం టి. వి. పల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త, వెన్నెల రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు కె. విజయ్‌కుమార్ తెలిపారు. ఆరేళ్ల క్రితం ‘సాక్షి సాగుబడి’లో ప్రచురితమైనప్పటి నుంచి వై.ఎన్. ద్రావణం అన్ని రకాల పంటల్లో పురుగులు ఆశించకుండా నిలువరించటం, ఆశించిన పురుగును అరికట్టేందుకు వై. ఎన్. ద్రావణం ఉపయోగపడుతోందన్నారు. ఇప్పుడు మిరప తదితర తోటలను ఆశిస్తున్న మిన్నల్లిని అరికట్టడానికి కూడా వై.ఎన్. ద్రావణం చక్కగా పనిచేస్తున్నదని తెలిపారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదని, చాలా ఏళ్లుగా ఉన్నదేనని ఆయన అంటున్నారు.
వై.ఎన్. ద్రావణం తయారీ ఇలా..
5 కిలోల యర్రి పుచ్చకాయలు, 5 కిలోల ముదురు నల్లేరు కాడలు రెండింటిని మొత్తగా దంచాలి. వంద లీ. నీరు కలిపిన ప్లాస్టిక్ డబ్బాలో పది రోజులు నిల్వ ఉంచి పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. ఏడాది పాటు నిల్వ ఉంటుంది. నీడపట్టున ఉంచి పైన గోనె సంచి కప్పాలి. ఈ పసరు శరీరంపై పడితే విపరీతమైన దురద, దద్దుర్లు వస్తాయి. ముందు జాగ్రత్తగా చేతులకు తొడుగులు, ముక్కుకు శుభ్రమైన బట్టను కట్టుకోవాలి. పొరపాటున శరీరంపై పడితే పేడ రసం, బురద రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
వరుసగా మూడు పిచికారీలు
వై. ఎన్ ద్రావణాన్ని గత ఎనిమిదేళ్లుగా వివిధ పంటలపై పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించారు. ఇందులో ఉండే చేదు ప్రభావం.. చర్మంపై పడగానే కలిగే దురద వల్ల పురుగులు చనిపోతాయి. గుడ్లు దశలో పిచికారీ చేస్తే పురుగు లార్వాలు మరణిస్తాయి. ఏ రకం పంటలయినా వై. ఎన్. ద్రావణాన్ని మూడు సార్లు పిచికారీ చేయాలి. రెండు పిచికారీల మధ్య 6 రోజుల ఎడం పాటించాలి. ఎకరాకు 15 ట్యాంకుల వరకు పిచికారీ చేస్తే పైరు బాగా తడిచి ద్రావణం సమర్థవంతంగా పని చేస్తుంది. ఉ. 6–9 గంటలు, సా. 5.30–7.00 మధ్య పిచికారీ చేయాలని విజయకుమార్ సూచించారు. (చదవండి: నల్ల పేనుకు హోమియోతో చెక్!)
ఆకుకూరలను ఆశించే త్లెల పేనుబంక, రంధ్రాలు చేసే మిడతలను వై. ఎన్. ద్రావణం నివారిస్తుంది. ఆకుకూరలపై మొదటిసారి ట్యాంకు (20లీ.)కు 1/2 లీ., రెండోసారి 1 లీ., మూడోసారి 1 1/2 లీ. చొప్పున ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. కాయగూరలు వేరుశనగ, పత్తి, మిరప, వరి వంటి పైర్లు, పండ్ల తోటలపై మూడు దఫాలు వరుసగా 1లీ., 11/2లీ., 2 లీ. చొప్పున పిచికారీ చేయాలి.
వేరు శనగను ఆశించే పచ్చపురుగు, నామాల పురుగు, కాండం తొలిచే పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. వరిలో సుడిదోమ, కాండం తొలిచే పురుగును నివారిస్తుంది. పండ్ల తోటలను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగించే వివిధ చీడపీడలను వై. ఎన్. ద్రావణం సమర్థవంతంగా నివారిస్తుంది. (చదవండి: వర్క్ ఫ్రం హోమ్.. మరోపక్క ప్రకృతి వ్యవసాయం)
మామిడిలో తేనెమంచు పురుగుపై ఇది చక్కని ఫలితాన్నిస్తుందని విజయకుమార్ తెలిపారు. చెట్లపై పూత దశకు ముందు, పిందె దశలో మాత్రమే బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పూత మీద పిచికారీ చేస్తే రాలిపోతుంది. నిమ్మ, దానిమ్మ, బొప్పాయిల్లో వచ్చే మసి తెగులు, ఆకుముడతను నివారిస్తుందని విజయకుమార్ (98496 48498) తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment