హైదరాబాద్ నగరం కేవలం ఐటీ, పారిశ్రామిక స్టార్టప్‌లకు మాత్రమే కాదు.. అరుదైన పంటల ఆవిష్కర్తలకు నగరంలోని శివారు ప్రాంతాలు వేదికగా నిలుస్తున్నాయి.. బీటెక్ కోర్సులు పూర్తి చేసి, ఐటీ, ఇతర సాంకేతిక సాగులో ఆరితేరాల్సిన జిల్లా యువత.. అరుదైన పంటల పరిశోధనలు, సాగుపై దృష్టిసారించింది. అందమైన కాశ్మీర్ లోయల్లో మాత్రమే సాగయ్యే అరుదైన కుంకుమ పువ్వు బాలాపూర్ మండలం గుర్రంగూడలో సాగవుతుండగా, కేరళ తీరం వెంట మాత్రమే సాగయ్యే వక్క తోటలు శంకర్‌పల్లిలోనూ సాగవుతున్నాయి.
ఇక సిమ్లా, ఇతర శీతల ప్రదేశాల్లో మాత్రమే కనిపించే యాపిల్ ప్రస్తుతం కందుకూరు మండలం పులిమామిడిలోనూ దర్శనమిస్తున్నాయి. సౌదీ అరేబియా దేశాల్లో విరివిగా పండే ఖర్జూర సరస్వతి గూడలో నోరూరిస్తుంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అవకాడో ప్రస్తుతం దెబ్బగూడలోనూ లభిస్తుంది. నేపాల్ సరిహద్దులో అరుదుగా లభించే రుద్రాక్ష.. ప్రస్తుతం మేడ్చల్ మండలం రాయిలాపూర్‌లో సాగవుతుండటం గమనార్హం..
ఎస్‌బీఐలో ఉద్యోగం చేస్తూ..
పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో వ్యవసాయ కుటుంబం. నల్లగొండ ఎన్జీకాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం కోఠి ఎస్‌బీఐలో పని చేస్తున్నా. అచ్చంపేటలో పదెకరాలు, సరస్వతి గూడలో ఏడెకరాలు ఉంది.
యూట్యూబ్ ద్వారా అనంతపూర్‌లో ఖర్జూర సాగు చేస్తున్న విషయం తెలుసుకున్నా. ఆ మేరకు ఆరేళ్ల క్రితం మొత్తం 17 ఎకరాల్లో 1260 మొక్కలు నాటాను. ఎకరాకు రూ.5 లక్షల వరకూ వచి్చంది. మూడేళ్ల క్రితం దిగుబడి ప్రారంభమైంది. తొలిసారిగా 1.50 టన్నుల దిగుబడి వచి్చంది. ఆ తర్వాత 55 నుంచి 60 టన్నుల దిగుబడి వచ్చింది.
– ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట (ఖర్జూర)
విదేశాల నుంచి తిరిగొచ్చి..
బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక వెనక్కి తిరిగొచ్చా. అవకాడోపై అవగాహన ఉండటంతో అటువైపు చూశా.. మూడేళ్ల క్రితం 1.10 ఎకరాల విస్త్రీర్ణంలో 220 అవకాడో మొక్కలు నాటాను. సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది.
డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించా. చీడపీడల సమస్యే కాదు.. పెట్టుబడికి పైసా ఖర్చు కూడా కాలేదు. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచ్చింది. ఆన్‌లైన్‌లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
– రమావత్ జైపాల్, దెబ్బడిగూడ (అవకాడో)
బీటెక్ చదువుతూనే..
బాలాపూర్ మండలం గుర్రంగూడ మాది. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నా. వ్యవసాయ కుంటుంబం కావడంతో నాన్నతో పాటు తరచూ పొలానికి వెళ్తుంటా. కాశ్మీర్‌లో ప్యాంపూర్, పుల్వొమా జిల్లాల్లో అరుదుగా పండే కుంకుమ పువ్వు పంటను ఎంచుకున్నా. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది.
కల్తీని నివారించి, నాణ్యమైన పువ్వును అందివ్వాలనుకున్నా. ఇంటిపై ఖాళీగా ఉన్న ఓ గదిలో 2024 సెప్టెంబర్‌లో సాగు ప్రారంభించాను. రూ.5 లక్షలు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకూ 20 గ్రాముల వరకూ సేకరించాం. ఒక గ్రాము రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది.
– లోహిత్‌రెడ్డి, గుర్రంగూడ (కుంకుమ పువ్వు)
వక్కసాగులో విశ్రాంత వైద్యుడు..
ఐడీపీఎల్ బాలానగర్‌లో ఫ్యామిలి ఫిజీషియన్‌గా నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించా. శంకర్‌పల్లి మాసానిగూడలోని భూమిలో ఏదైనా చేయాలని భావించా. ఏలూరులో నా స్నేహితుడు విజయసారధి సూచనలతో 2015లో నాలుగు ఎకరాల్లో.. ఎకరాకు 300 చొప్పున వక్క మొక్కలు నాటాను.
2023లో తొలిసారిగా పంట దిగుబడి 1500 కేజీలు వచ్చింది. కేజీ రూ.350 నుంచి రూ.400 పలుకుతుంది. వక్కతోటలోనే అంతరపంటలుగా మిరియాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, అల్లం, యాపిల్, ద్రాక్ష, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, అవకాడో, మ్యాంగో, జామ వంటి పండ్ల మొక్కలను సాగు చేస్తున్నా. మరో ఏడాదిలో పండ్ల దిగుబడి ప్రారంభమవుతుంది.
– డాక్టర్ విజయ్‌కుమార్ కొడాలి, బోధన్ (వక్కసాగు)
రాయలాపూర్‌లో రుద్రాక్ష..
ఫిన్లాండ్‌కు చెందిన మహిళను వివాహం చేసుకుని మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామ శివారులో స్థిరపడ్డారు. ఇంటి చుట్టూ వివిధ రకాల చెట్లు నాటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత అరుదుగా కనిపించే రుద్రక్ష మొక్కలను ఇంటి ముందు నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. జనవరి, ఫిబ్రవరిలో కాయలు తెంపి, ఆరబెడుతుంటారు. ప్రదీప్ ఇటీవల వెయ్యి రుద్రాక్షలతో పూజ చేయడం కొసమెరుపు.
– ప్రదీప్, మేడ్చల్ (రుద్రాక్ష)
(చదవండి: గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!)
Comments
Please login to add a commentAdd a comment