దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయుకాలుష్యం ‘మరింత ప్రమాదకర’ పరిస్థితికి చేరింది. గాలిలో 2.5 పి.ఎం. (పార్టిక్యులేట్ మేటర్) ధూళి కణాలు ఎక్కువయ్యే కొద్దీ మానవ జీవనం దుర్భరంగా మారిపోతూ ఉంటుంది. ఈ ఇండెక్స్ 0–50 మధ్య ఉంటే మంచిది. 100 వరకు పర్వాలేదు. 200 వరకు పెరిగితే గాలి నాణ్యత ఒక మాదిరిగా ఉన్నట్లు. మార్చి – సెప్టెంబర్ మధ్యలో ఈ స్థాయిలో ఉంటుంది. అక్కడి నుంచే ప్రతి ఏటా ధూళి కణాల సాంద్రత వేగంగా పెరుగుతుంటుంది.
201–300కు పెరిగితే తీవ్రంగా ఉన్నట్లు. 400 వరకు వెళ్తే ఘోరం. 401–500కి చేరిందంటే అత్యంత ప్రమాకర స్థాయిగా చెబుతారు. 2024లో నవంబర్ 19న 494కు పెరిగింది. అన్ని వయసుల వారి ఆరోగ్యానికి హానికరంగా గాలి కాలుష్యం మారింది. ఇందుకు ముఖ్య కారణాలు: వాహన, పారిశ్రామిక కాలుష్యంతో పాటు వరి పొలాల్లో మోళ్లు, గడ్డిని తగులబెట్టటం. వరి కోతలయ్యాక నిప్పంటించి, ఆ వెంటనే గోధుమ విత్తుకోవటం ఢిల్లీ పరిసర రాష్ట్రాల రైతులకు అలవాటు. ఈ రెండు పంటలనే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం సేకరిస్తున్నందు వల్ల ఈ విషవలయంలో రైతులు చిక్కుకుపోయారు.
‘హరిత విప్లవం’ మన పొలాల్లోకి వచ్చి ఇప్పటికి సరిగ్గా 65 ఏళ్లు. అప్పటి నుంచి పంట భూములను డొల్ల చేస్తున్న పర్యావరణ సంక్షోభమే ఇవాళ అతి సూక్ష్మ ధూళికణాల మహా పడగై రాజధానిని చుట్టుముట్టింది. దేశ రాజధానివాసులను మునుపెన్నడూ ఎరుగనంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.
‘హరిత విప్లవం’ వెంట తెచ్చిన ఏక పంటల (మోనోకల్చర్) దుష్ట సంస్కృతి వల్ల దాపురించడమే ఈ దుస్థితికి మూలకారణం.
హర్యానా, పంజాబ్ రాష్ట్రాల పొలాల్లో ఖరీఫ్‌లో వరి, రబీలో గోధుమ పంటల సాగు పద్ధతి రైతుల మనసుల్లో లోతుగా నాటుకుపోయింది. ఈ రెండు పంట దిగుబడులను మద్దతు ధరకు ప్రభుత్వం సేకరించడం వల్ల.. పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి ఇతర పంటల వైపు రైతులు కన్నెత్తి చూడటం లేదు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని సారవంతమైన నేలల్లో రైతులు కేవలం వరి, గోధుమ పంటలనే ఏక పంటలుగా సాగు చేస్తున్నారు.
యంత్రాలతో వరి కోతలైన కొద్ది రోజుల్లోనే గోధుమ విత్తుకోవాలంటే.. పొలాల్లో మిగిలిన మోకాలెత్తు వరి మోళ్లను తగుల బెట్టడానికి మించి మరొక సులువైన మార్గం రైతులకు తోచడం లేదు. పశువులకు వరి గడ్డి కన్నా గోధుమ గడ్డి మేపడమే మేలన్న భావన అక్కడి రైతుల్లో ఉంది. అందుకే వరిగడ్డికి డిమాండ్ లేదు. ప్రభుత్వం నిషేధించినప్పటికీ వరి మోళ్లకు రైతులు నిస్సంకోచంగా నిప్పంటిస్తూనే ఉన్నారు.
భూమిలో అనేక అంగుళాల లోతు వరకూ సూక్ష్మజీవరాశి మాడిపోయి పొలం నిర్జీవంగా, నిస్సారంగా మారిపోతున్నా.. ఏటేటా రసాయనిక ఎరువుల మోతాదు పెంచుతున్నారే తప్ప.. ఏక పంటల సాగు విషవలయాన్ని రైతులు ఛేదించలేక΄ోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అగ్గి మీద గుగ్గిలంగా మండి΄ోతున్న లక్షలాది హెక్టార్ల పంట భూముల పొగ.. ఢిల్లీ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పరస్పరాధారితమైన జీవవైవిధ్యమే ప్రకృతి మనుగడకు మూల సూత్రం. ఏక పంటల రసాయనిక వ్యవసాయ నమూనా ఫలితం నేలతల్లి పొదుగు కోసి పాలుతాగడం తప్ప మరొకటి కాదు.
ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ విషవలయంలో చిక్కుకున్న అన్నదాతల ఆక్రందనలు, ఆత్మబలిదానాలు పాలకులను కదిలించలేక΄ోతున్నాయి. కానీ, వరి పొలాల పొగ.. ఢిల్లీ పొలకులకు, ప్రజానీకానికి పంట భూముల్లో రగులుతున్న సంక్షోభాన్ని రుచి చూపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. పొలాల్లో పంటల జీవవైవిధ్యాన్ని, నేలతల్లి కడుపులో సూక్ష్మజీవరాశి వైవిధ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే.. గ్రామీణులకైనా, దేశ రాజధానివాసులకైనా మనుగడ సాగుతుందని ఇప్పటికైనా గ్రహించడం మేలు.
వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ఇటు నగర వాసులు, అటు రైతులందరూ సమష్టిగా కృషి చేయాలి. పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చూడటంతోపాటు వాహన, పారిశ్రామిక, నిర్మాణ రంగాల కాలుష్యాన్ని కూడా భారీగా తగ్గించుకునే మార్గాలు అత్యవసరంగా వెతకాలి. కేంద్ర మంత్రివర్గం గత సోమవారం నేషనల్ మిషన్ ఫర్ నాచురల్ ఫార్మింగ్‌ను రూ. 2,481 కోట్ల బడ్జెట్‌తో ఆమోదించింది.
ఇది మంచి ప్రారంభం. 60 ఏళ్ల క్రితం హరిత విప్లవం ప్రారంభంలో మాదిరిగానే పంజాబ్, హర్యానాలలో అధిక దృష్టిని కేంద్రీకరించి ఇప్పుడు ప్రకృతి సేద్యాన్ని, బహుళ పంటల సాగు పద్ధతులను దీక్షగా ప్రోత్సహించాలి. ఈ పరివర్తన మట్టితోపాటు గాలిని, మనుషులను ఆరోగ్యవంతులుగా మారుస్తుంది.
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
(చదవండి: తాటి తేగలతోనూ వంటకాలు!)
Comments
Please login to add a commentAdd a comment