రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ సర్కార్ ఆదేశం
ఢిల్లీలో ఇంకా క్షీణిస్తున్న వాయు నాణ్యత
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సీజన్‌లోనే అత్యంత చలిరాత్రిని చవిచూసిన ఢిల్లీవాసులు బుధవారం సైతం పొగచూరిన సూర్యోదయాన్నే ఆస్వాదించాల్సిన దుస్థితి దాపురించింది. హస్తినవాసుల చలి, వాయుకాలుష్య కష్టాలు మరింత పెరిగాయి. మంగళవారం రాత్రి 11.1 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ(ఏక్యూఐ) 426గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది.
దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఇంకా ‘తీవ్రం’ కేటగిరీనే కొనసాగిస్తోంది. కాలుష్యం కోరల్లో చిక్కిన ఢిల్లీలో ఇంకా జనం సొంత, ప్రజారవాణా వాహనాల్లో తిరిగితే కాలుష్యం మరింత పెరగొచ్చన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. రోడ్లపై జనం రద్దీని తగ్గించే ఉద్దేశ్యంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని(వర్క్ ఫ్రమ్ హోం)చేయాలని ఆమ్ ఆద్మీ సర్కార్ సూచించింది. అయితే అత్యయక సేవల విభాగాలైన ఆరోగ్యం, పారిశుద్ధ్యం, నీటిపారుదల, అగ్నిమాపకదళం, పోలీసులు, విద్యుత్, విపత్తు స్పందన దళం వంటి విభాగాల సిబ్బందికి ఈ వర్క్ ఫ్రమ్ హోం నిబంధన వర్తించదు.
ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 80 శాఖలు, విభాగాల్లో మొత్తంగా 1.4 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ‘‘ ప్రభుత్వ సిబ్బందితోపాటు పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు సైతం 50 శాతం మందిని ఇంటి నుంచే పనిచేయిస్తే మంచిది. మీ వంతుగా నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించినవారవతారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య పనివేళలను కొద్దిగా మార్చండి. దీంతో ఆఫీస్‌వేళల్లో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గి కాలుష్యం కాస్తయినా మటుమాయం కావొచ్చు’’ అని ఢిల్లీ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ‘ఎక్స్’ వేదికగా కోరారు.
‘‘ ఎక్కువ మంది సిబ్బంది రాకపోకల కోసం ప్రైవేట్ సంస్థలు షటిల్ బస్సు సేవలను వినియోగించుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం సైతం గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ఇదే నియమాన్ని అమలుచేస్తోంది’’ అని రాయ్ సూచించారు. ఈ సందర్భంగా పొరుగురాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘ ఢిల్లీ చుట్టూతా బీజేపీపాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఢిల్లీ పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా కాలుష్యాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మా సర్కార్ అనుసరిస్తున్న కాలుష్య నివారణ విధానాలనే మీరూ ఆచరించండి’ అని రాయ్ హితవుపలికారు.
కొనసాగుతున్న గ్రేప్–4 నిబంధన
కాలుష్యం ఏమాత్రం తగ్గకపోవడంతో సోమవారం అమలుచేసిన నాల్గవ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రేప్)ను ఢిల్లీ ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. గ్రేప్–4 నియమాల్లో భాగంగా ఢిల్లీ పరిధిలో నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతోంది. స్కూళ్లను మూసేశారు. డీజిల్‌తో నడిచే మధ్యస్థాయి, భారీ రవాణా వాహనాలను ఢిల్లీలోనికి అనుమతించట్లేరు. పాఠశాల ఢిల్లీలో ఉదయం చాలా ప్రాంతాల్లో అరకిలోమీటర్‌లోపు ఉన్నవి కూడా కనిపించనంతగా మంచు దుప్పటి కప్పేసింది. రన్‌వే సరిగా కనిపించని కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కష్టంగా మారింది.
పలు విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల ఆలస్యం సరేసరి. చలి, తీవ్ర కాలుష్యం కారణంగా చిన్నారులు, వృద్ధులు కళ్ల మంటలు, శ్వాస సంబంధ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాయు నాణ్యతా సూచీని గణించే ఢిల్లీలోని 38 మానిటరింగ్ స్టేషన్లలోనూ పరిస్థితి ఇంకా రెడ్‌జోన్‌లోనే కొనసాగుతోంది. ఆదివారం ఢిల్లీలో వాయునాణ్యత మరీ దారుణంగా పడిపోయి ‘సివియర్ ప్లస్’గా రికార్డవడం తెల్సిందే. దీంతో సోమవారం నుంచి గ్రేప్–4ను అమల్లోకి తెచ్చారు. ప్రతి ఏటా చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి కాలుష్యవాయు గాఢత అలాగే కొనసాగుతుండటంతో ఢిల్లీ వాసుల వాయుకష్టాలు పెరుగుతుండటంతో 2017 ఏడాది నుంచి ఈ గ్రేప్ నిబంధనలను అమలుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment